"డెబ్భైఏళ్ళు పైనబడుతున్నావిడచేత ఇంటెడు చాకిరీ చేయించడమే కాక, ఆవిడ కాస్త మూలిగితే చాలు నానామాటలు అంటుంది. ఆ కొడుక్కైనా ఉండాలి బుద్ధి" అని గొణుక్కుంటూ లోపలికొచ్చి కావేరి, జయా వాళ్ళతో చెప్పింది.
"అయ్యయ్యో! డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాల్సింది. అసలే పెద్దవయసు. విరిగితే అతకవుకూడానూ" అంది బాధగా కావేరి. జయకు ఆవిడ దుస్థితి తలుచుకుంటే కళ్ళనీళ్ళపర్యంతమయింది. నర్మద కాసేపటికి చక్కగా తయారయ్యి ఆఫీసుకెళ్ళిపోయింది. వెంటనే వర్ధనమ్మా, జయా అవతలి వాటాలోకెళ్ళారు. నొప్పెక్కువ ఉన్నట్టుంది. ఆవిడ ఒకటే ఏడుపు. నిజంగానే మోకాలు చాలా వాపొచ్చేసింది. "ఇలాంటి స్థితిలో కూడా వదిలి వెళ్ళిపోయారు. ఏం మనుషులమ్మా" అని ఆశ్చర్యపోయింది వర్ధనమ్మ.
"మంచంలోనే ఉండిపోవాల్సి వస్తుందేమోనమ్మా. మా కోడలు అదేదో ముసలివాళ్ళ ఆశ్రమంలో చేర్పించెయ్యండి మీ అమ్మని అని చెప్తోంది వాడితో" అంటూ బావురుమందావిడ.
"ఛా అలా జరగదు ఊరుకోండి" అంటూ ఓదార్చి, జ్వరం కూడా రావడంతో "జయా! కాస్త బ్రెడ్డూ, పాలూ తీసుకురా" అని చెప్పింది. జయ ఇంట్లో వున్న నవాల్జిన్ టాబ్లెట్ కూడా తెచ్చి వేసి, పాలలో ముంచి ఒక్క బ్రెడ్డు ముక్క తినిపించింది బలవంతాన.
ఆవిడ మూలుగూ, ఏడుపూ అంతకంతకూ ఎక్కువయ్యాయి. ధైర్యం చెపుతూ తల్లీకూతుళ్ళు మార్చిమార్చి ఆవిడ దగ్గరే కూర్చున్నారు. నర్మదొచ్చే వేళకి ఇంటికొచ్చేశారు. వస్తూనే మంచంలో ఏడుస్తున్న ముసలావిడ్ని చూసి చిందులేసింది. "ఏమిటా ఏడుపూ, ఆర్భాటం? ఊరందరికీ తెలియాలా? నోరు మూసుకుని పడుకోలేరా?" అంటూ నానా ఎగురుడూ ఎగిరేసింది.
ఆ తర్వాత శంకర్ వచ్చాడు. "అమ్మా! ఎలా వుంది?" అనడగగానే ఆవిడ...
"ఇంక నేను బతకనురా, ఈ బాధ భరించలేను" అంటూ ఘోల్లుమంది.
"చాల్చాలు, అయిన రచ్చ ఇంక చాలు. ఇంట్లో ఉండాలి అనుకుంటే నోర్మూసుకుని పడుండాలి" అని కళ్ళెర్రచేసి అరిచింది. దాంతో శంకర్ ఇంక నోరెత్తలేదు.
"నేను వంట చెయ్యలేను. పదండి బయటే తినొద్దాము" అని పిల్లల్ని తీసుకుని తయారయింది. తల్లినాస్థితిలో వదిలి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు శంకర్. నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అని మాటిమాటికీ గుర్తుచేస్తుంది నర్మద. అందుకే ఎదిరించలేడు. ఒకవేళ ఎదిరించినా వదిలి వెళ్ళిపోవడానికి కూడా వెనుకాడదు. ముగ్గురు పిల్లలతో తనూ, పరువూ కూడా బజార్నపడ్తారనవసరంగా అని సర్దుకుపోతాడు. అతని అశక్తత తెలిసి ఆమె మరీ సాధిస్తుంది.
తులశమ్మగారికి ప్రాణాలు పోతున్నట్టుగా వున్నాయి. "శ్రీరామచంద్రా, ఆపద్బాంధవా, నిన్నే నమ్ముకున్నాను. నా మొరాలకించవేం తండ్రీ" అంటూ వెక్కివెక్కి ఏడుస్తోంది. 'ఇంత విశాల ప్రపంచంలో నన్ననాధని చేశావేం నాయనా' అని కళ్ళు మూసుకుని ఏడుస్తుండగా "అత్తయ్యా" అన్న పిలుపూ, నుదుటిమీద చల్లని స్పర్శా తగిలింది. కళ్ళు తెరిచింది. ఎదురుగుండా సింధు జగన్మాతలా కనిపించింది.
కళ్ళనిండా నీళ్ళతో "ఏమిటత్తయ్యా ఈ ఘోరం? నిన్నిలా వదిలేసి, ఛీ బావకూడా" అంది ఛీత్కారంగా.
"సింధూ!" అంటూ చెయ్యిపట్టుకుని పసిపిల్లలా ఏడ్చేసింది తులశమ్మ.
"కావేరి ప్రొద్దుట బస్ లో కలవలేదు. లేకపోతే వచ్చేదాన్ని. ఇంకిప్పుడాలశ్యం చెయ్యడం దేనికీ? కావేరీ! మీవారొస్తే ఒక ఆటో తెప్పించండి. అత్తయ్యని డాక్టరు దగ్గరికి, తర్వాత ఇంటికి తీసుకెళ్ళాలి" అని ఆవేశంగా చెప్పింది సింధు.
"బావని రానీ" ఏడుస్తూనే చెప్పింది తులశమ్మ.
"ఏం చెప్పాలి సింగినాదం! ప్రొద్దుటనగా పడి ఆ మోకాలిచిప్పంత లావున వాచి ఏడుస్తుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు సరికదా పెళ్ళాన్ని తీసుకుని హోటళ్ళకి, షికార్లకి తిరుగుతాడా! అంత భారంగా ఉంటే చెప్పెయ్యమను తీసుకెళ్ళి నా దగ్గరే పెట్టుకుంటాను. దిక్కూమొక్కూ లేదనుకుని విర్రవీగుతున్నారు" అని ముక్కుపుటాలదుర్తుండగా కోపంగా అంటుండగా పిల్లలు, తర్వాత నర్మదా, శంకర్ లోపలికొచ్చేశారు.
"సింధూ! నువ్వా! ఎప్పుడొచ్చావు?" అని పలకరిస్తున్న శంకర్ మీద గయ్యిమని లేచింది.
"లేవలేని మనిషిని, అందులోనూ తల్లినీవిధంగా మంచంలో ప్రొద్దుటనగా వదిలేసి నీ దారి నువ్వు చూసుకుంటావా? ఇంత ఘోరమా! మనింట్లో కుక్కపిల్లకో, మనిషికో లేక పక్కింటివాళ్ళకో ఏదైనా అయితేనే పదిసార్లనుకుని బాధపడటం మానవ సహజం. అలాంటిది కన్నతల్లిని, నీకోసం నానాకష్టాలు పడి, మావయ్య పోయినప్పటి నుండి నీమీదే ప్రాణాలు పెట్టుకుని, తన కడుపుకట్టుకుని, చదివించి పెంచిన తల్లిని ఎంతబాగా చూస్తున్నావో చూస్తుంటే, మొత్తం ప్రపంచంలో ఎవరూ పిల్లలు లేనివాళ్ళు అందులోనూ మగపిల్లలు లేనివాళ్ళు బాధపడక్కర్లేదనిపిస్తోంది."
"ఏమిటండీ మీరు? ఇందాకట్నుండి చూస్తున్నాను మా మీద దాష్టీకం చేస్తున్నారు. ఇంతకాలం ఈ మేనత్తొకతుందనే మాటే తెలియని మీరు ఇప్పుడింత ప్రాణం పెట్టి మాట్లాడ్తున్నారు. అయినా... మా ఇంటి విషయంలో కలుగజేసుకోవడానికి మీరెవరు?" అంటూ నర్మద శంకర్ ని వెనక్కి తోసి ముందుకు వచ్చింది.
"బావా! నేను నీతో మాట్లాడుతున్నాను. నువ్వు సమాధానం చెప్పు. సభ్యతా, సంస్కారం మాట అటుంచి కనీసం మానత్వపు విలువలు తెలియనివాళ్ళతో నేను మాట్లాడను" అని నర్మదవైపు చూడకుండానే అడిగింది.
"ఆయనేం మాట్లాడతారు? ఈ ఇంట్లో నేనెంత చెప్తే అంత. మర్యాదిచ్చి పుచ్చుకో. నువ్వెంత గొప్ప చదువులు చదివినా, ఉద్యోగస్తురాలివైనా నాకేం గొప్పలేదు. నీ లెక్చర్లన్నీ కాలేజీలో చెప్పుకో. నా ఇంట్లో నోరిప్పి నాకెదురు మాట్లాడితే ఊరుకునేది లేదు. బయటికి నడు" అని వేలు చూపించింది నర్మద.
"వెళ్ళక ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. అత్తయ్యవి ఓ రెండు రవికలు, చీరలు సంచిలో పెట్టియ్యి బావా" అంది సింధు.
"చాలా గొప్పదానివి కదా! అవి మాత్రం తీసుకెళ్ళడం ఎందుకు? కొనిపెట్టలేవూ?" మూతి తిప్పుతూ అంది.