"వెళ్ళొస్తాను" అని చెప్పి శిరీష దగ్గరకొచ్చి "పద" అన్నాడు. రెండడుగులు వేసేసరికి కళ్ళు తిరిగి అతని భుజంమీద వాలిపోయింది శిరీష. "శిరీ! ఎలా వుంది?" అంటూ ఆమెను అలాగే పొదివి పట్టుకుని తీసుకొచ్చి బైక్ స్టార్ట్ చేసి "గట్టిగా పట్టుకుని కూర్చో" అని చెప్పాడు.
ఇంటికెళ్ళి శిరీషని దింపి, తిరిగి యమునా వాళ్ళింట్లోకెళ్ళి విషయం కనుక్కోవాలని ఆరాటంగా ఉంది శేఖర్ కి. కానీ ఇంటికొచ్చేసరికి శిరీష పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. లోపలికి ఎత్తుకుని తీసుకు రావలసివచ్చింది. ఆపైన గజగజా వణుకుతూ, పళ్ళు పటపటా కొరుకుతూ పరుపుమీద మెలికలు తిరగసాగింది. శాకుంతలమ్మ గుండెలు బాదుకుంటూ "ఒరేయ్! డాక్టర్ కి ఫోన్ చెయ్యి! ఈ పిల్లకేదైనా అయితే ఆ తండ్రికేం చెప్పను? నాకు కాళ్ళు చేతులాడటం లేదు" అంటూ ఏడవసాగింది.
"నువ్వు గొడవ చెయ్యకు!" అని చెప్పి డాక్టర్ కి ఫోన్ చేసి ఆయనొచ్చేలోపుగా ఆమెకి తల్లిచేత స్పాంజ్ బాత్ ఇప్పించసాగాడు చల్లని నీటితో. డాక్టర్ వచ్చేదాకా శేఖర్ కూడా చాలా గాభరాపడ్డాడు. ఆయనొచ్చి ఏదో ఇంజెక్షనిచ్చి "హైఫీవర్ వల్ల తట్టుకోలేక అలా కన్ వల్షన్స్ వచ్చాయి. ఏం ఫర్వాలేదు. ఈ టాబ్లెట్స్ వాడుతూ, గంటగంటకీ టెంపరేచర్ నోట్ చెయ్యండి" అని చెప్పి ఫీజు తీసుకుని వెళ్ళిపోయాడు. శాకుంతలమ్మ శేఖర్ చెయ్యిపట్టుకుని "నువ్విక్కడే వుండరా. నాకు చాలా భయంగా ఉంది! నేను అన్నయ్యకి ట్రంక్ కాల్ చేసి రమ్మంటాను." అంది. శేఖర్ సరేనని అక్కడే కూర్చుండిపోయాడు. గంటగంటకి టెంపరేచర్ నోట్ చేస్తూ తడిబట్టతో తుడుస్తూ శిరీష పక్కనే వుండాల్సొచ్చింది.
* * * *
ఆటోలో వెళ్తున్నంతసేపు యమున ముక్కుకి కొంగు అడ్డం పెట్టుకుని ఏడుస్తూనే ఉంది. ముందురోజు బావగారు ఆఫీస్ కొచ్చి పెళ్ళిసంబంధం విషయం ఎత్తారు. "అది కాకపోతే ఇంకొకటి చూద్దాం. ఇంక చూడవలసిన టైమొచ్చేసింది. నీ మనసులో ఎవరైనా వుంటే చెప్పు!" అన్నారు.
తను అసహాయురాల్లా చూసింది.
"ఇప్పుడు కాదు. రేపు నాకు ఆఫ్! మీ అక్కని కూడా లీవ్ పెట్టమంటాను. మాట్లాడుకుందాం. తప్పకుండా రావాలి. ఎదురుచూస్తూ ఉంటాను" అన్నారు.
ఆయన మాట తీసెయ్యలేక లీవ్ లెటర్ ఇచ్చింది నిర్మలకు. "పెళ్ళిచూపులా!" అనడిగింది. యమున దిగ్గున తలెత్తి చూసింది.
"మీ బావగారంటుంటే వినిపించిందిలే! అయినా మనలో మనమాట నీ లవర్ ఈ మధ్య మొహం చాటేశాడేమిటి?" అనడిగింది ఆరాగా.
తనకు దుఃఖమొచ్చేసి ఏమీ మాట్లాడకుండా వచ్చేసింది. ఛీ...ఛీ ఎంత అలుసైపోయింది అందరికీ! నోరు తెరిచి బావగారితో శేఖర్ విషయం చెప్తే! తీరా ఆయన వెళ్ళేసరికి "నాకు కుదిరిపోయింది సారీ!" అని శేఖర్ అంటే ఇంక తను అక్కకీ, బావకీ మిగిలిన ప్రపంచానికీ మొహం చూపించగలదా? నయమే తొందరపడి ఎప్పుడూ ఎవరితోటీ అన్లేదు. ఈ రహస్యం తనలోనే దాచుకోవాలి! మరి ఈ పెళ్ళిచూపుల ఉపద్రవం ఎలా తప్పించుకోవడం? తను మరో మగవాడి ముందు కాబోయే భార్య స్థానంలో కూర్చోగలదా? శేఖర్ని తప్ప మరొకర్ని భర్తగా ఊహించగలదా? లేదు తన వల్లకాదు. ఏం చెయ్యాలి? శేఖర్ని కలిసి అడిగేస్తే? ఆ రోజు నువ్వే చెప్పావుగా చేసుకో, నేను తప్పుపట్టనని అని మాటకి మాటా చెప్పేస్తే మొహం ఎక్కడ దాచుకోవాలి?
ఆటో దిగేటప్పటికి ఈ లోకంలోకొచ్చి డబ్బులిచ్చి లోపలికొచ్చింది యమున.
"రా....రా నీ కోసమే ఎదురుచూస్తున్నాం" చెప్పాడు సుధాకర్.
"రామ్మారా మొహంలో అప్పుడే పెళ్ళికూతురి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కావేరీ మీ చెల్లెలొచ్చింది" అంటూ పిలిచింది వర్ధనమ్మ.
లోపల్నుండి కావేరి వస్తూనే "ఏంటే మొహం అలా పీక్కుపోయింది? ఒంట్లో బాలేదా?" అంటూ భుజంమీద చెయ్యేసి ప్రేమగా అడిగింది.
యమున మాట్లాడకుండా వంటింట్లోకి నడిచింది. చెల్లెలి వెనకే వస్తూ "ఏమిటా నిర్లిప్తత? ముందటి చలాకీతనమే లేదు. అసలేమైంది నీకు?" అంది కాస్త కోపంగా.
బిందెలోంచి మంచినీళ్ళు ముంచుకుని తాగి గ్లాసుకిందపెడ్తూ "ఏమీ కాలేదక్కా మీరందరూ అనవసరంగా కంగారుపడ్తున్నారు" అంది శాంతంగా.
"అవును! ఏమీ కాలేదు. ఆ పాలిపోయిన చెక్కిళ్ళు, లోతుకిపోయిన కళ్ళు చెప్తూనే వున్నాయి నిక్షేపంలా వున్నావని. అమ్మానాన్న ఎంత బాధపడ్తున్నారో నీ మౌనం చూసి. ఒకవేళ ఒంట్లో ఏదైనా సుస్తీ అయితే నాతో చెప్పు డాక్టర్ దగ్గరకెళ్దాం. లేక ఏదైనా..." అంటూ ఆగిపోయింది.
"లేక? నీ అనుమానమేంటీ?" లోపలికెప్పుడొచ్చాడో, గుమ్మంలో నిలబడి అడిగాడు సుధాకర్. "లేక ఎవరితోటైనా ప్రేమలో పడిందేమోననీ" అంది కావేరి.
"ఏమిటి యమునా! మీ అక్కేదో అంటోంది. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే చెప్పమ్మా" అన్నాడు ప్రేమగా సుధాకర్.
నెమ్మదిగా కళ్ళెత్తి దీనంగా చూసింది యమున. ఏదో చెప్పాలని, చెప్పలేక మధనపడుతున్నట్లు కనిపించింది సుధాకర్ కి ఆమె మొహం. వెంటనే మాట మారుస్తూ "మీ అక్క ఇవాళ ఆవడలు బ్రహ్మాండంగా చేసింది. ఒక పట్టు పడదాం పద. కావేరీ! మా ఇద్దరికీ టిఫిన్ పెట్టు" అన్నాడు.
కావేరి ప్లేట్లో ఆవడలు పెట్టి తెచ్చిస్తూ "మా జయ కోరిందివాళ. నువ్వు కూడా వస్తున్నావు కదా అని చేశాను" అంది.
"జయేది?" అడిగింది యమున ఒకటి తీసుకుని కొరుకుతూ.
"ప్రభా వాళ్ళింటికెళ్ళింది. ఈ మధ్య మా ప్రభకి రావడానికి కుదరట్లేదు. వాళ్ళత్తగారొచ్చింది ఊర్నుండి. ఆవిడ చాలా స్నేహశీలి. నిన్ను చూడాలని చాలాసార్లంది. వాళ్ళింటికి కూడా వెళ్ళొద్దాం" అంది కావేరి భర్తకి కూడా టిఫిన్ పెట్టి.
యమునకెక్కడికీ వెళ్ళాలని, ఎవర్నీ కలవాలనీ లేదు. ఇంటికెళ్ళి పడుకుని దిండు తడిసిపోయేటట్లు ఏడవాలని ఉంది. ఒకటి తిని రెండోది వదిలేసి "ఆకలిగా లేదక్కా!" అంది.
"అదేమిటే..." అని కావేరి ఏదో అనబోతుంటే సుధాకర్ వెనుకనుంచొచ్చి ఆమె భుజంనొక్కి ఏమీ అనొద్దన్నట్టు సైగచేశాడు. "యమునా! గదిలో కూర్చుందాం రా!" అని అన్నాడు.
యమునలేచి బావగారి వెనకాలే నడిచింది.