Previous Page Next Page 
వేగు చుక్క పేజి 5


    "అండమాన్ అంటే మూడొందల యాభైద్వీపాల సముదాయం. పోర్ట్ బ్లయర్ దానికి రాజధాని. ఈ దీవుల్లో ఆరు తెగల ఆదివాసులు వున్నారు మంగోలియన్ జాతికి చెందిన పికోబారీ, షోంపేన్ లూ, నీగ్రో జాతికి చెందిన గ్రేట్ అండమాన్, వోంగే, జరావా, సెంటినలీ తెగలు వున్నాయి అక్కడ."

    "అక్కడే పప్పులో కాలేశావ్!" అన్నాడు ప్రొపెసర్ విజయ గర్వంతో చూస్తూ. "ఈ ఆరు తెగలూ కాక మరో తెగ వుందని రుజువు దొరికింది నాకు. వాళ్ళు నరమాంసం తింటారు."

    అపనమ్మకంగా చూశాడు సాగర్.

    ప్రొఫెసర్ చెప్పడం మొదలెట్టాడు-

    "అండమాన్స్ లో మూడొందల యాభై ద్వీపాలు వున్నా, వాటిలో ముప్పయి అయిదు ద్వీపాలలోనే మనుషులు వున్నారనుకుంటున్నాం ఇన్నాళ్ళూ. కానీ, మరో ద్వీపంలో కూడా అనాది మానవుల సంతతికి చెందిన ఇంకొక తెగ వుందని ఈ మధ్యనే కొన్ని సూచనలు దొరికాయి. మరికొంత పరిశోధన జరిపాను. అది నిజమే అని తేలింది. ఇంకా పాతరాతి యుగంలోనే బతుకుతున్నారు వాళ్ళు. మానవజాతి పురోభివృద్దికి కారణమైన నిప్పూ, చక్రం గురించి కూడా వాళ్ళకేమీ తెలియదు.

    అంతకంటే ముఖ్య విషయం వాళ్ళలో కానిబాలిజామ్ వుంది. అంటే తమ జాతి ప్రాణులని తామే తినే లక్షణం. ఇది కొన్ని రకాల పాముల్లో, తదితర జంతువుల్లో కనబడుతుంది."

    కొద్ది క్షణాలపాటు ఆలోచిస్తూ వుండిపోయాడు సాగర్.

    "సరే! మీరు ఆ అనాది మానవులని కలుసుకుంటారే అనుకోండి కలుసుకుని?"

    "కలుసుకుని చూస్తాం! మాట్లాడుతాం! ఫోటోలు తీస్తాం!" అన్నాడు ప్రొఫెసర్ గుంభనగా.

    కానీ ఆయన అసలు ఉద్దేశ్యం వేరేఉంది. ఆ నరమాంస భక్షకులలో ఒకడినన్నా దొంగచాటుగా బంధించి సిటీకి తెచ్చి, తన గార్డెన్ లో ఉంచుకుని ఏ చింపాంజీనో, మరే చిత్రమయిన జంతువునో ప్రదర్శించినట్లు ఫ్రెండ్సుకి ప్రదర్శించాలని.

    కానీ ఆ సంగతి పైకి చెప్పలేదు.

    అతను పూర్తిగా నిజం చెప్పడంలేదనిపించింది సాగర్ కి-

    "కొత్తమనుషులు కనబడితే ఆదివాసులు ఇచ్చే స్వాగతం ఎలా ఉంటుందో తెలుసా?" అన్నాడు పదునుగా.

    "ఎలా ఉంటుంది?"

    "వాళ్ళలో చాలామంది కొత్తమనుషులని కలపడానికి అసలు ఇష్టపడరు. కొద్ది సంవత్సరాలక్రితం కొంతమంది జర్నలిస్టులు జారావా తెగ ప్రజలని కలుసుకోవడం కోసం ఒక షిప్పులో వెళ్ళారు. షిప్పు తీరం చేరకముందే జరావాలు ఒడ్డుదాకా పరిగెత్తుకు వచ్చి, విషపు బాణాలు వదిలారు.

    భయపడి పోయి, షిప్పుని వెనక్కి తిప్పుకుని వచ్చేశారు జర్నలిస్టులు."

    సత్యనారాయణ సింగూ, స్వరూపరాణీ ఈ సంభాషణని అతి జాగ్రత్తగా వింటున్నారు మధ్యలో అడ్డుతగలకుండా.

    సాగర్ చెబుతూనే ఉన్నాడు. "ఆ ఆదివాసులు మనని తప్పించుకు తిరగాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళ స్వేచ్చకి భంగం కలిగించటం తప్పు! ఉదాహరణకి మన విషయమే తీసుకోండి. మీరు ఎవరినైనా మీ ఇంటికి ఇన్వయిట్ చేస్తే వాళ్ళు వచ్చి మీ డ్రాయింగ్ రూంలో కూర్చుని మాట్లాడి వెళ్ళిపోతే బాగుంటుందిగానీ, మీరు ఏకాంతాన్ని కోరుకుంటూ బెడ్ రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకున్న తర్వాత తలుపు కంతలో నుంచీ తొంగి చూసి, కిటికీలో నుంచీ దూకి లోపలికి వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా!!"

    అసహనంగా పిడికిలితో బల్లమీద గుద్దాడు ప్రొపెసర్. "సీ యంగ్ చాప్! యూ ఆర్ టాకింగ్ నాన్సెన్స్ ! పిడివాదంతో నందిని పంది చెయ్యొచ్చు- పందిని నంది చెయ్యొచ్చు.

    అడవి మనుషులూ, మనమూ ఒకటే ననుకుంటే ఎలాగ? ఆ జంగ్లీ గాళ్ళకి నాగరికత తెలియదు. వాళ్ళని ఉద్దరించాలి మనం!"

    "ఏమిటా ఉద్దరింపు? మీరు వెళ్తారు, అష్టకష్టాలు పడి వాళ్ళని మచ్చిక చేసుకుంటారు వాళ్ళ కోసం అక్కడో గుడీ బడీ పెడతారు. అయిదో క్లాసు దాకా చదువు చెప్పించి వదిలేస్తారు. వస్తువులు ఇచ్చి వస్తువులు తీసుకునే బార్టరు పద్ధతి వదలగొట్టి డబ్బులు అలవాటు చేస్తారు.

    అంతే! అయిదో క్లాసు దాకా చదివిన తర్వాత వాళ్ళు ఇంక అడవుల్లో ఉండటానికి ఇష్టపడరు. పట్నాలకి పరుగులు తీస్తారు ఏ తాలూకాఫీసులోనో బిళ్ళ బంట్రోతుగా చేరి, చాలని జీతపు రాళ్ళతో యాంత్రిక జీవితానికి అలవాటు పడతారు. అంటే, ప్రకృతి మాతకి ముద్దు బిడ్డలా పౌరుషంగా బతుకుతున్న వాళ్ళని పట్నాలకు లాక్కెళ్ళి జీవచ్చవాలుగా మారుస్తున్నామన్నమాట! అమాయకంగా గడిచిపోయే వాళ్ళ బతుకుల్లోకి మన కపటాలు, కల్మషాలూ తీసుకెళుతున్నామన్న మాట!

    ఇదే మీరు కోరుకునే ఉద్దరణ అయితే, అది వాళ్ళకి అంత అవసరమనుకోను!"

    ప్రొఫెసర్ కోపంతో ఊగిపోయాడు.

    వాతావరణం వేడిగా మారుతోందని గ్రహించిన సత్యనారాయణ సింగ్ టేబుల్ కింద నుంచీ నెమ్మదిగా ప్రొపెసర్ చేతిని నొక్కొడు.

    తమాయించుకుని, కొంచెం తగ్గాడు ప్రొపెసర్. "నేను చెబుతున్న ఈ తెగ మనుషులు కానిబాల్స్ అని చెప్పాను కదూ.  వాళ్ళు మనుషులని తింటారు. ఇంకెవ్వరూ దొరక్కపోతే, తమ బందువులనీ, మిత్రులనీకూడా  తినెయ్యడానికి సంకోచించరు. అలాతిని తిని వాళ్ళ సంఖ్య ఇప్పుడు పాతికకి పడిపోయింది. త్వరత్వరగా అంతరించి పోతోంది ఆ తెగ.

    అందుకని తక్షణం వాళ్ళని కాంట్రాక్ట్ చెయ్యాలి మనం. నరభక్షణం తప్పు అని వాళ్ళకు అర్థమయ్యేలా చెయ్యాలి. ఆ తెగ పూర్తిగా అంతరించి పోకుండా సేవ్ చెయ్యాలి ఓకే?"

    సాగర్ ఏమీ మాట్లాడకుండా, తందూరీ రోటీమీద పోటాటో కర్రి వేసుకుని, దానిమీద సాల్టూ పెప్పరూ జల్లి, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ ముక్క ఒకటి ఉంచి,  టొమాటో సాస్ ఒంపి, దాన్ని పార్కుతో గుచ్చి నోట్లో పెట్టుకున్నారు, 'ఈ సంభాషణ ఇంక చాలు' అని సూచిస్తున్నట్లు.

                                                              *    *    *

    విశాఖపట్నం:జగదాంబా సెంటర్:నవంబర్ రెండో తారీఖు:

    హైదరాబాద్ నుంచీ వచ్చిన అనూహ్య ఫ్రెండ్స్ అందరూ ఎలిజబెత్ వాళ్ళ సిస్టర్ ఇంట్లోని ఒక గదిలో ఇరుకిరుగ్గా పడుకుని ఉన్నారు. రాత్రి సెకండ్ షో సినిమా చూడడంవల్ల ఎవరికీ త్వరగా మెలకువరాలేదు.

    ఎవరో తలుపు తట్టిన శబ్దం వినబడింది కళ్ళు నులుముకుంటూ లేచి, తలుపు తీసింది ఎలిజబెత్.

    ఒక  నడివయసావిడ నిలబడి వుంది గదిబయట.

    "నేను అనూహ్య ఆంటీనమ్మా!" అంది ఆవిడ. "అనూహ్య లేచిందా?"

    ఎలిజబెత్ కి నిద్ర మత్తంతా ఒక్కసారిగా దిగిపోయింది.

    "అనూహ్య! అది మీ ఇంటికే వచ్చిందిగా?" అంది ఆశ్చర్యంగా.

    ఆవిడ కంగారు పడింది. "మా ఇంటికి వచ్చిందా? ఎప్పుడూ?"

    "నిన్న సాయంత్రం హర్భరు నుంచీ అటే వెళ్ళిపోయింది."

    క్షణాల్లో అందరూ లేచారు, గందరగోళంగా మాటలు ఆదరాబాదరాగా కొందరు పోలీస్ స్టేషన్ కూ, కొందరు హర్భరుకీ పరిగెత్తారు.

    అనూహ్య ట్రాప్ అయిపోయిన షిప్పు అప్పటికేనడిసముద్రంలో వుంది.


                                                                            4

    అనూహ్యని వెదుకుతూ వచ్చిన ఆమె ఫ్రెండ్సూ, ఆంటీ హర్భరుఅధికారులకి రిపోర్టు చెయ్యగానే, వాళ్ళు షిప్పుకి రేడియో మెసేజ్ పంపించారు.


                                                               *    *    *

    తెల్లవారగానే వంటకి కూరగాయలూ, మాంసం తియ్యడం కోసం కోల్ స్టోరేజ్ తలుపు తెరిచాడు హెడ్ కుక్ ఇబూకా.

    తలుపు తియ్యగానే కలిగే చల్లటి అనుభూతి ఇంక కలగలేదు అతనికి. పైగా భరించలేనంత ఉక్కగా, వేడిగా ఉంది లోపల చిమ్మ చీకటిగా ఉంది.

    ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకిలా అయింది? కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ కి పవర్ సప్లయి ఆగిపోయిందా?

    తెరలు తెరలుగా దుర్వాసన ఏదో రావడం మొదలెట్టింది.

    వెళ్ళి, పొడుగాటి టార్చ్ లైటు పట్టుకొచ్చి పరిశోధన మొదలెట్టాడు. కొద్ది నిమిషాల తర్వాత కారణం తెలిసింది.

    ఆహరంకోసం వెదుక్కుంటున్న చిట్టెలుక ఒకటి, కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ లోకి దూరడానికి దొంగదారి ఒకటి కనిపెట్టి, రిఫ్రిజిరేషన్ డక్ట్ లోకి దూరింది.

    వెంటనే షార్ట్ సర్క్యూట్ అయి కోల్ స్టోరేజ్ కి పవర్ సప్లయి ఆగిపోయింది

    ఒళ్ళు కొంకర్లు పోతూ,  స్పృహతప్పి, కొన ఊపిరితో పడి ఉన్న అనూహ్య పరిస్థితి ప్రమాదకరంగా మారిపోతున్నప్పుడు జరిగింది అది.

    వెంటనే చలి తగ్గింది. కిటికీలు లేకుండా ఇనప్పెట్టేలా ఉన్న ఆ గదులు వేడిగా అయిపోయాయి. గాలి ఆడకపోవడంతో దుర్భరమైన ఉక్క పొయ్యడం మొదలెట్టింది.

    ఆ వేడిమికి ఆహార పదార్థాలన్నీ నెమ్మదిగా చెడిపోవడం ప్రారంభమయింది.

    ఒక్కొక్క అడుగే వేస్తున్నాడు ఇబూకా. సడెన్ గా కాలికి మెత్తగా ఏదో తరలడంతో ఉలిక్కిపడి కిందికి చూశాడు.

    ఒక అమ్మాయి? నిశ్చలంగా పడి ఉంది, కోల్ట్ స్టోరేజ్ లో.

    మరుక్షణం అతనికి నిన్నటి ఆడపిల్లల బృందం గుర్తొచ్చింది. అందులో ఒక అమ్మాయి ఇందులో ఉండిపోయిందా ఏమిటి కొంపదీసి! ముచ్చెమటలు పోశాయతనికి బయటికి పరుగుతీశాడు.

    అప్పటికే హర్భర్ నుంచి రేడియో మెసేజ్ అందింది, సాగర్ కి. అతనూ గబ గబ ఒక్కొక్క రూమూ వెతుకుతూ వస్తున్నాడు.

    "సర్! నేను పెద్ద తప్పు చేశాను!" అన్నాడు ఇబూకా, ఏడుపు గొంతుతో,

    అతనికి జవాబు చెప్పకుండా క్విక్ గా లోపలికి వెళ్ళాడు సాగర్.

    అచేతనంగా పడివున్న అనూహ్య అతని కంటపడింది. వెంటనే ఆమెను ఎత్తి చేతుల్లోకి తీసుకుని కెప్టెన్స్ క్వార్టర్స్ వైపు నడిచాడు.

    తలుపు బయట మనుషుల గొంతులూ, హడావిడీ వినగానే డబుల్ బెడ్ మీద లేచి కూర్చుంది స్వరూపరాణి.

    "ఎక్స్యూజ్ మీ మెడమ్!" అంటూ అనూహ్యని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టాడు సాగర్.

    లివింగ్ రూంలో ఒక మూలగా ఖరీదయిన చెక్కతో చేసిన బార్ వుంది. ప్రపంచంలో దొరికే ఖరీదైన మద్యాలన్నీ దానిలో పేర్చిఉన్నాయి.

    ఫ్రెంచ్ బిస్కట్ బ్రాందీ సీఫా తీశాడు సాగర్ చిన్నగ్లాసులోకి దాన్ని వంచి, వేళ్ళతో అనూహ్య బుగ్గలు నొక్కి ఆమె నోరు తెరుచుకునేలా చేసి, గ్లాసులోకి  ద్రవాన్ని ఆమె నోట్లో పోశాడు. బ్రాందీ శరీరానికి వేడిమి కలుగజేస్తుంది.

    ఒక్క గుటక వేసి, వెంటనే మొహం చేదుగా పెట్టింది అనూహ్య.

    మరో గుక్కెడు పోశాడు సాగర్.

    మింగేసి కొరబోయినట్లు దగ్గింది అనూహ్య.

    తనకు తెలియకుండానే 'ఇంక పోయ్యొద్దు అన్నట్లు తల అటూ ఇటూ విదిలించింది.

    గ్లాసు టేబుల్ మీద పెట్టేసి, ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు సాగర్. ఆమె పాదాలు తన వళ్ళో పెట్టుకుని, అరచేతితో రాయడం మొదలెట్టాడు మంచులో తడిసిన గులాబీలా వున్న ఆమె పాదాలు వెచ్చగా కావటానికి చాలాసేపు పట్టింది.

    లేచి నిలబడి స్వరూపరాణి వైపు చూశాడు. "మీరు కూడా కొంచెం హెల్స్ చెయ్యాలి మేడమ్!"

 Previous Page Next Page