Previous Page Next Page 
తృప్తి పేజి 52


    "మీవల్లే! మీరుంటే తన ఆటలు సాగనియ్యరనీ, చాటుమాటుగా చేసే పనులు పసిగడతారనీ భయపడి వెళ్ళిపోతుంది. వెళ్ళనీయండి. వేరే పనిపిల్లని చూసుకుందాం" అంది సింధు. ఇంకావిడేం మాట్లాడలేదు.
    ఇంకోనెల జీతమెక్కువిచ్చే పంపించింది సింధు చిట్టెమ్మని.
    ఆ రాత్రి జడలో మల్లెపూలు పెట్టుకుని, తెల్లచీరలో వచ్చిన సింధుని చూసి కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు అరుణ్.
    "ఏమిటలా చూస్తున్నారు?" అనడిగింది సింధు చిరునవ్వుతో.
    "అలా ఆకాశంలో విహరిస్తున్న దేవకన్యలెవరన్నా పొరపాటున కాలుజారి భూమిమీద పడిపోయారేమోననిపించిందిలే" అన్నాడు.
    ఆమె కురులలోని విరులూ, అగరుపొగలూ, అత్తరులూ కలిపి ఆ గదంతా మత్తైన సుగంధం వ్యాపించింది. స్త్రీ లతలాంటిది. బలమైన వృక్షాన్ని పెనవేసుకుని శాశ్వతమవుతుంది. శాఖోపశాఖలుగా విస్తరించి వృక్షం మొదలునే మరుగుపరిచి, అంతా తనే అనే భ్రాంతి కల్పిస్తుంది. తన తాలూకు సుగంధాన్నీ, అందాలనీ విరజల్లి మనసు మైమరపిస్తుంది... అనుకున్నాడు.


                            *    *    *    *


    "రేపు పెళ్ళిచూపులకే చీర కట్టుకుంటావు?" అడిగింది కాత్యాయని బీరువాలోని చీరలన్నీ తీసి చూస్తూ.
    వెల్లకిలా పడుకుని, అరచెయ్యి మొహానికి అడ్డం పెట్టుకుని పడుకున్న యమున మాట్లాడలేదు.
    "నిన్నేనే, ఈ నీలిరంగు మైసూర్ సిల్కు చీర కట్టుకుంటావా?" అడిగింది. మళ్ళీ జవాబు రాకపోవడంతో పోనీ ఈ పసుపురంగు వెంకటగిరి జరీ చీర కట్టుకో. పసుపురంగు మంచిది శుభం కలుగజేస్తుంది" అంది. దానికీ జవాబు రాకపోయేసరికి "నేను నీతో మాట్లాడుతున్నానా? లేక గోడతోటా?" అడిగింది కోపంగా.
    "గోడకేరంగు వేయనూ? పసుపా లేక నీలమా? అన్నట్లుగా అడుగుతుంటే గోడనే అనుకున్నాను" అంది యమున విసుగ్గా.
    "ఏమయిందే నీకు! ఏ రంగుచీర కట్టుకుంటావని అడిగితే కూడా తప్పేనా?" అందావిడ బాధగా.
    "వాళ్ళొచ్చేది నన్ను చూడ్డానికా లేక నా చీరలు చూడ్డానికా? ఏదో ఒకటి కట్టుకుంటాను సరా!" అంది మళ్ళీ విసుగ్గా.
    "కట్టుకునే చీరను బట్టి కూడా ఆడపిల్లకి అందం వస్తుందమ్మా. మా తల్లివిగా. లేచి ఏ చీర బావుంటుందో చూడు! ఈ మొదటి పెళ్ళిచూపులే ఆఖరయి నా తల్లికి మంచి భర్త దొరకాలి" అంటూ గడ్డం పట్టుకుని ముద్దు పెట్టుకుంది కాత్యాయని.
    యమున పెదవులు విరక్తిగా నవ్వాయి. ఇవే ఆఖరవ్వాలట. ఈ వచ్చినతనే తన భర్తవ్వాలట. అమాయకంగా దీవిస్తున్న తల్లికి తెలియదు కదా తన బిడ్డకెంత శిక్ష విధిస్తుందో! మనసులోమాట బైటపెట్టలేని తన అశక్తతమీద తనకే అసహ్యమేస్తోంది. ఏమిటిది? ఎందుకిలా జరుగుతుంది? అసలు తనెలా ఒప్పుకుందీ తతంగానికి? ఒకవేళ ఖర్మకాలి కుదిరిపోతే ఇంకేమయినా ఉందా? జీవితాంతం మరొకరి భార్యగా, శేఖర్ కు దూరంగా... ఆ ఆలోచనే కాల్చేస్తోందసలు.
    పండుగ సరదా, సంతోషం కొంచెం కొంచెం కూడా ఆ ఇంట్లో కనిపించడం లేదు. కాత్యాయని పులిహోరా, పరమాన్నం చేసి పండుగయిందనిపించింది. రామారావుగారు బి.పి. మాత్రేసుకుని నిద్రపోతున్నారు. శరత్ ఎవరో స్నేహితులతో బయటికెళ్ళాడు. యమునలేచి ఎంగిలి పడలేదాపూట. "పండగ పూట పస్తుంటావా ఏమిటే? లేచి కాస్త కతికి పడుకో, ఒళ్ళేమన్నా వెచ్చ పడిందా?" అంటూ వచ్చింది కాత్యాయని.
    తనకి తెలుసు. తను తినకపోతే తల్లి కూడా తినదని. అయినా ఎందుకో తినాలనిపించలేదు. "నువ్వు తినేసిరా, నాకు తినాలని లేదు" అని గోడవైపు తిరిగి పడుకుంది.
    "ఏమో ఎందుకు ఆకల్లేదో అదైనా చెప్పకపోతే ఎలా? బాగానే సాధిస్తున్నారందరూ కలిసి నన్ను" అంటూ గొణుగుతూ వెళ్ళిపోయిందావిడ.


                           *    *    *    *


    జయ భారంగా కూర్చుని ముగ్గుపెడ్తోంది వాకిట్లో. అరుగుమీద వాలు కుర్చీలో కూర్చుని "ఇంకచాలు, వచ్చెయ్యి" అన్నాడు శశిధర్.
    "అయిపోవచ్చిందండీ!" అంటూ ఓసారి మొత్తం ముగ్గుని తనివితీరా చూసుకుని, అక్కడక్కడా మళ్ళీ ముగ్గు దిద్దుతోంది.
    భోజనాలు చేసి వక్కపొడి నముల్తూ బయటికొచ్చిన సుధాకర్, కావేరీ ఇది చూసి "అదేంపని జయా! గొంతుక్కూర్చుని ముగ్గు పెడ్తావా" అన్నారు.
    "ఒక్కనిమిషం" అంటూ తనపని తను చెయ్యసాగింది జయ.
    శశిధర్ లేచెళ్లి "ఎక్కడెక్కడ గియ్యాలో చెప్పు, నేవేస్తాను" అంటూ ఆమె చేతిలోంచి ముగ్గు కప్పందుకున్నాడు.
    "మీరా!" అంది ఆశ్చర్యంగా జయ.
    "మరేం చెయ్యనూ! మొండిగా, చెప్తే వినట్లేదు కదా నువ్వు" అన్నాడు.
    జయ నవ్వుతూ ఎక్కడెక్కడ వెయ్యాలో చెప్తుంటే శశిధర్ వేస్తున్నాడు. పిల్లలు "మావయ్య ముగ్గులేస్తున్నాడోచ్" అంటూ ఎగుర్తున్నారు.
    "నేచెప్పలేదూ అతను మంచివాడేననీ" అన్నట్లు చూశాడు సుధాకర్ కావేరి వైపు.
    కావేరి జయ కళ్ళల్లో తృప్తినే గమనిస్తోంది.
    కనుమనాడు అందరూ కలసి ప్రభ ఇంట్లో భోజనాలు చేశారు. హేమలతమ్మగారు నవ్వుతూ, నవ్విస్తూ వడ్డన చేసి అందరికీ గొంతుదాకా కూరి తినిపించింది.
    సాయంత్రం అందరికీ బట్టలు పెట్టారు సుధాకర్, కావేరీ "నా తరుపు నుంచి మా అమ్మాయికి" అంటూ ఓ ప్యూర్ సిల్క్ చీర తెచ్చి కావేరికి ప్రభ చేత పెట్టించింది హేమలతమ్మ.
    ఆవిడ అభిమానానికి కావేరి కళ్ళనిండా నీళ్ళొచ్చాయి. వంగి కాళ్ళకి నమస్కరించింది.
    "గోల్డెన్ మదర్ లా కలకాలం వర్ధిల్లు" చెప్పిందావిడ.
    రాత్రందరూ సుధాకర్ వాళ్ళ వాకిట్లో చాపలేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే నర్మదా, శంకర్, తులశమ్మగారూ, పిల్లలూ కూడా వచ్చి కూర్చున్నారు. పిల్లలు వెంటనే ఆట మొదలుపెట్టేశారు. వర్ధనమ్మగారూ, తులశమ్మగారూ, హేమ్ లెట్ పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటే, జంటలు ఒకళ్ళమీదొకళ్ళు జోకులు పేల్చుకుంటున్నారు.

 Previous Page Next Page