Read more!
 Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 2

    ఆమె అభిప్రాయం ఎటు మొగ్గితే ఆ గ్రామంలో ఓట్లు వారిని!! అటువంటి చెరుకుపల్లి గ్రామంలో జగదీశ్వరుని బ్రహ్మోత్సవాలు దగ్గరించి ఉన్నాయి.

    వైశాఖమాసంలో ఏకాదశినించి పూర్ణిమకు పూర్తి అవుతాయి. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం శాంతిహోమం!

    అయిదుగురు గొప్ప పండితులను పిలిపించి వారు వేదం చదువుతూ  బ్రాహ్మణులచేత హోమంలో ఆవునెయ్యి ఆహుతులుగా వేయిస్తుంది రాణి సుమిత్ర!

    ఆ ఒక్క సమయంలో అందరితోపాటుగా ఆమె యజ్ఞశాలలో పీట కూడా వేసుకోకుండా చాపమీద కూర్చుంటుంది!

    తమ శ్రేయస్సు ఎల్లవేళలా కోరుకునే ఆ పవిత్రమూర్తి సరసన కూర్చుని హోమంలోంచి వచ్చే పొగపీల్చేందుకు గ్రామంలోని వారే కాకుండా చుట్టుపక్కలవారు చాలా ఇష్టపడతారు.

    ఆ ఘట్టాన్ని ఫోటోలు వీడియోలు విరివిగా తీస్తారు.

    అది ఒక పండుగలాగా పరిపత్తులాగా జరుగుతుంది.

    హోమం పూర్తి అయిన తరువాత రాణి సుమిత్ర వచ్చిన ముత్తయిదువలు ఎన్ని వందల సంఖ్యలో ఉన్నా అందరికీ పండు తాంబూలం గంధము ఆకులు ప్రసాదంతోపాటు రవికలగుడ్డలు పంచుతుంది. ఆమె కుమార్తెలు గాయత్రి ఆమని ఓపికగా టం చేతుల మీదుగా అందరికీ అన్నీ పంచుతారు.

    తాను మనసారా అర్చించే జగదీశ్వరస్వామితో పాటు ఆ గ్రామీణ పునిస్త్రీల పవిత్ర హృదయాలు తన బిడ్డలిద్దరిపై ఆశీస్సుల వర్షం కురిపించాలని, వారి జీవితాలు ఒక మధురమయిన కలలాగా గడిచిపోవాలని ఆకాంక్ష!!

    మిగిలిన అయిదురోజుల పండుగ ఉత్సాహమంతా యువకులదే. అది చూచి ఆనందించటమే మిగిలినవారి అదృష్టం!

    ఈసారి గ్రామంలో బ్రహ్మోత్సవాలు మరింత ఘనంగా జరుగుతాయని వార్తలు వ్యాపించినాయి! గాయత్రి ఆమని పెద్ద అయారు!

    వారికి పెళ్ళి కార్యక్రమాలు తలపెట్టవలసిన సమయం ఆసన్నమయింది. తండ్రి తరువాత తాను ఒక్కర్తే ఆడపిల్ల!

    అయినా కుటుంబ గౌరవం చెక్కుచెదరకుండా పెద్ద గుండెతో నిభాయించుకుంటూ వచ్చింది. దురదృష్టం ఏమిటో కాని తనకూ ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు.

    రెండవతరంలో కూడా మగపిల్లాడు లేకుండా తన భర్త చనిపోయాడు. గాయత్రికి పెళ్ళి అయి ఒక్క మగనలుసు పుడితే ఈ భవన సంప్రదాయాలకు వాణ్ణి వారసుడిగా ప్రకటించి చనిపోవాలని రాణి సుమిత్ర గుండెలనిండా నిండిపోయిన ఆశ!

    గాయపడిన గుండె రెండుతరాల తరువాత ఆశాకిరణాన్ని చూచి తగ్గించుకోవాలని ఆమెకు అపరిమితమయిన కోరిక.

    అందుకోసం జగదీశ్వరునితోపాటు ముత్తయిదువుల అభిమానుల ఆశీస్సులు ఘనంగా పొందాలని సంకల్పించింది సుమిత్రాదేవి!

    ఈసారి హోమశాలలో యజ్ఞం జరిగే సమయాన పెద్ద కూతురు గాయత్రిని 'కర్త'గా కూర్చోపెడతానని ప్రకటించింది.

    తన స్థానంలోకి ఆమె వచ్చేస్తుందన్నమాట.

    ఆమె తరువాత అయిన ఆ చాపమీద ఒక మగనలుసు కూర్చుంటే నిశ్చింతగా కన్నుమూయవచ్చు అనుకుంటోంది.

    ఒక ఆశాకిరణాన్ని అందుకోవటానికి రాణి సుమిత్ర చేసే ప్రయత్నంలో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ముఖ్యమయిన మలుపు అవుతాయి. వచ్చే ఉత్సవాల నాటికి గాయత్రికి పెళ్ళికావచ్చు. అదృష్టం ఉంటే మగబిడ్డకూడ పుట్టవచ్చు.

    ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు దాన్ని అజమాయిషీ చేసుకోవటానికి మగవాడు ఉండటమే సరి అయిన అదృష్టం.

    ఈ ఆడ శాపం రెండు తరాలలో అంతం కావాలి.

    దశాబ్దాలుగా గుండెను తినివేస్తున్న ఈ బరువు దింపుకునే ప్రయత్నంలో మొదటి అడుగు గాయత్రిని యజ్ఞంలో బ్రహ్మోత్సవాలకు కర్తగా కూర్చో పెట్టటం.

    ఈ వార్తవిన్న గ్రామీణులు ఎంతగానో పొంగిపోయినారు.

    తమ కోరికలు అవుసరాలు తీర్చగల కల్పవల్లి రాణి సుమిత్ర!

    ఆమె జీవితాశయం తీర్చగలవాడు ఆలయంలోని ఆ జగదీశ్వరుడే!

    గ్రామీణులకు అన్నీ ఇచ్చి ప్రతిఫలంగా తన బిడ్డలను ఆశీర్వదించమని అడిగే ఆ ఘట్టంలో పాల్గొనేరోజు ఎంత త్వరగా వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

    పెళ్ళిళ్ళు అయిపోయి దూరంగా వెళ్ళిన తమ ఇంటి ఆడపడుచులకు కూడ ఉత్తరాలు వ్రాశారు, భర్తలతో బ్రహ్మోత్సవాలకు వచ్చి ఆ తల్లి బిడ్డలను ఆశీర్వదించే శాంతి హోమంలో పాల్గొనమని!

    వారికికూడా తమ మెడలలోని బంగారు మంగల్యాలు ఆ తల్లి చల్లని చేతులతో బహూకరించినవే! అందుకు ప్రతిఫలంగా ఆమె కోరుకున్నది ఆశీస్సులు మాత్రమే!

    అవి పుష్కలంగా అందించేందుకు భర్తలను వెంట పెట్టుకుని వచ్చారు. చెరుకుపల్లికె కాక చుట్టుపక్కల గ్రామాలలోకూడా కళలు పెరిగినాయి. ఆలయానికి రంగులు వేయించారు.

    తిరునాళ్ళకు అంగళ్ళు చాలా అధిక సంఖ్యలో వెలుస్తాయి.

    వాటి సౌకర్యం కోసం వీధులలో అడ్డంకులు తొలగించి సిద్ధం చేశారు. భవనం అంతటా పండుగ వాతావరణం వచ్చేసింది.

    ఇక ఉత్సవాలు రేపు ప్రారంభం అవుతాయి అనగా బిడ్డలు ఇద్దరిని పిలిపించింది రాణి సుమిత్ర!

    "మీరు పెద్ద అయారు. అర్ధం చేసుకునే వయసు వస్తోంది! మీకు కొన్ని ముఖ్యమయిన సంగతులు చెప్పాలి" అంది సుమిత్ర.

    రెండు తరాలుగా జగదీశ్వరస్వామి ఆ కుటుంబం మీద పరచిన చీకటి తెరను చింపుకోవాలన్న ప్రయత్నం ధ్వనించే కంఠస్వరం అది!

    తల్లిదగ్గర కూతుళ్ళు యిద్దరూ రెండు తీరులుగా మసలుకుంటారు. ఆ తేడా వారి స్వభావంలోనే ఉంది.

    గాయత్రి భయ గౌరవాలతో వచ్చి తల్లి ఎదుట మౌనంగా కూర్చుంది! ఆమని గలగలమని మాట్లాడుతూ వచ్చి తల్లి తొడమీద కూర్చుంది. మెడను చేతులతో చుట్టి చెంపమీద ఓ ముద్దు అతికించింది.

    "మై స్వీట్ మమ్మీ! వచ్చేశాను" అంది.

    "చిన్న పిల్లవుకావు. సరిగా కూర్చో! కుదురుతనం రావాలి నీకు." అంటూ అతి చనువు ధోరణిని పనివారు ఎవరయినా చూస్తున్నారేమో అని చుట్టూ చూచింది రాణి సుమిత్ర.

    ఆ మాటకే అలకవహించింది ఆమని!

    "వద్దంటే వెడతాలే ఫో మమ్మీ! మీరు వద్దంటే నాకు అక్కలేదా?!" అంటూ గాయత్రి వద్దకు వచ్చి అలాగే మెడను కావలించుకుని తొడమీద కూర్చుంది ఆమని!

    గాయత్రి ఏమీ మాటాడలేదు.

    తల్లి చెప్పే మాటలు వినేందుకు నిశ్శబ్దంగా చూస్తోంది.

    అక్కాచెల్లెళ్లు యిద్దరూ కట్టుకున్న బట్టలలో కూడా తేడా ఉంది.

    ఆమని సాటిన్ సల్వార్ కమీజ్ మీద రోజ్ ని పిన్ చేసుకుంది. గాయత్రి తల్లి బీరువాలోంచి ఆమె అపురూపంగా సంపాదించి దాచుకున్న ఒక వాయిల్ చీర కట్టుకుంది.

    గాయత్రికి అన్నీ తన అభిరుచులే!

    కాని అదృష్టం తనది కాకుండా ఉంటే చాలు అనుకుంది తల్లి!

    మనుషుల మీద ఎక్కి కూర్చోవటానికి నువ్వేం పసిదానివి కాదు! ఆ కుర్చీలో కూర్చో. ముఖ్యమయిన సంగతులు మాట్లాడాలి" అని మందలించింది తల్లి! మూతి సున్నాలా చుట్టేసింది ఆమని.

    "అక్క దగ్గరకూడా కూర్చోకూడదేమిటి?!" అని గునుస్తూ వెళ్ళిపోయి ప్రక్కనున్న ఖరీదయిన సోఫాలో విడిగా కూర్చుంది.

    రాణి సుమిత్ర కళ్ళ అద్దాలు తొలగించి అద్దాలు రుమాలుతో తుడుచుకుంటూ గతంలోకి వెళ్ళింది. జ్ఞాపకాల తెరలు క్రమ్మాయి. అద్దాలతోపాటు కళ్ళుకూడా తుడుచుకుని చెప్పటం మొదలెట్టిందామె.

    "బేబీ! మీరు ప్రపంచానికి పెద్ద అయినట్లు కనిపిస్తారు. కానీ నాకు ఎప్పటికీ పసివాళ్ళే!

    ఈ సమయం కోసం కళ్ళ వాకిళ్ళలో ఒత్తులు వెలిగించుకుని ఎంతో కాలంనించి ఎదురు చూచానమ్మా! మన వంశానికి రెండు తరాలుగా ఒక శాపం వెంబడిస్తోంది.

    నాన్నగారు కూడా చాలాసార్లు అన్నారు.

    వారికి నేను ఒక్కర్తినే ఆడపిల్లను. నాకు మీరు ఇద్దరే ఆడపిల్లలు. మగపిల్లలు లేకపోవటం ఒక శాపం అవునో కాదో కాని ఇంతపెద్ద అజమాయిషీ చేయాల్సిన అవసరం ఉన్న వ్యవస్థ మనది.

    దీన్ని ఇంతకాలం ఒంటరిగా ఈదుకొచ్చాను.

    నా అనుభవంలో తెలిసిందేమిటి అంటే ఒక మగాడిచాటున ఉండి మన ఆడవాళ్ళం ఎంతయినా సాధించవచ్చు.

    మగరెక్కలకు వున్న బలం, మొండితనం ఆడ పక్షులకు ఉండదు. ఇంతపెద్ద వ్యవస్థ నా తరువాత మళ్ళీ మీ చేతుల్లోకి వస్తుంది! మీరు కూడా నాలాగే కష్టపడాలి! మన స్థాయిని గౌరవాన్ని ప్రజలతో మనకున్న బందుత్వాన్ని ప్రేమని వాళ్ళ ఆప్యాయతని ఆశీస్సుల్ని నిలుపుకోవాలంటే చాలా కష్టాలు పడాలి తల్లీ!

    అది నోటి మాటలతో అర్ధంకాదు.

    అనుభవించాకే ఆ యిబ్బంది తెలుస్తుంది.

    వచ్చే తరంలో అయినా మన కులదైవం జగదీశ్వరస్వామి ఆశీస్సులతో ఈ శాపం అంతరించిపోవాలి. గాయత్రి కడుపున ఓ మగకాయ కాస్తే నేను తృప్తిగా కన్ను మూస్తాను" అన్నదామె!

    "పెళ్ళి చేయకుండానే పిల్లలు ఎలా పుడతారేమిటి-?" అంది ఆమని.

    "చేస్తానమ్మా! అది చెప్పటానికే పిలిచాను" అంది సుమిత్రాదేవి.

 Previous Page Next Page