Previous Page Next Page 
తృప్తి పేజి 39


    సింధు పద్ధతులు సింధువే. తను మారదు.
    అమ్మ పద్ధతులు అమ్మవే. ఆవిడ మారదు.
    మధ్యలో ఇరుకునపడి నలిగిపోతున్నది నేనేగా అనుకున్నాడు బాధగా.
    "ఇల్లన్నాకా ఏవో గొడవలు వస్తూనే ఉంటాయి. వెళ్ళిపోకండమ్మా" అంది తులశమ్మ బుట్ట సర్దుకుంటున్న అరుణ్ తల్లితో.
    "నాకిది మొదటిసారి కాదండీ. కొడుకుమీద మమకారంతో పుట్టెడాశ పెట్టుకుని రావడం, భంగపడి వెళ్ళిపోవడం నాకు అలవాటే. పిల్లలు ఉండమని వలవడ్తారుగదాని ఉంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇంత జరిగినా ఆ అమ్మాయి ఏమైనా నోరువిప్పి మాట్లాడిందా! చూడండి ఆ నిర్లక్ష్యం" అని కొంగుతో కళ్ళద్దుకుంది.
    "అనుభవం లేకపోవడంవల్ల ఇలా జరుగుతుంది. మనసులో ఆపేక్షలు లేక కాదు. మీరిలా వెళ్ళిపోతే నాకెంత సిగ్గుగా ఉంటుందో ఆలోచించండి. నిజానికి మీరుండాల్సిన స్థానమిది. చూసే దిక్కులేకుండా అక్కడ పడున్నానని తీసుకొచ్చింది సింధు" అందావిడ సిగ్గుపడ్తూ.
    "మీ గురించి నేనేమనలేదు. మీకు బాధ కలిగితే క్షమించండి. నన్నాపకండి, వెళ్ళనీయండి" అంటూ బుట్ట పట్టుకుని హాల్లోకొచ్చింది.
    "బామ్మా వెళ్ళిపోతున్నావా?" అంటూ వచ్చి చుట్టుకుంది రమ్య.
    "అవునమ్మా వెళ్ళాలి, అక్కడ పనుంది" అందావిడ దాన్ని ముద్దు పెట్టుకుంటూ.
    "వెళ్ళడానికి వీల్లేదు. ఉండాల్సిందే" అంటూ ఆవిడ బుట్ట పట్టుకుని గుంజి హఠం చెయ్యసాగాడు తేజా.
    ఆవిడకి కళ్ళనిండా నీళ్ళొచ్చేశాయి. "పదండి పదండి ఆటో వచ్చేస్తుంది" అంటూ చిట్టెమ్మ తేజని బలవంతంగా ఎత్తుకుని, రమ్యని లాగుతుండగా "అంతా నీవల్లే. మా బామ్మని ఏదో అన్నావ్, ఎందుకన్నావు?" అంది కోపంగా రమ్య.
    చిట్టెమ్మ మొహం గంటుపెట్టుకుని వెళ్ళి సింధుతో "పాప కూడా కేకలేస్తోంది నామీద. నేనేం తప్పుచేశానమ్మా? జీతమిస్తున్నారు. జీతానికి తగ్గపని చేస్తున్నాను. టైమైపోతుందని గబగబా రమ్మన్నాను అది కూడా తప్పేనా?" అని అడిగింది.
    సింధు వెంటనే "రమ్యా వెళ్ళు, వెళ్ళి తయారవ్వు. పెద్దపెద్ద మాటలు, చేతలు ఎక్కువయ్యాయి ఈ మధ్య" అంటూ కోప్పడింది.
    రమ్య ఏడుస్తూనే చిట్టెమ్మతో వెళ్ళిపోయింది. "ఎందుకమ్మా పెద్దవాళ్ళమీద కోపం చిన్నపిల్లల మీద చూపిస్తావు? వాళ్ళనేడిపిస్తే నే చూస్తూ ఊరుకోలేననేగా" అందావిడ డగ్గుత్తికతో గొంతు పూడుకుపోతుంటే.
    "ఏమిటండీ మీరు మరీ! వచ్చినప్పుడల్లా కళ్ళనీళ్ళు పెట్టుకునే వెళ్తారెందుకు? ఇప్పుడేం జరిగిందని? తనపని తను చూసుకుందామని గభాల్న వంటింట్లోకి వచ్చిందేమో తను. చెప్పి పంపించేస్తే సరిపోయేదానికింత గొడవ చేశారు. మిమ్మల్నెవరో నిర్దయగా వెళ్ళగొట్టినట్లు మీరేడ్చి, పిల్లల్నేడిపించి మమ్మల్ని బాధపెట్టి వెళ్తారు" అంది విసురుగా సింధు.
    "సింధూ" అన్నాడు అరుణ్ కోపంగా.
    సింధు మరి మాట్లాడకుండా గదిలోకెళ్ళిపోయింది.
    "పదమ్మా నిన్ను దింపుతాను" అని బుట్ట తీసుకుని నడిచాడు.
    ఆవిడ తులశమ్మవైపు తిరిగి "వెళ్ళొస్తాను" అని చెప్పి కొడుకు వెంట వెళ్ళిపోయింది. వెక్కిళ్ళు పెడ్తూ "టాటా బామ్మా" అన్నారు పిల్లలిద్దరూ. యుద్ధంలో ఓడిపోయిన సైనికుడిలా తల కిందికి వంచుకుని నడిచాడు అరుణ్.
    సింధు దిండులో తలదాచుకుని వెక్కివెక్కి ఏడ్చింది.
    "ఆ చిన్నారుల మనసుల్లో తల్లిమీద ఎంత కసి ఏర్పడుతుంది? పిలిచి అవమానించినట్లయిందా మేనత్తని! కొడుకింట్లో ఒక్కపూట అన్నం తినకుండా చేసినట్లుందా తల్లిని! నెలకిన్ని వేలు సంపాదిస్తూ కూడా తల్లిని ఇంట్లో ఉంచుకునే అర్హత లేనివాడిలా అయింది అరుణ్ పరిస్థితి. బావకీ, అరుణ్ కి ఏమిటి తేడా? బావ నర్మదకి భయపడి మరీ అధ్వాన్నంగా ప్రవర్తించాడు. అరుణ్ అంతకాదు. అత్తయ్యకి కొడుకు తప్ప ఎవరూ లేరు కాబట్టి ఇన్నాళ్ళనించీ ఇక్కడే పడి ఉంది. తనత్తగారికి కూతురుండబట్టి అక్కడ గడుపుకుంటోంది. తనకి నర్మద ప్రవర్తనమీద ఎంత అసహ్యం కలిగింది? అలాగే ఇవన్నీ తల్లెళ్ళి చెప్తే వసుధకి కూడా తనమీద అసహ్యం కలుగుతుంది కదా! ఒక్కపూట అన్నమైనా పెట్టకుండా పస్తుపెట్టి పంపించారు అంటుంది కదా! ఛీ,ఛీ తన సంస్కారం, తన చదువు ఏమైపోయాయి? తనెందుకసలు అలా మాట్లాడింది? చిట్టెమ్మ మానేస్తే మానేసిందని నాలుగు తిట్టుండాల్సింది. ఆవిడ ఎలా చెబితే అలా చెయ్యి. ఎదిరించకు అని కోప్పడాల్సింది. ఇప్పుడివన్నీ అనుకునేం లాభం! అరుణ్ ఎప్పుడో అన్నాడు నిన్ను చేసుకున్నందువల్ల తల్లికి రుణం తీర్చుకోలేని మాతృద్రోహినయ్యాను. కొడుకుండీ లేనివాళ్ళల్లో జమకట్టి నా తల్లి పరాయిపంచన పడిఉందని. ఇప్పుడు కూడా తనవైపెంత ఏవగింపుగా చూశాడనీ! ఎందుకిలా జరుగుతుంది? పరిస్థితుల ప్రభావమా లేక తనలో లోపముందా? తనొట్టి స్వార్థపరురాలా? నర్మదకీ, తనకీ తేడా లేదా? భర్తకంటే ఎక్కువ సంపాదిస్తున్నానని తనకి కూడా అహంకారమా? అరుణ్ ఏమీ అనలేనివాళ్ళా ఎందుకూరుకుంటాడు? ఒకవేళ తనని ఆవిడముందే దులిపేసి "మా అమ్మ ఇక్కడే ఉంటుంది. ఆవిడ చెప్పినట్టు విను" అంటే తను సహించగలదా? ఈ పరిస్థితులిలా సాగవలసినదేనా?"
    ఈ పూట ఆ ఇంట్లో ఒకే విస్తరి లేచింది. అది చిట్టెమ్మది.


                            *    *    *    *


    "వదినా ఏం చేస్తున్నారు?" అంటూ వచ్చింది ఎదురింటి మీనాక్షి.
    ఒత్తులు వేస్తున్న కాత్యాయని "రండొదినా, ఇప్పుడే పనయింది" అని పిలిచింది.
    "నాలుగురోజుల బట్టీ వద్దామనుకుంటున్నాను, కాని కుదరట్లేదు. ఇదిగో ఈరోజు తీరిక చేసుకుని మరీ వచ్చాను. నీతో ఓ విషయం మాట్లాడాలనీ" అంది.
    "ఏమిటొదినా?" కంగారుగా అడిగింది.

 Previous Page Next Page