"అంతగా కంగారుపడాల్సిందేమీ కాదు కానీ, మన యమున పెళ్ళి విషయం ఏం చేశారూ? మా మేనమామ మనుమడు ఈ ఊళ్ళోనే బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు మూడువేలకు పైగా సంపాదిస్తున్నాడు. మన యమునకు ఈడుజోడుగా వుంటాడు అంటుండగా_
"అంతలేసి సంబంధాలు మనకందుతాయా? మేమేమీ ఇచ్చుకోలేమని నీకు తెలుసుగా" అంటూ అశక్తత వ్యక్తంచేసింది కాత్యాయని.
"వాళ్ళకు ఒక్కపైసా కట్నం కూడా అక్కర్లేదమ్మా!" అని కాసేపాగి_
"అబ్బాయికి పెళ్ళయిన ఆర్నెల్లకే భార్యపోయింది. అదొక్కటే లోపం" అని చల్లగా చెప్పింది.
"ఆ... రెండో సంబంధమా?" అంది బాధగా కాత్యాయని.
"అదేమిటమ్మా! పిల్లా జెల్లా? బాదరాబందీ లేని చక్కని సంబంధం. ఇదే సంబంధం ఈ కాస్త మచ్చా లేకపోతే మీకు అందుబాటులో ఉండేదా? లక్షకి తక్కువ కాకుండా అడుగుతారు. మొదటిసారి కట్నం తీసుకుంటే అచ్చిరాలేదని గానీ, వీడికి మళ్ళీ ఇవ్వరని కాదు. ఇంతమంచి సంబంధం తీసుకురావాలంటే మీ తరంకాదు. ఏదో మీమీదున్న అభిమానం కొద్దీ ఇంతలా చెప్తున్నాను. అన్నయ్యగారితో చెప్పు. నీకట్టే అనుభవం లేక అలా మాట్లాడుతున్నావు" అని జ్ఞానబోధ చేసింది.
"అమ్మాయేం అంటుందో..." అంది కాత్యాయని.
"సరే! ఇదిగో అబ్బాయి వివరాలు" అంటూ ఓ కాగితం అందించి "పిల్ల ఇదివరకు ఎంత బావుండేదనీ! ఈ మధ్య చిక్కిపోయి బుగ్గల్లోపలికిపోయి కళ్ళు, ముక్కు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకో ఏడాదిపోతే ఈ రూపూ ఉండకపోవచ్చు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నారందుకే పెద్దలు. దాని వయసువాళ్ళందరూ పెళ్ళయి ఏడాది తిరిగేలోపుగా బిడ్డల్నందుకుంటుంటే దానికెలా ఉంటుందో ఆలోచించు! మరబొమ్మలా ఆ ఉద్యోగం, ఇంట్లో చాకిరీ తప్ప ఏం అనుభవిస్తోందీ వయసులో? ఇంక వాళ్ళకి వాళ్ళ ఇల్లు, సంసారం అనేవి కావాలనిపిస్తాయమ్మా. పరువుగల ఇంటి ఆడపిల్లలు ఆ మాట బైటికి చెప్పలేక, లోలోపలే మధనపడి చిక్కిపోతారు. ఈ వయసులోనే మనం జాగ్రత్తపడాలి. వస్తా, చాలా పనుంది" అని చెప్పి లేచి వెళ్ళిపోయింది. ఆమె ఎప్పుడెళ్ళిపోయిందో కూడా గమనించలేదు కాత్యాయని.
మీనాక్షి మాటలు బుర్రలో గిరగిరా తిరగసాగాయి. "అవును, నేను కనుక్కోలేకపోయాను. యమున ఈ మధ్య చాలా చిక్కిపోయింది. ఇదివరకటి ఉత్సాహమే లేదు" అనుకుంది.
ఆ రాత్రి రామారావుగారూ, యమునా, శరత్ అందరూ కూర్చుని భోజనాలు చేస్తుండగా ఎదురింటావిడ చెప్పిన సంబంధం విషయం చెప్పేసింది కాత్యాయని. "పెళ్ళయిన ఆర్నెల్లకే కదా! అంత అభ్యంతరముండదనుకుంటాను యమునకి" అంది మీనాక్షి. "పిల్లాడు బావుంటాడట. గొప్పవాళ్ళుట కూడానూ. మనలా అన్నిటికీ తడుముకోనక్కరలేదుట" అని చెప్పి ఆగి ఒక్కసారి అందరివైపూ చూసింది.
యమున మౌనంగా తింటోంది. శరత్ తినడమాపి తల్లివైపే చూస్తున్నాడు. రామారావుగారు తనని కాదన్నట్టు "ఆ చారుగిన్నె ఇలా పెట్టు" అన్నారు.
"ఏమిటి మాట్లాడరూ?" అంది.
"చారు బావుంది" చెప్పాడాయన.
"అదికాదండీ. నేచెప్పిన విషయం..."
"కొత్తిమీర వెయ్యలేదా? వేస్తే ఇంకా దివ్యంగా ఉండేది"
"అబ్బబ్బా నేనేం అంటున్నానో పట్టించుకోకుండా మీ ధోరణి మీదేగదా" నెత్తి కొట్టుకుంది కాత్యాయని.
"చింతపండు, నీళ్ళూ, ఉప్పు, పోపూ అన్నీ కలిస్తేనే చారవుతుంది. కొత్తిమీర లాంటి చిన్న విషయం మర్చిపోయినా అది చారే అవుతుంది. కానీ కొంచెం రుచి కోల్పోతుంది. అలాగే జీవితం కూడా. వరుడు డబ్బున్నవాడూ, చడువున్న వాడూ, గుణమున్నవాడూ అయితే చాలనుకుంటాము మనం. కానీ తన భర్త అన్నీ వున్నా కొత్త పెళ్ళికొడుకు కాడు. ఇదివరకోసారి దాంపత్యజీవితం అనుభవించినవాడే అని తలుచుకుంటే ఆడపిల్లకంత ప్రియంగా ఉండకపోవచ్చు. అయినా ఎవరి రుచులు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవీ, మనమేం చెప్పగలం? ఎవరికి వాళ్ళే తేల్చుకోవాలి" అన్నాడాయన మజ్జిగ గిన్నెనందుకుంటూ.
"దానిమొహం! దానికేం తెలుసు? కావేరిని మాత్రం మనమడిగామా నీకిష్టమా కాదా అని" అందావిడ.
యమున లేచి వెళ్ళిపోయింది.
"అదేమిటే మజ్జిగ పోసుకోలేదూ!" అనడిగింది.
"మీ ఆడవాళ్ళు కంచంలో అన్నంపెట్టి, గుండెల్లో రైళ్ళు పరిగెత్తే విషయాలు చెప్తారు. ఎదురింటావిడ కోడలు నీళ్ళోసుకుందని చెప్పినంత తేలిగ్గాను, వెనుక వీధిలో గుర్నాథం గుండాగి చనిపోయాడనీ చెప్పగలరు" అన్నారాయన చెయ్యి కడుగుతూ.
శరత్ నవ్వుతూ లేచెళ్ళిపోయాడు.
చెయ్యి తుడుచుకోవడానికాయనకి తుండుగుడ్డ ఇస్తూ "అది కాదండీ..." అని సందేహంగా ఆగిపోయింది. ఆవిడ మనసులో మీనాక్షి చెప్పిన విషయాలన్నీ ఆయనతో చెప్పాలనీ, యమున పరిస్థితి తనకర్థమయింది కాబట్టి వివరించాలనీ వుంది. కానీ ఆ కాలంవాళ్ళకి భర్త దగ్గర అంత చనువెక్కడిదీ?
"ఇంతకు నువ్వనేదేమిటీ? అనడిగాడాయన వాలుకుర్చీలో కూర్చుంటూ.
"వయసు మించిపోతే మనంతట మనమే రెండో సంబంధాల కోసం తిరగాల్సొస్తుందేమో ఆలోచించండి" అంది.
ఇందాకే చెప్పాను నేనేం చెయ్యలేనని. నువ్వు దాని ఉద్దేశం కనుక్కో. తల్లివిగా నీకు కాకపోతే ఎవరితో చెప్తుంది మనసువిప్పి" అన్నాడాయన తాపీగా.
"సరే నాకు తప్పుతుందా?" అంటూ లోపలికెళ్ళిందావిడ.
ఈ మాటలన్నీ తలుపు వెనకనుంచి వింటూనే వుంది యమున. "మనసు విప్పి తల్లితో కూడా చెప్పలేని పరిస్థితి. ఏమని చెప్తుంది? శేఖర్ వెంటపడినప్పుడు కాదు పొమ్మంది. ఇప్పుడతను ఐపూ అజా లేడు. తన సంబంధం తనే చూసుకున్నానని చెప్తుందా? లేక అతనివైపు నుంచి మళ్ళీ రెస్పాన్సు రాకుండానే ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటుందా? ఇంతలో కాత్యాయని లోపలికొచ్చేసి "ఏదో ఒకటి తేల్చి చెప్పమ్మా మూగనోము పట్టక" అంది.
యమున తలెత్తి తల్లివైపు చూసింది "నీకిష్టం లేకపోతే రేపావిడతో చెప్పేస్తాను" అంది బెదురుగా.