నిష్కారణంగా పక్కున నవ్వాను. నా మెళ్ళో ముత్యాలు నాలుగు వందల యాభైమూడు ఉన్నాయేమోనని లెక్క పెడుతో వుండగా వచ్చాడు అమీరు. చెప్పులు పెద్దగా చప్పుడు చేసుకుంటో కొంచెం నెమ్మదిగా వస్తే అతని సొమ్మేం పోయింది అనుకుంటూ ఒయ్యారంగా తలుపు దగ్గిరికి వెళ్లాను. వెంటనే కావలించుకొని గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా నాతోగూడ వెనక్కి నడవడానికి ప్రయత్నించి వొదలక తూగి, తూలి పుస్తకాల బీరువా మీద పడ్డాము. పెళపెళమని అడ్డం పగిలి గల్లుమని పెంకులు కిందపడి మళ్ళీ బద్దలైనాయి. ఏం జ్ఞాపకమొచ్చిందో ఆ నిమిషాన ఆయన బీరువాని మేమిద్దరం పగలకొట్టడం అతి హాస్యాస్పదంగా కనబడి, పకపక నవ్వి బద్ధలయ్యే అద్దం పెంకుల చప్పుడుతో నా కంఠం కలిపాను. తరవాత నిమిషం వూపిరాగింది. ఇల్లంతా, నడవాలో పడుకున్న వాళ్ళంతా, విని లేచినట్లే అనిపించింది. అమీర్ కౌగిలిలో పెనిగాను. కాని ఒదలడు కద! మనుష్యులు రావడం, వెతకడం, దీపాలతో గది నిండడం జరిగినట్టే తోచింది నాకు. కాని వాళ్ళందరూ వచ్చినా, అమీర్ మాత్రం తలన్నా ఎత్తి చూడకుండా తనపని తాను చేసుకునేటట్టు కనపడ్డాడు. అపాయమంటే ఏమిటో అర్థంకాని మనిషి అతనొకడు కనపడ్డాడు నాకు. అదేమి అదృష్టమో ఆ అపాయం అతన్ని చూసి తొలగిపోయేది. అతని నిర్లక్ష్యం చూస్తే ఒకప్పుడు అతని పాదాల్ని నా ప్రాణాలతో కడగాలనిపిస్తుంది. ఒకప్పుడు మీదపడి చీల్చి చంపెయ్యాలనిపించేది.
కొంత సేపయిం తర్వాత స్వస్థపడి నెమ్మదిగా మాట్లాడుకున్నాము. ఇద్దరికీ దగ్గిరిగా బల్లమీద కూచుని, మామిడిచెట్టు పూతలోంచి మిణుగురు పురుగులూ ఆర్ద్రా కలిసి మెరుస్తున్నాయి. చలిగాలి మమ్మల్నప్పుడప్పుడు పలకరిస్తోంది. కాలవలో కప్ప మూలుగుతోంది. రోడ్డుమీద లాంతరు వెలుతురు కొంచెంగా బీరువా మీదపడి, ఆ లావాటి పుస్తకాల మీది బంగారపు అక్షరాలు తమాషాగా మెరుస్తున్నాయి.
'ఎక్కడికి తీసికెడతావు నన్ను.'
'నిజాం?'
'వెళ్ళి?'
'హాయిగా వుందాం?
'అందరూ వూరుకుంటారా?'
'తెలిస్తే కద! వెళ్ళిపోయాక తెలిస్తే మాత్రం యేం చేస్తారు?'
'అక్కడి వాళ్ళూ!'
'మనకి తెలిసినవాళ్ళెవరుంటారు? ఆ దేశం చాలా బావుంటుంది. మనుషులు చాలా మంచివాళ్ళు, స్నేహానికి ప్రాణమిస్తారు. నీకేం భయం లేదు' అన్నాడు.
అదివరకే నిశ్చయించుకున్నాను వెళ్ళాలని. యెందుకు? అమీర్తో వుండాలని. అతనితో కావలసిన కామం యిక్కడ అభ్యంతరం లేకుండా సాగుతూనే వుంది. (నాకే కాదు. చాలామంది పతివ్రతలకే సాగుతోంది.) అట్లాంటప్పుడు ఇంట్లోంచి పోయి కులభ్రష్టని కావలసిన ఆగత్యమేముంది? అమీర్ తో కామం తీర్చుకోడానికి కాదు. అతని ముఖం చూస్తూ అతన్ని పూజించడానికి! వంటకోసమూ, ఆ రాత్రి నిమిషాల కోసమూ, నా భర్తతో బతికాను. అమీర్ తో అందుకు కాదు. అమీర్ కళ్ళలోని ఆరాధన చూసేందుకు, అతనితో మాట్లాడి, అతనివంక చూస్తూవుంటే అదృష్టానికి వెళ్ళాను. అది కామమే? ఈయనతో జీవనం పవిత్ర ప్రేమా? అమీర్ ఒక్కసారి కూడా నన్ను తాకనన్నాసరే వెళ్ళిపోయేదాన్నే, అతని పాదసేవకి, అతనితో సుఖదుఃఖాలు పంచుకునేందుకు. అతని ఆజ్ఞలే అతని దయే, అతని పూజే నా మతంగా, నా ధర్మంగా, నా ఆనందంగా, నా జీవనాన్ని అర్పించేందుకు, అతను నన్ను ప్రేమించనీ, చంపనీ, పాలించనీ, వొదిలెయ్యని. ఆ కొత్తవాడు, తురకవాడు, అతని చేతుల్లో నా ప్రాణాల్ని అర్పించాను. ఇంత విశ్వాసమూ ఇంత త్యాగమూ అంతా కామమేనా? నా హృదయంలోని ఆ అప్రమేయానందమూ, ఆ అనిర్వచనీయ మాధుర్యమూ, నా అల్పత్వమూ, క్షుద్రత్వమూ, వొదిలి, నగలూ, చీరలూ, మర్యాద అన్ని అసహ్యాలనిపింపజేసిన అద్భుతానుభవం కామమా? ఎన్నడూ అంతవరకు అసలు జీవితంలో సాధ్యమని అనుకోని, అమహాద్భుతరసనా, రసికత్వమూ ఔన్నత్యమూ ఇవన్నీ క్షుద్రకామమేనా? భోజనమూ, నిద్ర లోభత్వమూ తిట్లూ, చీవాట్లూ, అసహ్యమూ, ఇదంతా పవిత్ర ప్రేమా! అట్లా అయితే ఈశ్వరుడే, సృష్టి రహస్యమే కామం. ప్రేమ అంటే ద్వేషమని అర్థం.
2
అక్కడికి వెళ్ళిన మొదటి నిమిషానే అర్థమయింది నాకు, ఆ స్థలంలో అద్వితీయానందాన్ని అనుభవించబోతున్నానని, చుట్టూ వున్న ఆకాశాన్నీ, కొండల్నీ, పక్కన చింత చెట్లనీ, మా చిన్న యిల్లునీ, ఆ గాలినీ, అమీర్నీ చూడగానే నా మనసెట్లా అయిందనుకున్నావు! చెప్పనా? చిన్నప్పుడు మన ముందు పది పిండి వంటలు పెడితే, యేది తినాలో తోచక, తినబోతున్నామని తెలిసికూడా అన్నీ ఒక్కమాటుగా యెట్లా తినాలా, ఇది తినేలోపల రెండోది రుచి చూడడం ఆలస్యమౌతుందే, అని ఎంత కష్టపడుతుంది మనసు? అట్లానే ముందే, తెలుసు, దినం తర్వాత దినం నాకు తీసుకురాగల వివిధ వర్ణ రాగసుందరానుభవాలు! కాని ఆగలేను. అన్నీ ఒక్కసారిగా, తొరగా యెప్పుడు నన్ను కావలించుకుంటాయా అని తహతహలాడిపోయినాను. ఏం కారణం లేకుండా చిన్నప్పుడు నవ్వూ, అర్థంలేని ఆనందం కలిగి ఇంకా ఏంచేద్దాం, తిరుగుదాం, గంతులేద్దాం, నవ్వుదాం అనిపించేదే! అట్లా వుండేది గంట గంటా నాకు. వూరికీ, మాకూ మధ్య పెద్దచింతతోట వుంది; ఆ గుడిశ తప్ప యింక చుట్టూ ఏమీలేవు. ఎటుచూసినా నీలపు కొండల్లోనూ, ఆకాశంలోనూ అంతమయ్యే పెద్ద మైదానం. ఒక్క పెద్ద కొండ మాత్రం మా యింటికి అరమైలు దూరంలో వుంది. దానిమీద శిథిలమైన కోట ఒకటుంది. మా గుడిశ పక్కన చిన్న యేరు ఎప్పుడూ తొరగా పరిగెత్తుతూ వుంటుంది. దాన్నిచూస్తే, ఎవ్వరితో మాట్లాడక ఇంట్లో పనిమీద యెప్పుడూ తిరిగే మా అమ్మ జ్ఞాపకం వొచ్చేది.