చంద్రశేఖర్ ఆ కాలేజికి కొత్తగా వచ్చాడు తెలుగు లెక్చరర్ గా-అతడు క్లాస్ రూంలో అడుగుపెట్టి అటెండెన్స్ తీస్తుండగానే విద్యార్ధులు తమ ప్రతాపం ప్రదర్శించటం మొదలు పెట్టారు. ఒక్కొక్క నంబర్ కీ "యన్" అని అయిదారు గొంతులు వినిపిస్తున్నాయి. ఎవరో పరిశీలించబోతే ఎవరూ దొరకరు. ఈ విషయంలో మాత్రం విద్యార్దులది మంచి కట్టు-చంద్రశేఖర్ సార్ చాలా గట్టివాడు-చటుక్కున స్టేజ్ మీద నుంచి దిగి విద్యార్ధుల మధ్య పచారులు చేస్తూ అటెండెన్స్ తీయటం మొదలు పెట్టాడు-అప్పుడు అల్లరిగా 'యస్' అనటానికి ఎవరికీ సాహసం కలగలేదు. అటెండెన్స్ పూర్తి చేసి పుస్తకం తెరవగానే, పిల్ల అరుపులూ, కుక్క అరుపులూ మొదలయ్యాయి - చంద్రశేఖరం సార్ ఒక్కసారి క్లాస్ కలయజూశారు. ఒక్కక్షణం నిశ్శబ్దం ఏర్పడింది-వెంటనే ఉత్తరగో గ్రహణం పాఠం చెప్పటం మొదలు పెట్టారు. విరాటుని కొడుకు ఉత్తరుడు తాను రాజకుమారుడని అహంకరించే ఉత్తరుడు-లేనిపోని ప్రగల్భాలు పలికే ఉత్తరుడు విద్యార్ధుల కళ్ళముందు నిలిచాడు_-అతనితోపాటు గడుసుగా బృహన్నత సంగతి చెప్పిన సైరంధ్రి, ముగ్ధత్వంతో తనే తన గురువైన బృహన్నలను ఒప్పించగల ననుకునే ఉత్తర-అమాయకంగా బృహన్నలగా నటిస్తోనే, తన తేజోమూర్తిని స్పురింప చేసే విజయుడు__అందరూ ఆకృతి ధరించి మనసులలో నిలిచి పోతున్నారు-విద్యార్ధులు అల్లరి మరిచిపోయారు__తాము శ్రద్ధగా పాఠం వింటున్నామని కూడా తెలియనంత శ్రద్ధగా వినేశారు-క్లాసు పూర్తయింది. "కొత్త తెలుగుసార్, చాలా బాగా పాఠం చెపుతారనే" అభిప్రాయానికి వచ్చేశారు విద్యార్ధులు-ఎన్నడూ ఏ క్లాసులోనూ శ్రద్ధగా వినని రవి కూడా విన్నాడు-"ఈ సారేదో, గట్టోడిలాగున్నాడు గురూ?" అన్నాడు తన ఫ్రెండ్ తో.
"ఫరవాలేదు-మంచి పురాణ కాలక్షేపమే!" అని ఓ సర్టిఫికేట్ పారేశాడు ఆ ఫ్రెండ్- ఒక లెక్చరర్ ని మెచ్చుకోవటం అంత ఇష్టం లేకపోయినా, చంద్రశేఖరం మంచి లెక్చరర్ అని ఎలాగో ఒప్పుకున్నారు.
ఆ మరునాడే మళ్ళీ గడ్డు సమయమే ఎదురయింది చంద్రశేఖరంగారికి.అంతకుముందు రోజు క్లాస్ ని కంట్రోల్ చెయ్యాలని ధారాళంగా పాఠం చెప్పుకుపోయాడు-కానీ, ఎప్పుడూ అలా చెప్పటానికి ఎలా కుదురుతుందీ? ఆరోజు ఆగి అర్ధాలు చెప్పటం ప్రారంభించాడు-మూడు వంతులమంది వ్రాసుకోవటం లేదు-వ్రాసుకోక పోగా, అల్లరి ప్రారంభించారు.
"అర్ధాలు వ్రాసుకోకపోతే ఏమీ అర్ధంకాదు. అందరు వ్రాసుకోండి-" అని గదమాయించాడు క్లాస్ ని.
"ఎందుకండీ, అర్ధాలు రాసుకోవటం? గైడ్స్ ఉంటాయిగా!"
"టైం వేస్ట్ సార్! ఏదయినా కథ చెప్పండి- పద్యాల్లో అయినా ఫరవాలేదు-మీరు బాగా చెపుతున్నారు-"
"అసలు రాసుకోవటం ఎందుకుసార్? అర్ధం కావటం ఎందుకుసార్? పాఠం అయిపోయాక పరీక్షల్లో కాపీకొట్టడానికి వీలుగా చిన్న చిన్న యెస్సేస్ చెప్పండి. పోనీ, అవి రాసుకుంటాం!"
క్లాసులో నాలుగు మూలలనుంచీ వచ్చేస్తున్నాయి సమాధానాలు! ఇంత నిర్భయంగా ఇలా మాట్లాడుతోన్న ఆ విద్యార్ధులకు ఎలా భయం చెప్పాలో, ఏ విధంగా బోధించాలో బోధపడలేదు చంద్రశేఖరంగారికి.
"అర్ధాలు వ్రాసుకోకపోతే నా క్లాస్ లో ఉండక్కర్లేదు." అన్నాడు కోపంగా-మరుక్షణంలో క్లాస్ రూం మూడువంతులు ఖాళీ అయిపోయింది-క్లాసులో కూచున్న అయిదారుగురు అమాయకంగా వినయాన్ని నటిస్తూ-
"మా అయిదారుగురికీ క్లాస్ తీస్తారా సార్? ఆ తరువాత వాళ్ళు మాకు చెప్పలేదని కంప్లెయిన్ చేస్తారు-" అన్నాడు.
ఏం మాట్లాడకుండా కోపాన్ని అణచుకుంటూ క్లాస్ రూం వదలి స్టాఫ్ రూంలో కొచ్చేశాడు.
"డర్టీ జాబ్!" అన్నాడు పుస్తకం బల్లమీద విసిరికొట్టి.
"ఏమిటోయ్! ఇంత బంగారంలాంటి ఉద్యోగాన్ని పట్టుకుని డర్టీ అంటున్నావు?" నవ్వుతూ అడిగాడు మూర్తి.
"ఇంత మొండి-అల్లరి పొగరుబోతూ స్టూడెంట్స్ ని ఎలా కంట్రోల్ చెయ్యగలుగుతున్నారు మీరు?" చికాగ్గా అడిగాడు చంద్రశేఖరం.
"సింపుల్! అసలు కంట్రోల్ చెయ్యటానికి ప్రయత్నించక పోవటమే!"
"వాట్? మరి, పాఠమెలా చెప్పటం?"
"పాఠం చెప్పటం దేనికి? అటెండెన్స్ తీసుకుంటే చాలు!"
పాఠాలు చెప్పరా? మరి, పరీక్షల్లో వీళ్ళేం వ్రాస్తారు?"
"బ్రహ్మాండంగా వ్రాస్తారు-మనం క్లాస్ రూమ్స్ లో చెప్పేదేమీ ఉండదు-పరీక్ష హాల్ లోనే చెప్తాం. ప్రశ్నలకు సమాధానాలు_అప్పుడు చాలా శ్రద్ధగావిని బుద్ధిగా వ్రాసేస్తారు"