అనూష రాగానే రెండు కప్పుల్లో కాఫీ పోశాడు. ఆమె ఆత్రుతగా పేపరు తిరగేసింది. ఆమె చూపులు ఆ ప్రకటన మీద నిలిచాయి.
"నేను అలా బయటకు వెళ్ళి వస్తాను. మధ్యాహ్నం కుర్రాడితో క్యారేజి పంపుతాను. శుభ్రంగా భోజనం చేసి, విశ్రాంతి తీసుకో!"
అతను వెళ్ళిపోయాడు.
తను ఎందుకు వచ్చిందీ అతను అడగలేదు, తను చెప్పనూ లేదు. అతని ఆంతర్యం బోధపడడంలేదు.
అతనుగాని ఆ ప్రకటన చూశాడా? సందిగ్ధంలో పడిందామె.
అతను వెళ్ళిన కొద్ది నిమిషాలకే చుట్టుప్రక్కల ఉన్న అమ్మలక్కలు ఒక్కొక్కరుగా అనూష దగ్గరకు చేరారు.
'పెళ్ళి చేసుకున్నారా? ప్రేమించుకుని లేచి వచ్చారా?' లాంటి ప్రశ్నల వర్షం కురిపించారు.
వాళ్లు తన తండ్రి తను కనిపించడం లేదని పేపరులో వేయించిన ప్రకటన కాని చూసి ఇలా వేళాకోళం ఆడుతున్నారా?
వాళ్ళు వేసిన ప్రశ్నలతో ఆమె మనసు గాయపడింది.
పెళ్ళికాని ఆడపిల్ల ఒంటరిగా అర్థరాత్రి బ్రహ్మచారి గదికి రావడాన్ని ఈ సమాజం హర్షించదు గాక హర్చించదని మొదటిసారిగా తెలుసుకుంది అనూష.
దీర్ఘంగా ఆలోచించి గది తలుపులు దగ్గరకు వేసి, వాళ్ళంతా చూస్తుండగానే వెళ్లిపోయింది అనూష.
* * * *
కాలేజీ అమ్మాయిలిద్దరు చారెడేసి కళ్ళతో ఎవరి కోసమో ఎదురుచూస్తున్నారు.
దాచినా దాగని యౌవ్వనాన్ని దాచిపెడదామన్నట్టు వేసుకున్న పయ్యెదలను మాటిమాటికీ సర్దుకుంటున్నారు.
ఒకవైపు వయసు తెచ్చిన హొయలు చూపరులను క్షణం ఆలోచింప చేస్తున్నది. మరోవైపు నాటీ బోయ్స్ నలుగురు ఆ బ్యూటీస్ ఫేస్ కోసమే వెదుక్కుంటూ వచ్చారు.
వాళ్ళను చూసి ఈ చిలిపి చిన్నారుల బుగ్గలు ఒక్కక్షణం సిగ్గుతో ఎరుపెక్కాయి.
కుర్రాళ్లు కాస్తంత చొరవ చేసి వాళ్ళ పక్కనే కూర్చున్నారు. ఆడపిల్లలు గతుక్కుమని ఓ మూలగా ఒదిగి కూర్చున్నారు.
మరో పక్కన ఉన్న సింగిల్ సీట్లో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచి నవలా పఠనంలో లీనమైపోయాడు.
కోల మొఖం, గుబురు మీసాలు, పసుపుపచ్చని ఛాయలో ఉన్న అతనికి అందంతోపాటు ఠీవి, దర్పం సహజ లక్షణాలుగా ఉన్నాయి.
అతనికి ఎదురుగా ఉన్న సీటులో అనూష కూర్చుని ఉన్నది.
భవిష్యత్తు గురించి సుడులు తిరిగే ఆలోచనలు ఆమెను ఇంకా వదలడం లేదు.
కుర్రాళ్లు నలుగురూ పాటలు ప్రారంభించారు. పాటకు తగ్గట్టు డాన్స్ చేస్తున్నారు.
వాళ్ళ అల్లరికి తట్టుకోలేని ప్రయాణికులు లేచి ఇవతలకు వచ్చారు. అక్కడ ఇద్దరాడపిల్లలూ, నలుగురు కుర్రాళ్ళూ మిగిలారు.
అనూష వాళ్ళ చర్యలను క్రీగంట పరిశీలించింది.
కుర్రాళ్ళు రెండు బెడ్ షీట్స్ తీసి పైనుంచి క్రిందికి వేలాడగట్టారు. ఇప్పుడక్కడ ఎవరికీ కనిపించనంత మరుగ్గా వుంది.
అనూష చుట్టూ చూసింది. మిగిలిన ప్రయాణీకులు ఎవరికివాళ్ళు తమ తమ పుస్తక పఠనంలో, పిచ్చాపాటీలో నిమగ్నమై వున్నారు.
తనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి తను చదువుతున్న నవల సీటులో ఉంచి టాయిలెట్ కు వెళ్ళాడు.
ఆడపిల్లలను కుర్రాళ్లు ఏం అల్లరి పెడుతున్నారో... ఆలోచించడానికే బాధగా అనిపించింది అనూషకు.
సరిగ్గా అదే సమయానికి అతను టాయిలెట్ నుంచి తిరిగివచ్చి తన సీటులో కూర్చున్నాడు. తిరిగి పుస్తక పఠనంలో లీనమయ్యాడు.
"ఆ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మీకు అనిపించడం లేదా?"
తన ప్రశ్నకు అతను తలెత్తుతాడేమోనని క్షణం ఆగి చూసింది.
అతని నుంచి ఉలుకూ పలుకూ లేదు.
తనే ఆవేశంగా ముందుకు వెళ్ళి ఒక్క ఉదుటున దుప్పట్లను లాగేసింది.
"మీరు మనుషులా, రాక్షసులా?"
లోపలి దృశ్యం చూసిన అనూష ఆవేశంగా అరుస్తూ కుర్రాళ్ళ చొక్కాలు పుచ్చుకుని తన శక్తినంతా కూడదీసుకుని చెంపలు వాయించేసింది.
ఆడపిల్లలిద్దరూ స్పృహలో లేరు. వాళ్ళు అర్ధనగ్నంగా వున్నారు.
కుర్రాళ్లు వాళ్ళ పక్కన పడుకుని అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
దెబ్బలు తిన్న ఒక యువకుడు ఫాంట్ జేబులోంచి బటన్ నైఫ్ తీసి ఆమె మీదకు దూకాడు.
మరుక్షణంలో అతని తలమీద బలమైన పిడిగుద్దు పడింది. అతను నోట రక్తం కక్కుతూ కుప్పకూలాడు.
వెనుదిరిగి చూసిన అనూషకు అప్పటివరకు తనకు ఏమీ పట్టనట్టు కూర్చున్న వ్యక్తి కనిపించాడు.
ఇప్పుడతని ముఖం క్రోధంతో గడ్డకట్టి ఉంది. కనులు నిప్పులు చెరుగుతున్నాయి.
ఊహించని ఆ పరిణామానికి మిగిలిన ముగ్గురు కుర్రాళ్ళూ మొదట ఖంగుతిన్నా వెంటనే తేరుకుని జేబులో నుంచి చటుక్కున కత్తులు తీశారు.
కానీ, అంతలోనే అతని ఉక్కు పిడికిళ్ళు వాళ్ళ ముఖాలను తాకాయి. ముగ్గురూ ఉలుకూ పలుకూ లేకుండా నేల కొరిగారు.
అనూష గుండె మీద చేయి వేసుకుని భారంగా శ్వాస పీల్చింది. వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చి అర్థనగ్నంగా ఉన్న ఆడపిల్లల వంటిమీద దుప్పటి కప్పింది.
ఆకతాయిలు కత్తులతో బెదిరించి, ఆడపిల్లలకు మత్తుమందు వాసన చూపించి, వాళ్ళు స్పృహ కోల్పోయిన తరువాత అత్యాచారానికి పాల్పడబోయారని అంతా అర్థం చేసుకున్నారు.
ప్రయాణీకులంతా అనూషను ప్రశంసలతో ముంచెత్తారు.
"ఇన్ని అరాచకాలు జరుగుతున్నా పోలీసులు ఏమీ పట్టించుకోవడం లేదు. అందుకే స్త్రీలపై అత్యాచారాలు పెచ్చు పెరిగిపోతున్నాయి" అనూష ఆవేశంగా అంది.
క్షణ కాలం అతని భ్రుకుటి ముడిపడింది.
"ఎక్స్ క్యూజ్ మీ మేడం! ఈ బోగీలో దాదాపు నలభై మందికి పైగానే ఉన్నట్టున్నారు. కేవలం నలుగురు కుర్ర వెధవలు అఘాయిత్యం చేస్తున్నప్పుడు వాళ్ళను ఎందరు ప్రతిఘటించారు? దగ్గర ఉన్న మనమే ఏం జరుగుతుందో ఊహించనప్పుడు, ఎక్కడో ఉన్న పోలీసులు మాత్రం కలగనాలని ఉందా? అయినా వాళ్ళు ఆడపిల్లల్లా కుదురుగా ఉన్నారా? చూపులతో ఎదుటివాళ్ళను రెచ్చగొట్టలేదూ!" పోలీసులను నిందించడానికి తప్పుపట్టినట్టన్నాడు అతను.