Read more!
 Previous Page Next Page 
ఆలోచన ఒక యజ్ఞం పేజి 2


    
    వీటన్నిటిలో ఎన్నో వికారాలున్నాయి. ప్రపంచంలో ఏ సంఘటనా జరగవలసిన విధంగా జరగటంలేదు.
    
    ఎందుకని?
    
    వీటన్నిటికీ మూలకారణం మనిషి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు.
    
    సరిగా ఈ వాక్యాలు రాస్తున్నకాలంలో వరల్డ్ కప్ (క్రికెట్) సౌతాఫ్రికాకూ, ఆస్ట్రేలియాకూ మధ్య సెమీఫైనల్ పోటీ జరుగుతుంది. సౌతాఫ్రికా 213 పరుగులు చేజ్ చేస్తోంది. లక్ష్యం భారీగా లేకపోయినా మొదట ధాటీగా బ్యాటింగ్ ప్రారంభించి తేలిగ్గా గెలుస్తారనే స్థితిలో వున్న సౌతాఫ్రికా, షేన్ వార్న్ బౌలింగ్ కు దిగగానే ఠపఠపా వికెట్లు దారుణంగా పడిపోతూ క్రమక్రమంగా వోడిపోయే స్థితికొచ్చింది. ఈ మొత్తం సిరీస్ లో ఆపద్భాంధవునిలా ఆదుకుంటున్నా క్లూసెనర్ అదేస్థాయిలో మళ్ళీ విజ్రుంభించి పరుగులు కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. చివరి వోవర్ వచ్చింది. రెండు ఫోర్లతో ఆస్ట్రేలియా స్కోర్ తో సమానం చేశారు. విజయానికి మరొక్క పరుగు నిబంధనల ప్రకారం మ్యాచ్ ముగిస్తే ఆస్ట్రేలియానే ఫైనల్స్ కు చేరుకుంటుంది. అప్పుడున్న ఫామ్ లో క్లూసెనర్ కు అసాధ్యంకాదు, ఇంకా కొన్ని బాల్స్ మిగిలివున్నాయి. తొందర పడవలసిన అవసరంలేదు. సరిగ్గా... అప్పుడే... ఆ క్షణంలోనే క్లూసెనర్ సరైన నిర్ణయం తీసుకోలేక, లేని పరుగుకోసం ప్రయత్నించటం, ఆ తడబాటులో డోనాల్డ్ రనౌట్ అయిపోవడం రెప్పపాటు కాలంలో జరిగిపోయాయి. ఈ హఠాత్పరిణామానికి ఊపిరి బిగపట్టి, ఉత్కంఠతో చూస్తున్న కోట్లాదిమంది ప్రేక్షకులు అవాక్కయిపోయారు. ఫలితంగా, అప్పటివరకూ అద్భుతంగా ఆడుతున్న సౌతాఫ్రికా వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించవలసివచ్చింది.
    
    సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవటమే ఆ గేమ్ అలా నిర్దాక్షిణ్యంగా ముగియటానికి కారణం.
    
    అంటే... అది సెకన్లో వెయ్యోవంతు కాలం కావచ్చు. ఆ క్షణంలో పూర్తిస్థాయిలో ఆలోచించలేకపోవటం జరిగింది.
    
    అలా... పూర్తిస్థాయిలో ఆలోచించలేకపోవటంవల్లే..... ఊఁహూఁ ఈ వాక్యం తప్పు... ఆలోచించకపోవటంవల్లే అనేక విపరీతపరిణామాలు సంభవిస్తాయి.
    
    మనిషికి పూర్తిస్థాయిలో ఆలోచించగల సత్తా వున్నది. కాని చాలా సందర్భాల్లో అలా చేయటానికి ఇష్టపడరు. ఎందుకని? బద్ధకం వల్లా? ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లా? తెలియనితనం వల్లా? అంతకంటే కుదరకా? లేక స్వార్ధం వల్లా?
    
    ఒకటికాదు... రెండు కాదు... అనేక కారణాలుంటాయి. కాని విచిత్రమేమంటే వాటిలో చాలావరకూ ఆత్మసమర్ధనకు వుపయోగపడేదే కానీ, నిజాయితీతో కూడినది కాదు. అయినా అలా జరిగిపోతూ వుంటుంది. విలువైన జీవితాలు నిష్ప్రయోజన మవుతూ వుంటాయి.
    
    కాబట్టి మనిషికి సరైన సమయంలో సరైన ఆలోచన అన్నది ఎంతో అవసరం.
    
    ఈ సత్యాన్ని విశ్లేషించటానికే ఈ గ్రంథ రచనకు ఉపక్రమించాను.
    
    పుస్తకాలు జీవితాలను మారుస్తాయా? వాటికంత శక్తి వుంటుందా?
    
    ఉంటుంది!
    
    కొన్ని అపురూప గ్రంథాలు ఎందరి జీవితాలనో ప్రభావితం చేసిన సంఘటనలు నాకు తెలుసు.
    
    పుస్తకాలు మనిషిని ఆలోచింపజేస్తాయి. అనేక సందర్భాల్లో ఎన్నో సమస్యలతో నిస్సహాయస్థితిలో నలిగిపోతోన్న మనిషికి ఊరటనిస్తాయి. తోడుగా నిలుస్తాయి.
    
    కొన్ని పుస్తకాలను కొందరు పారాయణ గ్రంథాల్లా నిరంతరం పఠించే సంఘటనలు ఎన్నో తెలుసు. అంటే అవి అందించే ఆలోచనలు వాళ్ళకు కావాలన్న మాట!
    
    ఆ ఆలోచనలు వాళ్ళను క్రమంగా మారుస్తూ వుంటాయి.
    
    నా వరకూ... నా జీవితం ధన్యమైన సంఘటనలెన్నో వున్నాయి.

    
    ఎన్నో సంవత్సరాల క్రితం వైద్యవృత్తిమీద 'హౌస్ సర్జన్' అనే నవల రాశాను. ఆ నవల యువతరాన్ని ఎంతో ప్రభావితం చేసింది. చాలామంది విద్యార్ధులకు వైద్యరంగం మీద గొప్ప ఆసక్తి కలిగేటట్లు చేసి వాళ్ళు డాక్టర్లుగా, ప్రముఖ వైద్యులుగా రూపొందేందుకు దోహదపడింది. అలా జీవితాలను మలుచుకున్న వారిలో ఎంతోమంది ప్రముఖ కార్డియాలజిస్టులూ, ఇంకా ఇతర సూపర్ స్పెషాలిటీకి చెందిన ప్రఖ్యాతులూ వున్నారు.
    
    రక్తసంబంధాలు చేసుకోవటం వల్ల వచ్చే కొన్ని అనర్ధాలను వివరిస్తూ 'ఒకే రక్తం-ఒకే మనుషులు' నవల రాశాను. ఆ నవల చదివి ఎందరో మేనరికం సంబంధాలను చేసుకోవటం ఆపేసుకున్నారు.
    
    అలాగే 'భారతి' నవలలో కుష్ఠువ్యాధిగ్రస్తులను సమాజంలో అంటరానివాళ్ళుగా చూడకూడదని వేదన వెళ్ళగక్కుతూ, ఆ భావన పాఠకుల హృదయాల్లో చొప్పించటానికి చాలా శ్రమించాను. ఆ నవల కుష్ఠు పట్ల ఎంతోమంది దృక్పథంలో మార్పు తీసుకొచ్చింది.
    
    అలాగే ఇతర రచయితలవీ ఎన్నో అపురూప గ్రంథాలున్నాయి.
    
    కాబట్టి పుస్తకాలకు శక్తి వుంటుంది.
    
    ఆ శక్తిప్రసారాన్ని పొందటానికి మనను మనం మలుచుకుంటూ వుండాలి.
    
    నాదో పద్దతి.
    
    ఏం రాసినా జీవితాలను అధ్యయనం చేసి, జీర్ణించుకుని నమ్మి రాస్తానుకాని, ఏ ఇతర రచయితల ప్రభావమూ మీద పడకుండా చూసుకుంటాను. విషయాలను ఇతర గ్రంథాలనుంచి కాకుండా జీవితాలనుండి సేకరించటానికి ప్రయత్నిస్తాను.
    
    ప్రతి రచనా ఓ కొత్తరచనలా వుండితీరాలి. అప్పుడప్పుడూ అవసరాన్నిబట్టి విషయం పాతదైనా సరే - కొత్తకోణంనుంచి నూతన సత్యాలను ఆవిర్భవించేలా చేయగలగాలి. ఎంత చిన్నసత్యమైనా సరే, దాని ప్రాముఖ్యం దానికుంటుంది. అలా సున్నితంగా, మృదువుగా, హృదయాల్లో దూరి, అక్కడ వున్నత విలువలతో కూడిన స్పందన కలుగజేయాలి.
    
    ప్రతి అంశంగురించీ ఆలోచించాలి. ఆలోచన చురుగ్గా, స్పష్టమైన అవగాహనతో సాగిపోవాలి. వేగంగా ఆలోచించటమంటే తొందరపాటుతో ఆలోచించి తప్పు నిర్ణయాలు తీసుకోమని అర్ధంకాదు. నిదానంగా ఆలోచించటమంటే నెలలతరబడి, సంవత్సరాల తరబడి ఏ నిర్ణయమూ తీసుకోలేక చాదస్తంగా కాలం దొర్లించెయ్యటం కాదు. ఈ రెండు విధానాలూ అనర్ధాలను సృష్టిస్తాయి.
    
    మనిషి... పోనీ మనుషుల్లో చాలామంది తమవి కాని జీవితాలు జీవిస్తున్నారు. ఇది చాలా దుఃఖం కలిగించే విషయం. ఇలా ఎందుకు జరుగుతోంది?
    
    సరైన ఆలోచనను ఆహ్వానించలేకపోవటమే.
    
    పెద్ద పెద్ద విషయాలతో పాటు చిన్నచిన్న విషయాలూ ఎంతో సున్నితమైనవి...నా మనసును కదిలిస్తున్నాయి. ఇవన్నీ అక్షరరూపంలోకి తీసుకురాగలగాలి. అలా తీసుకురాగలిగితే నా జన్మ ధన్యమైనట్టే!
    
    నా మనసులో ఎంతో వుంది. ఎంతో బాధవుంది. వేదన వుంది. దుఃఖముంది.
    
    ఈ భావస్రవంతికి స్పష్టమైన ప్రారంభం, కొనసాగింపూ వుండవు నవలల్లోలా నా మనసులోంచి, అప్పుడున్న పరిస్థితిని బట్టి, ఏది ముందూ, ఏది వెనుకా అని ఆలోచించకుండా రాసుకుంటూపోతాను.
    
    అంతేకాదు సందర్భాన్ని బట్టి ఎన్నో జీవిత విశ్లేషణలు విరుచుకుపడుతూ వుంటాయి, వాటిని నేనాపలేను గనుక.
    
    ఇహ... ఆలోచనా స్రవంతుల్లోకి వెళ్ళిపోదాం.

 Previous Page Next Page