Previous Page Next Page 
తృప్తి పేజి 38


    "ఉండండి పిల్లలడుగుతున్నారుగా" అంది సింధు.
    ఏమనుకుందో వుండిపోయిందావిడ. అరుణ్ రాత్రి ఆలశ్యంగా ఇంటికొచ్చాడు. తల్లిని పలుకరించి, తులశమ్మగారి ఆరోగ్యం గురించి ప్రశ్నలు వేసి గదిలోకెళ్ళాడు. ఇంతలో సింధు కోసం బిలబిలమంటూ పదిమంది స్టూడెంట్స్ వచ్చారు. తన స్టడీరూంలోకి తీసుకెళ్ళి వాళ్ళతో బిజీ అయిపోయింది సింధు. చిట్టెమ్మ వచ్చి భోజనానికి పిలిచింది. "నాకు ఆకల్లేదు" అని చెప్పి ఓ గ్లాసెడు మజ్జిగ తీసుకుని తాగొచ్చిందావిడ. తులశమ్మ రాత్రిపూట అన్నం మానేసిందీ మధ్య. ఆవిడకి రోజూ రాత్రిపూట రెండు పుల్కాలు, పాలు ఇమ్మని డాక్టర్ గారన్నారు. పిల్లలకు అన్నాలు పెట్టి తను తిని, అన్నీ మూతలు పెట్టేసి పడుకుంది చిట్టెమ్మ.
    తొమ్మిదయిపోయినా వచ్చిన స్నేహితులు వెళ్ళడం కనిపించలేదు. అరుణ్ పదిగంటలవరకు చూసి కాస్త అన్నం పెట్టుకుని తిని పడుకున్నాడు. సింధు వాళ్ళని పంపించేటప్పటికి పదకొండున్నరయింది. లోపలికొచ్చి కాంప్లాన్ కలుపుకుని తాగింది.
    "అన్నం తిన్నావుటే?" అడిగింది తులశమ్మ.
    "వద్దు" అని వెళ్ళి మళ్ళీ చదువుకోసాగింది.
    వాళ్ళత్తగారు తులశమ్మ గదిలోనే పడుకుంది. "ఇదమ్మా సంగతి! వాడక్కడా, ఈవిడిక్కడా, రోజూ ఇంతే! ఓ అచ్చటా ముచ్చటా లేదు వాడి ముఖాన. ఏం వయసు మించిపోయిందని చెప్పండి? ఇవన్నీ చూస్తే నా తల్లిప్రాణం తట్టుకోలేదు" బాధగా చెప్పిందావిడ.
    "ఇవేళ అమ్మాయికి కాస్త పనెక్కువగా ఉన్నట్లుంది" సమర్ధించుకుంది తులశమ్మ.
    "ఏనాడు తక్కువ ఉంది గనక? పెళ్ళయిన ఓ నెలరోజులు సరదాగా గడిపారేమో అంతే. ఆ తర్వాత నుంచీ ఇదే కథ!" విరక్తిగా చెప్పిందావిడ.
    "అందరూ ఇలాగే హైరానా పడుతున్నారా? కాలేజీ నుంచొచ్చాక కూడా ఇలా హడావుడి పడడం ఎందుకమ్మా? తనకు మాత్రం ఇలా ఎంతకాలం ఓపికుంటుంది?" అంది మళ్ళీ.
    తులశమ్మకేం చెప్పాలో తోచలేదు. సింధుని తప్పుపట్టలేదు. అలా అని ఆవిడన్న దానిలో ఏం తప్పు కనిపించడం లేదు. అరుణ్ విషయంలో అసలు వంకపెడదామన్నా కనిపించటం లేదు. అతని వినయం, అణకువా ఆమెను ఆకర్షించాయి. అప్పుడప్పుడు సింధు గట్టిగా ఏమైనా అన్నా అతను పెదవి తొణకడు. గదిలో ఒంటరిగా ఏమైనా అంటాడేమో మరి తెలియదు. ఇక ఇంట్లో అంతా చిట్టెమ్మదే రాజ్యం.
    మర్నాడు ప్రొద్దుటే అరుణ్ వాళ్ళమ్మ మడి గట్టుకుని పూజ చేసుకుని, వంటకు పక్రమించింది. సింధు ఇంకా లేవలేదు. ఆవిడ బియ్యం కడిగిపెట్టగానే, చిట్టెమ్మొచ్చి మూతతీసి గరిటెతో కలియబెట్టసాగింది.
    "అయ్యయ్యో నువ్వెందుకు ముట్టుకున్నావు? మడితో వండుకుంటుంటే" అనరిచిందావిడ.
    "నాకివేం తెలియవు. పిలలు వెళ్ళే లోపల వంట కావాలి. మీరు కావలిస్తే పనంతా అయ్యాక మళ్ళీ మడిగట్టుకుని చేసుకోండి" అంది.
    "నేను తర్వాత వండుకోవాలా? ఎంత ధైర్యం నీకామాట అనడానికి? అసలు నువ్వెవరామాట చెప్పడానికి? ఇది నా కొడుకిల్లే" అరిచిందావిడ.
    "మీరెప్పుడో ఒక్కరోజొచ్చి పోయేవాళ్ళు. నేను నిత్యముండేదాన్ని. ఇక్కడి పద్ధతులు, పనిపాటలు నాకు తెలుస్తాయి కానీ మీకు కాదు" అంది గట్టిగానే.
    "పనిదానివి నీకెంత అలుసైపోయాను? ఎప్పుడో ఒక రోజొచ్చి పోయేదాన్నా? అవును మంచిమాటే అన్నావు. నిజంగానే నాకెక్కడుందీ ఇంట్లో స్థానం" అనావిడ ఏడవసాగింది.
    ఈ గొడవకి అరుణ్, సింధు లేచి బైటికొచ్చారు.
    "నాకేం తెలుసమ్మా కొత్త పద్ధతులు! నేను మామూలుగానే పిల్లలు వెళ్ళే వేళకి వంట చెయ్యాలని వంటింట్లోకి వచ్చాను. ఈ అమ్మగారు గొడవగొడవగా మాట్లాడుతున్నారు. పనిదానివి అంటూ ఎత్తిపొడుస్తున్నారు. నన్ను తక్కువగా చూస్తే నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను. మేమూ ఒకప్పుడు బాగా బతికినవాళ్ళమే. ఆ సంగతి తెలుసుకొని అమ్మగారు, అయ్యగారూ నన్ను చాలా గౌరవంగా చూస్తారు. ఒక్కమాట కూడా అనరు" అంది.
    "ఎందుకు చూడరూ! అయినవాళ్ళకు ఆకుల్లో కానివాళ్ళకి కంచాల్లో పద్ధతి కదా ఈ ఇంట్లో" అందావిడ కసిగా.
    ఈ మాట తులశమ్మ గుండెల్లో వాడిగా గుచ్చుకుంది. సింధు తలెత్తి సూటిగా అరుణ్ కళ్ళల్లోకి చూసింది. అతను వెంటనే చూపులు మరల్చుకుని "పోనీలేమ్మా చిన్న విషయానికింత గొడవెందుకు? చిట్టెమ్మా! ఈ రోజుకి పిల్లలకి బ్రెడ్, జామ్ పెట్టి పంపించు. వెంటనే వెళ్ళి నీ పని చూసుకో! అమ్మా నీ పని నువ్వు చూసుకో! నువ్వున్నంతవరకు చిట్టెమ్మ వంటింట్లోకి రాదు సరేనా!" అన్నాడు.
    "దాన్నొక్కమాటైనా అనకుండా నన్ను అన్ని మాటలంటావా? నేను గొడవ చెయ్యడానికొచ్చానురా? వుండమన్నారని ఒక్కపూట ఉన్నాను కానీ లేకపోతే నేనుంటానా! నాకు తెలియదూ ఏమాత్రం స్వతంత్రముందో నీ ఇంట్లో" అని కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఆవిడ గదిలోకెళ్ళిపోయింది.
    అరుణ్ కి మనసులో దేవేసింది. "అమ్మ రాత్రి కూడా అన్నం తినలేదు. ఆవిడ చాదస్తం ఆవిడది. ఈ చిట్టెమ్మకి ఎందుకింత నోరు? పనిమనిషంటే తప్పేమిటి? మేమందరం పనిమనుషులం కాదా! ఎక్కడో ఒకచోట పని చేస్తున్నప్పుడు పనిచేసేవాళ్ళు అంటే తప్పేమిటి?" అనుకున్నాడు. కానీ ఆ మాటలు బయటికంటే వాటి పర్యవసానం తనూహించగలడు. చిట్టెమ్మ మానేసినా మానేస్తుంది. దాంతో సింధు శివాలెత్తిపోతుంది. అటు బయటా ఇటు ఇంట్లో చేసుకోలేక సింధు ఎంత మధనపడిపోతుందో తనకు తెలుసు. రాత్రిళ్ళు పిచ్చిపిచ్చిగా కలవరించేది. ఈ మధ్యనే పనెక్కువగా వున్నప్పటికీ మనశ్శాంతిగా వుంటోంది. చిట్టెమ్మ మీద మొత్తం ఇంటి పనుల భారమంతా వేసేసింది. ఈ పరిస్థితుల్లో చిట్టెమ్మ మానేస్తే ఇంకేమయినా ఉందా? మళ్ళీ ఇలా పనిచేసే మనిషి దొరకకపోవచ్చు. దాంతో సింధు విసుగు, రుసరుసలూ మళ్ళీ మొదలు. అందుకని ఏమీ అనకపోవడమే ఉత్తమం. కానీ మరి తల్లి పరిస్థితేమిటి? ఇన్నాళ్ళనించి అలవాటైన పద్ధతులు మానుకోవడం, ఆవిడ తరం కాదు. ఆ మాటకొస్తే ఎవ్వరి తరం కూడా కాదు. అందుకే అక్క ఇంట్లో ఉంటోంది. బావగారు చాలా మంచివారు. దేవుడని చెప్పుకోవచ్చు. తన తల్లిలాగే చూసుకుంటారు అమ్మని. అక్క కూడా ఆవిడెలా చెప్తే అలా నడుచుకుంటుంది. ఇక్కడ తననేమైనా అన్నా భరించదు. "చిన్నవాడు వాడినేం దెప్పకు, ఈ వచ్చేది కూడా మానేస్తాడు" అంటూ వెనకేసుకొస్తోంది. తననే కాదు సింధుని కూడా చాలా వెనకేసుకొచ్చి మాట్లాడుతుంది. "ఎంత పెద్ద ఉద్యోగమో నీకేం తెలుసు! అంతపెద్ద హోదా ఊరికే వస్తుందా? అందుకు తగ్గ పని కూడా చెయ్యాలి మరి. లేకపోతే గౌరవముండదు" అని తల్లికి చెబుతూ ఉంటుంది.

 Previous Page Next Page