Read more!
 Previous Page Next Page 
ఆలోచన ఒక యజ్ఞం పేజి 3


    
  ఎంతమార్పు!
    
    ఉదయం ఏడుగంటలవేళ డాబామీద ఎండ పడకుండా వున్న ప్రదేశాన్ని చూసుకుని నిలబడి రోడ్డువైపు చూస్తున్నాను. అలా చేయటం ఎన్నో సంవత్సారాలనుంచీ నాకున్న అలవాటు.
    
    ఇతరులను కావాలని గమనించే అలవాటు నాకులేదు. మా పక్కఇళ్ళలో ఎవరెవరున్నారో, వాళ్ళేమి చేస్తున్నారో కూడా చాలా సందర్భాల్లో నాకు తెలీదు. బహుశా రచయితకు కావలసిన లక్షణాలు నాలో ఎక్కువ వుండివుండవు. కాని నా దృష్టిలో కొన్ని దృశ్యాలూ, సన్నివేశాలూ ఆకర్షిస్తూ వుంటాయి. ఎన్నో సత్యాలు గ్రహించటానికి అవి చాలు.
    
    ఉదయానే కాలేజీలకు వెళ్ళే అబ్బాయిలు, అమ్మాయిలూ విడివిడిగానో, బ్యాచీలు బ్యాచీలుగానో, ఉత్సాహంగా, హాయిగా వెళ్ళిపోతున్నారు. కొన్ని సంవత్సరాల కిందటికీ, ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం నాక్కనిపించింది. అప్పుడు ఆడపిలల్లు ఆకతాయిలు వెంటబడతారనో, వెకిలి చేష్టలు చేస్తారనో భయం భయంగా నడవటం కనిపించేది. ఇప్పుడూ కొన్నిచోట్ల అలాంటి సంఘటనలు జరుగుతున్నాయేమోగాని, ఓ రకమైన ఆరోగ్యకరమైన స్వేచ్చ వాళ్ళ నడవడి దిశలో కనిపిస్తోంది.
    
    అబ్బాయిలు స్కూటర్లమీద వెడుతూ వుండటం సరే ఆడపిల్లలూ చాలామంది లూనాలూ, స్కూటీ... ఇంకా అలాంటి సున్నితమైన బండ్లమీద వేగంగా, హాయిగా వెళ్ళిపోతున్నారు.
    
    ఈ దృశ్యం నాకెంతో నచ్చింది. ఒకప్పుడు ఈ సమాజంలో సైకిల్ తొక్కడానికి కూడా బిడియపడే ఆడపిల్లలు... ఇప్పుడు ఎంతో నిర్భయంగా, ఫ్రీగా, ముచ్చటగా ఆ బండ్లమీద వెళ్ళిపోతున్నారు.
    
    రిక్షాలమీదో, సిటీబస్సులమీదో ఆధారపడకుండా వాళ్ళ సమయాన్ని వాళ్ళు నియంత్రించుకోగలగటం ఎంత ఆహ్వానించదగ్గ విషయం! ఒకరిమీద ఆధారపడటం ఎంత చికాకైన, ఇబ్బంది కలిగించే అంశం!
    
    ఒక నడివయసు స్త్రీ కెనెటిక్ హోండామీద తన ఇద్దరు పిల్లలనూ ఎక్కించుకుని వాళ్ళ స్కూల్ బస్ ఆగే చోటికి చేరింది. ఆ బస్సు ఎన్నిగంటలకు వస్తుందో ఆమెకు బాగా తెలుసు. సరిగ్గా ఆమెచేరిన ఐదు నిముషాల్లో స్కూల్ బస్ వచ్చింది. పిల్లల్ని బస్సులో ఎక్కించి టాటా చెప్పి ఆమె వెళ్ళిపోయింది. చకచక ఇంటిపనులు ముగించుకుని, తను ఆఫీసుకు వెళ్ళేందుకు.
    
    ఐదు-పది నిముషాల వ్యవధిలో ఇద్దరు ముగ్గురు పురోహితులు. వారిలో నడి వయసువారూ వున్నారు. వయస్సు మళ్ళినవాళ్ళూ వున్నారు. టీవీఎస్ లాంటి వాహనాల మీదా, కొందరైతే మామూలు స్కూటర్లమీదా చలాకీగా వెళ్ళిపోతూ వుండటం కనిపించింది. ఈ దృశ్యం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఏవేవో పిచ్చిసంకోచాలు వొదిలేసి వారు వారి వృత్తిధర్మాలను ఎంత చక్కగా నిర్వహించగలుగుతున్నారు? తమ జీవితాల్లోని చిన్నవిషయాలకు ఇబ్బందుల పాలుకాకుండా ఎలా సుఖమయం చేసుకుంటున్నారు?
    
    అంతలో మరో దృశ్యం కనిపించింది. సైకిల్ సాయంతో సామాను మోసుకెళ్ళే ఓ వాహనాన్ని బహుశా ఆ చోదకుడి భార్య అయివుండవచ్చు. తొక్కుకుంటూ సాగిపోతోంది. ఒకప్పుడు యిలాంటివి జరిగేందుకు ఎన్నో సంకోచాలూ, అభ్యంతరాలూ వుండేవి. ఇప్పుడు చుట్టుపక్కల మనుషులూ, సమాజమూ వాటిని ప్రోత్సహిస్తూ ఆమోదించే మంచి పరిస్థితి వచ్చేసింది. రానురానూ అవన్నీ సహజమైన కార్యకలాపాలుగా వాతావరణంలో ఇమిడిపోతున్నాయి.
    
    ఎంత ఆహ్వానించదగ్గ మార్పు!
    
    కాని... ఇంతటి ఆరోగ్యకరమైన చైతన్యంలో కూడా పిచ్చిపిచ్చి అవరోధాలు.....!
    
    నేను డాక్టర్ను ఆరోజుల్లో... అంటే 1965 ప్రాంతంలో ప్రాక్టీసు పెట్టిన ఆరునెలల్లోనే కారు కొనుక్కోగలిగాను. అప్పటినుంచీ నాలుగైదేళ్ళక్రితం వరకూ కార్లలోనే తిరిగాను. తర్వాత పరిస్థితులు కొంత మారాయి. కొన్ని తొందరపాటు చర్యల వల్ల ఆర్ధికంగా దెబ్బతినటం, రెండుకళ్ళకూ కేటరాక్ట్ వచ్చి, ఆపరేషన్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్... కారు నడపలేకపోవటం, ఒకదానికి ఒకటి తోడై కారమ్మేశాను. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే.... హాస్పిటల్ ను వెళ్ళాలన్నా, సభలూ, సమావేశాలకో, స్నేహితుల, బంధువుల ఇళ్లకో, పెళ్ళిళ్ళకూ ఇతర శుభకార్యాలకూ హాజరవ్వాలన్నా రిక్షాలలోనో, ఆటోలలోనో వెళ్ళాలి. ఆటోలు అంత తేలిగ్గా లభ్యంకావు. రిక్షావాళ్ళ ప్రవర్తన ఒకరికీ, మరొకరికీ పొంతనవుండదు. అదికాక గమ్యం చేరుకునేందుకు ఎంతో విలువైన కాలం వ్యర్ధమవుతోంది. ఈ బాధ తట్టుకోలేక ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు వొదులుకోవలసి వస్తోంది. అంటే అభిలాష వున్నా సమాజానికీ ఏదోరకంగా దూరమైపోతున్నామన్నమాట!
    
    అంటే జీవించాల్సిన జీవితం కొంత కోల్పోతున్నాం.
    
    అనేకమార్లు స్కూటర్, టీవీఎస్ లాంటి వాహనం తీసుకొని, ఎవరిమీదా ఆధార పడకుండా, కాలం వృధా అవకుండా చకచకా నా పనులు చేసుకుంటూ పోవాలని మనసు ఉవ్విళ్ళూరేది. అయినా ఆ కోరికను అదిమేస్తున్నాను.
    
    ముఫ్ఫయ్యేళ్ళు కారు మెయిన్ టెయిన్ చేసినవాడ్ని, అవకాశమొస్తే ముందు ముందు మెయిన్ టెయిన్ చెయ్యాలన్న ఆలోచనా వుంది. ఇప్పుడు ఈ బుల్లిబండిమీద ప్రయాణాలు చెయ్యాలంటే... ఇగోప్రాబ్లమ్ కాదుగానీ, ఓ ఫాల్స్ ప్రిస్టేజ్ అడ్డువస్తోంది.
    
    మా బంధువుల్లో ఒకరు ప్రభుత్వోద్యోగిగా పనిచేసి రిటైరయ్యాడు. ఈమధ్య సన్నీమీద మా ఇంటికొచ్చాడు. ఆ వయసులో, అల సునాయాసంగా, వొంటరిగా, ఎవరిమీదా ఆధారపడకుండా తాను అనుకొన్న చోటికి వెళ్ళగలుగుతూ వుండటం, కాలాన్ని తన అధీనంలో వుంచుకోవటం...చూడటానికెంతో ముచ్చటగా, నా మట్టుకు నాకు అసూయను కలిగించేదిగా వుంది.
    
    అయినా ఆ పని నేను చెయ్యలేకపోతున్నాను.
    
    ఎందుకని?
    
    దీనికి సరైన జవాబు లేదు.
        
    ఇది అహంకారం కాదు. అభిజాత్యమూ కాదు. ఇతరులేమన్నా అనుకుంటారన్న సంకోచమా? అనుకుంటారు. పోనీ, అర్ధం చేసుకోలేనివాళ్ళు, వ్యంగ్య స్వభావం వున్నవాళ్ళు. దీనివల్ల కొంప మునిగిపోయినంత నష్టమేంలేదు మన జీవితాలకు మనమున్న పరిస్థితులను బట్టి ఓ వీలు కలిగించుకుంటూంటే ఇతరుల అభిప్రాయాలకు విలువనివ్వవలసిన అవసరమేముంది? చిత్రమేమిటంటే ఎన్నో సందర్భాల్లో ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ వుంటాం. మనసులోతుల్లోంచి ఓ ఇష్టాన్ని ముందే నిర్ణయించుకున్నప్పుడు ఎవరేమనుకున్నా లెక్కచెయ్యని ఓ ఆత్మవంచన ముసుగులో వుండిపోయి, ఆ ముసుగులోనే తారట్లాడుతూంటాం. దానివల్ల ఎంత జీవితాన్ని కోల్పోతున్నా సరే!
    
    అసలు ఈ ఫాల్స్ ప్రిస్టేజ్ ఏమిటి? నిశితంగా, సహృదయంతో చూడగలిగితే మనకన్నా ఎంతో వున్నత పదవుల్లో వున్నవాళ్ళూ, అనేకరంగాల్లో ఆధిక్యంలో వున్న వాళ్ళూ, అనేక వనరులున్నా చాలా నిరాడంబరంగా, నిర్మల స్వేచ్చాప్రియత్వంతో జీవించటం గోచరిస్తుంది మనసులో వాళ్ళను అభినందిస్తూనే వుంటాం. అయినా ఈ సత్యాన్ని నేర్చుకోలేం.
    
    ఎందుకని?
    
    మనం మారటం అంటే, మన వైఖరిని మార్చుకోవడం మన సరళిని మార్చుకోవటానికి హృదయపు లోతుల్లోంచి మనం ఇష్టపడటంలేదు. అలా ఇష్టపడటం మనకు చేతకావటంలేదు.
    
    ఇది అసమర్ధతా?
    
    కాదు.
    
    బలహీనతా?
    
    కావచ్చు.
    
    కాని దాని ప్రభావం కొంతవరకే ఇంతకన్నా మూలకారణం మన ఆలోచన పరిధిని విస్తరించుకోవటంలో.....లోపలి పొరల్ని ఛేదించుకోలేకపోతున్నాం గనుక!

 Previous Page Next Page