Previous Page Next Page 
పడిలేచే కడలితరంగం పేజి 2

    అన్యమనస్కంగా తండ్రి గదిలోకి నడిచి అలసటగా కనిపిస్తున్న ఆయన మొహాన్ని చూస్తూ కొంతసేపు ఉండిపోయింది.

    డాక్టరు మాటలతో కొంత వూరట కలిగినా ఆమెలో అలజడి మాత్రం తగ్గలేదు.

    భయంకరమైన ఒంటరితనం....

    ఎవరూ లేని తనకు నాన్నగారు కూడా కరువైతే...

    గోడనున్న స్విచ్ గడియారంలోని పెండ్యులమ్ 'ధన్ ధన్' మంటూ పదిసార్లు మ్రోగి ఆగిపోయింది.

    గదిలోకి అడుగుపెట్టిన అన్నపూర్ణమ్మ అవనత వదనయై ప్రతిమలా కూర్చున్న శిల్పను చూసి రంగనాధం గారి అనారోగ్యం గురించి ఆరాతీసే సాహసం చేయలేకపోయింది.

    పోనీ భోజనమైనా చేయమని బలవంతం చేద్దామన్నా శిల్ప ఎక్కడ కసురుకుంటుందో నన్న జంకు....

    తను చేయాల్సిన పనుల్ని ఆమె విధుల్ని మరెవరైనా గుర్తుచేయటం శిల్ప క్షమించదు.

    అది ఆ లోగిలిలో అనుశ్రుతంగా వస్తున్న ఆనవాయితీ.

    అందుకే శిల్ప ఏమైనా అడుగుతుందేమోనన్న ఆశతో చాలాసేపు నిలబడ్డ అన్నపూర్ణమ్మ అలాంటి అవకాశం కనిపించకపోయేసరికి కిటికీలకున్న పరదాల్ని సర్ది మౌనంగా బయటకు నడిచింది.

    నాన్నగారికెందుకిలా అయింది.

    దీని పర్యవసానం ఎలా వుంటుంది.

    దేనినీ పట్టించుకోనట్టుగా వుండే నాన్నగారిలో సంఘర్షణకి కారణం ఏమిటి....

    ఎడతెగని ఆలోచనలు.... జవాబు దొరకని ప్రశ్నలు.

    దూరంగా తీతువు అరుపు మృత్యువు కేకలా వినిపించే సరికి ఉలిక్కిపడిన శిల్ప అపాదమస్తకం కంపించిపోయింది.

    ఆ సమయంలో ఆమెకు మరెవరి తోడైనా అవసరం అనిపించింది.

    అన్నపూర్ణమ్మను పిలిచి ఆమె ఒడిలో తలపెట్టి బావురుమని ఏడవాలనిపించింది.

    మృత్యువు పాదాలపైనపడి 'నాన్నగారి మెడకు ఉచ్చుబిగించి తన గుండెల్లో చిచ్చురేపొద్దని' ప్రాధేయపడాలనిపించింది.

    రివ్వున వీచిన చలిగాలికి కిటికీరెక్కలు టప టప మంటూ కొట్టుకొనేసరికి ఆమె ఆలోచనలు తెగిపోయాయి.

    ఛీ ఛీ! ఏమిటి తనింత బేలగా ఆలోచిస్తోంది.

    అసలిప్పుడు నాన్నగారికేమైందని.

    ఆమెలోని స్వాతిశయం ఓదార్పునందించింది.

    కిటికీ రెక్కల్ని మూసి నాన్నగార్ని సమీపించి బ్లాంకెట్ ను మెడవరకు కప్పింది.

    ఆమె దృష్టి అలవోకగా గోడపైనున్న నిలువెత్తు పోర్ట్రెయిట్ పైకి మళ్ళింది.

    రాజానరేంద్రన్.....
    """ "
    ఒకనాటి జమీందారు.....

    బ్రిటిష్ వారి కాలంలో మకుటంలేని మహారాజులా బ్రతికి అపరిమితమైన ఆస్తిని సంపాదించి ఎదురులేని వ్యక్తిగా ఎంతో ఘనకీర్తిని పొందగలిగిన మహామనీషి.

    స్ఫురద్రూపంతో, రాజఠీవితో వెలిగిపోతున్న తాత గారివైపు గర్వంగా చూసిన శిల్ప అంతకంటే గర్వంగా నుదుటిపై అలుముకున్న స్వేదబిందువుల్ని తుడుచుకుంది.

    తాతగారు వేటాడి చంపిన పులితోలుతో చేయబడిన పులిబొమ్మ దక్షిణద్వారానికి కాపలా కాస్తున్నట్టుగా నిలబడి గత వైభవాన్ని గుర్తుచేస్తుంటే అంతసేపూ భీరువులా ఆలోచించిన తన తప్పిదానికెంతగానో నొచ్చుకుంది.

    అద్దంలోని ఆమె ప్రతిబింబం ద్విగుణీకృతమైన అభిజాత్యాన్ని ప్రదర్శిస్తుంటే ముగ్ధమోహనంగా ముందుకు నడవబోయి హఠాత్తుగా ఆగింది.

    కార్పెట్ పై పడివున్న ఎనవలఫ్ ను అందుకుని యధాలాపంగా లోపలి కాగితాలను చూసింది.

    తమ యావదాస్తి జప్తుకై సుప్రీకోర్టు ఇచ్చిన తూర్పు గురించి తమ తరపున వాదించిన సుప్రీకోర్టు లాయర్ రామసుధీర్ రాసిన సుదీర్ఘమైన లేఖ అది.

    ఆసాంతం చదవగానే హఠాత్తుగా నాన్నగారు అనారోగ్యానికి ఎందుకు గురైనదీ నిర్దారణ చేసుకుంది.

    వణుకుతున్న చేతులతో కాగితాన్ని మడిచినిస్సత్తువగా సోఫాలో చతికిలబడిపోయింది.
 

 Previous Page Next Page