Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 5


    "అలా అని ఎందుకు సరిపెట్టుకోవాలి? ఎవరి పని వాళ్ళు చేయాలి. పోలీసులు ఉంది ప్రజల మానప్రాణాలు కాపాడడానికేగా...?" అనూష పోలీసు వ్యవస్థను ఎత్తిపొడుస్తూ అన్నది.
    అతను ఆలోచనలో పడ్డాడు.
    స్టేషన్ లో రైలు ఆగింది.
    అతను హుటాహుటిన రైలు దిగాడు.
    వెళ్ళిన కొద్ది క్షణాలలోనే పోలీసులను వెంట తీసుకువచ్చాడు.
    కానిస్టేబుళ్లు ఆకతాయిలు నలుగురినీ చరచర ఈడ్చుకు వెళ్ళారు.
    ఆడపిల్లలిద్దరికీ అప్పుడే మత్తు వదిలింది. పరిసరాలను గుర్తుతెచ్చుకుని కెవ్వుమన్నారు.
    అనూష వాళ్లిద్దరికీ ధైర్యం చెప్పింది. ఇద్దరూ బట్టలు సరిచేసుకున్నాక, రైలు దిగి ప్లాట్ ఫారం మీదకు వచ్చింది.
    "మిస్! మీరు వాళ్ళిద్దర్నీ తీసుకుని రైల్వే పోలీసు స్టేషన్ కు వెళ్ళి రిపోర్టు రాసివ్వండి..." అన్నాడతను.
    అప్పటికి రైల్వే పోలీసు సబ్ ఇన్ స్పెక్టరు అక్కడకు వచ్చాడు.
    ముద్దాయిలను పట్టిచ్చిన అతన్ని గుర్తుపట్టి వెంటనే సెల్యూట్ కొట్టాడు.
    అనూష ఆశ్చర్యంగా అతనివంక చూస్తూ_ "మీరు?"
    "నేను ఇన్ స్పెక్టర్ వీరేష్ ను. అఫ్ కోర్స్_ ప్రస్తుతం సెలవుపై వెళుతున్నాను..." అన్నాడు నవ్వుతూ.
    అనూష గౌరవంగా అతనికి నమస్కారం చేసింది.
    "పోలీసు వ్యవస్థ మీద ఇంతకు ముందు మీరు చేసిన వ్యాఖ్యానాలను ఇప్పటికైనా ఉపసంహరించుకుంటారా మిస్?" అన్నాడు కొంటెగా నవ్వుతూ ఇన్ స్పెక్టర్ వీరేష్.
    పోలీసులందరినీ తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షణం దోషిలా తల వొంచుకుంది అనూష.
    అతను నవ్వుతూ వీడ్కోలు తీసుకున్నాడు.
    కనుచూపుమేర వరకు ఆశ్చర్యంగా అతన్నే చూస్తూ ఉండిపోయారంతా.


                                                       *    *    *    *


    అది రావూస్ ట్రస్ట్.
    నిరుపేదలను, అభాగ్యులను ఆదుకుంటున్న స్వచ్చంద సేవాసంస్థ, దానికి డైరెక్టరు బిందు మాధవి.
    ట్రస్టు బిల్డింగు ఎంట్రన్స్ లో ఉన్న కుడివైపు గదిని డైరెక్టుకు, ఎడమవైపు గదిని సిబ్బందికి కేటాయించారు.
    మధ్యన ఉన్న హాలులో టైపు మిషన్లు ఉన్నాయి. కొందరు స్త్రీలు టైప్ చేర్చుకుంటున్నారు. మరొక మూల కుట్టు మిషన్ల మీద మహిళలు దుస్తులు కుడుతున్నారు. కొందరు నవ్వారు నేస్తున్నారు.
    పరిసరాలను ఆద్యంతం పరిశీలించి లోపలికి అడుగుపెట్టింది అనూష.
    "రచయిత్రి బిందు మాధవిగారు...."
    "ఎస్....నేనే!"
    అనూష ప్రశ్నకు తలెత్తి వెంటనే సమాధానంగా అందామె.
    "మీ రచనలు చదివాను. చాలా బావున్నాయి."
    "థాంక్స్...."
    కూర్చోమన్నట్టు కుర్చీ చూపించిందామె.
    టెలిఫోన్ మోగడంతో "ఒక్క నిమిషం" అంటూ రిసీవర్ ఎత్తింది.
    "హల్లో! బిందును మాట్లాడుతున్నాను."
    అవతలి వైపునుంచి ఒక అభిమాని రచయిత్రికి అభినందనలు చెప్పింది.
    మరుక్షణంలో బిందు మాధవి ముఖం జేవురించింది.
    "ఠాట్! అదీ ఒక పోటీయేనా? స్టాండర్డు లేని వారపత్రిక అది. అసలు ఆ పోటీకి నా నవల పంపడం పొరపాటే...." అంటూ విసురుగా రిసీవరు పెట్టేసింది.
    "ప్రస్తుతం మీ మూడ్ బాగోలేనట్టుంది. మళ్ళీ వస్తాను మేడమ్ అంటూ ఆమె వద్ద సెలవు తీసుకోవడానికి ప్రయత్నించింది అనూష.
    "అబ్బే__అదేం లేదు! దేనికదే! ఇంతకీ నువ్వొచ్చిన పని చెప్పలేదు!"
    అనూష తటపటాయించింది.
    "ఫర్వాలేదు, అభిమానపడకు. చెప్పు...." అంది అభయమిస్తున్నట్లు.
    తను చేసిన పని చెబితే తనను గౌరవిస్తుందా? లేక నాలుగు చీవాట్లు పెట్టి పొమ్మంటుందా? కాని, ఆమె అభ్యుదయ భావాలు గల రచయిత్రి అని విన్నది తను. మంచి ఆశయాలను, ఆదర్శాలను గౌరవిస్తుందని చదివింది. అటువంటి వ్యక్తికి తన గురించి చెప్పుకొని సహాయం కోరడంలో తప్పులేదనిపించింది.
    అనూష ఆలోచనలో పడడంతో చూచాయగా ఆమె ఆంతర్యం గ్రహించింది. ఎందుకో ఆమె బిడియపడుతున్నట్టు గమనించింది.
    "ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామా?" అంటూ కుర్చీలోంచి లేచిందామె.
    అనూష మౌనంగా ఆమెను అనుసరించింది.
    ఇద్దరూ కారు ఎక్కారు.
    బంగళాలో అడుగుపెట్టి దిక్కులు చూస్తున్న అనూషను ఆప్యాయంగా చేయి పుచ్చుకుని లోపలకు తీసుకు వెళ్ళిందామె.
    "మేడమ్...." అనూష పెదవి విప్పింది.
    "పిచ్చి పిల్లా! విషయాలు తరువాత, ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో_ఎలా వాడిపోయిందో! లేచి కడుక్కురా!" మొహమాట పెట్టిందామె.
    ఇక కాదనలేక అక్కడే ఉన్న తువ్వాలు తీసుకుని బాత్ రూమ్ వైపు వెళ్ళింది అనూష.
    అనూష వచ్చేటప్పటికే డైనింగ్ టేబిల్ మీద భోజనం ఏర్పాటు చేసింది బిందుమాధవి.
    ఇద్దరూ భోజనం అయిందనిపించి లేచారు.
    ఆమె ఆప్యాయతకు అనూష పులకించిపోయింది. ఇటువంటి వ్యక్తిని తనకాళ్ళ మీద తను నిలవడానికి సహాయం చేయమని కోరడంలో తప్పులేదనిపించింది.
    "ఇప్పుడు చెప్పు_నువ్వేం పనిమీద వచ్చావు? నా నుంచి నీకే సహాయం కావాలి?" సూటిగా అడిగింది బిందుమాధవి.
    "మేడమ్"_అని తనను తాను క్లుప్తంగా పరిచయం చేసుకుంది. నిదానంగా "నా కాళ్ళమీద నేను నిలవడానికి నాకు మీ ట్రస్టులో ఆశ్రయం కల్పిస్తారన్న ఆశతో వచ్చాను" నేలచూపులు చూస్తూ అంది.

 Previous Page Next Page