Previous Page Next Page 
తృప్తి పేజి 42


    "తినబోతూ రుచెందుకు? రేపు చూపిస్తాగా" చెప్పాడు శేఖర్ నవ్వుతూ.
    "నిజంగానా!" అడిగింది.
    "చాలా పొద్దుపోయింది వెళ్ళిపడుకో" అన్నాడు చెయ్యిపట్టుకునే.
    "బావా! ఆమె నాకన్నా అందగత్తేనా?" అడిగింది కళ్ళల్లోకి చూస్తూ.
    చిన్న నవ్వునవ్వి "వెన్నెల్లో తాజ్ మహల్ లాంటిదానివి నువ్వు... పెరట్లో తులసికోట లాంటిది యమున" చెప్పాడు.
    "ఫర్వాలేదు నీలోనూ కవిత్వం పెల్లుబుకుతోందే!" అంటూ పారిజాతాలన్నీ ఒకేమారు రాలినట్టు నవ్వింది శిరీష.
    మర్నాడు చాలా హుషారుగా లేచి తయారయ్యాడు శేఖర్. "శిరీ...శిరీ" అంటూ ఆమె గది దగ్గరకొచ్చి చూసేసరికి ఇంకా ముసుగుపెట్టుకుని నిద్రపోతూ కనిపించింది. "ఏయ్ మొద్దూ లే!" అంటూ భుజంమీద తట్టేసరికి పెనంలా కాలుతోందనిపించింది. "ఇంతవేడిగా వుందేమిటి? శిరీ!" అంటూ వెల్లకిలా తిప్పి నుదిటిమీద చెయ్యేసి చూసేసరికి నుదురు కాలిపోతుంది. అతని చేతిస్పర్శకి నెమ్మదిగా కళ్ళు తెరిచింది శిరీష.
    "అమ్మా...అమ్మా" అంటూ కంగారుగా కేకలు వేస్తున్న అతన్ని చూసి నవ్వుతూ "గుడ్ మార్నింగ్" అంది.
    "ఏం గుడ్, గాడిద గుడ్! జ్వరం తెచ్చుకుని ప్రోగ్రాం అంతా కాన్సిల్ చేశావు" కినుకుగా చెప్పాడు.
    నుదుటిమీద బొటనవేలు రాసుకుంటూ విధిలిఖితం అన్నట్టు చూపించి నీరసంగా నవ్వింది. ఇంతలో "ఎవరికిరా జ్వరం?" అంటూ హడావుడిగా శాకుంతలమ్మ వచ్చేసింది. "ఇంకెవరికీ నీ ముద్దుల మేనకోడలికి" చెప్పాడు చూపిస్తూ.
    "అయ్యయ్యో ఒళ్ళు కాలిపోతుంది. రాత్రి దాన్ని తీసుకెళ్ళి మంచులో నిలబెట్టావంతసేపు. అదసలే ఏడు మల్లెపూలెత్తు. ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. లేమ్మా. లేచి మొహం కడుక్కుని కాస్త వేడివేడిగా పాలుతాగు" అంటూ ఆవిడ ఆదుర్దా పడసాగింది.
    "సరే!" అంటూ శేఖర్ శిరీషని లేపి కూర్చోబెట్టి "బట్టలు మార్చుకో" అంటూ బయటికెళ్ళాడు.
    కాసేపట్లో ఇద్దరూ డాక్టర్ దగ్గరికి బయల్దేరారు. నీరసం వల్ల శిరీష శేఖర్ భుజంమీద వాలిపోయింది.
    "జాగ్రత్త! గట్టిగా పట్టుకో బావని" అని మరోమారు హెచ్చరించింది తల్లి. మోటార్ సైకిల్ మలుపు తిరిగిపోయాక ఆమె భర్తతో అంది "చూశారా! వాడొక్క నిమిషం దాన్నొదిలి పెట్టట్లేదు. వచ్చేవరకు కస్సుబస్సుమన్నాడు" అంది ముసిముసిగా నవ్వుతూ.
    సూర్యారావు కూడా నవ్వుతూ "ఇంకాలశ్యం దేనికీ? పిల్లలిద్దరూ బాగా అతుక్కుపోయారని మీ అన్నయ్యకి కబురు చెయ్యి ముహూర్తాలు పెట్టుకుందాం" అన్నాడు.


                             *    *    *    *


    రయ్యిమని పక్కనుంచి మోటార్ సైకిల్ దూసుకుంటూ వెళ్ళిపోతుండగా హఠాత్తుగా తలతిప్పింది యమున.
    శేఖర్.....
    ఆనందంగా "శేఖర్" అనబోతుండగానే అతని వీపుకి బల్లిలా అతుక్కుపోయి కూర్చున్న ఒక అందాలబొమ్మ కనిపించింది. నోట్లో పిలుపు నోట్లోనే ఆగిపోయింది. మోటార్ సైకిల్ జనప్రవాహంలో కలిసిపోయింది. ఆ లోపలే వెనకాల కూర్చున్న అమ్మాయి నిమిషంలో వెయ్యోవంతుసేపు యమునవైపు యమునవైపు చూసి తలతిప్పుకుంది. 'ఛక్'మని మెర్క్యూరీ లైటు కంట్లో పడినట్లనిపించింది యమునకి. పాలరాతి శిల్పంలాంటి ఆమె చిలకాకు పచ్చని షర్టూ, తెలుపు ప్యాంటూ వేసుకుని అటోకాలు, ఇటో కాలూ వేసుకుని కూర్చుని అతని వీపుకంటుకుపోయి కూర్చుంది. ఎంత ధీమాగా కూర్చుంది! తన ఆస్తి, తన స్వంతం అన్నంత ధాటిగా అనిపించింది. శేఖర్ కి చాలా హాయిగా వుండి వుంటుంది. అవును అంత అందమైన పిల్ల వీపుకి అంటుకుపోయి కూర్చుంటే ఆనందంగా ఉండదా! తనెప్పుడూ "అమ్మమ్మలా మునగదీసుకుని కూర్చోకు. కాస్త తగులుతూ కూర్చో. నా నడుం పట్టుకో" అనేవాడు. కానీ తనెప్పుడూ అలా చెయ్యలేకపోయింది. ఆ అమ్మాయెంత ధైర్యంగా కూర్చుందీ? పసుపు టీ షర్ట్ వేసుకుని శేఖరెంత అందంగా కనిపించాడూ! ఆ అమ్మాయి శేఖర్ పక్కనుంటే చూసినవాళ్ళు 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనుకుంటారు. నేను అతని పక్కన నడుస్తుంటే బహుశా కాకి ముక్కుకి దొండపండులా....
    ఆ పైన ఊహించలేకపోయింది. కళ్ళనిండా నీళ్ళొచ్చాయి. నేనెంత పిచ్చిదాన్ని! అతను నా స్వంతం అనుకున్నాను. అతను తన వెంట తిరుగుతుంటే జీవితాంతం ఇలా తోడునీడగా వుండే భర్త దొరకబోతున్నాడు అని ఎంత సంతోషపడింది? అవన్నీ కల్లలయిపోయాయి. అతను మరో స్త్రీతో.... ఉప్పెనగా ఏడుపొచ్చేస్తోంది. గబగబా కళ్ళు తుడుచుకుని వెళ్ళి ఆటోలో కూర్చుని ఎడ్రస్ చెప్పింది.
    శిరీషని డాక్టర్ కి చూపించి బయటికి తీసుకొచ్చాక "యమునని సర్ ప్రైజ్ చేద్దామా?" అడిగాడు శేఖర్.
    శిరీషకి అస్సలు ఓపికలేదు. తల తిరిగిపోతోంది. చాలా నీరసంగా అనిపిస్తోంది. అయినా అతని కళ్ళల్లో మెరుపూ, గొంతులో హుషారూ చూసి కాదనలేకపోయింది. తల వూపింది.
    ఇద్దరూ మరో అయిదు నిముషాల్లో యమున ఆఫీస్ ముందున్నారు. "పద!" అంటూ లోపలికి తీసుకెళ్ళి, రిసెప్షన్ లో అడిగాడు యమున కావాలని. అక్కడారోజు నిర్మలే ఉంది. శేఖర్ ని గుర్తుపట్టి మాట్లాడింది. "ఈమధ్య కనబళ్ళేదేమిటి?" అడిగింది కుతూహలంగా, శిరీషని అపాదమస్తకం పరీక్షిస్తూ.
    "చిన్న యాక్సిడెంట్ అయిందిలెండి. అందుకని రావడానికి కుదర్లేదు. యమునని పిలుస్తారా?" అనడిగాడు.
    "అదీ రోజు లీవ్ పెట్టిందండీ. వాళ్ళక్కయ్య ఇంటికెళ్తుందిట. బహుశా! పెళ్ళిచూపులు" అంది నవ్వుతూ.
    "వ్వాట్!" అరిచినట్టుగా అన్నాడు శేఖర్.
    "నిన్న వాళ్ళ బావగారొచ్చి ఏవో పెళ్ళికొడుకు వివరాలు చెప్తుంటే విన్నాన్లెండి సరిగ్గా తెలియదు" అంటూ ఏదో ఫోన్ వస్తే "ఎక్స్ క్యూజ్ మీ" అని అది ఎటెండ్ అవసాగింది.

 Previous Page Next Page