Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 3

    గేట్లో టికెట్ యిచ్చేసి స్టేషన్ దాటి బయటికి వచ్చాడు రిక్షావాళ్ళు, జాతకావాళ్ళు పాసింజర్స్ కోసం కేకలు పెడుతున్నారు.
    "సార్, మీరా! నా రిక్షాలోరండి" తమ వీధికుర్రాడు ఆ అబ్బాయి...టెన్త్ చదివి, యికపై పైకి చదవలేక రిక్షా తొక్కుతున్నాడు డిగ్నిటి ఆఫ్ లేబర్ అమెరికాలోనేనా? వెదికితే అడుగడుగునా అంధ్రదేశంలోనే సాక్షాత్కరిస్తుంది.
    రిక్షా రివ్వున దూసుకెడుతోంది.
    నాలుగు నెలలక్రితం ఇదే రోడ్డంట ఆనందోత్సాహాలతో స్టేషన్ అభిముఖంగా వెళ్ళాడు. అప్పటికీ ఇప్పటికీ యెంత తేడా. అప్పుడు తన వ్యక్తిత్వంమీద, తన అందంమీద, తన యోగ్యతమీద యెంతో నమ్మకం! ఇప్పుడూ ఆ నమ్మకం తగ్గలేదు కానీ, ఏదో వెలితి.
    రిక్షా మెయిన్ రోడ్డు దిగి అడ్డరోడ్డంట తిరుగుతోంది. అదిగో పార్క్! పార్కుదాటగానే స్కూలు! ఆ స్కూలు దాటి మలుపు తిరగ్గానే తమయిల్లు ఆలోచనలకంటే వేగంగా సాగిన రిక్షా పెంకుటింటిముందు ఆగింది.
                                        3
    అప్పటికి సుమారు ఎనిమిదిగంటలు కావస్తుంది. రేడియోలో సినిమా పాటలు వస్తున్నాయి. ఇంటిముందు బాగా కల్లాపిజల్లి ముగ్గులేశారు. చెల్లాయికి తెలుగు సాంప్రదాయమంటే చాలా యిష్టం. ప్రతినిత్యం యింటిముందు ముగ్గులు పెడుతుంది. ఇంటికి తోరణాలుకడుతుంది. గేటు ముందున్న చిన్న బయలుస్థలంలోనే చెట్లు పెంచింది. పెరట్లో పూల మొక్కలు, కూరగాయపాదులు నిత్యం కళకళలాడుతూ వుంటాయి. ఎంతపని చేసినా అలసిపోదు. శ్రద్ధగా చదువుతోంది. ఇంటి సెకండియర్ కి వచ్చింది. స్కాలర్ షిప్ వల్ల ఆమె చదువు బాధ్యత తమకేం లేదు.
    ఇంటిముందు రిక్షా ఆగిన చప్పుడికి తలెత్తి చూసింది. శైలజ పాలుపోయించుకుంటున్నదల్లా అమ్మా అన్నయ్యొచ్చాడేవ్ అని కేకేసింది. రిక్షా దిగివాడి చేతిలో రూపాయిపెట్టి ముందుకికదిలాడు రిక్షాఅబ్బాయి హోల్డాల్ తీసుకొనివచ్చాడు.
    లోపల్నుంచి కూతురి కేకవిన్న అన్నపూర్ణ బయటకు వచ్చింది. కొడుకుముఖం చూడగానే ఆమె ముఖం విప్పారింది. "ఒక్కడివే వస్తున్నా వేంబాబు? జ్యోతి ఏది? రాలేదా?"
    తల్లి ప్రశ్నకు చప్పున సమాధానం ఇవ్వలేదతను.
    "తను యీ యింటికి తిరిగొస్తున్నాడు ఇంటితో శాశ్వతంగా తెగదెంపులు చేసుకొని వెళ్ళకపోయినా ఇల్లరికం వెళ్ళిన తనకి యీ ఇంటిలోనే వుండిపోయే హక్కు లేదు.
    తమకి లేదు. తమకొడుకునయినా సుఖపడనీ అని యిల్లరికానికి బలవంతంగా వప్పుకున్న తలితండ్రులు యీ నాడు తన విషయం వింటే ఏమంటారు? తనని సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా?"
    లోపలికిరా అన్నయ్యా? అలా నిల్చున్నావేం? వదిన రాలేదేం?
    చెల్లాయి ప్రశ్నకు చిరునవ్వు నవ్వేడు బదులుగా.
    'ఇక ఇలావుంటే లాభంలేదు మామూలుగా వుండాలి. తను నిదానంగా విషయం చెప్పాలి. తను తప్పిపోయిన సంతానములాంటివాడు.
    తనింతగా మధనపడుతున్నాడు కానీ వాళ్ళు దీనికంతగా ప్రాధాన్యత యివ్వకపోవచ్చు. తనింట్లో తనకెందుకు సంకోచం. ఆలోచన మరో మార్గం పట్టింది.
    రిక్షా అబ్బాయి హోల్డాల్ ను వరండాలోపెట్టి వెళ్ళిపోయాడు.
    లోపలవున్న విశ్వనాథంగారు బయటకు వచ్చారు.
    "జ్యోతిరాలేదమ్మా నేనొక్కడినే వచ్చాను!" అని టక్కున జవాబు చెప్పాడు. తండ్రివైపు తిరిగి "మీ ఆరోగ్యం ఎలా వుంది నాన్నగారు? శైలు బాగా చదువుతున్నావా! అమ్మా నేనింకా మొఖం కడుక్కోలేదు కాఫీ త్వరగా పెట్టు నేను స్నానం చేసి వస్తాను ఏకంగా టిఫిన్ కూడా పెట్టెయ్!" అని పలకరించాడు గబగబా.
    అతని ప్రశ్నలకి సమాధానాలు వచ్చేయి.
    పెరట్లోకి వెళ్ళాడు ఆలోచనలు సాధ్యమైనంత దూరం చేసుకోవాలి. ఈ రోజునుంచి ఉద్యోగప్రయత్నంలో పడాలి. జాబ్ వచ్చాక అప్పుడు చెప్పచ్చు విషయం అనుకున్నాడు.
    అతను స్నానంచేసి వచ్చేసరికి కాఫీ, టిఫిన్ సిద్ధంగా వుంచింది అన్నపూర్ణ. ఆవురావురుమనితిని, ఆప్యాయంగా కాఫీ ఇస్తే తాగేసి పడకపై వాలిపోయాడు. క్షణంలో నిద్ర మత్తుగా వచ్చేసింది.
    అయినా నిద్రని ఆపే ప్రయత్నంగా ఏదో పుస్తకం తీసుకున్నాడు!
    చూపులు పేజీపై వున్నాయి.
    కానీ మనస్సే ఏకాగ్రంగా నిలవటంలేదు. అది తెగిన గాలిపటంలాగా ఆలోచనల దారాల వెంట వెళ్తుంది.
    చిరాకు చిరాకు ప్రశాంతత లేదు.
    కాని ఇలా లాభంలేదు తను వీటిని పారద్రోలాలి.
    మనస్సుకి సుఖం శాంతి దొరికే మార్గంలో ఆలోచించాలి.
    జ్యోతి విషయాన్ని తనింక జన్మకి గుర్తుగా అనుకోవాలి. అదోకల. కమ్మని కల అనుకున్నాడు. కానీ అనుభవాలుమాత్రం తనకి కమ్మగా లేవు. జీవితమంతా చేదుమాయం అయిపోయింది.
    కమ్మరి ఒక కుండ పగిలిపోతే దాన్నట్టిపెట్టుకొని ఏడుస్తూ కూచోడు. మిగతాకుండల్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటాడు.
    రైతు ఒక ఎకరం పాడైపోయిందని దుఃఖీస్తూ కూచోడు మిగతా పొలాన్ని పండించుకొని తన కడుపు నిండించుకునేందుకు కృషి చేస్తాడు.
    అంతెందుకు!
    పరీక్షలో ఓ సబ్జక్టు తప్పిపోయిన విద్యార్ధి యిక తన భవిష్యత్తంతా పాడైపోయిందని ఏడుస్తూ కూచోవాలా? అది పద్ధతా? అది జీవితానికి మంచిబాటా?
    "ఊహూఁ ఆ సబ్జెక్ట్ పూర్తి చేయాలి పట్టుదలతో. తర్వాత పై చదువులకి పరిగెత్తాలి! చదువుని సాధించాలి! జీవితంలో సుఖపడాలి. 
    అది కదా పద్ధతి!
    డీలా పడిపోతే ఏమవుతుంది? అంతా నిష్ప్రయోజనం! భవిష్యత్ నాశనమయి పోతుంది! అలా కాకూడదు!"
    తనూ అంతే! తన జీవితమూ అంతే! గతించిన దాన్ని పూర్తిగా మరచిపోవాలి. ఆ దిగులుతో ద్రిగ్గుళ్ళి పోకూడదు! కొత్త మార్గాన్ని ఎన్నుకోవాలి! కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలి! అది సరైన మార్గం. అంతేకానీ ఎప్పుడూ గతము తలచీ పగచేకన్నా అందమేలేదు - ఆనందమే లేదు అని పాడుకుంటూ కూర్చుంటే ఎలా? అది పిరికివాళ్ళ పద్ధతి. జీవితాన్ని నిర్మించుకోలేని అప్రయోజకుల పద్ధతి. తను అప్రయోజకుడు కాడు! జీవితాన్ని సరిచేసుకుంటాడు.
                                       4
    ఎండకాలం ఎండ తీవ్రంగా వుంది. అంత తీవ్రతలో కూడా జనం అటూ ఇటూ రోడ్లమీద తిరుగుతూనే వున్నారు. వడగాలి ఈడ్చి కొడుతూంది.
    "అబ్బ! పది కూడా కాలేదు. అప్పుడే ఎండ దంచేస్తుంది" అని కర్చీఫ్ తో ముఖానికి అంటిన చెమటని అద్దుకున్నాడు శ్రీకర్.
    అతను ఓ ప్రయివేట్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళుతున్నాడు ఆ పూట.

 Previous Page Next Page