రాములమ్మ బయట కూర్చుని పిడకలు చేయసాగింది. ఆ పిల్లకి తల్లిదండ్రుల మాటలు ఏమీ అర్ధం కాలేదు.
2
"నువ్వు ప్రయోజకుడ వవుతావని అమ్మా నాన్నా ఆశ పడ్డారు. నేనూ నీపై ఎన్నో ఆశలు పెటుకున్నాను. అయితే ఏం లాభం! నువ్వు బి.ఏ తప్పావు పోనీలే ఎందరు తప్పలేదు. మహా మహా పెద్దవాళ్ళే బి.ఏ తప్పారు. తర్వాత పాసయ్యారు. జీవితంలో ఎన్నో ఘనకార్యాలు సాధించారు. ఏదీ? నువ్వేం చేస్తున్నావు. నెలకో రెండు నెలలకో నన్నో మీ వదిన్నో ఏడ్పించో, బెదిరించో డబ్బు చేబిజిక్కించుకుంటావు. ఝా పరమేశ్వరా అని దేశాలపై పడతావు. ప్చ్! లాభం లేదు!"
జనార్ధన్ తలెత్తలేదు. అతన్లో సుగుణం అదే! అన్న చౌదరిగారు ఎంత తిట్టినా అతను నోరెత్తాడు. తిట్టుకో రూపాయి అన్నట్టుగా లెక్కించుకుంటాడు. ఓ వారం తర్వాత అడుగుతాడు. తిట్టినా, బాధపడినా ఆ డబ్బు యిచ్చేస్తాడు చౌదరి.
"నాకు కొడుకులు లేరు. ఒక్కతే ఆడపిల్ల. దాన్నో అయ్య చేతిలో పెట్టాను. దాని గురించి నాకు దిగులు లేదు. తమ్ముడివైనా కొడుకువైనా నీవే అనుకున్నాను. నీకు పెళ్ళి చేస్తే నీ కడుపున అయినా ఓ మగ నలుసు నిలుస్తుందనుకున్నాను. ఏదీ! నువ్వు దానికి తలూపితేనా!"
తలూపేడు జనార్ధన్.
"సరే! ఆ వాయనప్పాడు సంబంధం వచ్చింది. నాకు నచ్చింది. పిల్ల, ఐదో క్లాసు చదివింది. బాల తొడుగు పాతిక తులాలు వుంది. ఆడపడుచు కట్నం కింద ఎకరం మామిడి తోట యిస్తారు!"
"ఊఁ"
"నువ్వెళ్ళి చూసి వస్తే-"
"సరే."
"ఎప్పుడు వెళతావు మరి?"
"నువ్వూ వదినా ఎప్పుడంటే అప్పుడు అంతే!"
చౌదరిగారికి ఆ మాటలు చాలా సంతోషాన్ని కలిగించాయి. అంతలో చప్పున అనుమానమూ వచ్చింది. తమ్ముడు అంత సులభంగా అంగీకరించటం ఆయనలో అనుమానాన్ని రేకెత్తించింది.
"ఇదంతా నిజమేనా?"
"ఏమిటి?"
"పెళ్ళికి ఒప్పుకోవటం!"
"మీ మీ దొట్టు! మీ మాట ఎప్పుడూ కాదన్నాను!"
"సరే! వాళ్ళు కట్నం కూడా యిస్తామన్నారు. లక్ష!"
జనార్ధన్ కళ్ళు యింతయ్యాయి. "లక్ష! ఆ లక్షా తనదే! పాతిక తులాలంటే యీ రోజుల్లో హీనం నలభయ్ వేలు. అంటే దాదాపు లక్షన్నర బడ్జట్ పిక్చర్ కి ప్లాన్ చేయొచ్చు. అంతా అవుట్ డోర్ షూటింగ్ లో తీస్తే సబ్సిడీ కూడా యిస్తారు. కొత్తవాళ్ళతో ప్లాన్ చేస్తే డెఫినిట్ గా పిక్చర్ పూర్తవుతుంది!" కలల్లోకి జారిపోయాడు జనార్ధన్.
"జనార్ధన్!"
"ఊఁ"
"కట్నం డబ్బులన్నీ అమ్మాయిపేర బ్యాంక్ లో వేస్తారట. వెయ్యనీ! మనకేం ఆ డబ్బులు కావాలా ఏం? మనకి బోలెడుంది. వాడుకునే అవసరం లేదాయె. నువ్వు సరేనంటే వెంటనే ముహూర్తం పెట్టుకుందాం!"
ఆ మాట వినగానే నీరుగారి పోయాడు జనార్ధన్. కలలన్నీ కల్లలుగా అయిపోయాయి. ఉస్సురుమన్నాడు. ఉత్సాహం తగ్గిపోయింది.
"మరెప్పుడు వెళదాం?"
"మీ యిష్టం!" నీరసంగా సమాధానం యిచ్చి లోపలికి వెళ్ళాడు జనార్ధన్.
"ఎప్పుడయ్యా రావటం?" మరిదిని చూడగానే ముఖమంతా కళ్ళు చేసుకుని అడిగింది అచ్చమాంబ.
"ఇప్పుడే వదినా!" ముభావంగానే సమాధానం వచ్చింది.
"ఎక్కడి నుంచి?"