Previous Page Next Page 
తృప్తి పేజి 36


    యమున నవ్వు చూసి ఎన్నిరోజులయింది? ఒక్కరోజుకే గిలగిలలాడే నేను ఇన్ని రోజులెలా వున్నానసలు? నెమ్మదిగా ఆమెకి దూరమైపోతున్నానా? అనుకుంటే ఆ ఊహకే ఒళ్ళు గగుర్పొడిచింది. యమునతో జీవితం గురించి ఎన్ని కలలుగన్నాడు తను! ఎప్పుడూ ఆర్ధిక ఇబ్బందులంటూ గిరి గీసుకునుండే యమునకి పెళ్ళయ్యాక ప్రపంచంలో వుండే ఆనందాలన్నీ చవిచూపించాలనుకునేవాడు. పెళ్ళికాకుండానే, తను పైసా ఖర్చుపెట్టినా యమున గిలగిలలాడిపోయేది. యమున పుట్టినరోజుకోసారి చీరకొంటానంటే పెద్దగా గొడవ చేసేసింది. ఇలాంటివన్నీ నాకిష్టంలేదు. నా మనసు గాయపర్చదలుచుకుంటే చెయ్యి అంది. తను మరి ఇక ఒత్తిడి చెయ్యలేదు. యమునకీ, శిరీషకి పోలికే లేదు. శిరీష గలగలా పారే సెలయేరైతే, యమున నిండుగా, నిశ్శబ్దంగా ప్రవహించే నది. తన కళ్ళకి మాత్రం యమున సౌందర్యదేవత. మూతి బిగపట్టిన కళ్ళతో నవ్వడం, అలకలో ఉన్నప్పు  జడ విసురుగా వెనక్కి వెయ్యడం, నీళ్ళు నిండిన కళ్ళతో బేలగా చూడడం ఇవన్నీ ఏ కావ్యనాయికకీ అందని కళలు. శిరీష చిత్రపటం లాంటిది. ఇంటి అలంకరణకి ఉపయోగపడుతుంది. యమున బాపుబొమ్మలా హృదయంలో ఊయలలూగుతూ అమృతం జాలువారుస్తుంది. పాలరాతి బొమ్మని తాకితే మాసిపోతుందేమోనని భయంగా ఉంటుంది. కానీ నల్లరాతితో చేసిన శృంగార దేవతలని తడిమి తడిమి చూడాలనిపిస్తుంది. గడ్డిపోపూసే రంగురంగుల పువ్వుల్ని ఎంతమంది గమనిస్తారు? కొన్ని అందాల్ని చూసి ఆనందిస్తాం కానీ స్వంతం చేసుకోవాలనిపించవు. కాఫీ తాగినట్టు గంటగంటకీ పాలు తాగడం అలవాటయినవాళ్ళు ఎక్కడా కనిపించరు. ఎంతో ఇష్టపడేవాడు కూడా రోజుకి రెండుసార్లే తాగుతాడు... కాలక్షేపం కోసం బఠానీలు, పల్లీలూ నములుతారు కానీ డబ్బుంది కదా అని జీడిపప్పు ఎక్కువగా నమిలితే వెగటు పుడుతుంది. ఎంతో ఇష్టమైనవాడు కూడా క్యాడ్ బరీస్ ని కొని చప్పరించినట్టు రోజూ పాలకోవా కొనుక్కుని తినడు. యమునంటే నీకెందుకిష్టం? అన్న ప్రశ్నకి ఒక్కమాటలో తను సమాధానం చెప్పలేడు. అన్నిటికన్నా ముఖ్యమైనది స్పర్శ. మనిషికోరకం స్పర్శ, వాసనా ఉంటాయని చాలామందికి తెలియదు. అవతలి మనిషిని తాకితే వాళ్ళు స్పందించిందీ లేనిదీ గమనించి చూస్తే మనకి తెలుస్తుంది. కొంతమందిని తాకితే చెయ్యి వెంటనే వెనక్కి లాగేసుకోబుద్ధవుతుంది. కొంతమంది స్పర్శ చాలా హాయిగా ఉంటుంది. ఈ చేయి పట్టుకుని ఇలాగే బతుకంతా గడిపేయొచ్చు అనిపించేదిగా ఉంటుంది. అలాగే వాసన కూడా! యమున భుజం మీద తలపెట్టుకుంటే అదోరకం సహజమైన సుగంధం ఆమె నుంచి వెలువడుతుంది. ఎటువంటి పెర్ ఫ్యూమ్స్ వాడని ఆమెని "ఇవాళ పసుపుతో నలుగుపెట్టుకున్నావు కదూ?" అని అడుగుతుంటే ఆమె సిగ్గుపడుతూ "అన్నీ గమనిస్తావు బాబూ, నీకు చతుష్పాదులకుండే శక్తులన్నీ వున్నాయి" అని వెక్కిరిస్తుంది. నిజంగానే తనకు యమునని స్పృశించగానే ఆమె మూడ్ అర్థమయిపోతుంది. ఆమె మనసులో బాధపడుతుంటే ఆ శరీరం చల్లగా అదోరకంగా ఉంటుంది. ఆమె ఉత్సాహంగా ఉన్నరోజు నులివెచ్చగా మంచికిరణం సోకిన మల్లెమొగ్గలా ఉంటుంది. కోపంగా ఉన్నప్పుడు ముట్టుకుంటే ఎక్కడ కాలుతుందో అనిపించే ఎండాకాలం గచ్చులా అనిపిస్తుంది. అంతగా ఆమె నాడీ, వాడీ తెలిసిన తను ఆమె లేకుండా బతకగలడా? ఇంపాజిబుల్ అనుకున్నాడు.


                                         *    *    *    *   


    సంక్రాంతి శలవులిచ్చేశారు. ప్రభ ఇంట్లోనే ఉంటుంది. కానీ ఈ మధ్య తల్లిగారింటికి చీటికీ మాటికీ రావట్లేదు. ఆమె అత్తగారు హేమలత ఏలూర్లో గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తుంది. ఇంకో నెలలో రిటైర్ మెంటు కూడా ఉంది. వీళ్ళ పెళ్లయిన దగ్గర్నుంచి, సెలవులకి వీళ్ళు వెళ్ళడమే కానీ ఆమెగారొచ్చి నాలుగురోజులు కొడుకు దగ్గరున్నది లేదు. అందుకే ఈసారి నెలరోజులుంటానని వచ్చింది.
    ఆవిడ ఇంగ్లీషు టీచర్. అందుకే ఏమాత్రం అవకాశమొచ్చినా, ఆనందమొచ్చినా ఇంగ్లీషులో మాట్లాడ్తుంటుంది. ఆవిడ ఇంగ్లీషు వినీ వినీ సుధాకర్ ఆవిడకి హేమ్ లెట్ అని పేరు పెట్టాడు. బావి దగ్గర పీటేసుకుని కూర్చుని జయ బట్టలుతుకుతుండగా హేమలతమ్మ వచ్చింది. "అదేమిటి జయా! నౌ యు ఆర్ ప్రెగ్నెంట్. అలా గొంతు క్కూర్చుని పనిచెయ్యకూడదు. వేరీజ్ యువర్ సర్వెంట్ మైడ్?" అనడిగింది.
    "రాలేదత్తయ్యగారు. అమ్మ ఒక్కతే చేసుకుంటుంటే సహాయం చేస్తున్నాను" అంది జయ.
    "యూనిటీ ఈజ్ స్ట్రెంత్. నేనొప్పుకుంటాను. కానీ ఈ పరిస్థితిలో కాదు. నాట్ ఇన్ దిస్ సర్ కమ్ స్టెన్సెస్" అందావిడ.
    "వదినగారా! రండి కూర్చోండి" అని పిలిచి పీట వేసింది వర్ధనమ్మ.
    "జయా ఈజ్ వెరీ స్వీట్" అందావిడ.
    "ఏమిటీ స్వీటా! కాజాలున్నాయి తింటారా?" అడిగింది అమాయకంగా ఆవిడ.
    "అది కాదండీ, జయ చాలా మంచి తీపిపిల్ల అంటున్నాను" అంది అనువదిస్తూ.
    "దానికేం జబ్బదీ లేదు. తొమ్మిదోనెల వస్తుంది కదా! అందుకే కాస్త ఉబ్బుగా కనిపిస్తోంది" అంది గాభరాగా.
    "మైగాడ్! మీ అమ్మాయి చాలా మంచి పిల్ల! ఇంగ్లీషులో అలా తియ్యని పిల్ల అంటారు" అని విడమర్చి చెప్పింది.
    "మనుషుల్లో తీపీ, కారం వుంటాయా?" అని నవ్వింది వర్ధనమ్మ.
    "అక్కేం చేస్తోంది?" అడిగింది జయ.
    "క్లీనింగ్ డిషెస్" అందావిడ.
    "అంటే?" కుతూహలంగా అడిగింది వర్ధనమ్మ.
    "అంట్లు తోముతోందిట" అంది జయ.
    "దానికి కూడా అంత చక్కని పేరు పెట్టాడా తెల్లవాడు? మనమూ అలాగే అనుకుందామే ఇప్పట్నించీ" అని సరదా పడింది వర్ధనమ్మ.
    "ఫెస్టివల్ స్పెషల్సేమిటి? పండక్కి ఏం చేస్తున్నారు?" అనడిగిందావిడ.
    "స్టాంపింగ్ బాల్స్" అంది ఠక్కున జయ.
    "అవేమిటి? నెవర్ హెర్డ్" అని ఆశ్చర్యపోయిందావిడ.
    "తొక్కుడు లడ్లు" అని కిసుక్కున నవ్వింది జయ.
    "యూ ఆర్ నాటీ" అని ఆవిడ కూడా నవ్వింది.
    "మీరేం చేద్దామనుకుంటున్నారూ?" అడిగింది వర్ధనమ్మ.
    "ఏం చేస్తాను కౌడంగ్" అంది విసుగ్గా.

 Previous Page Next Page