Previous Page Next Page 
తృప్తి పేజి 45


    "ఔనే! నేను మరచిపోయాను" అంది కావేరి.
    "వద్దు! అమ్మ ఒక్కత్తీ చేసుకోలేదు. రావడానికి కుదరదక్కా" అని గబగబా చెప్పేసింది యమున. ఇంకెవరూ బలవంతం చెయ్యలేకపోయారు. కాసేపయ్యాక బయల్దేరొచ్చేశారు అక్కాచెల్లెళ్ళిద్దరూ. యమునని బస్ స్టాప్ లో దింపి "ఆదివారం పొద్దుటే వచ్చెయ్యండంతా ఆలస్యం చెయ్యొద్దు" అని చెప్పాడు సుధాకర్. సరేనని తలూపింది. మనసులో మాత్రం 'ఆ ఆదివారం రాకపోతే ఎంత బావుంటుంది?" అనుకుంది.


                           *    *    *    *


    ఇంటికొచ్చేటప్పటికి ఏడుపోచ్చేసింది నర్మదకి.
    పిల్లలు దిక్కులేనివాళ్ళల్లా వీధిలో కూర్చుని వుంటారు. తలుపు తీయడంతోటే ఆకలాకలని ఏడుస్తారు. చెప్పులు విప్పి వెంటనే వంటగదిలోకెళ్ళాల్సొస్తుంది. గోపీగాడు పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేక పాడైపోయాడు. అలగావాళ్ళతో చేరి ఆటలూ, చెడ్డ మాటలూ. ఏమైనా అంటే ఎదిరిస్తున్నాడు. వాడు అమిత గారాబం వల్ల పాడైపోయాడు. తండ్రి కూడా బుద్ధి చెప్పకుండా "నువ్వేగా నెత్తికెక్కించుకుని, అమ్మని నానామాటలూ అనేదానివి" అంటున్నాడు. అలవాటు లేక వంట అస్సలు చేతకావట్లేదు. మొన్నటికి మొన్న సీత "బామ్మెళ్ళిపోయాక మాకీ ఇంట్లో బాగోలేదు. అమ్మ పనేంచేయదుగానీ అందర్నీ తిట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం మాత్రం వచ్చు" అంటూ నానామాటలూ అంది. పనిమనిషి కూడా ఏడిపించేస్తోంది. తనెళ్ళే టైముకి రాదు. సాయంత్రం ఎదురుచూసి, ఎదురుచూసి తను అన్నీ తోముకున్నాక వస్తుంది. ఏమైనా అంటే 'ఇప్పుడే నాకు కుదుర్తుంది' అని రాత్రి బట్టలుతికి పోతుంది. అవేమో ఆరవు! ఒకటే ముచ్చు వాసన. శంకర్ తో చెప్దామంటే అతను రాత్రిళ్ళు చాలా ఆలస్యంగా వస్తున్నాడు. అత్తగారున్నప్పుడు అతను ఎక్కడ గొడవవుతుందో అన్నట్టు ఒదిగి ఒదిగి ఉండేవాడు. ఇప్పుడలా కాదు. అసలు తనని కేర్ చెయ్యట్లేదు. "నన్నేమన్నా అంటే నేను కూడా మా అమ్మలాగే ఇల్లొదిలి పారిపోతాను. ఇన్నాళ్ళూ అమ్మ గురించని నోర్మూసుకుని పడున్నాను" అని చెప్పేశాడు. ఈమధ్య రాత్రిళ్ళు డ్రింక్ చేసి వస్తున్నట్లుగా కూడా అనుమానంగా ఉంది. తనామాటెత్తితే "పిల్లల గురించి ఇంటికొస్తున్నాను. నువ్వు గొడవ చేస్తే అదీరాను" అనేశాడు. అత్తగారున్నప్పుడు తను ఏడుగంటలకి లేచేసరికి కాఫీ కప్పు రెడీగా ఉండేది. తను తయారవడం, భోంచెయ్యడం తప్ప మరో పనుండేది కాదు. వచ్చాక కూడా హాయిగా భర్తతో షికార్లూ, సినిమాలూ, హోటళ్ళూ తప్ప మరోపని ముట్టుకునేది కాదు తను. ఇప్పుడు తెల్లవారగట్ల అయిదుగంటలకి లేస్తే వెళ్ళేవరకూ పని. పిల్లల్ని తయారుచెయ్యడం, రెండురెళ్ళు నాలుగు జడలు వెయ్యడం, టిఫిన్ బాక్స్ లు కట్టడం. ఒక్కనిముషం ఊపిరి పీల్చడానికి ఉండట్లేదు. సాయంత్రం వచ్చాక ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఇల్లంతా సంతలా చేస్తారు పిల్లలు. ఇల్లు సర్దుకోవడం వాళ్ళని చదివించడం... వంటా, మర్నాటి వంటకి చూసుకోవడం... ఇలా రాత్రి పదింటిదాకా పనే ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది ఎప్పుడు ఏదయిపోతుందో తెలియట్లేదు. రోజుకొకటయిపోతుంటే చాలా విసుగ్గా ఉంటుంది. అదే ఆవిడుంటే ఎప్పుడూ తనకా ఇబ్బంది కలగలేదు. ఒక్కనాడు నెలమధ్యలో ఇది కావాలి అని అడిగేది కాదు. తనెంత నిశ్చింతగా వుండేదనీ! ఆ రోజులు పోయాయి. పిల్లలకి బాలేదనీ, చాకిరి వల్ల తనకి నీరసంగా వుండీ అన్ని లీవులూ వాడేసింది. శంకర్ తో పనిచేసుకోలేకుండా వున్నానంటే "హాయిగా ఉద్యోగం మానేసి ఇంటిపట్టునుండు. నేను తెచ్చిన దాంతో పొదుపుగా సంసారం చెయ్యి. అసలు నీలా ఓర్పులేనివాళ్ళకి ఉద్యోగాలనవసరం. కనీసం పిల్లలకి కడుపునిండా తిండి పెట్టడం నేర్చుకో" అని హితబోధ చేశాడు. చూస్తూ చూస్తూ ఇంత మంచి ఉద్యోగం ఎలా వదిలెయ్యగలదు? అసలు ఉద్యోగం ఉండబట్టే కదా తనకంత గర్వంగా ఉంటోంది! మానేస్తే ఇంకేమయినా ఉందా? ఇప్పుడేం చెయ్యడం? అయిపోయిందేదో అయిపోయిందని అత్తగార్ని వెళ్ళి బతిమాలుకుని తీసుకువస్తే బాగుంటుందని అనుకుంది. కానీ సింధూ పట్ల తన ప్రవర్తన గుర్తుకొస్తే తన మొహం చెల్లట్లేదు. ఏమాటకామాటే! పక్కింటివాళ్ళనెప్పుడూ తను విసుక్కుంటూ చులకన చేసి మాట్లాడేది కానీ వాళ్ళే ఇప్పుడు పిల్లలకి దిక్కయ్యారు. వల్లి ఆడుతూ, ఆడుతూ రాయిమీద పడి నెత్తి చిట్లితే, కావేరి భర్త వెంటనే బండిమీదెక్కించుకుని తీసుకెళ్ళి కుట్లేయించి తీసుకొచ్చాడు. వాళ్ళాడబడుచు తను వినేటట్లుగా "వాళ్ళమ్మ ఊళ్ళోవాళ్ళకి పనీపాటా లేదు. మా ఇంటి సంగతులు పట్టించుకోవడం తప్ప! అంటుందేమో వదినా!" అంది తనొచ్చాక.
    "అలా అని పసిపిల్లనలా వదిలేస్తే ప్రమాదం కదూ! పిల్లలెవరైనా పిల్లలే కదా!" అంది కావేరి. తనకు బయటికెళ్ళి థాంక్స్ చెప్పడానికి కూడా మొహం చెల్లలేదు. గతంలో తను వాళ్ళని నానామాటలూ అందికదా!
    "ఎక్కడ్రా మీ అమ్మ! బైటికి రమ్మను. పెద్ద దొరసానిలా ఉందే! ఉద్యోగం చేస్తేనేం! ఊళ్ళేలితేనేం! పిల్లల్ని సక్కంగ సాకాలి. అది చాతకానప్పుడు కనకుండా నిమ్మళంగుండాలి" అంటూ పెద్దపెద్ద అరుపులు వినిపించి, హడలిపోతూ బైటికొచ్చింది నర్మద.
    వీధిచివరుండే నూకాలమ్మ పూనకమొచ్చినట్లు ఊగిపోతోంది. ఒక చేత్తో గోపిగాడ్ని రెక్కుచ్చుకుని ఉంది.
    ఆమెను చూడగానే నర్మద పై ప్రాణాలు పైనే పోయాయి. నూకాలమ్మ మర్రిమానంత మనిషి. ఎప్పుడూ తాంబూలచర్వణంచేత గారపట్టిన పళ్ళు, జీడిపిక్క రంగులో ఉండే నుదుటిమీద ఎర్రటి కాసంత కుంకుమబొట్టు పెట్టుకుని వీధిచివర్న ఒక చిన్న బడ్డీకొట్టు పెట్టుకుని కూచుంటుంది. దాని నోరు ఒక్కక్షణం ముయ్యకుండా ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని తూర్పారబడుతుంటుంది.
    "ఏమయింది?" అంది నర్మద ధైర్యం తెచ్చుకుని.
    "ఆ... ఏమయిందా? అంటూ తుపుక్కున ఉమ్మింది. ఆ ఉమ్ము తన ముఖంమీదే ఉమ్మినట్లు అనిపించింది నర్మదకి.
    "నీ కొడుకు నాకొట్లో కన్నమేసి జీళ్ళవీ ఎత్తుకుపోతున్నాడే" అంది చేతులు తిప్పుతూ.
    "మాటలు తిన్నగా రానీ, నువ్వెంత నీ బతుకెంత? నన్ను ఏవే అంటావా?" అంది రోషంగా.
    "నువ్వేమిటో నీ బతుకేమిటో ఈ వీధిలో అందరికీ తెలిసే వొన్నెల విసినికర్రా! మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కేదానివనీ, ముసలత్త మూలపడిందని ఇంట్లోంచి ఎల్లగొట్టినదానివనీ, పిల్లల్ని కని బజార్నపడేసి, టింగురంగాయని ఊరేగేదానివనీ ఇంకా ఎన్నెన్నో తెలుసే!" అందది ముందుముందుకోస్తూ.

 Previous Page Next Page