"రేయ్! శ్రీకర్! యెక్కడినుంచి యెక్కడికిరా! ఇంటర్ పూర్తి చేశాక మళ్ళీ నీ ఆచూకీనే తెలియలేదు. యెక్కడున్నావ్! ఏం చేస్తున్నావ్? విషయాలు ఏమిటి! గబగబా అడిగాడు అతను. ఆత్రుతలో అతని ఆంతర్యం కన్పించింది.
ప్రదీప్ పద్ధతే అంత! మాటాడటం ప్రారంభించాడు. భావ కవులకిమల్లే తడుముకోకుండా చకచకా మాటాడేస్తాడు. ఓసారి మొదలెట్టాడా అతనాగేదాకా యెవరూ ఆపలేరు అడొచ్చినా ఆగడు.
ఆ ప్రశ్నలకి చిన్నగా నవ్వాడు శ్రీకర్.
అతనికి ప్రదీప్ పద్ధతంతా మదిలో మెదిలింది. అందుకే అతని పెదాలపై చిరునవ్వు మళ్ళీ చిందులు వేసింది.
"అదో! ఆ చిరునవ్వుతోనే మనుషుల్ని బురడీ కొట్టేస్తావు నువ్వు. అందుకే నిన్నంతా మెచ్చుకుంటారు. నీ చిరుదరహాస చద్రికల్ని చూడాలని నీతో నేస్తం కడతారు. ఆ మాటకొస్తే నేను అంతేగా!" మిత్రుడిని చూసి ఆనందం చాలా ఏళ్ళ తర్వాత కలుసుకున్న ఆశ్చర్యం, అనుభూతి మాత్రం మిగిలే ఆర్ద్రత అన్నీ వున్నాయా మాటల్లో.
ప్రదీప్ నువ్వేం మారలేదోయ్! అప్పుడెలా వున్నావో యిప్పుడూ అంతే! జష్టు కాస్త యెదిగావు, కొంచెం లావయ్యావు, మీసాలు పెంచావు దట్సాల్!" నవ్వుతూ అన్నాడు శ్రీకర్.
అతనికీ ప్రదీప్ ను చూడగానే బద్ధకం, నిరాశ నిస్పృహలన్నీ యెక్కడికో పరుగెత్తుకొని పోయినట్లయింది. అంతదాకా ముసురుకున్న ఆలోచనా మేఘాలు ప్రదీప్ రాకతో చెల్లాచెదురయ్యాయి.
ట్రెయిన్ వేగంగా వెళుతోంది.
"ఊఁ అయితే నన్ను మరచిపోలేదన్నమాట! శ్రీకర్ నీతో విడిపోయి నిండా అయిదేళ్ళు కాలేదు. ఎంత మారవోయ్! కొంచెం లావెక్కానంటావా? మా ఆవిడ తిండి తింటే ఎవరయినా అంతే! ఛాలెంజ్!
కావాలంటే నువ్వొచ్చి ఓ వారంరోజులుండిపో...కనీసం అయిదు కేజీల బరువెక్కుతావు.
అన్నట్టు మన హిస్టరి చెప్పలేదు కదూ...
నేను బి.ఎస్సీ. పూర్తి చేశాను. సెకండియర్ చదువుతూ వుండగా రాసిన రైల్వే ఎగ్జామ్స్ రిజల్ట్సు వచ్చేసరికి డిగ్రీ వచ్చేసింది."
తిరుచినాపల్లిలో ట్రయినింగ్ పూర్తిచేసుకుని వచ్చేక మా మామయ్య - అదే మా శ్రీమతిగారితండ్రిగారు కోసం ఎదురు చూస్తూ వున్నట్టుగా వచ్చారు.
వెళ్ళిచూడటం పెళ్ళిచేసుకోవడం అంతే! టకటకా వాళ్ళతో గృహస్తునైపోయాను. ప్రస్తుతం నేను మా ఆవిడ క్వార్టర్స్ లో వుంటున్నాము. అన్నట్టు నీ విషయం ఏమిటి? యేం చేస్తున్నావ్? పెళ్ళయిందా?
ప్రదీప్! బొకారో ఎక్స్ ప్రెస్ స్పీడ్ లో మాటాడేవు....నువ్వేం మార్లేదోయ్...ఒకసారి గుర్తుందా! మన కాలేజీలో విషయం. ఏమీ లేకుండా ఉపన్యాసం ఏర్పాటు చేశారు. నువ్వు విషయం అనేదానిమీదే అరగంట మాటాడేవు. ఆఖరికి నువ్వేం చెప్పావో ఎవ్వరికీ గుర్తులేదు. జడ్జెస్ తో సహా ఆ విషయం అంగీకరించి నీకే ఫస్టు ఫ్రైజ్ యిచ్చారు..."
పకపక నవ్వాడు ప్రదీప్. నిర్మలంగా, స్వచ్చంగా, స్వేచ్చగా, హాయిగా నవ్వగలుగుతున్న అతన్ని చూసి చాలామంది జీవితాన్ని సుఖమయం చేసుకోవటం చేతకాకే దుఃఖపడతారేమో, అనిపించింది శ్రీకర్ కి.
"ఆఁ ఆఁ బాగా గుర్తుంది. అదేకాదు....తర్వాత నేను డిగ్రీ యూనివర్శిటీలో చేశాగా...మా నాన్నగారు ట్రాన్స్ ఫర్ నాకు చాలా మేలుచేసింది శ్రీకర్. నేనూ అందరిలాగే మామూలు కాలేజీల్లో చేసివుంటే నా బ్రతుకు యిలా వుండేదికాదు. అన్నట్టు చెప్పటం మరిచా! మా నాన్నగారు ట్రెయిన్ యాక్సిడెంట్ లో పోయారు. చూశావా చిత్రం...ఆయన పోయిన యేడాదికి నేను రైల్వేలో చేరాను."
"వెరీసారీ ప్రదీప్!" నొచ్చుకుంటూ అన్నాడు శ్రీకర్.
"ప్చ్! ఆఫ్టరాల్ అది చాలా నేచురల్!" అని సిగరెట్ ముట్టించి, శ్రీకర్ కి ఆఫర్ చేశాడు...అప్రయత్నంగా చేయిచాచి సిగరెట్ అందుకుని ముట్టించాడు. సమిధ వెలిగించే సమయంలో వేళ్ళు కొద్దిగా వణికాయి. చప్పున జ్యోతి గుర్తుకొచ్చింది. నోరంతా చేదుగా అయిపోయి ఘాటుకి దగ్గువచ్చింది.
"ఊఁ నీ విషయాలు చెప్పవన్నమాట!"
"అదేం?" అన్నట్టుగా చూశాడు శ్రీకర్.
"లేకపోతే నేను నిన్ను అడిగి ఎంతసేపు అయింది. విషయాలు చెప్పవేం? పోనీ నేను ఇంటర్వ్యూలోలా ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పు.
ఆ పెళ్ళయిందా నీకు! ఉద్యోగం చేస్తున్నావా? బి.ఏ. తోనే ఆగిపోయావా? ఎమ్మే చేశావా? ప్రయివేట్ గా చేసావా? పెళ్ళయుంటే పిల్లలా...ఇటిసి...సమాధానాలు త్వరగా చెప్పు. నెక్ట్స్ స్టేషన్ లో దిగిపోతాను.
అదే నా హాల్టింగ్ స్టేషన్.
నువ్వూ దిగెయ్రాదూ! అన్నట్టు నీ టికెట్ ఏది యెక్కడి నుంచి ఎక్కడికి!"
"మహానుభావా నీ ప్రవాహం ఆపు...ఇంతకుముందే నా టికెట్ చెక్ చేశావు. నేను ఆ బెర్తుపై పడుకుని వున్నాను. నేను బి.ఏ. పూర్తి చేశానంతే! తర్వాత ఏం అనుకోలేదు. ఉద్యోగం అంటూ ఏదీ రాలేదింతవరకూ. నేనూ దాని అన్వేషణలోనే వున్నాను. ప్రస్తుతం ఓ ఇంటర్వ్యూకి వెళుతున్నాను. ఇక్కడ సక్సెస్ అయితే ఇక తర్వాత బ్రతుకు బాగానే వుంటుంది. ఇంక పెళ్ళి..."
"చెప్పొద్దులే...ఈ రోజులలో నిరుద్యోగి పెళ్ళిచేసుకునేటంత ఘోరమైన పొరపాటు చెయ్యడులే! పోనీలే! త్వరలో పెళ్ళి చేసుకుందువుగానీ..."
నన్నడగితే యిలా ట్రెయిన్స్ లో యెంతో మంది తటస్తమవుతూ వుంటారు. బాగా బ్యూటిఫుల్ గా వున్న ఎడ్యుకేటెడ్ యెంగ్ గర్ల్ ని మాట్టాడిపెట్టమంటావా?
అఫ్ కోర్స్! అదంత సులభం కాదు. నేనేం పెళ్ళిళ్ళ పేరయ్యనీ కాదు. రిజిష్ట్రార్ ఆఫ్ మేరేజెస్ కాదు. అదో స్టేషన్ వచ్చేస్తోంది. నా డ్యూటీ అయిపోతుంది. ఇక్కడే నా క్వార్టర్స్...రిటర్న్ జర్నీలో ఆగి దిగు. రెండురోజులన్నా గడిపి వెళుదువుగానీ!"
ట్రెయిన్ ఆగింది. ప్రదీప్ వాక్ ప్రవాహమూ ఆగింది.
ట్రెయిన్ దిగి ప్లాట్ ఫారం పై నుంచి చేయి అందించాడు. పెదాలు బిగించి "థాంక్స్!" అన్నాడు చేయి కలిపి... మరుక్షణంలో చకచకా చేతులూపుతూ వెళ్ళిపోయాడు ప్రదీప్.
మరి రెండు నిమిషాలలో ట్రైన్ కదిలింది.
2
ఆలోచనలు మళ్ళీ ముసురుకున్నాయ్...ఆలోచనలో ట్రైన్ ఆగిన విషయం కూడా గుర్తించలేదు.
"కాఫీ...టీ...ఇడ్లి...వడ" ఫ్లాట్ ఫాంపై వెండర్స్ కేకలు, జనంమాటలు...నవ్వులు...దిగేవాళ్ళు, యెక్కేవాళ్ళ రద్దీ...హడావిడి చప్పున చూశాడు. తను దిగాల్సిన స్టేషన్.
కొంతగాబరాగా హోల్డాల్ అందుకొని ట్రైన్ దిగాడు. అప్రయత్నంగా కుడికాలు క్రిందపెట్టాడు గమత్ గా జ్యోతి మళ్ళీ తలుపులలోకి వచ్చింది...యెందుకీరోజు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది అనుకున్నాడు.