బంగారం పండే పాతిక ఎకరాల మాగాణి, పదెకరాల మామిడితోటపై వచ్చే ఆదాయం ఉండగా అంత అప్పు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది.
నాన్నగారికి రేసులపిచ్చి వుందని అందుకే అప్పుడప్పుడూ హైదరాబాద్, మద్రాసువంటి పట్టణాలకు వెళ్తుంటారని, ఉబుసుపోక తరచుగా క్లబ్బులకు వెళ్తుటారని చూచాయగా తెలుసుతప్ప ఆ పిచ్చే ఇన్ని అప్పులకి ఇంతటి అనర్థానికి దారితీస్తుందని ఆమె ఏనాడూ ఊహించలేదు.
అపరిమితమైన ఆస్తి అంచెలంచెలుగా హరించుకుపోతుందంటే కారణం ఇదమిద్దమని ఇన్నాళ్ళూ గ్రహించలేకపోయింది.
ఊరూ వాడా వేనోళ్ళ పొగిడే తాతగారి ప్రతిష్ట ఈనాడిలా అడుగంటిపోవడానికి నాన్నగారి దుర్య్వసనాలే కారణమన్న ఆలోచన రాగానే ఆమె ఊపిరి అందనట్టుగా విలవిల్లాడిపోయింది.
బిల్డింగ్ రినపోయట్ చేయించమన్నా, తనకోసం ప్రత్యేకించి ఓ కారు కొనమన్నా నాన్నగారు ఇంతకాలం ఎందుకు తాత్సారం చేసిందీ ఆమెకు అర్థమైంది.
తాతగారి కాలంనుండీ తమనే నమ్ముకున్న కొందరు నౌకర్లని నాన్నగారు ఎందుకు తొలగించిందీ, అయిదారు నెలలుగా ఆయన ఎందుకు దిగులుగా వున్నదీ ఇప్పుడు అర్ధమైంది.
తాతగారి నిలువెత్తు చిత్రాన్ని, బీటలువారిన భవంతి గోడల్నీ చూస్తుంటే ఆమెకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది.
ఏమిటది?
ఏమైంది ఈ జమీందారీ ప్రాభవానికి......
ఎన్నో తరాలకు సరిపడ్డ రాజానరేంద్రవ్ ఆస్తిపాస్తులు ఎందుకిలా హరించుకుపోయాయి.
మిగిలిన సంపదనైనా రక్షించుకోలేక తరతరాల వంశ ప్రతిష్టల్ని నడిబజార్లో అమ్మకానికి సిద్ధపరచిన తండ్రిని చూస్తుంటే ఆమె హృదయం తీరని వేదనకు గురైంది.
కిటికీ దగ్గర నిలబడి మసక వెన్నెల్లో సమాధుల్లా కనిపిస్తున్న పల్లెలోని పూరిగుడిసెల్ని, పల్లె నానుకుని నిశ్చలంగా ప్రవహిస్తున్న శారదానదిని చూస్తూ చాలాసేపు గడిపింది.
రంగనాధంగారు కాస్త తేరుకుని తిరగటం ప్రారంభించటానికి మరో రెండురోజులు పట్టింది.
మూడవనాటి రాత్రి రంగనాధంగారే స్వయంగా శిల్ప గదికి వచ్చారు.
నిబ్బరంగా తిరిగే శిల్ప నిస్తేజంగా కనిపించేసరికి ఆయన గుండె కెలికినట్టయింది.
చదువుతున్న పుస్తకాన్ని ప్రక్కకుపెట్టి యాంత్రికంగా లేచి నిలబడ్డ కుమార్తె ప్రవర్తన ఆయన దిగులును మరింత అధికం చేసింది.
ఏదో మాట్లాడాలని వచ్చిన రంగనాధంగారు కొన్ని క్షణాలపాటు గొంతు మూగపోయినట్టుగా ఉండిపోయారు.
జమీందారీ కుటుంబాల్లో బందాలకంటే భేషజాలకు ప్రాముఖ్యత అధిక.... కాబట్టే బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న శిల్పకు ఏ లోటు లేకుండా పెంచాలని ఆలోచించారు కాని ఆమె మానసికంగా ఎదగాలంటే మరేం కావాలో ఊహించలేకపోయారు.
భార్య మరణంతో మరింతగా దుర్వ్యసనాలకు అలవాటు పడిన రంగనాధంగారు శిల్పకు సరైన ఆప్యాయతనందించటంలో అశ్రద్ధ చూపటంతో ఆమె విచిత్రమైన మొండితనానికి అలవాటు పడింది. ఒక్కోమారు పెద్దా చిన్నా విచక్షణ మరిచి ప్రవర్తిస్తూ వుంటుంది. అందుకే ఆ లోగిలిలో అందరితోపాటు రంగనాధంగారు కూడా ఆమెతో చాలా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు.
"నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చానమ్మా!"
తటపటాయిస్తూ నిలబడారాయన.
"మీరేం మాట్లాడాలని వచ్చారో, ఏ దుర్వార్త చెప్పాలని వచ్చారో నాకు బాగా తెలుసు."
ఆమె కంఠంలోని ఎగతాళికి ఆయన తల వాలిపోయింది.
"ఎందుకు నాన్నగారూ తలవంచుకుంటారు. తాతగారి కీర్తికి తలవంపులు తెచ్చినందుకా లేక కన్నకూతురి ముందు మీ అసమర్థతని అంగీకరించాల్సి వస్తున్నందుకా?"