Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 6


    "సారీ అనూషా! ఇక్కడ ముందూ వెనుకా ఎవ్వరూ లేని స్త్రీలకు, భర్త విడిచిపెట్టిన గృహిణులకు, విధవలకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. కాని నీ వంటి శ్రీమంతుల బిడ్డకు మా ట్రస్టు చేయగల సహాయం ఏమీలేదు." నిర్మొహమాటంగా తేల్చి చెప్పింది బిందుమాధవి.
    అప్పటివరకూ ఎన్నో ఆశలతో ఉన్న అనూష మ్రాన్పడిపోయింది.
    ఆమె అభ్యుదయ భావాలు గల రచయిత్రి. ఎందరో స్త్రీల సమస్యలకు తన రచనల ద్వారా పరిష్కారం సూచించింది. ఆ ఆశతోనే తనకు ట్రస్టు ద్వారా సహాయ సహకారాలు అందజేస్తుందనుకుంది. కాని రచన వేరు, వాస్తవం వేరని తేలిపోయింది.
    "ఫరవాలేదు లెండి! ఆ అవకాశం లేనప్పుడు మీరు మాత్రం ఏమి చేస్తారు? నేనిక వెళతాను..." అంటూ కుర్చీలోంచి లేచింది అనూష.
    "అనూషా! ఎక్కడికని వెళతావు? ఒంటరిగా నిన్ను ఎలా వెళ్ళనిస్తాననుకున్నావు?" అంటూనే భుజం మీద చేయి వేసింది బిందుమాధవి.
    అనూషను ముందుకు కదలనీయకుండా తన రెండవ చేత్తో ఆమెను పట్టుకుని గదిలోకి తోసి గది తలుపులు మూసి గడియవేసింది.
    రెప్పపాటు కాలంలో జరిగిన ఈ విపరీత పరిణామానికి అనూష ఖిన్నురాలయింది.
    బిందుమాధవి ఫోన్ తీసి అనూష తండ్రి శ్రీపతికి డయల్ చేసింది.
    అనూషకు తనున్న పరిస్థితి పూర్తిగా అర్థమయింది. సహాయం ఆశించి వస్తే తనకు సహాయం చేయకపోగా తీరని అపకారం చేస్తున్నదీ బిందుమాధవి!
    "మేడమ్! దయచేసి నన్ను వెళ్ళనివ్వండి!..." అభ్యర్ధనగా అంది అనూష.
    "నా మాట విను అనూషా! ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు వినాశానికి దారితీస్తాయి. కాలమే అన్నింటికీ జవాబు చెబుతుంది." వేదాంత ధోరణిలో అంది బిందుమాధవి.
    తను నిజంగా అనూషకు న్యాయం చేస్తున్నట్టా? లేక....
    అభ్యుదయ భావాలు గల రచయిత్రిగా స్త్రీలకు స్వేచ్చా_సమానతలు కావాలని చాటిచెప్పిన తను, ఈ రోజు ఎందుకని ఇంత కఠినంగా మారిపోయింది?
    "స్వేచ్చా, సమానతలు అంటూ అనుబంధాలను, సాంప్రదాయాలను కాదనుకుని యువత ఆవేశంగా ముందుకు వచ్చినా చేయూతనిచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళను తీర్చిదిద్దేవాళ్ళు ఎవరు? అనుకున్న స్వేచ్చను అనుభవించ లేక, ఆశయాలు, ఆదర్శాలు నిలుపుకోలేక చివరకు జీవితమే నాశనం చేసుకుంటే ఎవరు బాధ్యులు?" ఆలోచనలతో వేగిపోతున్నది రచయిత్రిగా బిందుమాధవి.
    అనూష ఆవేశంతో తలను గోడకేసి బాదుకుంది. తల చిట్లి రక్తం చిమ్మింది.
    అవి రక్తపు బొట్లు కావు, ఆశయ ధారలు!
    బింధుమాధవి మనసు చివుక్కుమంది. తను అనవసరంగా అనూష విషయంలో చొరవ చూపించిందేమో.
    అనూష చిన్నపిల్లేమీ కాదు. ఆమె సమస్యలు ఆమెకుంటాయి. పరిష్కరించుకోవలసిన బాధ్యత కూడా ఆమె మీదే వుంది. చేయగలిగితే తన వంతు సహాయం చేయాలి. కాని తను అనూషను ఆమె తండ్రికి అప్పచెపుదామనుకుంటున్నది_మెప్పు పొందడానికా?
    తన రచనలకూ, ప్రస్తుతం తన ప్రవర్తనకూ ఎంత వ్యత్యాసం ఉందో! అభ్యుదయ భావాలు గల రచయిత్రిగా తనకిది తగునా? ఆమె అంతరాత్మ నిలదీసింది.
    బయట కారు ఆగిన శబ్దం.
    "మేడమ్! మా నాన్న వచ్చేస్తున్నారు _ ప్లీజ్! నన్ను వదిలేయండి!" రెండు చేతులతో నమస్కరిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ నిస్సహాయురాలుగా నేలమీద కుప్పకూలిపోయింది అనూష.
    "పిచ్చిపిల్లా! మనిషికి ఆవేశం ఒక్కటేకాదు, ధైర్యం కూడా కావాలి. నీ జీవితం నీ ఇష్టం."
    గది తలుపులు తెరచి ఆమెను లేవనెత్తుతూ అంది.
    "మేడమ్....మీరు...." మాటలు అస్పష్టంగా పెదాలమీద కదలాడాయి అనూషకు.
    "కృతజ్ఞతలు తరువాత,ముందు నీ దారిన నువ్వు వెళ్ళమ్మ" అంటూ ఇంటి వెనుకవైపున ఉన్న గేటు చూపింది బింధుమాధవి.
    అనూష మెరుపులా దూసుకుపోయింది.
    శ్రీపతి ఇంట్లోకి అడుగుపెట్టాడు.
    "రండి....రండి."
    ఎదురువచ్చి బిందుమాధవి అతన్ని ఆహ్వానించింది.
    శ్రీపతి వచ్చి సోఫాలో కూర్చున్నాడు.
    పనమ్మాయి బిస్కట్లు, టీ తెచ్చి టీపాయి మీద పెట్టింది.
    అనూష విషయం ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో అతను విషయం అర్థంకానట్టు బిందుమాధవిని, ఖాళీగా ఉన్న గదిని మార్చి మార్చి చూశాడు. అసహనంగా సోఫాలో అటూ ఇటూ కదిలాడు.
    "సారీ శ్రీపతి గారు! అనూ నిద్రపోయిందని నేను తలుపు గడియ పెట్టలేదు. బహుశా...." అతని ఆత్రుతను అర్థం చేసుకున్నట్టు అంది.
    "ఇట్స్ ఆల్ రైట్! మీరు నాకు ఫోన్ చేసినప్పుడు తెలుసుకుని పారిపోయి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఎదురుపడితే తెలియజేయండి."
    థాంక్స్ చెప్పినంత వేగంగానూ వెళ్ళిపోయాడు శ్రీపతి.
    రచయిత్రిగా మంచి కట్టుకథ అల్లి ముగింపు రక్తి కట్టించాననుకుని తృప్తిగా గాలి పీల్చింది బిందుమాధవి.
    కాని, ఇప్పుడామె ఆలోచనలన్నీ ఉదయాన్నే కాలేజీకి వెళ్ళి ఇంతవరకు తిరిగిరాని సాహితి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.


                                            *    *    *    *


    కాలేజీ నుంచి ఇంటికి రావడం చాలా ఆలస్యం అయింది. ఎలా సర్దిచెప్పాలో మరొకసారి రిహార్సల్స్ చేసుకున్నట్టు ఆలోచించింది సాహితి.
    చేతిలోని స్వీట్స్ పాకెట్ ను ఒకసారి చూసుకుంది. తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో ఇంట్లోకి అడుగుపెట్టింది.
    బిందుమాధవి గదిలో లైటు వెలుగుతున్నది. ఆమె చదువుకుంటున్నది. సాహితి రావడం గమనించి తలెత్తిందామె. ఆమె చూపులు తీక్షణంగా ఉన్నాయి.
    గతుక్కుమంది సాహితీ. తనను తాను సంబాళించుకుంది. గొంతు సరిచేసుకుంది.

 Previous Page Next Page