"సినిమాకెళ్దాం" అన్నాడు. తను అత్తగారిని అడగమంది. తల్లితో చెప్పగానే "ఎలా కుదురుతుంది? అర్థరాత్రి వచ్చి చేస్తుందా వంట" అని ఎగిరిపడింది.
"నువ్వు చెయ్యొచ్చుగా" అని అడగాలని అతనికి అనిపించింది కానీ అడగలేక పోయాడు. గదిలోకొచ్చి "అసలు నన్నెందుకు పెళ్ళిచేసుకున్నావు? మీవాళ్ళు జాతకాలు చూపించారా?" అనడిగాడు.
ఇంతకాలమయ్యాక ఈ ప్రశ్న వేస్తున్నాడేమిటని తను తెల్లబోయింది. తర్వాత సంగతి తెలుసుకుని తను నవ్వుకుంది. అతని గురించి ఆలోచిస్తున్నకొద్దీ బెంగెక్కువయింది.
"జయా! జయా!" అంటూ కిందినుండి కావేరి పిలిచింది. నెమ్మదిగా లేచి కిందికొచ్చింది.
"ఒక్కదానివే ఏం చేస్తున్నావు? అలా వున్నావేమిటీ ఒంట్లో బాగోలేదా?" అడిగింది ఆదుర్దాగా.
"ఏం లేదు వదినా!" అంటూ లోపలికెళ్ళింది జయ.
"నాకు తెలుసులే" అంది వెనకాలే వచ్చిన కావేరి.
"ఏంటదీ?"
"ఇది" అంటూ వెనుకనుంచి చేతులు ముందుపెట్టి చూపించింది కావేరి. అవి కవర్లు.
తన మనసులోమాట వదినకప్పుడే ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ "వదినా" అంది సంభ్రమంగా.
"ఇవి నువ్వు వచ్చినప్పుడే తెప్పించి పెట్టాను. నీకెప్పుడు అవసరమైతే అప్పుడు ఇద్దామని. కానీ నీకా ధ్యాసే కలగలేదు. ఇప్పుడు నీ ముఖం చూస్తే పతిమీదకి ధ్యాస మళ్ళిందని తెలుస్తోంది. తీసుకో. చక్కగా నీ ప్రేమంతా ఒలకబోసెయ్యి" అంది చిలిపిగా.
జయ సిగ్గుపడ్తూ తీసుకుని "రాత్రికి రాస్తాను" అంది.
"అవును, కొన్ని పన్లు రాత్రికే కేటాయించాలి" అంది వుడికిస్తూ కావేరి.
"అబ్బా! ఏమైంది నీకీవేళ!" అంటూ నునుసిగ్గులు గులాబీ మొగ్గలై పూస్తుండగా అక్కడినుండి వెళ్ళిపోయింది జయ.
రాత్రి భోజనాలయ్యాక ఉత్తరం రాయడానికి ఉపక్రమించింది జయ.
"ప్రియమైన శ్రీవారికి!" అని మొదలుపెట్టింది. తర్వాతేం రాయాలో తెలియలేదు. "నేను క్షేమం. మీరు క్షేమంగా ఉన్నారా?' అని రాసింది. ఇంకేం విశేషాలు లేనట్టుగా అనిపించింది. ఎలా రాయాలో వదిన్నడుగుదామనుకుని మళ్ళీ ఆటపట్టిస్తుందని ఊరుకుంది. త్వరగా ఇల్లు చేరుతుండమనీ, అన్నం అదీ వేళకి తినమనీ, డబ్బులు అనవసరంగా ఖర్చుచెయ్యొద్దనీ, ఏమేమో రాసింది. 'కడుపులో బాబు వూరికే తంతున్నాడని, త్వరగా పురుడొచ్చేస్తుందని అందరూ అంటున్నారు. మీరప్పుడిక్కడే ఉంటే బావుంటుంది. తండ్రి కాబోతున్నందుకు మీకు సంతోషంగా లేదూ!' అని రాసింది. ఆ తరువాత అన్నయ్య పిల్లల గురించీ, వదిన ఓర్పు గురించీ ఇలా నాలుగు పేజీలు రాసింది. మొదట్లో అసలు సంగతులే లేవనిపించాయి. ఇప్పుడిన్ని సంగతులు పుట్టుకొచ్చేశాయేంటబ్బా! అని ఆశ్చర్యపోయింది. చివరకు "ముద్దులతో మీ జయప్రద' అని రాసి బోలెడు సిగ్గుపడిపోయింది.
మర్నాడు ఉత్తరం వదినకిచ్చి పోస్ట్ చేయమని చెప్పిన దగ్గరనుంచి ఉత్తరం చదువుకుని ఏమనుకుంటాడో, అసలు అతనికన్నా ముందరే ఎవరైనా విప్పుతారేమోనని పలురకాల అనుమానాలతో గడిపింది. సాయంత్రం కావేరి వస్తూ వూలు వుండలు తెచ్చిచ్చి "ఖాళీగా కూర్చుంటే అస్సలు తోచదు. నీకు అల్లడం వచ్చుగా! చక్కని స్వెట్టరల్లు" అంది.
జయకి హుషారొచ్చేసింది. వెంటనే అల్లడం ప్రారంభించింది. వర్ధనమ్మకి అసలు తీరికలేదు. ఏదో ఒకటి చేస్తూనే వుంది. జయకిష్టమని ఓరోజు పల్లీపాకం, ఓరోజు కొబ్బరిలౌజు, ఓరోజు కొయ్యరొట్టె తీసి తినేదాకా వదలదు. మధ్య మధ్యలో ప్రభ దుమారంలా వచ్చి "దానికైతే అన్నీ చేసిపెడ్తావు" అంటుంది. "నీకూ చేశాను కదే!" అంటే "ఎప్పుడో చేశావులే, ఇప్పుడు మాత్రం నాకోసమేం చెయ్యవు" అని సణుగుతూనే చేసినవన్నీ తీసుకెళ్తూ ఉంటుంది. ఓరోజు కాత్యాయినొచ్చింది. "నువ్వొచ్చినప్పటి నుండి రావాలనుకుంటూనే ఉన్నాను. కానీ నా వశం కాలేదు. ఇంక చూడాలనిపించి పడ్తూలేస్తూ వచ్చాను" అంటూ జయ ఆరోగ్యం గురించీ, అత్తగారి గురించీ అడిగి తెలుసుకుంది. నిండుగా తిరుగుతున్న జయని చూస్తుంటే యమున వయసుదే కదా! దానికెప్పుడు పెళ్ళిచేస్తామో" అని ఆ తల్లి మనసు పరితపించింది.
"వచ్చారు కదా! ఇవాళ్టికుండి వెళ్ళండి" అని వర్ధనమ్మ బతిమాలింది.
"యమునకి వంట్లో కులాసాగా లేదు. ఆఫీసు నుండి రావడంతోటే పడుకుని పోతోంది. రోజూ తలనెప్పంటుంది. డాక్టరుకి చూపించుకొమ్మంటే వినదు. మొండిది" అని బాధపడింది.
"యముననోసారి రమ్మనండి అత్తయ్యగారు!" అంది జయ.
"నువ్వే వచ్చి ఓరోజుండి వెళ్ళమ్మా. దానికి తగని మొహమాటం. ఓరోజు తీసుకురావే" అని కావేరికి చెప్పింది. కావేరి సరేనంది. తనకి చెల్లెలి ఆరోగ్యం గురించి విన్నాక చూడాలనిపించింది. ఎంతో చలాకీగా ఉండే యమున అలా ఉంటోందంటే బహుశా! నిజంగానే ఏదైనా సుస్తీ ఏమో! బలవంతంగానైనా సరే డాక్టరుకి చూపించాలి అనుకుంది. కనుచీకటి పడ్తుండగా శరత్ వచ్చి కాత్యాయినిని తీసుకెళ్ళిపోయాడు.
* * * *
మర్నాడు ఉదయం పక్కింట్లోంచి పెద్దపెద్ద అరుపులూ, గొడవ వినిపించింది. ఏమైందబ్బా అని జయ గోడ దగ్గరకెళ్ళి చూసింది.
"అందరికీ మా ఇంటి సంగతులే కావాలి. చుప్పనాతిమూక, మరీ అలగావాళ్ళ మధ్య వుండాల్సివచ్చింది. కాస్త చప్పుడైతే చాలు వచ్చేస్తారు గోడ దగ్గరికి" అంటూ నర్మద రయ్యిమని వచ్చి వాళ్ళ కిటికీ తలుపులేసింది.
జయ లోపలికొచ్చేస్తుంటే తులశమ్మగారి మూలుగూ, ఏడుపూ వినిపించింది. లోపలికొచ్చి తల్లితో చెప్పింది. ఆవిడ చేస్తున్న పనాపి బయటికొచ్చి చూసింది. గోపీగాడు గోటీకాయలాడుతున్నాడు ఎవరో పిల్లలతో. "ఒరేయ్! బామ్మగారికి ఒంట్లో బావుందా?" అని గొంతు తగ్గించి అడిగింది.
"బామ్మ నూతి దగ్గర జారిపడింది. మోకాలింత లావున వాచిపోయింది. నీకెవరు చేస్తారని పడ్డావంటూ అమ్మ తిడ్తోంటే ఏడుస్తోంది. నాన్న కొబ్బరినూనె రాసి, ఆఫీసుకెళ్ళిపోయారు" అని గడగడా చెప్పేశాడు.