"కూర్చో" అంటూ కుర్చీ వేశాడు తను మంచం మీద కూర్చుంటూ. "కావేరీ! నువ్వు కూడా రా" అని పిలిచాడు. కావేరి వచ్చి భర్తపక్కన కూర్చుంది. అతను గొంతు సవరించుకుని "చూడు యమునా! నాన్నగారు ఇదివరకట్లా లేచి తిరగలేకపోతున్నారు. వయసు బాగా మీదపడిపోయింది. మీ అమ్మగార్ని చూస్తే ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రం. ఇక శరత్ అంటావా? తెలివైనవాడు వృద్ధిలోకొస్తాడు. నువ్వేం అతని చదువు గురించి బెంగపడొద్దు. నా చెల్లెళ్ళ పెళ్ళి విషయంలో మీ అక్క నాకు చేయూతనిచ్చి సహాయం చేసింది. మీ తమ్ముడు తన కాళ్ళ మీద తను నిలబడేవరకూ నేను చేయూతనిస్తాను. నువ్వా బెంగలన్నీ వదిలేసి నీ పెళ్ళి విషయం మాట్లాడు. మీ అమ్మగారు చెప్పిన సంబంధం నీకు నచ్చకపోతే ఫరవాలేదు. మరోటి చూద్దాం! మా కొలీగ్ తమ్ముడున్నాడు. ప్రైవేట్ దైనా మంచి లిమిటెడ్ కంపెనీలో ఎకౌంటెంట్ గా చేస్తున్నాడు. నువ్వు సరేనంటే ఆదివారం పెళ్ళిచూపులేర్పాటు చేస్తాను. మా చెల్లెళ్ళని నేను అడగకుండానే పెళ్ళిసంబంధాలు చూశాను. కానీ నీ విషయంలో అంత స్వతంత్రం తీసుకోలేకపోతున్నాను. ఈ మాత్రం స్వతంత్రం కూడా నువ్వొద్దంటే తీసుకోను. ఏమంటావు?"
ఏమీ మాట్లాడకుండా కన్నీళ్ళతో చూసింది యమున. "దానికి మీరీమాత్రం స్వతంత్రం తీసుకోవడం కూడా ఇష్టంలేనట్టుంది" నిష్టూరంగా అంది కావేరి.
"అక్కా!" దెబ్బతిన్నట్టు చూసింది యమున.
"నువ్వూరుకో! అనవసరంగా ఆవేశపడకు! ఏమంటావు యమునా? పెద్దవాడిగా ఆదివారం పెళ్ళిచూపులు ఏర్పాటు చెయ్యదలుచుకున్నాను సరేనా! నీకో అన్నయ్యున్నా ఈ విధంగానే నిర్ణయం తీసుకునేవాడమ్మా. నీకంతగా ఇష్టంలేకపోతే చెప్పేసెయ్యి. కానీ ఎందుకొద్దో ఆ కారణం కూడా విపులంగా చెప్పాలి" అన్నాడు షరతు పెడ్తున్నట్లు.
"చెప్పవే!" కావేరి లేచొచ్చి చెల్లెలి గడ్డం పట్టుకునెత్తి అడిగింది. ఆ కళ్ళల్లో ఆర్తి చూసి కాదనీ ఒద్దనీ అని అక్కని నొప్పించలేకపోయింది యమున. సరేనన్నట్లు తల వూపింది.
"హమ్మయ్యా! ఒప్పుకుందండీ ఎలాగైతేనేం! త్వరలో మా చెల్లెలు పెళ్ళికూతురవ బోతోంది" అంటూ సంతోషంతో కంటనీరు తిరుగుతుండగా యమునని గుండెలకి హత్తుకుంది కావేరి.
అక్కగారి గుండెల్లో ఒదిగిపోగానే ఒక్కసారిగా ఉప్పెనలా దుఃఖమొచ్చేసింది యమునకి. "పిచ్చిమొద్దు" అంటూ వీపు నిముర్తున్న కావేరి పెళ్ళంటే ఇది ఎందుకో భయపడ్తోంది అనుకుంది.
ఇద్దరూ కలిసి ప్రభ వాళ్ళింటికి వెళ్ళారు. "వెల్ కమ్, వెల్ కమ్" అంది హేమ్ లెట్ నవ్వుతూ. ఆవిణ్ణి పరిచయం చెయ్యగానే యమున వినయంగా నమస్కరించింది. జయ, యమున చెయ్యిపట్టి లాగుతూ "మా అపర్ణ కోసం బొమ్మలు పెడ్తున్నాను. వచ్చి ఏదైనా సలహా ఇయ్యి" అంది.
కావేరి లోపలికెళ్తూ "ప్రభ ఎక్కడ?" అనడిగింది.
"ఔట్ ఆఫ్ డోర్స్" ఠక్కున చెప్పింది హెమ్ లెట్. ఈలోగా ప్రభ దొడ్డి వరండా లోంచి "వదినా! ఆవడలు చాలా బావున్నాయి. ఇంకొంచెం పంపాల్సింది" అంది.
"టూ బేడ్, వచ్చినప్పటినుండీ చూస్తున్నాను. ఆ అమ్మాయి ఏదో ఒకటి చేసి పంపడం తప్ప, నువ్వేమీ పంపడం కనపడలేదు" అని కోడలిని మందలించిందావిడ.
"ఏం, సరిపోలేదా అందరికీ?" అనడిగింది కావేరి.
"నో, నో మౌంటింగ్ ఎండ్ స్టాంపింగ్" అని అయోమయంగా చూస్తున్న కావేరితో 'ఎక్కీ తొక్కీగా సరిపోయాయి' అందావిడ.
ఆవిడ ట్రూ ట్రాన్స్ లేషన్ కి చాలా నవ్వొచ్చింది కావేరికి.
"ఇంతకీ మీ చెల్లెలు మేరేజీ లుక్స్ ఎప్పుడూ?" అడిగిందావిడ.
"ఆదివారమనుకుంటున్నాము" చెప్పింది కావేరి.
యమున పరధ్యానంగా జయ చెప్పే కబుర్లు వింటోంది. అపర్ణ బొమ్మలన్నింటిలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు పల్లకీలో కూర్చున్న కొండపల్లి బొమ్మ చాలా నచ్చింది యమునకి. "ఎంతో దూరం లేదులే ఊరేగడానికి! ఆదివారం పెళ్ళిచూపులటగా" అడిగింది నవ్వుతూ జయ.
కంగారుగా బొమ్మను క్రింద పెట్టేసింది యమున.
"ఎందుకంత కంగారు?" పకపకా నవ్వింది జయ.
యమున కళ్ళల్లో మళ్ళీ మోటార్ సైకిల్ మీద శేఖర్, అతని వీపుకంటుకు పోయి కూర్చున్న ఆ అమ్మాయీ కనిపించారు. మనసు మరల్చుకుని మరేదైనా ఆలోచిద్దామన్నా అదే గుర్తుకొస్తోంది పదే పదే! పల్లకీలో నుదిటిమీద బాసికం, బుగ్గన చుక్కా, నామం పెట్టుకొని పట్టుపంచెలో శేఖర్, అతని ఎదురుగా మోకాళ్ళమీద గడ్డం ఆన్చుకుని కూర్చున్న ఆ అమ్మాయి కనిపించసాగారు.
"డ్రీమ్ లాండ్ లోంచి కాలు కిందపెట్టమ్మా" అంటూ కాఫీ కప్పులతో వచ్చింది ప్రభ అత్తగారు.
గబుక్కున ఉలిక్కిపడి "కాఫీ వద్దండీ" అంది.
"నోనో! కాఫీ వద్దంటే మనిషిగా మరో జన్ముండదు అని సమ్ ఎల్డర్స్ చెప్పారు" అని బలవంతంగా కప్పు చేతికందించిందావిడ నవ్వుతూ. యమున కాఫీ గుటక వేస్తుండగా "ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడూ?" అడిగిందావిడ. ఏ అబ్బాయో తెలియక గమ్మున పలకమారింది యమునకి. ఆపుకోలేక సతమతమవుతూ దగ్గుతున్న యమున నెత్తిమీద చిన్నగా మొట్టుతూ "నో ప్రాబ్లెమ్. కాస్త స్లేట్ చేంజయింది" అంది ఆవిడ. అందరికీ ఆవిడ ట్రాన్స్ లేషన్స్ అలవాటయిపోవడంతో నవ్వి ఊరుకున్నారు.
"నేనూ చూళ్ళేదు. బానే ఉంటాడట" అంది. కాసేపు జరుగబోయే పెళ్ళిచూపుల గురించి మాట్లాడుకున్నారు. "పండక్కి మీరంతా అక్కడికే రండి. రాత్రి ఆయనొచ్చి అన్నయ్యగారిని పిలుస్తారు. జయా వాళ్ళాయన కూడా వస్తారు" అంది కావేరి.
"మా అమ్మాయి బొమ్మలు పెట్టుకుందిగా ఎలా వస్తాం?" అంది ప్రభ.
"భోగికి వాళ్ళింటికెళ్దాం. బిగ్ ఫెస్టివల్ ఎవరింట్లో వాళ్ళు చేసుకొని కనుమనాడు వాళ్ళు మనింటికొస్తారు. ఎప్పుడూ ఆ అమ్మాయికే ఇంటా బయటా చాకిరీ పాపం!" అంటూ హేమలతమ్మగారు జాలిపడింది.
"యమునా! నువ్వు కూడా రారాదూ! ఎలాగో తర్వాతరోజేగా పెళ్ళిచూపులు" అంది జయ.