"ఓహో! బహుశా అవి కూడా మీరు కొనుండరు. బావా! నీ దౌర్భాగం చూస్తుంటే నాకు జాలేస్తుంది" అంది వెటకారంగా.
"ఇందాకట్నుంచి చూస్తున్నాను. నేను మాట్లాడ్తుంటే అటు తిరిగి ఆయనతో మాట్లాడ్తున్నావు, ఏమనుకుంటున్నావసలు" అంటూ సింధు భుజంపట్టి తిప్పుతూ గద్దించింది నర్మద.
విసురుగా ఆ చెయ్యి తోసేస్తూ_
"నీ భర్తతో మాట్లాడుతుంటే మర్యాద లేకుండా అడ్డుపడుతున్న నీకు అహం తప్ప అభిమానం లేదని మరోసారి చాటుతున్నావు" అంది సింధు.
"ఎంత పొగరే నీకు!..." అని నర్మద గొంతు చించుకుని అరుస్తుంటే_
"నోర్మూసుకో" అని శంకర్ ఆమెని పట్టి వెనక్కి లాగి "ఇంకొక్కమాట మాట్లాడినా, నన్ను పశువుని చేసినదానివవుతావు. నలుగురిలో దెబ్బలు తిని నవ్వులపాలవుతావు. సింధు మాట్లాడినదంతా నిజం. నీ నోటికి జడిసి కన్నతల్లిని నానా అగచాట్ల పాలూ చేశాను. మంచంలో ఏడుస్తున్న నా తల్లిని తలుచుకుంటూ నేను కుమిలిపోతుంటే నీకు తిండెలా సహించిందో నాకు అర్థం కావట్లేదు. ఛీ ఛీ నా ప్రవర్తన తలుచుకుంటే నామీద నాకే అసహ్యం వేస్తోంది. నేవెళ్ళి ఆటో తీసుకొస్తాను" అని విసురుగా వెళ్ళబోతుండగా ఆటో చప్పుడయింది. సుధాకర్ ఆటో తీసుకొచ్చి గుమ్మంలో నిలబెట్టాడు. సింధు, కావేరి, శంకర్ సాయంపట్టి తులశమ్మగారిని తీసుకెళ్తుంటే నర్మద నోరు తెరుచుకుని శిలా ప్రతిమలా చూస్తుండిపోయింది.
సింధు వాళ్ళింటి దగ్గరుండే నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్ళింది. అక్కడ నుండి అరుణ్ కి ఫోన్ చేసింది. డాక్టర్ చూసి ఎక్స్ రే తీయించాడు. పెయిన్ కిల్లింగ్ టాబ్లెట్ ఇచ్చి, నిద్రకి ఇంజెక్షన్ కూడా చేశాడు. "ప్రొద్దుటనగా పడితే ఇప్పుడు తీసుకొచ్చారా!" ఆశ్చర్యంగా అడిగాడు సింధుని.
"అందరం ఆఫీసులకెళ్ళిపోయాక జరిగింది" శంకర్ ని క్రీగంట చూస్తూ చెప్పింది.
"వెంటనే తీసుకురావాల్సింది. విరిగి ఉండదు. కొద్దిగా డిస్ లొకేటయినట్టుగా అనిపిస్తోంది. ప్రొద్దుటినుండి చాలా బాధపడి ఉంటారు" అన్నాడు.
శంకర్ కళ్ళనీళ్ళతో తల వంచుకున్నాడు. "బావా! ఈ రాత్రికి నేనిక్కడే ఉంటాను. ఇంకేం భయం లేదు. అత్తయ్యకి నిద్రపట్టేసింది. నువ్వింటికెళ్ళు. అక్కడ నర్మదేం అఘాయిత్యం చేస్తోందో? నేను ఆవేశంలో నోరుజారాను క్షమించు" అంది.
"క్షమించాల్సింది నువ్వు. ఆ రాక్షసి నిన్ను చాలా మాటలంది. ఏం చెయ్యను! చాతకానివాడ్ని" అంటూ తలవంచుకున్నాడు తప్పుచేసినట్లు.
సుధాకర్ శంకర్ భుజంమీద చెయ్యేసి "ప్రొద్దుటే వద్దాం పదండి" అన్నాడు.
శంకర్ అరుణ్ కీ, సింధూకీ కృతజ్ఞతలు తెలియజేసి తల్లినోసారి పిలిచి బదులు రాకపోయేసరికి "నిద్రపోతోంది పాపం! ఎన్నాళ్ళయిందో ఆవిడింత ప్రశాంతంగా పడుకుని" అనుకుంటూ సుధాకర్ తో కలసి బయటికి నడిచాడు.
చిట్టెమ్మ ఇంటినుండి సింధుకి బట్టలు, భోజనం మొదలైనవి తెచ్చింది. స్పెషల్ రూంలో అన్ని సౌకర్యాలూ వుండబట్టి హాయిగా వుంది. సింధు స్నానం చేసి భోజనం చేసింది.
తులశమ్మగారు కళ్ళు తెరిచి చూసింది. అంతా కొత్తగా ఉంది. తెల్లని పక్కా, మెత్తని పరుపు, చల్లని గాలి, హాయిగా ఉంది. ముఖ్యంగా కోడలి చివాట్లు, పిల్లల రణగొణధ్వనీ లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇది స్వర్గం కాదు కదా! నేను అప్పుడే చచ్చిపోయానా? అనుకుందో నిముషం.
"అత్తయ్యా లేచావా? జ్వరం తగ్గింది. డాక్టర్ లైట్ గా చారన్నం పెట్టమన్నారు. నోరు తెరు" అంటోంది సింధు గిన్నె, చెంచా పట్టుకుని.
ఆవిడకప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ గుర్తుకు రాసాగాయి. కోడల్నెదిరించి 'దిక్కులేనిది కాదావిడ' అన్నట్టుగా సింధు తీసుకురావడం, కొడుకు బాధపడ్తూ పశ్చాత్తాపంతో అన్నమాటలూ, అన్నీ గుర్తుకురాగానే "ఇది కలకాదు" అనుకుంది.
సింధు స్పూన్ తో పలచగా కలిపిన చారన్నం పెడ్తుంటే "అనాథాశ్రమాలుంటాయటగా ముసలాళ్ళకి, అందులో పారెయ్యండీవిడ్ని. ఈవిడ మంచంలో పడితే నేచెయ్యలేను బాబు" అన్న నర్మద మాటలు గుర్తొచ్చి దుఃఖమొచ్చింది.
గిన్నె పక్కన పెట్టి "వూరుకో అత్తయ్యా! నేనున్నాను నీకు. నువ్వు ఒంటరివి కాదు. మనది రక్తసంబంధం. నిన్ను నా దగ్గర పెట్టుకునే హక్కు నాకుంది. నిన్నా నరకంలోకి మళ్ళీ ఎన్నటికీ పంపను. బావ కావలిస్తే చూసెళ్తాడు" అంటూ ఆవిడ చెక్కిళ్ళు రాస్తూ ధైర్యం చెప్పింది. దాంతో కాస్త వూరట చెంది మిగిలిన అన్నం కాస్త తిని, మందు వేసుకుని తిరిగి నిద్రలోకి జారిపోయిందావిడ. ఆవిడ్నలా చూస్తుంటే సింధుకెంతో తృప్తిగా, ఆనందంగా అనిపించింది.
* * * *
ప్రతిరోజూ పోస్ట్ మాన్ కోసం ఎదురుచూడడం జయ దైనందిన జీవితంలో ఒక పనిగా మారిపోయింది. రేపు శలవు పెడ్తున్నాను. నిన్ను చెకప్ కి తీసుకెళ్ళి అట్నించి మా అమ్మావాళ్ళింటికి తీసుకెళ్తాను. వచ్చేటప్పుడు అమ్మమ్మగారిని చూసొద్దాము" అని చెప్పింది కావేరి.
అప్పటికి తులశమ్మగారు వెళ్ళి వారంరోజులు అయింది. ఆసుపత్రి నుండి రెండురోజుల్లో ఇంటికి పంపించేశారు. సింధు వాళ్ళింటికి తీసుకెళ్ళిపోయింది. వర్ధనమ్మ ఈ సంగతి విని చాలా సంతోషించింది "అంతా ఆవిడ చేసే రామనామం మహిమ" అంది.
వల్లీ, సీతా వాళ్ళ బామ్మకోసం బెంగపెట్టుకున్నారని మధ్యలో తీసుకెళ్ళి చూపించి తెచ్చాడు శంకర్. నర్మద పరిస్థితి చెప్పక్కర్లేదు. ఇంట్లో రోజూ కురుక్షేత్రమే. శంకర్ ని సాధించడం, పిల్లల్ని కొట్టడం ఎక్కువైపోయింది. అలవాటు లేక ఏ పనీ చెయ్యలేకపోతుంది. "అమ్మ అన్నం వండితే బియ్యం లాగానే ఉంటుంది. లేకపోతే జావలాగా అయిపోతుంది. కూరల్లో ఉప్పో, కారమో, పసుపో ఏదో ఒకటెక్కువవుతోంది. అందుకే రాత్రిపూట నాన్న వంట చేస్తున్నారు" అని చెప్పిందోసారి వల్లి.
పనిమనిషిని పెట్టుకుని రప్ఫాడించేస్తే "నేను మీ అత్త లెక్క కనిపిస్తున్నానా? నోర్మూసుకుని పడుండనీకి, చేయిపించుకుంటే చెయిపించుకో లేకుంటే లే. నేను గింతే చేస్తా" అని దబాయించి చెప్పేసింది. శంకర్ కూడా ఇదివరకట్లా కాకుండా మాటకి మాట చెప్తున్నాడు. పిల్లలు స్కూల్ నుండి రాగానే పూజా, మధులతో పాటు వాళ్ళకి కూడా ఫలహారం పెడ్తోంది వర్ధనమ్మ. శంకర్ కూడా అడపాదడపా పలకరించి మాట్లాడుతున్నాడు వీళ్ళతో.