Read more!
 Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 4


                                          కాలంతో కదలాలి

    "ఎనీ ప్లాన్స్ ఫర్ హనీమూన్ హనీ!" గోముగా భుజంమీద తల ఆన్చి అడిగింది. మరో నాలుగు రోజుల్లో మూడుముళ్లు వేసి మొగుడు కాబోయే రామ్ చరణ్ ఉరఫ్ చరణ్ ని అడిగింది చరిత్ర, చరిత్ర సృష్టిస్తూ.
    'వామ్మో! ఏం ప్రోగ్రెస్ రా నాయనా? ఆడవాళ్ల ప్రోగ్రెస్ ఇంత ముందుకు వెళ్లిపోయిందా? తమని దాటుకుని ముందుకెళ్లి గోల్ కొట్టేశారా? నాయనో, రేపు శోభనం గదిలోకి పాలగ్లాసుతో తను వెళ్లాలి కాబోలు! ఆవిడగారు తలుపు గడియ వేసే డ్యూటీ పుచ్చేసుకుని తిన్నగా మంచం దగ్గరకి వచ్చేసి తన చేతిలో పాలగ్లాసు తీసుకుని తాగేస్తుందేమో!' కళ్లముందు అరక్షణంలో అర రీలు తిరిగిన దృశ్యాలకి తబ్బిబ్బు అయి తడబడి "నువ్వే చెప్పు" అన్నాడు బెరుకు కనబడకుండా ఓ వెర్రినవ్వు నవ్వి.
    చుబుకం పట్టుకుని ఆమెను తనవైపు తిప్పుకున్నాడు. కాబోయే భర్తగారు తనకంత ప్రాముఖ్యం ఇస్తున్నందుకు "థాంక్స్ డియర్" అని చెప్పింది. మొహం నిండా సంతోషం నింపుకుని "గోవా" అంది.
    'పోవే తింగరబుచ్చి! విశాఖలో సముద్రం ఒడ్డున కూర్చుని మళ్లీ అక్కడికెళ్లేదేమిటే? అక్కడ కూడా ఇదే సముద్రమేడుస్తుంది, అంతేగా!' ఈ మాటలన్నీ లోపలే అనేసుకుని, అక్కడ సముద్రం వేరు, ఇక్కడ సముద్రం వేరు అని చరిత్ర అనకముందే "అబ్బ! వద్దు. ఇంకెక్కడికన్నా వెడదాం. పుట్టిన దగ్గరనుంచి సముద్రం చూస్తూనే వున్నా" ప్రయత్నం మీద మొహంమీదనుంచి విసుగు వెనక్కి తోసి గొంతులోకి మార్దవం చొప్పించి అన్నాడు.
    "ఓకే ఓకే, దెన్ స్విట్జర్లాండ్" అంది మరింత మొహంలో మొహం పెట్టేసి.
    'స్విట్జర్లాండ్... అయ్యబాబోయ్! టిక్కెట్లు, బోర్డింగు, లాడ్జింగు...' కంప్యూటర్ కంటే వేగంగా లెక్కలు కట్టేసి రిజల్ట్ చూపెట్టేసింది అతని ఇంజనీరింగ్ బుర్ర. మూడేళ్లనుండీ దాచుకున్న డాలర్లన్నీ హాంఫట్. ఫెడేలున మొహంమీద కొట్టినట్టు తెలివి తెచ్చుకుని, భుజం మీద తల గట్టిగా అడుముకుని చాలా ప్రేమగా "యుఎస్ లో ఉంటాం! స్విట్జర్లాండ్ కేం భాగ్యం? ఎప్పుడన్నా వెళ్లొచ్చు. ఇండియాలో ఎన్ని మంచి ప్లేసులున్నాయో తెలుసా?" ఊరిస్తున్నట్టన్నాడు.
    "ఓకే. దెన్ యూ ఛూజ్" అంది కాబోయే మొగుడిమీద నమ్మకంతో. ఆ క్షణంలో ఆ మొగుడిగారి మనసులో 'హాయిగా, వెన్నెల్లో డాబామీద తెల్లటి మెత్తటి పరుపేసుకుని, చక్కగా ఓ పక్కనుంచి బీచ్ గాలి తగులుతుంటే, మరో పక్కన ట్రాన్సిస్టర్ లో పాత తెలుగు, హిందీ పాటలు వింటూ ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తూ ఎంజాయ్ చేయకుండా పడుతూ లేస్తూ ఎక్కడికో వేరే ఊరెళ్లి, హోటల్ రూమ్ లో ఫస్ట్ నైట్ చేసుకోవడం ఎందుకు? దానికంటే ఈ మూన్ నైట్ బాగుంటుంది కదా!' అనే ఆలోచనలు మెదిలాయి. ఇలా ఆలోచిస్తున్నట్టు చరిత్రకి తెలిసిందంటే 'పెళ్లికి మూడు రోజుల ముందు పారిపోయిన పెళ్లికూతురు' అన్న వార్తతో చరిత్ర సృష్టించేదేమో చరిత్ర!' అనుకున్నాడు మళ్లీ.
    "సరే, ఊటీ, కొడైకెనాల్ వెళదాంలే" సూక్ష్మంలో మోక్షం ఆలోచిస్తూ చెప్పాడు చరణ్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, తెలివిగా చదువుకుని అమెరికా వెళ్లి 'డాలర్లు సంపాదించుకుంటాం' అనుకుని ఎమ్మెస్ చేశాడు. 'క్వాల్ కం'లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మూడేళ్లుగా డాలర్లు జమ చేసుకుంటూ ఆనందంగా డబ్బులు లెక్కపెట్టుకునే మానవుడు మన హీరోగారు.
    అమెరికాలో సెటిలైన తెలుగింట పుట్టిన అమ్మాయి మన హీరోయిన్. అవసరాన్ని మించిన డబ్బు, అమెరికా స్వేచ్చ మధ్య పెరిగిన అమ్మాయి. ఇద్దరికీ ఆఫీసులో పరిచయాలు. స్నేహం ప్రేమగా మారింది. రెండువైపులా అభ్యంతరం చెప్పడానికి కారణాలు లేవు గనుక 'ఓకే' అని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు పెద్దవారు. అబ్బాయి నాయనమ్మ, మాతామహులు ముసలివారయ్యారు. ప్రయాణాలు చేయలేరు. అయినా అమెరికాలో పెళ్లేమిటి? ఇండియాలో చెయ్యాలి గానీ అనేసి, మీకెవరూ లేకపోతే ఏర్పాట్లు మేం చేస్తాం అనేశారు అబ్బాయివాళ్లు.
    పరి రోజుల ముందు అమ్మాయితో సహా వచ్చేసి, షాపింగులు, టైలరింగులు, నగల కొట్లన్నీ ఆడపిల్లవాళ్లు తిరుగుతుంటే, అబ్బాయి, అమ్మాయి జంటగా షికార్లు, సినిమాలు, కాఫీషాపులు తిరుగుతూ ఇద్దరూ మానసికంగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కాస్త కాస్త శారీరకంగా... అబ్బే... ఊరికే చిన్న చిన్న టచ్ లు, సరదాలు మజాలు చేస్తూ తిరుగుతున్నారు వారం రోజులుగా.
    ఇంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడీ హనీమూన్ గొడవ వచ్చిపడి హీరోగారి మూడ్ కాస్త చెదిరింది. ఈ పదిరోజుల్లో అమ్మాయిగారి ఖర్చు లెవెల్ చూస్తుంటే చరణ్ గారికి కరచరణాలు కాస్తా చల్లబడుతున్నాయి. పక్కన కొత్తమోజులో, కొత్త అమ్మాయి ఇచ్చే సాంగత్యం వేడి పుట్టిస్తున్నా ఖర్చు విషయానికొస్తే మాత్రం ఒళ్లు కాస్త చల్లబడుతోంది.
    బీచ్ రౌండు పూర్తిచేసి ఇల్లు చేరిన కాబోయే నవదంపతుల్ని చూసి చరణ్ వాళ్ల నాయనమ్మకు ఓ పక్క ముచ్చటనిపిస్తున్నా, కొంపదీసి వీళ్లిద్దరూ పెళ్లికంటే ముందే శోభనం చేసుకున్నారేమో అని అనుమానం. అందుకే బయట తిరిగి వచ్చినప్పుడల్లా వాళ్లిద్దర్నీ నఖశిఖపర్యంతం పరీక్షిస్తూ ఉంటుంది ఆవిడ హాల్లో కూర్చుని.
    "ఏమిట్రా నాన్నా! ఆ తిరుగుళ్లు. పెళ్లి ఇంకా మూడు రోజులే ఉంది. తిరిగి తిరిగి ఇద్దరూ నల్లకప్పేసినట్లు కమిలిపోయారు. ఇదిగో ఇంక ఈ రెండు రోజులూ ఇంటిపట్టున ఉండాల్సిందే. గుమ్మం కదలడానికి వీల్లేదు" ఆర్డరిచ్చేసింది.
    పెళ్లికూతురు ముసి ముసి నవ్వులు నవ్వింది. పెళ్లికొడుకు మనసులో కొద్దిగా సంతోషించినా పైకి మాత్రం "మామ్మా! డోంట్ బీ సిల్లీ" అన్నాడు. "ఇప్పుడు కాకపోతే మజా ఇంకెప్పుడు?" అన్నాడు కొంటెగా చరిత్రని చూస్తూ తను చాలా రొమాంటిక్ అన్నట్టు.
    "సిల్లీ కాదు, గిల్లీ కాదు. అవ్వ! పెళ్లి కాకముందు ఈ తిరుగుళ్లేమిటి? పెళ్లిరోజు జీలకర్ర, బెల్లం పెట్టాక, తెర తీశాక సుముహూర్తంలో మొహాలు చూసుకోమనే ఆచారం మనది. చాదస్తంగా ఏదో చెప్పబోయింది.
    "ఈజిట్... అప్పటివరకు ఇద్దరూ చూసుకునేవారు కాదా?" వింతగా చూస్తూ అడిగింది అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి.
    "అవునే మనవరాలా! పెళ్లిచూపుల తరువాత కాబోయే మొగ్గుణ్ణి మళ్లీ చూసేది సుముహూర్తంలోనే! పెళ్లి కాకుండా ఇలా చెట్టాపట్టాలేసుకు తిరగడం సంప్రదాయం కాదు."
    'పిచ్చిమామ్మా! చెట్టాపట్టాలేసుకు తిరగడమేంటి? అన్ని సరసాలూ, సరదాలూ ముందే అయిపోతున్నాయి. అప్పుడే సగం ఫిల్టర్ అయిపోతున్నాయి నచ్చకపోతే. పెళ్లిదాకా వచ్చేవి ఇదిగో ఇంకా మీలాంటివాళ్ల పెంపకంతో కాస్తో కూస్తో ప్రిన్సిపల్స్ వంటబట్టడం వల్లే' పైకి అనలేని మాటలే అవన్నీ. నాయనమ్మ మాటలన్నింటికీ ఓ నవ్వే జవాబుగా చెప్పాడు చరణ్.
    చరణ్ అంటే ఆవిడకి ప్రాణం. ఇద్దరు ఆడపిల్లల తరువాత మనవడు పుట్టడం, తాతగారు పోయిన ఏడాదిలోగా పుట్టడంతో భర్తే మనవడి రూపంలో పుట్టాడని చరణ్ పై ఆవిడకు అంతులేని మమకారం. భర్త పేరు రామనాథం కలిసేట్టు రామ్ చరణ్ అని పెట్టించింది. చిన్నప్పుడు చంకనేసుకుని వెండిగిన్నెలో పెరుగన్నం కలిపి కథలు చెప్పి తినిపిస్తూ వాడి ముద్దుమురిపాల మధ్య భర్తలేని లోటు పూడ్చుకుంది. ఇంజనీరింగ్ కూడా ఊళ్లోనే చదువుకోవడంతో అమెరికా వెళ్లేవరకు మనవణ్ణి ఎప్పుడూ ఆమె వదిలి ఉండలేదు. "ఎందుకురా పాడు అమెరికా? ఇక్కడ లేవా ఉద్యోగాలు?" అంటూ పోరుపెట్టింది.

 Previous Page Next Page