Previous Page Next Page 
రక్షరేకు పేజి 4

   
    కానీ తనెవరో తెలుసుకోగానే "కూలివెధవ" అని చీదరించుకోకుండా ఆ కృతజ్ఞత కూడా అడ్డుకోలేకపోయింది.
    తన కొడుకుతో కలిసి ఒకే స్కూల్లో, ఒకే క్లాసులో చదువుతోన్న వ్యక్తి తమ యింటికి వచ్చి తమతోపాటు కుర్చీలో కూచుంటే సహించలేకపోయింది ఆ తల్లి మనసు.
    అంతకు ముందు ఏనాడూ ఆలోచనలోకి రాని విషయాలు ఒక్కసారిగా మనసును చుట్టిముట్టి అల్లకల్లోలం చేయసాగాయి ఎదిగీ ఎదగని ఆ పసివాడ్ని.
    చీదరింపుగా ఆ తల్లి అన్న "కూలివెధవ" అన్నమాట అతనిని వెన్నాడి వెన్నాడి వేధించసాగింది.
    ఆ మరునాడు బడికి వచ్చి సుథీర్ ని పలకరించకుండా తన స్థానంలో తను కూర్చున్నాడు.
    సుధీర్ పలకరించబోయినా వినిపించుకోలేదు. లంచ్ టైంలో సుధీర్ తను తెచ్చుకున్నది పెట్టబోతే తీసుకోలేదు.
    ఆ మరునాడు సాయంత్రం బడి వదిలేసిన తర్వాత సుధీర్ తన గుప్పిట్లో రహస్యంగా ఏదో పట్టుకొని "నీకోసం మంచి బహుమతి తెచ్చాను. చాలా మంచి బహుమతి అన్నాడు.
    ఆ వయసుకు సహజమైన కుతూహలంతో "ఏమిటది?" అని అడిగేశాడు జైహింద్.
    "నువ్వు నా జట్టు ఉంటానంటే, చెబుతాను."
    జైహింద్ బాబు మాట్లాడలేదు.
    "జైహింద్ బాబూ! నామీద కోపం తెచ్చుకోకు- మా అమ్మ తిడితే నన్నేం చెయ్యమంటావు చెప్పు? మీ అమ్మ తిడుతుందనుకో! నువ్వెదిరించగలవా చెప్పు!"
    మా అమ్మ తిట్టదు?"
    "తిట్టదూ? ఎప్పుడూ తిట్టదూ?"
    "తిట్టదు- అమ్మెందుకు తిడుతుంది?"
    "నేను మీ ఇంటికి రానా?"
    "రా?"
    "ఇది నువ్వు తీసుకుంటావా? ఆంజనేయస్వామి తాయెత్తు. మా అత్తయ్య తెచ్చింది. ఇది మెళ్ళో వేసుకుంటే ఆంజనేయస్వామి మననెప్పుడూ కాపాడతాట్ట! మా అత్తయ్య నా మెళ్ళో వేసింది. నేను నీ కోసం కూడా అడిగి తెచ్చాను."
    "నాకెందుకూ? నా మెళ్ళో మైసమ్మ తాయెత్తు వుంది."
    "మీ దేవుడు చిన్న దేవుడు- మా దేవుడు గొప్ప దేవుడు...."
    "ఏమిటి? చివరకు దేవుడి విషయంలో కూడా మా దేవుడు చిన్న దేవుడేనా? నీ తాయెత్తు నాకేం అక్కరలేదు."
    సుధీర్ చిన్నబుచ్చుకున్నాడు. అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి....
    "మా అత్తయ్యని ఎంతో బ్రతిమాలి బ్రతిమాలి తెచ్చాను, నీకోసం......" కష్టంగా అన్నాడు.
    జైహింద్ బాబు తన నెదిరించిన వాళ్ళతో ఎంతైనా పోట్లాడగలడు. కానీ, బేలతనానికీ, కన్నీళ్ళకూ లొంగిపోతాడు.
    ముఖ్యంగా తనపై అభిమానం చూపించే వ్యక్తిని అతడు అసహ్యించుకోలేడు.
    "అయితే ఇయ్యి" అని చెయ్యి జాపాడు.
    సుథీర్ పరమానందంగా ఆ తాయెత్తు తనే జైహింద్ బాబు మెళ్లో కట్టాడు.
    జైహింద్ బాబు గుండెలమీద పైన నిలిచిన ఆంజనేయస్వామిని, క్రిందకు జారిన మైసమ్మ వెర్రిగా, బేలగా చూసింది.
    "మీ ఇంటికి రానా?" మళ్ళీ అడిగాడు సుధీర్.
    "రా!" అన్నాడు జైహింద్ బాబు.
    తీరా ఆ గుడిసెల దగ్గిరకు వచ్చాక ఎందుకొచ్చానా అని పశ్చాత్తాపపడ్డాడు సుధీర్.
    శుచీ శుభ్రం లేని ఆ గుడిసెల చుట్టూ పేరుకున్న దుర్గంధం అతడు భరించలేకపోయాడు. దిశ మొలలతో ఉన్నపిల్లల్నిచూడలేకపోయాడు.
    జైహింద్ బాబు తమ గుడిసె చూపించి "రా!" అన్నాడు లోపలికి ఆహ్వానిస్తూ.
    సుధీర్ ఆ గుడిసె లోపలికి అడుగు పెట్టలేకపోయాడు.
    "నేను వెళతాను" అన్నాడు.
    జైహింద్ బాబు అర్థం చేసుకున్నాడు. అతడికి సుధీర్ మీద కోపం రాలేదు. సుధీర్ అవస్థ చూసి జాలి కలిగింది.
    "పద! అక్కడిదాకా వస్తాను" అనిసుధీర్ తో కలిసి తనూ బయలుదేరాడు.
    సుధీర్ కొంచెం తటపటాయిస్తూ "నేను మీ ఇంటికి వచ్చినట్టు మా అమ్మకి చెప్పవుగా?" అన్నాడు భయంగా.
    జైహింద్ బాబు నవ్వి "అది అసంభవం!" అన్నాడు.
    "ఎందుకని?"
    "ఇక నేను మీ ఇంటికి రానుగా"
    సుధీర్ తల వంచుకున్నాడు. తన ఇంటికి రమ్మని బలవంతం చెయ్యలేదు. ఆ 'కూలి వెధవ'ని మళ్ళీ ఇంటికి తీసుకొస్తే వీపు చిట్లగొడతానంది తల్లి. 'వాడితో స్నేహం చేశావంటే కాళ్ళు విరగ్గొడతానని బెదిరించింది.
    అలా బెదిరించిన తరువాతే జైహింద్ బాబు స్నేహం ఎంత గొప్పదో అర్ధమయింది సుధీర్ కి. అయినా అతని సంకెళ్ళు అతనికున్నాయి. వాటిని అతనెలా ఛేదించగలడు?
    ఈ సంఘటన తరువాత మరింత పెరిగాడు జైహింద్ బాబు. అతనికింకా అనేక విషయాలు అర్థం కాసాగాయి.
    కానీ, సుధీర్ అభిమానంగా తన చేతులతో కట్టిన తాయెత్తును మాత్రం అలాగే ఆప్యాయంగా గుండెలమీద దాచుకున్నాడు.

 Previous Page Next Page