Previous Page Next Page 
ఆలోచన ఒక యజ్ఞం పేజి 4


మేము మాటపడం
    
    అతి సామాన్యమైనవిగా కనిపించే చిన్నచిన్న విషయాలూ వుంటాయి, మహా భయంకరమైన జీవిత సమస్యలూ వుంటాయి. జీవితాన్ని గౌరవించేవాడు రెంటికీ ప్రాధాన్యం ఇవ్వగలగాలి. పెద్ద సమస్యలు ఎప్పుడో తుఫానులా వచ్చి కుదిపెస్తే చిన్న చిన్నవి కంటికి కనిపించకుండా నిరంతరం గాయపరుస్తూ ఉంటాయి.
    
    చాలామంది దగ్గర ఓ అసహ్యమైన మాట తరుచూ వింటూ వుంటాం. "మేము మాట పడమండీ!"
    
    ఈమాట విన్నప్పుడల్లా ఎలర్జీలా నా వొళ్ళు గగుర్పొడుస్తూ వుంటుంది.
    
    ఈ సమాజంలో ఓ పౌరుడుగా జీవిస్తూ కుటుంబంలో ఓ సభ్యుడుగా మనుగడ సాగిస్తూ, అనుక్షణం తోటి మనుషులతో, కుటుంబంలోని సహచరులతో, అన్నగా, అక్కగా, తండ్రిలా, తల్లిలా కొన్ని అధికారాలు వాళ్ళకున్నప్పుడు, ఉద్యోగధర్మం నిర్వహిస్తున్నప్పుడు, దానికి సంబంధించిన అధికారులు తనమీద వున్నప్పుడు, వృత్తి ధర్మం ఆచరిస్తూన్నప్పుడు, ఆ వృత్తిలో తప్పటడుగులు వేస్తే ఎదుటివారు మందలించినప్పుడు ఇంకా అనేక సంఘటనల్లో సందర్భాన్ని బట్టి, అవతలివారు విమర్శించినప్పుడు, వినిపించే వాడుక పదం ఒకటుంది. "నేను ఎవరన్నా ఏమైనా అంటే మాట పడనండీ!" అనేది.
    
    మితిమీరిన అహంకారాన్ని విశిష్ట వ్యక్తిత్వంగా మలుచుకుంటూ అనేమాట.
    
    దీన్నిగురించి కొంచెం లోతుల్లోకి పోదాం. అన్ని వైపులనుంచీ ఆలోచిస్తూ.

    
    తండ్రి అనే వ్యక్తి కుటుంబయజమాని, ఈ తరం వాళ్ళకు అర్ధమైనా, కాకపోయినా, అదో మహోన్నతమైన, అతి విలువైన స్థానం పెళ్ళయినప్పటి నుంచీ ఆర్ధికంగా సాంసారికంగా, సాంఘికంగా, సామాజికంగా ఎన్నో ఒడుదుడుకులూ, పోరాటాలూ ఎదుర్కొని, కొన్ని కొన్ని పరిస్థితుల్లో మునిగిపోతున్నా, రాత్రనక, పగలనక, శ్రమించి, ఆఖరికి భార్యకుకూడా అర్ధంకాని రీతిలో, తనదైన శైలిలో శ్రమించి, ఆ గురుతర బాధ్యతను నిర్విఘ్నంగా నిర్వహించి, పిల్లల ఆరోగ్యాన్ని, భవిష్యత్తునూ తీర్చిదిద్దటంలో నిరంతర కృషీవలుడుగా కష్టపడి, సమాజంలో ఆ కుటుంబానికి గౌరవప్రదమైన విలువను కల్పించిన తండ్రిని ఎంతటి మహోన్నతస్థానం!
    
    అలాగే తన ఆరోగ్యం, ఇబ్బందులూ పట్టించుకోకుండా, అసలు వాటిగురించి ఆలోచించకుండా, ఓ కుటుంబంక్సోం, భర్తకోసం, పిల్లలకోసం, సర్వశక్తులూ ధారపోసే మహత్తర త్యాగమూర్తిగా విలసిల్లే తల్లి!
    
    ఆ తండ్రి కొన్నికుటుంబాల్లో ఇతరుల కందనంత ఎత్తులో వున్న గంభీరమూర్తిగా వుండవచ్చు. కొన్ని కుటుంబాల్లో అతి మృదుహృదయుడుగా మనుగడ సాగించవచ్చు. కొన్ని కుటుంబాల్లో అరమరికలు లేకుండా సన్నిహితుడుగా మసలుకోవచ్చు. కొన్ని కుటుంబాల్లో అంటీ అంటనట్లు కనిపించే సామాన్యుడుగా కనిపించవచ్చు. కొన్ని కుటుంబాల్లో చిన్నసమస్యకు కూడా తల్లడిల్లిపోయే అపరిపక్వ మనస్కుడిలా సంచరించవచ్చు.
    
    కాని...
    
    అతడు నిర్వర్తించి వున్న గురుతర బాధ్యతను విస్మరిస్తే అంతకంటే కృతఘ్నత వుండబోదు!
    
    అలాగే తల్లి!
    
    అలాంటి తండ్రి పిల్లలు పెడదారిన పడుతున్నారని అనుకున్నప్పుడు, వాళ్ళ భవిష్యత్తును చేజేతులా చెరిపేసుకుంటున్నారని భావించినప్పుడు..... ఆ తపనలో, బాధలో వాళ్ళను మందలిస్తే తప్పేమిటి?
    
    ఆ మందలింపు ఒక్కోసారి తీవ్రంగా వుండవచ్చు.
    
    ఒక్క నిజం సహృదయంతో గుర్తించాలి.
    
    కుటుంబంకోసం, కుటుంబాన్ని నిలబెట్టటం కోసం ఎన్నో సుదీర్ఘ సంవత్సరాలు ఓ కృషీవలునిలా శ్రమించిన వ్యక్తి సందర్భాన్నిబట్టీ, అవసరాన్ని బట్టీ పిల్లలను మందలిస్తే తప్పేమిటి?
    
    దానికి... గోరంతలు కొండంతలుగా చేసుకుని ఆవేశపడేవారు కొందరు. అనవసరంగా తమను మాటలన్నారని మధనపడిపోయేవారు కొందరు, తమను అవమానించారని బాధపడి ఇల్లువిడిచి వెళ్ళిపోయేవారు కొందరు తల్లిదండ్రులమీదే కాక పెద్దవారైన సోదరుల మీదా ద్వేషం పెంచుకునేవారు కొందరు, ఆత్మహత్యలకు పాల్పడేవారు కొందరు అనుక్షణం ఎదురు తిరుగుతూ ఇంట్లో కల్లోలాలు సృష్టించేవారు కొందరు..... ఇంట్లోని ప్రశాంత వాతావరణమే విచ్చిన్నమైపోతూ వుంటుంది.
    
    ఒక్క సత్యం గురించి మనం చిత్తశుద్దితో ఆలోచించాలి. తప్పు చేసినప్పుడు, ఒకవేళ తప్పు చేశామని మనం అనుకోకపోయినా, ఆ సందర్భం వారికి తప్పుగా కనిపించినప్పుడు... ఒకమాట వారు అంటే మనం పడితే ఏమైంది?
    
    ఇక భార్యాభర్తల విషయమొచ్చేసరికి.... భర్త మంచివాడో, చెడ్డవాడో, ఇంకా ఏవేవో లోపాలున్నవాడో ఆ సంగతలా వుంచండి. ఆ సమస్యలగురించి ముందు ముందు సుదీర్ఘంగా, నిష్పక్షపాతంగా చర్చిద్దాం.
    
    ఇప్పుడు సామాన్యంగా నడుస్తూన్న కుటుంబాల గురించి మాట్లాడుకుందాం.
    
    స్త్రీ పురుషులు ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారి సంగతలా వుంచండి. అదికూడా మరోసారి చర్చించుకుందాం.
    
    ఇప్పుడు...
    
    భర్త ఉద్యోగమో, వృత్తో, వ్యాపారమో చేసేవాడు బయట ఎన్నో వొత్తిడులు ఎదుర్కొంటూ వుంటాడు. ఒక్కోసారి ఎంతో నిస్సహాయస్థితిలో చిక్కుకుని, కృంగిపోతూ, వుడికిపోతూ ఇంటికొస్తాడు. ఆ స్థితిలో భార్య ఏదైనా విసుగు కలిగించే మాట అంటే కోపంగా ఏదోమాట అనేస్తాడు. అందులో ఏం దురుద్దేశమూ వుండదు. అవతలి వ్యక్తిని కించపరచాలని కూడా వుండడు. ఆ తర్వాత పశ్చాత్తాపం కూడా పడతాడు.
    
    అయితే ఈ లోపలే జరగవలసిన ఉపద్రవం జరిగిపోతుంది. ఆమె చాలా బాధ పడుతుంది. తనను అనవసరంగా మాట అన్నారన్న అక్కసుతో ఇంట్లో పెద్ద గలభా సృష్టిస్తుంది. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరుగుతుంది. ఇద్దరూ అర్ధం పర్ధం లేకుండా హద్దులు దాటిపోతారు.
    
    ఒక్క సత్యమిక్కడ అర్ధం చేసుకోవాలి. మనిషి పరిస్థితులను బట్టి పరాజితుడవుతూ, ఇతరులకూ, ఆఖరికి ఇంట్లోవాళ్ళకుకూడా తానున్న హృదయవిదారకమైన నిస్సహాయతను వ్యక్తం చేసుకోలేని సమయాలుంటాయి. అటువంటప్పుడు అతని మెదడుకూడా పనిచేయకుండా వుంటుంది. ఎంత నిగ్రహించుకుందామనుకున్నా బ్యాలెన్స్ తప్పిపోతూ వుంటుంది.
    
    అప్పుడే.. ఇలాంటి సన్నివేశాలు విరుచుకుపడుతూ వుంటాయి.
    
    అలాగే.... ఒకానొక ఉద్విగ్నస్థితిలో ఒకరు తన ముఖ్యస్నేహితున్ని కూడా ఓమాట అనాల్సి వస్తుంది. ఆ ఒక్కమాట కారణంగా ఎన్నో సంవత్సరాల నుంచీ విడదీయలేని బంధంగా వున్న స్నేహధర్మానికి తిలోదకాలివ్వాల్సి వస్తుంది.
    
    ఆఫీసులో పనిచేసేచోట పై అధికారి పనిలో లోపం కనిపించి ఓ మాట అంటాడు. దాంతో అమాంతం ఆవేశం ముంచుకొచ్చి ఇంట్లో ఆర్ధికపరిస్థితి బాగుండకపోయినా, ఉద్యోగాన్ని వదులుకుని బయటికి వచ్చేస్తారు.
    
    నీ తప్పుండనీ, వుండకపోనీ (వున్నా ఆ విషయం నీకు తెలియకపోవచ్చు) నీపై అధికారి ఓ మాట అంటే, నువ్వు పడితే తప్పేమిటి? అందులో కొంపలంటుకు పోయేటంత విశేషమేముంది? ప్రపంచంలో ఎన్నో రంగాల్లో వృత్తి, ఉద్యోగం, కళ, క్రీడ, ఇంకా ఎన్నో... వీటిలో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతులుగా వున్నవారు ఒకానొకదశలో ఇంతకంటే పెద్దపెద్దమాటలే అనిపించుకుని వున్నారని గుర్తుంచు కోండి వారానాడు "మేము మాట పడం!" అని ధిక్కరించి బయటికి అడుగుపెడితే ఈనాడున్న అత్యున్నత స్థానాన్ని పొందగలిగివుండేవారు కాదు.
    
    భార్యను భర్తా, భర్తను భార్యా ఒకమాటంటే తప్పేమిటి? పిల్లను ఓ మాటంటే తప్పేమిటి? ఆలోచించండి అసలు అనకుండా గడపటం ఎలా సాధ్యమవుతుంది?

 Previous Page Next Page