Previous Page Next Page 
రక్షరేకు పేజి 3


                                                              2
    ఎంత పెద్ద సిటీలలోనైనా సిటీ సెంటరులో మాత్రమే ఆధునిక నాగరికతా లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటారు. సెంటర్ కి దూరంగా ఉండే లొకేలిటీలు వేటికవి చిన్న చిన్న పల్లెటూళ్ళలాగానే ఉంటాయి. కొద్ది భేదాలతో-
    పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి- కాన్వెంట్స్ ఉన్నాయి కానీ, అవి దూర దూరంగా ఉంటాయి- సిటీ నాలుగు మూలలనుంచీ అందరూ తమ పిల్లల్ని అలాంటి స్కూల్స్ కి పంపలేరు.
    మామూలు మధ్య తరగతి కుటుంబీకులు తమపిల్లల్ని తమకు దగ్గిరలో అందుబాబులో ఉండే గవర్నమెంట్ స్కూల్స్ కి పంపక తప్పదు.
    గవర్నమెంట్ స్కూల్స్ లో మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలే కాదు- కూలి జనం పిల్లలు కూడా ఉంటారు.
    సమాజంలో చెక్కు చెదరక స్థిరపడిపోయిన వర్గభేదాలకు బీజాలు ఇక్కడే ఈ విద్యార్థి దశలోనే ఏర్పడిపోతుంటాయి. జరుగుతున్నదేమిటో ఎవరికీ తెలియరానంత విచిత్రంగా అత్యంత సహజంగా పెరిగిపోతుంటాయి ఈ గోడలు....
    ప్రేగ్రౌండ్ లో ఏదో గలాటా జరుగుతోంటే, ఒక మూలకు కూచుని చదువుకుంటున్న జైహింద్ బాబు తలెత్తి చూశాడు.
    నలుగురు అబ్బాయిలు కలిసి ఒక అబ్బాయిని తంతున్నారు- చూడలేకపోయాడు జైహింద్ బాబు- వెంటనే వెళ్ళి వాళ్ళతో కలియబడ్డాడు.
    జైహింద్ బాబుది చాలాబలిష్టమైన శరీరం. జైహింద్ బాబు తాకిడికి వాళ్ళు నిలవలేకపారిపోయారు.
    క్రిందపడ్డ అబ్బాయిని లేవనెత్తాడు జైహింద్ బాబు- అతనికి వంటిమీద చాలా చోట్ల గాయాలు తగిలాయి- ముక్కులోంచి నెత్తురు కారుతోంది. నిలబడలేక పోతున్నాడు. అతడు జైహింద్ బాబు క్లాస్ మేటే! పేరు సుధీర్.
    సుధీర్ కి జైహింద్ బాబు పని చేసుకునే అన్నమ్మ కొడుకని తెలుసు. అయితే జైహింద్ బాబుతో ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడేవాడు కాడు. పైగా తప్పుకు తిరిగేవాడు. అది అర్థం చేసుకున్న జైహింద్ బాబు కూడా సుధీర్ కి దూరంగానే ఉండేవాడు.
    ఈనాడు తనను దెబ్బల నుండి కాపాడింది జైహింద్ బాబు అని గుర్తించగానే సుధీర్ కి సిగ్గుతో తల వాలిపోయింది.
    "వాళ్ళు నా పెన్సల్ లాక్కున్నారు. ఇయ్యమని అడిగితే అన్యాయంగా ముగ్గురూకలిపిసి నా మీద కలబడ్డారు" నెత్తురు చొక్కాతో తుడుచుకుంటూ అన్నాడు సుధీర్.
    "ఇంక ఇక్కడ ఉండకు. ఇంటికెళ్ళిపో! దెబ్బలు బాగా తగిలాయి" అన్నాడు జైహింద్ బాబు.
    సుధీర్ లో భయం ఇంకా తగ్గలేదు.
    "నువ్వు వస్తావా?" బెదురుతూ ప్రాధేయపడుతున్నట్లు అడిగాడు.
    "వస్తాను పద" అని బయలుదేరాడు జైహింద్ బాబు.
    సుధీర్ ది పెద్ద సంపన్న కుటుంబమూ కాదు, అంతలేని కుటుంబమూ కాదు. అతని తండ్రి పోస్టుమాస్టర్. తల్లి కూడా ఏదో ఆఫీస్ లో టైపిస్టుగా పనిచేస్తోంది.
    సుధీర్ కాక ఇంకా ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళకి. ఒకడు సుధీర్ కంటే పెద్దవాడు. మరొక అమ్మాయి సుధీర్ కంటే చిన్నది.
    రెండుగదులూ, ఒక వంటిల్లూ, వున్న చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని వుంటున్నారు.
    సుధీర్ ఇంటికి రాగానే తల్లి హడలిపోయి "ఏమిటిరా? ఏమిటా దెబ్బలు?" అని అడిగింది.
    ఆవిడ కూచోమనడం వలన అక్కడి కుర్చీలో కూచుని- "సుధీర్ ని ముగ్గురు అబ్బాయిలు కొట్టారు. నేను కలియబడి విడిపించాను" అన్నాడు జైహింద్ బాబు గర్వముగా.
    "అయ్యయ్యో! అనవసరంగా కొట్లాటల్లోకి ఎందుకు దిగావురా...."
    "వాళ్ళు నా పెన్సిల్ లాక్కున్నారు. ఇయ్యమంటే యివ్వమని అంటున్నారు. మళ్ళీ నా పెన్సిల్ నేను లాక్కోబోతే, దెబ్బలాటలోకి దిగారు"
    "వెధవ పెన్సిల్! దానికోసం దెబ్బలాటల్లోకి దిగారా?"
    "యిప్పుడిలాగే అంటావు. తీరా "నా పెన్సిల్ వాళ్ళు లాగేసుకున్నారు. కొత్త పెన్సిల్ కొనియ్య"మంటే "వెధవా! రోజుకోక పెన్సిల్ కొనమంటావా?" అని తిట్టవూ.....?"
    "చాల్లే! మాటలు నేర్చావు" అని కొడుకుని కసురుకొని,
    "కాఫీ త్రాగుతావా?" అని జైహింద్ బాబుని అడిగింది తల్లి.
    వచ్చీ రాని వయసులో ఉన్న జైహింద్ బాబు ఉత్సాహంగా తల ఊపాడు.
    సుథీర్ తల్లి ముందు తడిగుడ్డతో అతని గాయాలన్నీ తుడిచి అయోడిన్ రాసి, సుథీర్ కి, జైహింద్ బాబుకీ కాఫీ యిచ్చింది.
    జైహింద్ బాబు కాఫీ తాగేసి సుథీర్ లాగే కప్పుకింద పెట్టేసి "వస్తానండీ" అని బయటకు వచ్చేశాడు.
    కొంచెం దూరమైనా రాకుండా తన టిఫిన్ డబ్బా అక్కడ మరిచిపోయినట్లు చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చాడు....
    లోపలి నుంచి తన పేరు వినిపించడంతో గుమ్మందగ్గరే ఆగిపోయాడు.
    "ఏమిటీ? వాడు కూలివాడి కొడుకా? వాడి తల్లి పాచిపని చేసుకునే మనిషా? ఆ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదూ?-"
    కోపంగా అడుగుతోంది సుథీర్ తల్లి. ఆవిడ కంఠంలో అసహ్యం, చీదరింపు స్ఫష్టంగా ధ్వనిస్తున్నాయి.
    "జైహింద్ బాబు మంచివాడు" బెదురుతూ అన్నాడు.
    "మంచి! గెడ మంచి! యిలాంటి అడ్డమైన వెధవలతో తిరుగు, నీ పని చెప్తాను. ఛీ! చీ! ఆ వెధవని మనింట్లో కుర్చీలో కూర్చోబెట్టాను. నీతో సమంగా మన కప్పులో కాఫీ యిచ్చాడు. ఆ కూలి వెధవ తాగిన కాఫీ కప్పు నేను స్వయంగా కడిగాను. నా ఖర్మ! ఆ వెధవకెంత పొగరో చూడు! "అమ్మగారూ! నా కప్పు నేను కడుక్కుంటాను" అనయినా అనలేదు. దర్జాగా టీ తాగేసి, కప్పు కింద పెట్టేసి వెళ్ళిపోయాడు కలెక్టర్ లాగా....."
    యింక చాటుగా నిలబడి వినలేకపోయాడు అతను. చటుక్కున లోపలికి వచ్చేశాడు.
    సుథీర్ తల్లి నోరు ఠక్కున మూతపడింది. సుథీర్ ముఖం పాలిపోయింది.
    "నా టిఫిన్ డబ్బా మరిచిపోయాను" అని ఏదో మహాపరాధం చేసినవాడిలా తల వంచుకొని టిఫిన్ డబ్బా తీసుకొని గబగబ యివతలకు వచ్చేశాడు.
    ఆ క్షణంలోనే అతని వయసు ఒక్కసారిగా ఒక దశాబ్దం పెరిగిపోయింది.
    తన కొడుక్కి దెబ్బలు తగలకుండా కాపాడి యింటికి తీసుకొచ్చినందుకు ఆ తల్లి కృతజ్ఞత చూపించింది మొదట!

 Previous Page Next Page