Previous Page Next Page 
పెళ్ళి చేసి చూడు పేజి 4


    "నలుగురు వచ్చారు - ఇద్దరు కట్నం అక్కర్లేదు కానీ ఉద్యోగం వేయించే పూచీ తీసుకోవాలన్నారు. ఉద్యోగమైనా ఆషామాషీది కాదు. కలక్టర్ లెవల్లో కావాలట. ఒకరేమో అమ్మాయి నలుపన్నారు. ఆ విషయం చూస్తేనే తెలుస్తుంది. వేరే చెప్పాలా అన్నాన్నేను. ఇంకొకళ్ళు యాభై వేలు కట్నం కావాలన్నారు ---" వెంకట్రామయ్య అన్నీ ఏకరవు పెట్టి ---" ఒరేయ్ - మన పరిస్థితులన్నీ నాకు తెలుసు. ఈ పరిస్థితుల్లో ఎటువంటి సంబంధం తేవాలో కూడా నాకు తెలుసు. అన్నీ కలిసి రావాలి మరి -----' అన్నాడు.
    మోహనరావు మనసు ఆనందంతో ఉప్పొంగి పోయింది. లక్ష్మీ పెళ్ళి గురించి తండ్రి ఇంత శ్రద్దగా ప్రయత్నాలు చేస్తాడని అతననుకోలేదు. అయితే అతని అనందం తాత్కాలికమే అయింది. ఆరోజు రాత్రి తమ్ముడు శ్రీకాంత్ అన్నీ అతనికి వివరంగా చెప్పాడు.
    ఇంతవరకూ ఒక్క పర్యాయం కూడా వెంకట్రామయ్య కూతురి పెళ్ళి గురించి ఇల్లు కదలలేదట. ఎవరైనా మధ్యవర్తులు సంబంధాలు చెబితే వివరాలన్నీ విని- విన్నాం కదా ఈ సంబంధం మనకు పొసగదు అని తోసి పుచ్చేసేవాడట. కొద్ది గంటల క్రితం అయన వర్ణించి చెప్పిన వివరాలన్నీ -- అయన ఊహకు సంబంధించినవి మాత్రమే! ఒక్కటీ వాస్తవంలో జరుగలేదు.
    ఇదే రకం మనస్తత్వామో మోహనరావుకి అర్ధం కాలేదు. అతను తలపట్టుకు కూర్చుంటే విరజ వారించి -- "ఈ విషయా లెప్పుడూ ఉన్నవే ---ముందు తిరుపతి ప్రయాణం సంగతి చూడండి --' అంది.

                                                4

    "నమస్కారమండీ----"
    "నమస్కారం ---" అంటూ ఆ ఆగంతకుని పరీక్షగా చూశాడు వెంకట్రామయ్య. ఎవరో పాతికేళ్ళ కుర్రాడు. పెద్ద విశేషంగా ఏమీ కనపడ్డం లేదు.
    "నాపేరు వీర్రాజంటారండి ---' అన్నాడతను.
    'అలాగా - నన్ను వెంకట్రామయ్యంటారండి ----" అన్నాడు వెంకట్రామయ్య అదోలా.
    "ఎంతమాట - తమరి నేమంటారో వేరే మీరు చెప్పాలండీ-" అన్నాడు వీర్రాజు వినయంగా.
    వెంకట్రామయ్య ముఖంలో గర్వం కనపడింది ----"మీరేదో పని మీద వచ్చినట్లున్నారు ---" అన్నాడు.
    "పనంటే పనేమీ కాదండి. ఏదో చిన్న సమాచారం అందించి పోదామని వచ్చానండి---"
    వెంకట్రామయ్య ఈసారి కళ్ళలో అతన్ని ప్రశ్నించాడు.
    "భీమరాజుగారిది హైదరాబాదండి ---" అన్నాడు వీర్రాజు.
    వెంకట్రామయ్యకు భీమరాజేవరో తెలియక పోవడం వల్ల అతనిది హైదరాబాదన్న సమాచార మెందుకో ఆయనకు అర్ధం కాలేదు.
    "ఆయనకో శ్రీరామచంద్రుడి లాంటి కొడుకున్నాడండి ---" మళ్ళీ అన్నాడు వీర్రాజు.
    'పేరు కూడా శ్రీరామాచంద్రుడేనా----" అన్నాడు వెంకట్రామయ్య చిరాగ్గా.
    "కాదండి ----బాబూరావంటారండి అతన్ని -------"అన్నాడు వెంకట్రామయ్య.
    "అలాగా ------చాలా మంచిది ----' అన్నాడు వెంకట్రామయ్య.
    'చిత్తం ---అతను చేసే ఉద్యోగం కూడా మంచిదేనండి ----' అన్నాడు వీర్రాజు.
    "చాలాబాగుంది కానీ ఈ వివరాలన్నీ నాకెందుకు?' అన్నాడు వెంకట్రామయ్య.
    "భీమరాజుగారికి మీ నాన్నగారు బాగా తెలుసునటండి. మీకో పెళ్ళీడమ్మాయుందని కూడా తెలిసిందిటండి. మీతో వియ్యమందాలని అయన సరదాపడుతున్నారండి----" అన్నాడు వీర్రాజు.
    వెంకట్రామయ్య ముందులిక్కిపడినా తర్వాత తమాయించుకుని ---"దానికేముంది - వచ్చి పిల్లను చూసుకుంటే సరిపోతుంది ----' అన్నాడు.
    'అవుననుకోండి - అలా చూస్కోమని మీరాయానకుత్తరం రాస్తే అయన అలాగే వస్తారండి ----' అన్నాడు వీర్రాజు.
    వీర్రాజుని మరికాసిని ప్రశ్నలు వేశాక వెంకట్రామయ్యగారికి వివరాలు పూర్తిగా తెలిశాయి. భీమరాజుగారిది కూడా తనది లాగే పెద్ద కుటుంబం. పెద్దకొడుకుద్యోగం చేసుకుంటున్నాడు. తండ్రీ కొడుకు లిద్దరూ హైదరాబాద్ లోనే స్వంతింట్లోఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మంచి సంప్రదాయమైన కుటుంబంలోని పిల్లను చేసుకోవాలన్నది అయన అభిలాష. ఆయనకు వెంకట్రామయ్య గురించి విన్నాడాయన. కయ్యానికి, వియ్యానికీ నెయ్యానికి సమ ఉజ్జీలుండాలి కాబట్టి అన్ని విధాలా ఈ సంబంధ మాయనకు నచ్చింది. అందుకే తనకు తెలిసిన వీర్రాజు చేత కబురు పంపించాడు. మగపెళ్ళి వారు కదా - అందుకని ముందాడ పెళ్ళి వారిచేత అడిగించుకోవాలి.
    వీర్రాజు వెళ్ళిపోయాక వెంకట్రామయ్య కుడి కన్నదిరింది. అప్పుడే పార్వతమ్మకు ఎడమ కన్నదిరింది. వెంకట్రామయ్యకు కుడి కాలిలో దురదలు ప్రారంభమయ్యాయి.
    'ఇంకేం ప్రయాణ ముందన్న మాట -----' అంది పార్వతమ్మ.
    "అబ్బే - నే నుత్తరం రాద్దామనుకుంటున్నాను---' అన్నాడు వెంకట్రామయ్య.
    'చాల్లెండి , వెళ్ళి స్వయంగా చెప్పి రావడమే మర్యాదగా ఉంటుంది. ఆవిధంగా వాళ్ళ ఇల్లూ, పరిస్థితులు చూసినట్లు కూడా ఉంటుంది --"
    'అయితే ఒక పని చేస్తాను. ఉత్తరం లేకుండానే వెళ్ళి వాళ్ళను చూసి - విషయం చెప్పి వస్తాను ---' అన్నాడాయన.
    "మీ బద్ధకం బంగారం కానూ - ఒక ఉత్తరం రాసి పారేస్తే మీరోస్తున్నట్లు వాళ్లకు తెలిసి ఇంటి పట్టునంటారు - లేకపోతె ...."
    "నీకు తెలియదు. వాళ్ళ గురించి పూర్తిగా తెలియాలంటే ఏ ఉత్తరమూ లేకుండానే వెళ్ళాలి -----' ఉత్తరం వ్రాయకూడదనే దృడ నిశ్చయానికి వచ్చేక - మళ్ళీ అది రాయాలంటే చాలా బాధాకర మైన విషయమాయనకు.
    వెంకట్రామయ్య ఉత్తరం వ్రాయకపోవడానికి కింకో కారణం కూడా వుంది. ఒకతేదీకి అనుకుని ప్రయాణం చేయడం ఆయనకు చాలా చిరాకు. అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోవడమే ఆయనకు హాయిగా వుంటుంది. ఈ విషయం ఋజువు చేయడానికి అయన జీవితంలో చాలా ఉదాహరణలున్నాయి.
    వెంకట్రామయ్య తండ్రి అంత్య దశలో ధవళేశ్వరం లో ఉండేవాడు. వెంకట్రామయ్య పెద్ద కొడుకులిద్దరూ తాతగారి దగ్గరే ఉండి చదువుకుంటుండేవారు. పితృభక్తీ పరాయణుడైన వెంకట్రామయ్య ఇంచుమించు ప్రతిరోజూ తన గ్రామం నుంచి బొబ్బరలంక వచ్చి అక్కడ నావ దాటి ధవళేశ్వరం చేరుకునేవారు. వచ్చీ రాగానే అతను తిరుగు ప్రయాణానికి నావను చూడమని రెండోకొడుకు రాజారావును పంపించేవాడు. వాళ్ళుండే ఇంటికి గోదావరీ నది దగ్గర్లోనే ఉంది. రాజారావు గోదావరి ఒడ్డుకు పోయి కూర్చునేవాడు. నావల కోక నీర్నీత సమయమంటూ లేదు. జనం పోగుపడగానే తోసేస్తారు. అందువల్ల నావ సిద్డంయ్యేవరకూ వేచి ఉండడం రాజారావుకు చాలా విసుగ్గా ఉండేది. తీరా నావ సిద్దమై తండ్రి కా సమాచారమందిస్తే -- అయన తాపీగా --- "తర్వాత నావ ఎన్నింటికో చూడు ------" అనేవాడు. రాజారావుకి కళ్ళ నీళ్ళ పర్యంతమయ్యేది. చేసేది లేక అతను మళ్ళీ వెళ్ళేవాడు. అలా అతను ఆఖరి నావ వెళ్ళేవరకూ గోదావరి ఒడ్డునే ఉండేవాడు. తండ్రి ఆఖరి నావలో తిరిగి వెళ్ళిపోయేవాడు- ఆప్యాయంగా కొడుకు చేతిలో ఒక రూపాయుంచి.
    ఆఖరి నావలో వేడదామన్న అభిప్రాయం వెంకట్రామయ్యకు మొదట్లో ఉండదు. కానీ నావ సిద్దంగా ఉందని తెలిసేసరికి అయన మనసు వాయిదాను కోరేది. అలా ఆఖరి నావవరకు జరిగేది. తన స్కూలుకు సెలవు రోజుకి తండ్రి ధవళేశ్వరం వస్తే రాజారావుకు ప్రాణంతకంగా ఉండేది - సమయమంతా గోదావరి పాలని తెలిసి.

 Previous Page Next Page