Previous Page Next Page 
వేగు చుక్క పేజి 4


    "డ్రెస్....నగ్నం...." అనుకోగానే మళ్ళీ ఇందాకటి సంఘటన గుర్తొచ్చింది, వద్దుద్దవనుకున్నా. సిగ్గుతో వళ్ళు చచ్చిపోయినట్లయింది.

    అలా ఉధృతంగా గాలి వీచగానే తను వెంటనే కూర్చుండి పోవలసింది. కానీ ఏం చేసింది తను?

    మెట్లు దిగి మెయిన్ డోర్ దగ్గరకి వచ్చి నిలబడి పిలిచాడు సెయిలర్ బావా. హెడ్ కుక్ ఉత్త వాగుడుకాయ అని అతనికి తెలుసు.

    "బ్రదర్! టైం లేదు! వాళ్ళని త్వరగా పంపెయ్!"

    "ఓకే బ్రదర్! పదండి లేడీస్ పోదాం! బావా ఉత్త తొందర మనిషి!" అని నవ్వుతూ వెనక్కి తిరిగాడు ఇబూకా. ఎప్పుడెప్పుడు ఆ వాసనలో నుంచి బయటపడతామా అని ఎదురుచూస్తున్నా అమ్మాయిలు త్వరత్వరగా అతని వెంట నడిచారు.

    ఇవేవీ గమనించలేదు అనూహ్య పరధ్యానంగా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది.

    స్కర్టు లేచిపోగానే ఆ కొద్ది క్షణాలు ఏం చేసింది తను? బిగుసుకుపోయి అలాగే నిలబడి పోయిందా? అతను అసలు తనని అలా ఉండగా చూశాడా?

    కొద్ది కొద్దిగా గుర్తు వస్తోంది. గాలి వీచాగానే ముందు తన జుట్టు ఎగిరి మొహంమీద పడడం మొదలెట్టింది. ఈలోగా స్కర్టు లేచిపోయింది. జుట్టు సవరించుకోవాలా, స్కర్టు సవరించుకోవాలా ఏది ముందు, ఏది వెనక అనే ప్రయారిటీస్ వి వెంటనే నిర్ణయించుకోలేక పోయింది. మొద్దుబారిపోయిన మెదడు. చేతులు ముందు జుట్టుమీదికి వెళ్ళాయి, తప్పు నిర్ణయం తీసుకుని ఈలోగా.....

    మళ్ళీ చెంపలు ఎర్రబడ్డాయి అనూహ్యకి. తనలాంటిదే ఎవరో మరదలు పిల్ల, బావ కనబడగానే సిగ్గు ముంచుకొచ్చి పరికిణీ ఎత్తేసి మొహం కప్పేసుకుందిట! అలాగే వుంది తను చేసిన పని!

    అనూహ్య అక్కడే వుండిపోవడం వాళ్ళెవరూ గమనించలేదు.

    తను ఒంటరిగా అక్కడ నిలబడి వుండడం కొద్దిక్షణాల తర్వాత గానీ గుర్తించలేదు అనూహ్య వెంటనే గాభరాగా కదిలింది.

    కదలడంలో తలుపుకీ మధ్య ఇరుక్కుపోయింది ఆమె స్కర్టు!

    హెడ్ కుక్ ఇబూకా బయట రెండో గది తలుపు వేసిన శబ్దం వినబడింది.

    "వెయిట్ ఫర్ మీ!" అసరిచిందామె విహ్హ్యలంగా. భయంవల్ల గొంతు వణికిపోతోంది. ఆమె మాట ఆమెకే వినిపించడంలేదు.

    స్కర్టును బలంగా లాగింది. రాలేదు అది.

    మరింత గట్టిగా, బలం అంతా ఉపయోగించి గుంజింది.

    పర్రుమని చిరిగిందిస్కర్టు. ఒక ముక్క తలుపులోనే ఇరుక్కుని ఉండిపోయింది.

    వెంటనే పరిగెత్తి రెండో గదిలోకి వెళ్ళి ఆ తలుపును తెరిచింది.

    ఇబూకా అప్పటికే మూడోగది తలుపులు వేశాడు.

    జీవితంలో మొదటిసారిగా ప్రాణభయం కలిగింది అనూహ్యకి, కాళ్ళు గజగజ వణకడం మొదలెట్టాయి. శక్తి అంతా కూడాదీసుకుని ఆ తలుపు దగ్గరికి పరిగెత్తింది.

    ఆ సమయానికి మెయిన్ డోర్ లాక్ చేసేసి, తాళాలు జేబులో నేను కున్నాడు ఇబూకా.

    మెయిన్ డోర్ లాక్ చెయ్యగానే ఆటోమాటిక్ గా లోపల వేసుకున్నాడు ఇబూకా.

    మెయిన్ డోర్ లాక్ చెయ్యగానే ఆటోమాటిక్ గా లోపల ఉన్న లైట్లన్నీ ఆరిపోయాయి. గాడాంధకారం అసరించుకుంది.

    వాళ్ళకోసం బయట అసహనంగా నిల్చుని ఉన్నాడు బావా. "టైమయి పోయింది!" అని మళ్ళీ హెచ్చరించి, అందరినీ గాంగ్ నే దగ్గరకు తీసుకెళ్ళాడు.

    ఆడపిల్ల అందరూ థాంక్స్ చెప్పి, దిగిపోయారు. అనూహ్య షిప్పు లోనే ఉండిపోయిందని ఎవరూ గమనించలేదు, ఆ హడావిడిలో!

    షిప్పు బయలు దేరడానికి కొద్ది గంటలే వ్యవధి ఉంది.

    రిక్షాలు ఆగే చోటికి వచ్చాక ఒకమ్మాయి అడిగింది. "అనూ ఏదీ?"

    అందరూ అటూ ఇటూ చూశారు. అప్పుడే ఒక రిక్షా కదిలి వెళ్ళిపోతోంది. అందులో ఒక గ్రే కలర్ చీరె కట్టుకున్న స్త్రీ ఉంది.

    "అదిగో! రిక్షాలో  వెళ్ళిపోతోంది!"

    "చెప్పకుండానే! పొగరు దీనికి!"

    "హర్భరు మంచీ వేరుగా వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్ళి రాత్రికి  ఉండిపోతానంది ఇందాకే! రేప్పొద్దున వస్తానంది మళ్ళీ!"


                                    3

    అనూహ్య షిప్పులోనే కోల్ స్టోరేజ్ రూంలో ట్రాప్  అయి పోయిందని వాళ్ళకి తెలియదు. రక్తం గడ్డకట్టేంత చల్లగా  ఉంది అక్కడ. అనూహ్య వణికిపోతుంది, చలితో, భయంతో కూడా! చుట్టూ కటిక చీకటి

    సందేహంగా చేతులతో తడిమింది, లైట్లు స్విచ్చి ఏదన్నా ఉందేమోనని.

    ఆమె చెయ్యి తగలగానే, మేక కళేబరం ఒకటి, నిర్జీవమైన చలనముతో జారి ఆమె చెంపలనూ, చేతులనూ , కాళ్ళనీ తడితడిగా స్పృశిస్తూకింద  పడింది.

    వెర్రికేక వేసింది అనూహ్య.

    తనమీద మేక కళేబరం పడగానే  భయంతో పక్కకి జరిగింది అనూహ్య. అలా జరగడంలో రాక్ తాలూకు షార్ప్ గా ఉన్న అంచు కణతలకి బలంగా తగిలింది.

    అప్పటికే షాక్ లో వున్న ఆమె ఆ దెబ్బకు స్పృహతప్పి కింద పడిపోయింది.

    విపరీతమైన చల్ల దానానికి ఆమె వేళ్ళు ముడుచుకుని కొంకర్లు పోతున్నాయి.

    ఆమె పరిస్థితి క్రమంగా విషమిస్తోంది.

    హర్భరులో నుంచీ షిప్పు కదలడానికి క్లియరెన్సు వచ్చింది.

    షిప్పు హర్భరులోకి వచ్చేటప్పుడూ హర్భరు సిబ్బందిలో ఒకడైన పైలట్ తను  స్వయంగా ఆ షిప్పులోకి ఎక్కి దాన్ని గైడ్ చేస్తాడు. ఆ తర్వాత షిప్పు కేప్టెన్ దాన్ని  నడిపిస్తాడు పైలట్ కి కూడా షిప్పు కేప్టెన్ లకి వుండవలసిన క్వాలిఫికేషన్సూ, ఎక్స్ పిరియాన్సూ వుంటాయి. (నిజానికి ఈ రోజుల్లో షిప్పింగ్ లో కేప్టెన్ అనే ఉద్యోగం లేదు. అది ఊరికే వ్యవహారికపదం,  'కేప్టెన్' అని అందరూ ఊహించుకునే పదని పేరు 'మాస్టర్ ఆఫ్ ది షిప్.' ఇతనికి 'సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ యాజ్ మాస్టర్ ఆఫ్ ఏ ఫారిస్ గోయింగ్ స్టీమ్ షిప్' అనే క్వాలిఫికేషను వుండాలి. మంచి షిప్పింగ్ కంపెనీలలో అయితే అలవెన్సులతో కలిసి దాదాపు  నెలకి పదిహేను వేలదాకా జీతం వస్తుంది.)

    షిప్పు ప్రయాణం చెయ్యాలంటే నీళ్ళు కనీసం ముప్చై అడుగుల లోతున వుండాలి. హర్భరులో నీటి లోతు  ఎక్కడ ఎంత వుందో కెప్టన్ కంటే పైలట్ కే బాగా తెలుస్తుంది. అందుకని అతని గైడెన్స్ అత్యవసరం.

    షిప్పులోకి ఎక్కాడు పైలట్.

    చిన్నసైజ్ షిప్పుల్లా వున్న రెండు టగ్ బోట్లని ఆ పెద్ద షిప్పుకి కట్టారు హర్భరు దాటేంతవరకూ షిప్పుఇంజన్ లు స్టార్ట్ చెయ్యరు. టగ్ బోట్స్ షిప్పుని బయటకు లాక్కువెళ్ళిన తర్వాత అక్కడ స్టార్ట్ అవుతాయి దాని ఇంజన్లు.

    లంగరు ఎత్తే ప్రయత్నం మొదలయింది. కర్జకఠోరంగా శబ్దం చేస్తూ గొలుసు పైకి  వచ్చేసి కేస్ స్టన్ కి చుట్టుకుంది. లంగరు షిప్పుకి బయటగా,  పై భాగంలో వున్న గ్రూప్ లో  ఇమిడిపోయింది.

     టగ్ బోట్స్ స్టార్ట్ అయ్యాయి. నెమ్మదిగా కదిలింది షిప్పు.

    హర్భరునించి బయటకు వచ్చేసి, కొంతదూరం పయనించాక, షిప్పులోంచి  తాళ్ళతో చేసిన నిచ్చెన లాంటిది వదిలారు.

    కేప్టెన్ కృపాసాగర్ కి "బాన్ వాయేజ్" అని శుభాకాంక్షలు చెప్పి, ఆ నిచ్చెన మీదనుంచి టగ్ బోట్ లోకి దిగాడు పైలట్.

    కేప్టెన్ సాగర్ నేవిగేషన్ రూమ్ లో కూర్చుని, ఇంజన్ లు  స్టార్ట్ చెయ్యటానికి ఆర్డర్ ఇచ్చాడు.

    ఇంజన్ లు స్టార్ట్ అయ్యాయి. ఇంజన్ రూమ్ లో వున్నవాళ్ళకి చెవులు దిబ్బెళ్ళు వేసేటంత పెద్దగా వినబడుతోంది ఆ శబ్దం.

    నేవిగేషన్ చార్ట్ సహాయంతో తమ వెళ్ళవలసిన మార్గాన్ని ఖచ్చితంగా నిర్ణయించి వుంచుకున్నాడు సాగర్. సముద్రంలో కనబడే కొండ గుర్తులూ, లైట్ హౌస్ లూ, అలాంటివన్నీ సూచింపబడి వుంటాయి. ఆ చార్టులలో.

    షిప్పుని ఏ దిశగా పోనివ్వాలో చెప్పాడు సాగర్. నేవిగేటర్ ఎలెక్ట్రిసిటీతో పనిచేసే గైరో కంపాస్ లోకి చూస్తూ దిశని మారుస్తున్నాడు.

    ఇంటర్ కమ్ లో సాగర్ ఆదేశాలు అందుకున్న ఇంజన్ కూ షిప్పుని ముందుకి పోనిచ్చారు.

    అండమాన్, నికోబార్ దీవులవైపు ప్రయాణం మొదలెట్టింది షిప్పు, అనూహ్యతో సహా!

    ఇండియా మెయిన్ లాండుకి తూర్పున బంగాళాఖాతంలో ఉన్నాయి ఆ ద్వీపాలు నికోబార్ కొసన వున్న  ఫిగ్మాలియన్ పాయింటు భారత దేశానికి దక్షిణ అగ్రం అవుతుంది- చాలామంది అనుకునేటట్లు కన్యాకుమారి కాదు.

    రాత్రి బాగా పొద్దుపోయేదాకా చాలా బిజీగా వున్నారు కేప్టేనూ, ఆఫీసర్లూ, ఇంజనీర్లూ సెయిలర్లు అందరూ.

    ప్రయాణం ఒకదారిలో పడ్డ తర్వాత ఆటోపైలట్ ఆన్ చేశాడు కేప్టెన్ సాగర్. ముందుగా నిర్ణయించిన మార్గంలో, షిప్పుని దానంతట అదే నడిపినుంది ఆటోపైలబ్. షిప్పులో, కేప్టెనూ, క్రూ అందరూ కూడా రోజుకి ఎనిమిది గంటలు మాత్రమె డ్యూటీ చేస్తారు. రాత్రిళ్ళు ఆటోపైలట్ ఆన్ చేసి నిద్రపోతారు, ఎవరో ఒకళ్ళని మాత్రం డ్యూటీలో వుంచి.

    పనంతా పూర్తయ్యాక తన  కేబిన్ లోకి వెళ్ళి  షవర్ బాత్ తీసుకుని బట్టలు మార్చుకున్నారు. అలాంటి చిన్న కేబిన్ లో వుంటూ ప్రయాణం చెయ్యడం అతనికి అలవాటు లేదు. కేప్టెన్ కోసం కేటాయించబడిన  విశాలమైన ఫామిలీ క్వార్టర్సు వేరే వున్నాయి.

    షిప్పులో సెయిలర్స్ కి వేరే కేబిన్స్ వుంటాయి. ఒక్క కేబిన్ రెండేసి బంకులు వుంటాయి. రైల్వే కంపార్టుమెంటులో బెర్తులు వున్నట్టుగా. కొద్దిగా ఫర్నీచర్ వుంటుంది. అందరికీ కలిసి కామన్ బాత్ రూమ్స్, టాయిలేట్సూ వుంటాయి.

    ఆఫీసర్లకి ఒక్కొక్కళ్ళకీ ఒక కేబిన్ వుంటుంది. అటా చ్ డ్ బాత్ తోసహ.

    కానీ సెయిలర్సూ, ఆఫీసర్సూ ఎవరూ కూడా తమ కుటుంబాలని తమతోబాటు తీసుకెళ్ళకూడదు. ఆ ప్రివిలేజ్ ఒక్క కేప్టెన్ కి మాత్రమే వుంటుంది. అతనికి రెండు, మూడు గదులకో వున్న ఫ్యామిలీ క్వార్టర్స్ ఇస్తారు. కేప్టెన్ కి ఇష్టమయితే అతను తన ఫ్యామిలీని కూడా వెంట  తెచ్చుకో వచ్చు, డ్యూటీలో వున్నప్పుడు కూడా.

    సాగర్ కి కేటాయించిన క్వార్టర్సులో ఆ షిప్పు ఓనరు సత్యనారాయణసింగ్ , అతని భార్య స్వరూపరాణీ వుంటున్నారు.

    బాగా లేట్ మ్యారేజ్ చేసుకున్నాడు సత్యనారాయణ సింగ్. దాదాపు యాభై అయిదేళ్ళు వచ్చాక పెళ్ళాడాడు స్వరూపరాణిని, ఆమె అతని కంటే పాతికెళ్ళ చిన్నది. పెళ్ళయినప్పటి నుంచీ వ్యాపారం మీద శ్రద్ధ తగ్గిపోయింది అతనికి. భార్యని వెంటేసుకుని నాన్ స్టాప్ హనీమూన్ లాగా దేశాలు తిరుగుతున్నాడు. ఈ ట్రిప్పులో భార్యతో సహా అండ మాన్స్ కి వస్తున్నాడు కాబట్టి, స్వరూపరాణీకి సౌకర్యంగా వుండడం కోసం సాగర్ ఫ్యామిలీ క్వార్టర్స్ తను తీస్కున్నాడు. తను స్టేటస్ కు తగినట్లు ఉండాలని చెప్పి, దాన్ని ఒక ఫారిన్ కంట్రీలా పూర్తిగా రీమోడల్ చేయించాడు సింగ్ డెకోరేషన్ పూర్తిగా మార్పించేశాడు. షిప్పుకి పూర్తిగా రిపేర్లు చేయించాడు. మొత్తం షిప్పుకంతా ఫ్రెష్ గా   పెయింట్ వేయించాడు.

    తన భార్యని  సంతోష పెట్టడానికి దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోడు సత్యనారాయణసింగ్.

    స్నానం చేశాక, మెస్ లోకి  నడిచాడు సాగర్.

    ఆ షిప్పులో రెండు డైనింగ్ హల్సు వున్నాయి. చిన్నది ఆఫీసర్లకి, పెద్దది  సెయిలర్ల కోసం.

    ఆఫీసర్సు మెస్ ఎరుపు రంగు వెల్వెట్  పరదాలతో ,సీట్ కవర్లతో గ్రాండ్ గా డెకోరేట్ చేసి వుంది తెల్లటి డెకోలమ్ టాప్ టేబుల్స్ శుభ్రంగా తుడిచి వున్నాయి. టేబుల్ మీద ప్లవర్  వాజుల్లో రంగు రంగుల గులాబీలు గుండ్రటి కిటికీలలా ఉన్న పోర్టు హొల్సు లో నుంచీ సముద్రం నీలంగా కనబడుతోంది.

    ఈ అలంకరణ అంతా స్వరూపరాణి చేయించింది.

    సాగర్ మెస్ లోకి వచ్చేసరికి అప్పటికే టేబుల్ దగ్గర కూర్చుని వున్నారు సత్యనారాయణసింగ్, స్వరూపరాణి, వాళ్ళతోబాటుగా వాళ్ళ గెస్ట్ ప్రొఫెసరు ఆనందరావు.

    "ప్రొఫెసర్ ని నీకు ఇంట్రడ్యూస్ చేశాను కదూ?" అన్నాడు సత్యనారాయణసింగ్.

    కొంచెం అప్రసన్నంగా తల పంకించాడు  సాగర్. బాస్, బాస్ భార్యా తమతో బాటు వచ్చేయడమే కాకుండా, తోడుగా ఈ  తలతిక్క ప్రొఫెసర్ ని వెంట బెట్టుకు రావడం  బొత్తిగా నచ్చలేదు.

    పైగా, ఈ ప్రొఫెసరేం తక్కువవాడు కాడు. ఇతన్ని గురించి ఆ మధ్య పేపర్లలో నానా గొడవా అయింది. అది ఇంకా మర్చిపోలేదు సాగర్.

    ఏదో ఒకటి సెన్సేషనల్ గా చేసేసి, అర్జెంటుగా కీర్తిసంపాదించెయ్యాలన్న కండూతి విపరీతంగా వుంది ప్రొఫెసర్ ఆనందరావుకి.

    ఉన్నట్లుండి ఒక రోజున తను ఒక అద్భుతాన్ని కనుక్కున్నానని ప్రకటించాడు ఆనందరావు, ఆంద్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ అడవుల్లో ఒక అనాదిమానవుడి కపాలాన్ని తవ్వి తీశానని చెప్పి సైంటిఫిక్  సర్కిల్స్ లో ప్రదర్శించాడు దాన్ని. ఆ కపాలం- వెనక్కి వాలిపోయిన  నుదురు, ముందుకు చొచ్చుకు వచ్చిన మూతీ, దవడలూ, వెడల్పాటి ముక్కు ఉండేదన్న దానికి సూచనగా పెద్ద పెద్ద రంధ్రాలూ.

    రెండ్రోజులు తిరక్కుండానే అది సంచలన వార్త అయి, ప్రపంచంలోని అంతోపాలజిస్టులందరికీ తెలిసిపోయింది. ఆ కాస్త్రానికి చెందిన జర్నల్సులో, కాన్పరెన్సుల్లో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ఆ కపాలానికి "హొమో ఆనందకస్" అని పేరు కూడా పెట్టేశారు. ఆనందరావు పేరు చిరస్థాయిగా  నిలిచిపోవడానికి వీలుగా.

    కానీ సంవత్సరం గడవక ముందే ఆనందరావు చేసిన దారుణమైన  మోసం బయటపడిపోయింది. అది నిజంగా అనాది మానవుడి కపాలం కాదనీ, మనిషి పుర్రెకి ఒరాంగ్ ఊటాన్ అనే కోతి దనడ ఎముకలు తెలివిగా అమర్చి ఆనందరావు అందరినీ కొన్నాళ్ళపాటు వెర్రివెధవలని చేశాడనీ అర్థమయింది.

    ఆ తర్వాత చాలాకాలం పాటు ఎవరికీ మొహం చూపకుండా అదృశ్యమైపోయాడు ప్రోఫెసర్.

    మళ్ళీ  ఇన్నాళ్ళకు, ఇలా సముద్రం మీద తేలాడన్నమాట! ఎందుకు?

    "అండమాన్ నికోబార్ ద్వీపాల్లో నరమాంస  బక్షకులయిన ఆదివాసుల తెగ ఒకటి వుంది. వాళ్ళని మనం కలుసుకోవాలి" అన్నాడు ప్రొఫెసర్, సాగర్ ఆలోచనలు చదివేస్తున్నట్లు. అందరూ ఒక్కసారిగా ఊపిరి లోపలికి పీల్చుకున్న శబ్దం వినబడింది.

    నిర్ఘాంతపోయి చూశాడు సాగర్. "అండమాన్స్ లోనా? నేను ఎప్పుడూ వినలేదే!"

    వేదాంతిలా సహనంగా నవ్వాడు ప్రోఫెసర్. "మైడియర్ యంగ్ మాన్! నీకు అండమాన్స్ గురించి అసలేమైనా తెలుసా?" అన్నాడు, అతని జనరల్ నాలెడ్జి పరీక్షిస్తున్నాట్లు.

    పౌరుషంగా చూశాడు సాగర్.

 Previous Page Next Page