Previous Page Next Page 
తృప్తి పేజి 37


    "అదేదో కొత్త స్వీటేమో కనుక్కోవే జయా! పెద్ద పండుగనాడు చేసుకుందాము" అనగానే హేమలతమ్మ, జయా పడీపడీ నవ్వసాగారు. అదేమిటో తెలుగులో చెప్పాక ఆవిడ కూడా నవ్వేసింది.
    ఇంతలో స్కూల్ నుండి పిల్లలొచ్చారు. మధు జయ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి "నీ కోసమేం తెచ్చానో చెప్పుకో!" అన్నాడు.
    "చాక్లెట్" అంది జయ.
    వాడు కాదని తల అడ్డంగా ఊపాడు.
    "రేగిపండ్లు" అంది. వాడు మళ్ళీ తల అడ్డంగా ఊపాడు.
    "అబ్బా అదేమిటో త్వరగా చెప్పు. గుంజీలు తియ్యమంటే మాత్రం నావల్ల కాదు" అంది.
    "అదేం కాదులే! చింతపండు, జీలకర్రా, ఉప్పు దంచి పుల్లకి చుట్టిపెట్టి. బట్టలు మార్చుకుని వస్తా" అన్నాడు.
    "ఇంతకీ నాకేం తెచ్చావు?" అనడగగానే వాడు నుదురు కొట్టుకుని "మర్చిపోయాను ఇదీ..." అంటూ ఓ ఇన్ లాండ్ కవరిచ్చాడు.
    "పోస్ట్ మాన్ దార్లో కనిపించి ఇచ్చాడు. ఇంటి నెంబర్ కూడా సరిగ్గా వెయ్యకుండా జయప్రద అని రాసేస్తే వచ్చేస్తుందా? వాడు వారంనుంచి తిరుగుతున్నాడట. ఇవాళ నేనే అడిగాను దార్లో కనిపిస్తే జయప్రద పేరు మీదేమైనా ఉత్తరమొచ్చిందా? అని. నా కాళ్ళు పట్టుకున్నంత పనిచేసి మరీ ఇచ్చాడు" అన్నాడు వాడు.
    వాడికి తన మీదున్న అభిమానానికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి జయకి. వాణ్ణి దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది.
    "నయమే! లెటర్ పోస్ట్ మేన్ తెచ్చివ్వలేదు" అంది హేమ్ లెట్ వెంటనే.
    మధు చప్పట్లు కొడ్తూ పెద్దగా నవ్వేడు. అర్థంకాకపోయినా పూజా, వర్ధనమ్మగారూ నవ్వేశారు.
    "ఆంటీ ఈజ్ వెరీ నాటీ" అంటూ జయ ఉత్తరం తీసుకుని డాబా మీదికెళ్తుంటే "నా చింతపండు, పుల్లా" అని గుర్తుచేశాడు వాడు.
    "అలాగే, అలాగే" అంటూ వెళ్ళిపోయింది.
    జయకి పెళ్ళయ్యాక శశిధర్ రాసిన మొదటి ఉత్తరం అది. నెమ్మదిగా విప్పి పెదవులకాన్చుకుంది. శశిధర్ మీసాలు గరుగ్గా తగిలినట్టనిపించి "ఛీ పాడూ" అని నవ్వుకుంది.
    "జయా! నీ ఉత్తరం చూడగానే కోపమొచ్చింది తెలుసా!"
    "ఎందుకబ్బా!" అనుకుంది.
    "నేనిక్కడ నానా కష్టాలు పడుతుంటే హాయిగా ఉన్నావా?"
    ఓహో! అబ్బాయిగారికి పెళ్ళాం లేకపోతే పడే పాట్లు తెలిసొచ్చాయి కాబోలు ననుకుంది.
    "ఒక్క షర్టు వారంరోజులు వేసుకుంటున్నాను"
    "ఛీ" అనుకుంది ముక్కు చిట్లించి.
    "గడ్డం అసలు నువ్వు వెళ్ళాక చేసుకోలేదు"
    "నాకేం బాధ" అని నవ్వుకుంది.
    "పక్క బట్టలు మార్చే దిక్కేలేదు. అన్నం రోజూ చల్లగా అయిపోయి, సరైన అధరువులు లేక ఏడుపొస్తోంది"
    "అయ్యయ్యో" అని జయ మనసు విలవిలలాడింది.
    "మొన్ననేం జరిగిందో తెల్సా! చూసుకోకుండా చిరిగిపోయిన షర్టేసుకెళ్ళాను. కాఫీ వెచ్చపెట్టుకుంటుంటే పట్టకారు పట్టుతప్పి కాఫీ చేతిమీద పడిపోయింది. చిన్న బొబ్బే వచ్చిందనుకో! బుజ్జిగాడు పుట్టకముందే నన్ను సతాయించేస్తున్నాడు. పుట్టాక అసలు నన్ను పట్టించుకోవేమో నువ్వు. మగపిల్లాడైతేనే మంచిదిలే. అమ్మ సణక్కుండా ఉంటుంది. అక్కా, అమ్మా రోజూ వంట గురించి పోట్లాటే. నువ్వుంటే పాపం తెలిసేది కాదు. మొన్నెప్పుడో ఓ తెలుగు సినిమా చూశాను. అందులో హీరో భార్య కడుపుతో ఉంటే ఎంతో అపురూపంగా చూశాడు. అన్నం కలిపి తినిపించాడు. జడ వేశాడు. చివరికి చీర కూడా... నేను నీకు కనీసం పల్లీలు కూడా కొని తినిపించలేదని నాకప్పుడు గుర్తుకొచ్చింది. ఇంకోసారి నేను కూడా అవన్నీ చేస్తాలే. ఇప్పుడు నాకు కొత్తకదా!"
    జయకి పకపకా నవ్వొచ్చేసింది.
    "మీ ఇంట్లో వాళ్ళందర్నీ అడిగానని చెప్పు. మా అక్కవాళ్ళల్లా టీవీలు, సినిమాలు ఎక్కువగా చూడకు! పుట్టేవాడికి కూడా ఆ బుద్ధులే వస్తాయి. ఇంట్లో ఎప్పుడు చూసినా జాతరలా ఉంటుంది. అందుకే నేను ఎక్కువసేపు బైటే వుంటున్నాను. ఫిబ్రవరి మొదట్లో కదా డాక్టరిచ్చిన డేటు, అలాగే వస్తాలే. ఔను మర్చేపోయాను, నువ్వు మందులవీ సరిగ్గా వేసుకుని, రెస్టదీ తీసుకుంటున్నావా? అయినా మీ వదినకన్నీ తెలుసులే! ఆవిడ చూసుకుంటుంది. నేనెప్పుడూ ఉత్తరాలు రాయలేదు అందుకని తప్పులుంటాయి. ఎవ్వరికీ చూపించకు నవ్వుతారు. ఇంక ఆపేస్తున్నాను తొందరగా జవాబురాయి" అని సంతకం చేశాడు.
    ఒకటికి పదిసార్లు చదువుకుంది జయ. ఫర్వాలేదు ఈయనకి కూడా కొన్ని తెలుస్తున్నాయి అనుకుంది.
    క్రిందినుంచి "అత్తా" అన్న మధుగాడి పిలుపు వినిపించి "అయ్యయ్యో! వాడడిగింది చేసివ్వనేలేదు" అనుకుంటూ కిందికొచ్చింది. అప్పటికే వాడు ఫ్రెండ్స్ తో ఆటలకెళ్ళిపోయాడు.
    "పిచ్చి వెధవ! నే వచ్చేవరకు ఆగలేదు" అంది బాధగా.
    "టామరెండ్ స్టిక్స్ నేను చేసిచ్చాలే" అంది హేమ్ లెట్.


                           *    *    *    *


    "ఆడపిల్లకదా! సంక్రాంతి పండక్కి రమ్య చేత బొమ్మలు పెట్టించు. బోలెడున్నాయిగా" అంది తులశమ్మ మంచం మీద కూర్చుని.
    "చిట్టెమ్మతో చెప్పత్తయ్యా" అని బైటికెళ్ళిపోయింది సింధు.
    "ఏమిటీ పిల్ల! పిల్లకి ఒళ్ళు కాలిపోతుంటే చిట్టెమ్మతో చెప్పమంటుంది. అబ్బాయి ఎవర్నో ఇంటికి పిలిచాడుట... అంటే చిట్టెమ్మతో చెప్పమంటుంది. మీ ఆడబడుచు వాళ్ళొస్తారుట... అంటే చిట్టెమ్మతో చెప్పమంటుంది" అనుకుంది.
    తులశమ్మగారింకా ఇంట్లో అటూ ఇటూ తిరగట్లేదు కానీ చేతికర్ర తీసుకుని బాత్ రూమ్ కి వెళ్ళొస్తుంది. అరుణ్ తల్లి ఓ రోజొచ్చింది. బాగానే మాట్లాడింది. సాయంత్రం సింధు రాగానే చెప్పి వెళ్ళిపోతానంది. "వద్దు బామ్మా! మా ఇంట్లో ఉండు. ఈ అమ్మమ్మకి తోడుగా" అని పిల్లలు ఏడ్చారు.

 Previous Page Next Page