Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 4


    ఒక అధ్యాపకుడే నిర్లక్ష్యంగా అలా మాట్లాడుతోంటే మతిపోయింది చంద్రశేఖరానికి.
    "ఇవేనా, మన ఉద్యోగాలు?" అన్నాడు బాధగా.
    "ప్రస్తుతానికి ఇంతే మరి! పెద్దలే తమ స్వార్ధంకోసం స్టూడెంట్స్ ని ఉపయోగించుకుని మొత్తం వాతావరణమే విషమయం చేసేశారు-యూనివర్శిటీ మొత్తం ఏ రంగంలో చూసినా అరాచకత్వమే రాజ్యమేలుతోంది-మేనేజ్ మెంట్ కి కావలసింది రిజల్ట్స్__ మనం ఎలాగో ఒకలాగ రిజల్ట్స్ బాగా వచ్చేలాగ చూడగలిగితే చాలు!"
    ఏమిటీ చదువులు? ఎలా చదివి సాధించేదేమిటి? ముక్కు పచ్చలారని ఈ యువకుల భవిష్యత్తు ఏమయిపోతుంది? ఈ పరిస్థితి చక్కదిద్దే ఉపాయమేదీ లేదా?
    ఏమీ చదవకుండా కాపీలుకొట్టి డిగ్రీలు సంపాదించుకుని, కొన్ని రోజుల్లోనే దేశమంతా అన్ని రంగాలలోనూ ఎందుకూ పనికిరాని ఏమీ నేర్వని మనుష్యులతో నిండి పోయినట్లు ఊహించుకుని వణికి పోయాడు చంద్రశేఖరం.


                                    3


    కాలేజీలో ఎన్నికల హడావుడి ప్రారంభమయింది-నిజం ఎన్నికలను మించిపోయి ఉంటుంది ఆ హడావుడి-కాలేజీలో ఎక్కడ చూసినా కరపత్రాలు పంచి పెట్టెవాళ్లే! "మీ ఓటు రవికే" అని నినాదాలు చేస్తూ ప్రచారం చేసేవాళ్ళే! కాలేజీ గోడలనిండా కరపత్రాలు అంటించేశారు. బ్లాక్ బోర్ట్స్ నిండా "మీ ఓటు గోపాల్ కే!" అని వ్రాసేశారు.
    రవి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తూ నిలబడ్డాడు. రవి తెలివైనవాడు కాదు-కష్టపడి చదివే పిల్లాడు అసలేకాదు-కానీ అతనికి విద్యార్ధులలో మంచి పలుకుబడి ఉంది. కారణం అతి డబ్బు-ఆ కాలేజీలో సొంతకారును డ్రైవ్ చేసుకుంటు కాలేజీకి రాగల విద్యార్ధి అతనొక్కడే! స్నేహితుల్ని సినిమాలకు, హోటళ్ళకూ తిప్పగల సమర్ధత కూడా అతనికే ఉంది. కాలేజీలో కాని, సంఘంలో కాని నాయకుడు కావటానికి ఇంతకు మించిన అర్హత లేమున్నాయి?
    రవి తండ్రికి ఏ ఉద్యోగమూ లేదు-అతడు చదువుకున్నవాడూ కాదు-తల్లి అసలే చదువుకోలేదు-అతడు ఎప్పుడు ఎలా ప్రారంభించాడో కాని ఒక గదిలో గేంబ్లింగ్ నడిపిస్తున్నాడు-ప్రస్తుతం అతని ఐశ్వర్యానికి ఆధారం అదే! రోజూ ఉదయం, సాయంత్రం, కొద్దిపాటి పెట్టుబడితో లక్షలు లక్షలు సంపాదించుకోవాలని తహ తహలాడే జనం అనేకమంది అక్కడ పోగయి బ్రాకెట్లు కడుతూ ఉంటారు__ఇంకా చీట్లపేక మొదలయినవి కూడా సాగుతూ ఉంటాయి-ఇందులో రహస్యమేమీలేదు__రవి తండ్రి వ్యాపారం ఇలాంటిదని అందరికీ తెలుసు-అయినా అతడంటే ఎవరికీ చులకన భావం లేదు-మరింత గౌరవమేతప్ప. అతడికి పోలీసులతో లావాదేవీలున్నాయని అందరికీ తెలుసు కనుక అతడంటే భయభక్తులు కూడా ఉన్నాయి-రవి తండ్రి పోలీసులకు ఎప్పటికప్పుడూ మామూలు కట్టవలసిన "మామూలు" కట్టేస్తూ ఉంటాడు- పోలీసులు లాంఛనప్రాయంగా నెలకొకసారి అతణ్ణి పట్టుకుంటూ ఉంటాడు- అప్పుడు కోర్టులో "దర్జాగా" ఫైన్ కట్టేసి బయటికొచ్చి యథాప్రకారం వ్యాపారం నడుపుకుంటూ ఉంటాడు- తలిదండ్రులిద్దరూ చదువుకోని వాళ్ళవటంవల్ల ఆ ఇంట్లో రవి చదువు సంధ్యల గురించి పట్టించుకునే వాళ్ళెవరూ లేరు.
    రవికి కుడిభుజం మురళి. మురళి తండ్రి ఇంజనీరు. తల్లి హైస్కూల్ టీచర్. ఇద్దరూ ఉద్యోగాలకు పోయేవాళ్ళంవటంవల్ల ఇద్దరూ మురళి చదువుపట్ల శ్రద్ధ చూపించినా, మురళికి కొంత స్వతంత్రంగా వ్యవహరించగలిగే అవకాశం వచ్చేసింది.
    రవి ఇంటికీ, కాలేజీకీ మధ్యలో ఉంది. మురళి ఇల్లు__రవి రోజూ వచ్చి మురళిని కారులో ఎక్కించుకుని కాలేజీకి తీసికెళ్తుంటాడు. రవి చూడటానికి బాగుంటాడు. మర్యాదగా మాట్లాడతాడు. తన పొగరుబోతుతనమూ, అధార్టీ పెద్దవాళ్ళ దగ్గిర చూపించడు.... అంచేత మురళి తల్లి సత్యవతి, తండ్రి కాంతారావూ కూడా రవిని చాలా ఆదరంగా చూసుకుంటారు. ఆ ఇంట్లో ఒక బిడ్డలాగే చనువుగా స్వతంత్రంగా తిరుగుతాడు రవి. మురళి చెల్లెలు లత. మురళి కంటె ఒక ఏడాది చిన్నది. చదువులో కూడా ఒక సంవత్సరమే తక్కువ. మురళి ఇంటర్ సీనియర్ లో ఉంటే లత జూనియర్ లో ఉంది.
    "ఓట్ ఫర్ రవీ!...." అని గొంతు పగిలేలా అరుస్తున్నాడు మురళి. ఒక్కొక్కళ్ళ దగ్గిరకి వెళ్ళి కరపత్రాలు పంచి పెడుతున్నాడు.
    "రవికి ఓట్ వేస్తే హోటల్లో పార్టీ, ఆ తరువాత సినిమా...." అని రవి ప్రెసిడెంట్ అయితే వచ్చే లాభాలు వివరిస్తున్నాడు.
    తన కోసం ఇంత ప్రయాస పడుతున్న మురళిని రోజూ రెండుసార్లు హోటల్ కి తీసికెళుతున్నాడు రవి. విద్యార్ధులు ఓట్ చెయ్యడానికి ముందు పోటీ చేస్తున్న అభ్యర్ధులు అన్ని క్లాసులలోకీ వెళ్ళి ఉపస్యానాలు ఇవ్వాలి. కొంచెం తెలివిగల విద్యార్ధికి హోటల్లో బాగా తినిపించి ఉపన్యాసం వ్రాయించుకున్నాడు రవి.
    "సోదర విద్యార్ధినీ విద్యార్థులారా!
    ఈనాటి బాలలే రేపటి పౌరులు__అఫ్ కోర్స్, మనం బాలలం కామనుకోండి! (నవ్వులు - చప్పట్లు)....ఇంకా యువకులం కూడా కాలేదు__అవుతున్నాం! (మళ్ళీ నవ్వులు)....అంచేత ఇప్పటినుండే మనను మనం, భారత పౌరులం అనిపించుకోవటానికి అర్హత కలిగించేలా తీర్చి దిద్దుకోవాలి! ఈనాటి ఈ ఎన్నికలు ముందు ముందు మనం నిర్వహించబోయే ఎన్నికలకు నమూనాలు. నేను మీకందరకూ నా సాధ్యమయినంతగా సేవ చేద్దామనే కోరికతో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నాను. కాలేజిలో అధ్యాపకుల నుండి మీ కేవిధమైన ఇబ్బందీ కలగకుండా చూస్తాను. ఏ ఒక్క లెక్చరరూ మిమ్మల్ని నోరెత్తి ఏమీ అనకుండా చూస్తాను. అంటే క్షమార్పణ చెప్పిస్తాను. క్షమార్పణ చెప్పుకోకపోతే కాలేజిలోంచి వూస్ట్ చేయిస్తాను! (క్లాస్ రూంలో నవ్వులు - హర్షధ్వనులు)....మీరంతా పరీక్షల్లో త్వరగా వ్రాయటానికి వీలుగా__అఫ్ కోర్స్, చూసేననుకోండి (నవ్వులు) మినీ నోట్సులు తయారు చేయిస్తాను. అన్ని విధాలుగా మీసేవ చేయటానికి సంకల్పించుకున్న నాకు మీ అమూల్యమైన ఓటునిచ్చి గెలిపిస్తారనే నమ్ముతాను...." 

 Previous Page Next Page