Previous Page Next Page 
పడిలేచే కడలితరంగం పేజి 4

 

          2)

    అందుకే ఆయన జవాబు చెప్పలేకపోయారు.

    దుర్వ్యసనాలతో ఆస్తి హరించుకుపోయింది.

    ఉన్నన్నాళ్ళూ బాధ్యతల్ని విస్మరించాడు.

    ఈడొచ్చిన పిల్లకు ఏం చేయాలో ఆలోచించలేకపోయాడు.

    అంతా అయిపోయాక బాధపడటం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మాత్రమే.

    ఆమె మాటలకంటే శిల్ప ఛీత్కారం కంటే.... తను పోగొట్టుకోబోతున్న పరువుకంటే ఆయన్ని బాధిస్తున్న ఆలోచన ఒక్కటే...

    ఆ తర్వాత ఎలా.....

    ఓ వారంరోజుల వ్యవధిలో తన ఆస్తిపై సర్వహక్కుల్ని కోల్పోతున్నాడు.

    కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి అడుగు పెట్టబోతున్నాడు.

    ముక్కుపచ్చలారని శిల్ప అసూర్యంశ్య మాత్రమే కాదు..... ఆత్మాభిమానంగల ఆడపిల్ల కాబోయే పరిణామాలకు తట్టుకోగలదా?
           
                                              2

    ఉదయభానుని లేతకిరణాలు శారదానదిపై ప్రతిఫలిస్తున్నాయి.

    పల్లె దైనందిన జీవితానికి సమాయత్తమవుతున్న సూచనగా పొలాలకు వెళుతున్న కూలిజనంతో ఏటిగట్టు సందడిగా వుంది.

    రాత్రి కురిసిన మంచుబిందువులు చెట్ల ఆకులపైనుండి సుతారంగా నేలజారుతూ ఉషఃకాంత అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి.

    రకరకాల క్రోటన్లతో పూలచెట్లతో నిండిన పూదోటలో వనకన్యలా నిలబడ్డ శిల్ప శీతల పవనాల శైత్యోపచారాల్ని తట్టుకోలేనిదానిలా గంభీరంగా ముందుకి నడిచింది.

    గత వైభవపు సౌరభాలను వెదజల్లుతున్న ఆ లోగిలి, శతాబ్దాల చరిత్రకు కాణాచి అయిన ఆ విశాలమైన భవంతి, మరికొన్ని రోజులలో తమకు దూరమౌతోందని అందరికంటే ప్రత్యేకంగా బ్రతికిన తను మరికొంతకాలంలో అందరిలో ఒకతి కాబోతోందన్న తలంపు రాగానే శిల్ప అంతులేని ఉద్వేగంతో కంపించిపోయింది.

    ప్రమాదంనుండి గట్టెక్కే మార్గాలకోసం అన్వేషించకుండా ముఖం చాటేస్తూ గదిలోనే ఉంటున్న నాన్నగారంటే ఆమెలో రోజు రోజుకీ చిన్న చూపు ఎక్కువ కాసాగింది.

    "అమ్మగారూ!"

    నౌకరు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది.

    "అయ్యగారికోసం ఎవరో వచ్చారండి."

    గదిలోపల గడియ పెట్టుక్కూర్చుంటున్న ప్రతి చిన్న విషయానికీ విరుచుకుపడటం అలవాటు కావటంతో దగ్గరికి వెళ్ళటానికి ఎవరూ సాహసించలేకపోతున్నారు.

    నౌకరు అందించిన విజిటింగ్ కార్డు అందుకుని కొన్ని క్షణాలపాటు చూస్తూ నిలబడ్డ శిల్ప ఏదో నిశ్చయానికి వచ్చిన దానిలా రంగనాధంగారి గదిని సమీపించి నెమ్మదిగా తలుపు తట్టింది.

    తలుపులు తెరిచిన రంగనాధంగార్ని చూడగానే శిల్ప మనసు ఆర్థ్రమైంది.

    మాసిన గడ్డంతోను, పీక్కుపోయిన మొహంతోనూ గుర్తుపట్టలేనంతగా మారిపోయారాయన.
 
    "మీకోసం ఎవరో వచ్చారు వైజాగ్ నుంచి."

    "నేనెవర్నీ చూడదల్చుకోలేదు" అనబోయి - శిల్ప "వెళ్ళిరండి" అంటూ కార్డు అందించడంతో కాదనలేనట్టుగా బయటకు నడిచారు.
   
    ఎంబాసిడర్ ను ఆనుకుని నిలబడ్డ అగంతకుడ్ని పిలుస్తూ లాన్ లోని కుర్చీలో ఆసీనులయ్యారు.

    "నమస్కారం.... నాపేరు  భూషణ్.... పియెటు మిస్టర్ కిరీటి. మేనేజింగ్ డైరెక్టరాఫ్ మాలినీ మెషిన్ టూల్స్, డైరెక్టరాఫ్ డీన్ ఇంజనీరింగ్ వర్క్సు, ఛైర్మన్ ఆఫ్ చక్రవర్తి...."

    "వచ్చిన పని...."

    రంగనాధంగారు సాధికారంగా ప్రశ్నించేసరికి ఆర్దోక్తిలో ఆగిపోయాడు భూషణ్.

 Previous Page Next Page