Previous Page Next Page 
మైదానం పేజి 4


    ఆ దేశంలో ఆకాశం ఎప్పుడూ నీలం కారుతున్నట్టే వుంటుంది. వాన కురిసినా శుభ్రమైన కొండల్నీ, నేలనీ ఇంకా శుభ్రంగా కడుగుతుంది. టపటపమని చినుకులుపడితే, కడుపులో ఉన్న స్త్రీవలె నా యేరు నిండి పోయేది. కొండలన్నీ మేఘాల్ని కప్పుకుని తెల్లనయేవి.
    మొదట కుండల్లో వండడం నెయ్యీ కూరలూ లేకుండా తినడం, పరదాపేసుకుని ఆరుబైట పడుకోవడం కొత్తగా కష్టంగా వుండేది. అప్పుడప్పుడు పిచ్చి పట్టుదలలు కూడా పట్టేదాన్ని, కాని కష్టపడ్డానికీ, కొత్త పడడానికీ వ్యవధి వుంటేనా? అమీర్ వుండనిస్తేనా? అయినప్పటికి నాకు చిన్నప్పటి అలవాట్లు వదలడం ఎంతో కష్టమయింది. వంట చేసేప్పుడు అమీరావేపు వొస్తే అన్నీ పారేసి దూరంగా పోయినాను. అన్నం తినక తిరిగాను. కాని ప్రేమ వున్నప్పుడు త్యాగం చెయ్యడం ఎంత సులభమనుకున్నావు? ఊరికే ఏ త్యాగానికైనా పతివ్రతల్ని పొగుడుతారుగాని ప్రతి నిమిషం సౌఖ్యాల్నీ, ఆనందాన్నీ అవసరంగానైనా సరే వొదిలేసుకుని ప్రేమబలం స్థిరపరచాలని వుంటుంది.
    ఆయన్ని ప్రేమిస్తూ నేను ఆయన యింట్లో వున్నప్పుడు ఒకసారి ఇంగ్లండు వెళ్ళివచ్చిన ఆయన స్నేహితుణ్ణి తీసుకొచ్చి తనతో భోజనం వడ్డించమన్నారు. ససేమిరా వీల్లేదన్నాను. కారణం - మా పెత్తల్లి సూరమ్మగారికి నా మీద కోపం వస్తుంది. ఏమంటుంది? 'మొగవాడు అతడు అన్నీ నిర్లక్ష్యంగానే చెయ్యాలంటాడు. ఆడదానివి నీకు బుద్ధిలేక పోయిందా? అంటుంది. తోడికోడలు నన్ను వెలేస్తానని బెదిరిస్తుంది, నవ్వులాటకులాగు. పాపం ఆయన నన్ను బతిమాలారు. తన పరువు పోతుందని కన్నీళ్ళపర్యంతమైనారు. తనమీద ప్రేమలేదా. తన మాట వినకూడదా అని అడిగారు. రాయివలె స్థిరంగా నా పట్టుదల విడవలేదు నేను. ఇదీ మనం భర్తలకోసం చేసే త్యాగం. ఆధ్యాత్మిక ప్రేమ. పవిత్ర దాంపత్యానికి మన జీవితంమీద వుండే "ఇన్ల్ఫుయస్సు" కాని మామయ్య వొచ్చి, "చివరికి తురకకూడు తింటున్నావుటే!" అంటే నాకేమనిపించింది? ఏమన్నాను? ఇది తురక కూడా? ప్రేమ దేనికి నైవేద్యం పెట్టి భక్తితో కళ్ళుకద్దుకుని మధ్య మధ్య అమీర్ ముద్దులతో ఆరగించిన ఆ అమృతం తురక కూడా? ఏం తింటున్నామో, తింటున్నామో లేదో అనే ధ్యాస వుంటేనా? ఇంక బతకడానికి వీలులేదనీ ఆకలేసి మధ్య మధ్య ఆనందానికి అవాంతరంగా మనసు మళ్ళించుకుంటానే గాని, ఇంక యింటిదగ్గరవలె ఈ కూరలో ఉప్పు సరిపోయిందా, ఈ చారులో పోపు చాలిందా అనే ఆలోచనలు వుంటాయా? పచ్చడిలో యిసక పడ్డదనీ, అన్నం చిమిడిందనీ, పులుసు ఉడకలేదనీ తిట్లూ - లేచిపోవడాలూ - విస్తరి మొహాన కొట్టడాలూ పవిత్రమైన మానసిక ప్రేమగల ఆదర్శ సంసారాల్లో జరుగుతాయిగాని, పశువులవలె కామంతో పొర్లాడే గుడిసెల్లో జరగనే జరగవు! మానసిక ప్రేమగనక- దాంట్లో వుప్పెక్కువైందనీ, కారమెక్కువయిందనీ, తగాదా! ఈ మానసిక ప్రేమమీద నాకెందుకంటే అంతకోపం - మామయ్య తీసుకొచ్చాడు దాన్ని వాళ్ళ వూరినించి, దాని సంగతి చెపుతా తరవాత. కామంతో పడి కళ్ళు మూసుకుని నరకంలోకి జారేవాళ్ళకి ఈ విచక్షణలన్నీ యెందుకుంటాయి! గంజే పరమాన్నంగా వుంటుంది. అది మళ్ళీ ప్రేమలక్షణమే నంటారు కొందరు పూర్వులు. కాని మామయ్యవంటి విమర్శకులు మాత్రం దాన్ని పశుకామమే నంటారు! ఎందుకు? వారి నీతి హృదయాలకి నెప్పి కలిగిస్తోంది! నావంటి వారి పాడుజీవిత చరిత్రలనీ చదివీ, వినీ వారి భార్యలూ, కూతుళ్ళూ లేచిపోతే యెట్లా?
    ఇంక విను. ఆరుబైట చక్కని బంగారపు టెండలో చేతులు పైకి చాచి, ఆవలించి, వొళ్ళు విరుచుకుని చాపమీద నించీ ఒక్క దూకు దూకి లేచి ఒకరి మొహం వొకరు కొత్తగా, అందంగా చూసుకుని రాత్రి జ్ఞాపకం వల్ల కొంచెం సిగ్గుపడి, చుట్టూ వున్న సౌందర్యాన్ని చూసి నవ్వడం. కారణం లేకుండా, ఆనందంతో ఒకరికి ఒకరమూ, మా ఇద్దరికీ కలిసి ఆ సుందరలోకం వుందని నవ్వడం. పొద్దున్న కాఫీలా? ఏంలా. ఒక్క రోజు కాఫీ గంట ఆలస్యమయితే గిలగిలలాడేదాన్ని. మొదటిరోజు నించి కాఫీనే మరచిపోయినాను. పెందరాళె ఇన్ని బియ్యం కుండలోవేసి యేట్లో కడిగేటప్పటికి అమీర్ యిన్ని చితుకులతో పొయ్యి వెలిగించేవాడు. ఆ మంట అయిపోయేటప్పటికి అవి వుడికివుండేవి. గుడిసె వెనుక రాయి వుంది. దానిమీద యే వుల్లిపాయో, గోంగూరో, మిరపకాయా, ఉప్పూ వేసి నూరడం, అంతే వంట. వున్నప్పుడు చల్ల.
    అమీర్ బైట కూచునీ పావురాలని ఆడిస్తూ వుంటే అప్పుడప్పుడు తమాషాకి నేను వెళ్ళి గుడిసె తలుపుచాటు నుంచి సన్న గొంతుతో.
    'లేచి మడికట్టుకోండి' అనేదాన్ని, అతను ప్రయత్నంలో నా భర్త గొంతూ, బ్రాహ్మణ వుచ్చారణా పెట్టి -
    'ఇదిగో లేస్తున్నా, ఈ కాయితము చదివేసి....' అనేవాడు. ఒకసారి మరిచిపోయి 'పావురాన్ని ఒదిలి' అన్నాడు.
    ఏం నవ్వేవాళ్ళం!
    ఒకసారి అమీర్ వచ్చి 'మరి కచేరీవేళ అయింది. యింకా వంటకాలా?' అన్నాడు.
    'అయ్యో, ఈవేళ తద్దినమని జ్ఞాపకం లేదూ, మీకు?' అన్నాను.
    ఆ మాటకి నన్ను పట్టుకుని దవడవేపు భీకరంగా ఒంగితే తప్పించుకోడానికి పెనుగులాడాను. అందుకని భుజంమీద కొరికాడు. అదుగో వెక్కిరిస్తోంది నీ నొసలు. కొరకడమేమిటి, అదేం సరసమనేనా? ఆ మైదానంలో గుడిసెల్లో బతికి, కుండల్లో తినేవాళ్ళకి మాకు నాజూకు లెక్కడివి! దేహాన్ని మనసునీ కూడా అంటకుండా కళ్ళుమూసుకుని వేదాంతోక్తంగా సంసారాలు గడపడం; పుష్టీ, జవా నిండు రక్తమూ వున్న మోటు ప్రజలకి చాతకాదు మరి. చదువులతోనూ, రోగాలతోనూ ముప్పైయేళ్ళకే ముసలి వాళ్ళయిన యీ నవీన రసికులకి మాత్రమే చేతనౌను. మాటలతోనూ, ధర్మబోధనలతోనూ, ఆధ్యాత్మిక ప్రేమతోనూ తృప్తి పొందడం. అమీర్ కి సంతోషం ఒచ్చి నన్ను ఒక్క వూపు వూపాడా, కళ్ళు తిరిగి దూరంగా తూలేదాన్ని. గట్టిగా జబ్బ పట్టుకున్నాడా రెండుగంటల దాకా నెప్పి పోదు. కావలించుకుంటే వూపిరాడదు. మొదట్లో- కళ్ళలో అల్లరీ, ప్రేమా మరచి పోయినాను. (మామయ్య ఆ మాట అన ఒద్దన్నాడు) కామమూ, వెలుగులో నా వంక పడినాడా భయంతో ఒణికేదాన్ని.
    ఇంక మా స్నానం. రోజు కెన్నిగంటలు! యెన్నిసార్లు గడిపే వాళ్ళమో ఆ యేట్లో? వాన కురుస్తున్నా, చలేస్తున్నా, ఎండలో చీకటిలో యెప్పుడూ స్నానమే. యెంత బావుండేది యెండలో తళతళలాడే యేటి చల్లటి నీళ్ళలో తెల్లని యిసకమీద పడుకోడం! ఆ చిన్న అలలు నా మెడని కొడుతూ, నీళ్ళు స్నేహతులులాగ యిద్దరినీ దగ్గిరికి లాగుతూ పరిగెత్తడం యెంత బాగుండేది?

 Previous Page Next Page