Read more!
Next Page 
కౌగిట్లో జాబిల్లి  పేజి 1

                                 


                           కౌగిట్లో జాబిల్లి

                                              - లల్లాదేవి

 




    చెరుకుపల్లి ఇప్పుడు చిన్న కుగ్రామం!

    ఒకనాటి దాని వైభవం తాలూకు గుర్తులు ఇంకా ఆ గ్రామంలో అక్కడక్కడ కన్పిస్తుంటాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలనించి ఆ ఊరికి రహదారులు ఉండేవి. అది ఆనాటి జమీందారీ వైభవం!

    కాని ఇప్పుడు తారురోడ్డు కూడా లేదు.

    బండి దారులు మాత్రమే ఉన్నాయి.

    ప్రయాణం చేయాలంటే ప్రక్కనున్న చిన్న పట్టణానికి నడిచి వెళ్ళి వాహనాలను అందుకోవాలి. పల్లె జనాలు అలా అలవాటు పడిపోయారు. అన్ని గ్రామాలలాగే అది కూడా వ్యవసాయ వృత్తిని చేపట్టిన వారితో నిండి వుంది. వారు పండించే పొలాలు ఒకనాటి జమీందారులవి!

    పాత కోటలాగా గతించిన జమీందారీ వైభవానికి మిగిలి ఉన్న చిట్టచివరి జ్ఞాపకం రాణి సుమిత్ర. ఆమె జీవితంలో ప్రధమ కాలం కొద్ది సంవత్సరాలు మాత్రమే ఆ ఇంటిలో జమీందారీ వెలుగులు కన్పించాయి.

    ఆ తరువాత కాలంలో వచ్చిన మార్పులు అన్నీ ఆ కుటుంబం వారిమీద తమ ప్రభావాన్ని చూపినాయి. సుమిత్రాదేవి పూర్వులు చాలామంది చుట్టుప్రక్కల తమ చుట్టుప్రక్కల జమీందారీలో ఉన్న గ్రామాలలో మంచి పనులు ఎన్నో చేయించారు. ముఖ్యంగా బడులు, గుడులు కట్టించారు.

    ఎన్నో కుటుంబాలను ఆపదలలో ఆదుకున్నారు.

    ఏ బడిలో శిలా ఫలకంమీద చూచినా వారి పూర్వుల పేర్లు కన్పిస్తాయి.

    దేవాలయాలకు ఇచ్చిన భూములు అన్నీ వారివే!

    ఆలయంలో పూజలు ప్రారంభం అవగానే శాశ్వత ధర్మకర్తలుగా వారి గోత్ర నామాలు విన్పిస్తాయి.

    తరాలపాటు జమీందారీ పద్ధతిలో సేకరించి దాచుకుంటూ వచ్చిన విలువయిన ఆభరణాలు మూలధనంగా నిలిచి ఉన్నాయి.

    ఇటీవల వాటిని ఆధునిక కాలానికి అణువు అయిన పద్ధతిలో బాంక్ లాకర్స్ లోకి చేర్పించింది  రాణి సుమిత్ర.

    ఆమె నివసించే చెరుకుపల్లి చుట్టు ప్రక్కల గ్రామాల వారు రాణి అనే బిరుదాన్ని ఆమె పేరులోంచి తొలగించలేదు.

    జీవితకాలంలో తొలగించే అవకాశాలు లేవు కూడ.

    ఎందుకంటే జమీందారీలను ప్రభుత్వంలో విలీనం చేసిన కాలంలో ఆమె చాలా ఉన్నతమయిన నిర్ణయం తీసుకుంది.

    జమీందారీల విలీనం సమయంలో గ్రామాలు ప్రభుత్వ పరమయ్యాయి కాని, రకరకాల పేరులతో ప్రభుత్వంతో ఆమె లాయర్లు పోరాడి మూడున్నరవేల ఎకరాలు మిగిల్చారు.

    ఒక కుటుంబం అంత సంపదని అనుభవించే అవకాశాలు ముందు ముందు వుండవు. మూడున్నరవేల ఎకరాలు నగరాలలోని భవనాలుకాక మిగిలినదంతా ప్రభుత్వం నించి తప్పించి తరతరాలుగా జమీందారీ కుటుంబాన్ని ఆశ్రయించి ఉన్న రైతులకు ఇప్పించటానికి కృషి చేసిందామె. అది వారికి తెలుసు.

    శాసనాలవల్ల మరో దాడి కూడ జరిగింది.

    భూమి నియంత్రణ చట్టం రూపొందుతున్న సమయానికి తండ్రి పెత్తనం పోయి ఏకైక వారసురాలు అయింది రాణి సుమిత్ర.

    వెంటనే శాసనం రావటానికి పూర్వం ఆమె ఒక సంచలనాత్మక సాహసోపేతం అయిన నిర్ణయం తీసుకుంది.

    కొద్దిపాటి భూమిని తమ క్రింద ఉంచుకుని మిగిలిన మూడువేల ఎకరాలకు పైగా భూములను పేద రైతులకు తానే పంచి ఇచ్చింది. అది కేవలం ప్రభుత్వ దాడి నుంచి తప్పుకునే ఒక నాటకంగా కాకుండా దఖలు పరిచింది.

    దాంతో ఆమె సంపద స్టాంపు పత్రాల మీద నుంచి పేద రైతు కుటుంబాల గుండెలలోకి బదలా అయింది.

    వారు ఆ భూములలో పండిన పంటలలో కొంత భాగాన్ని ఆమెకు కృతజ్ఞతగా చెల్లిస్తుంటారు.

    ప్రభుత్వాల నిర్ణయాలతో ఆస్తులు పోయాయి.

    కాని రాణి సుమిత్రాదేవి వాసి వన్నె మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆ ఇంటిలో ఆ ఛాయలే కన్పిస్తాయి.

    ఆ భవనాన్ని మెయింటెయిన్ చేసేందుకు కొన్ని లక్షల రూపాయల వ్యయం అవుతుంది. అదంతా రైతులు ఒక కూటమిగా ఏర్పడి ఆమె వల్ల లాభం పొందిన కుటుంబాలనించి తెచ్చి యిస్తారు.

    జీవిత కాలమంతా ఆమెకు అలాగే జరపాలని వారి నిర్ణయం. ఆ తరువాత ఏమవుతుందో తెలియదు.

    కాని రాణి సుమిత్ర జీవిత కాలం ఆ భవంతిలోనూ చుట్టుప్రక్కల గ్రామాల కొందరు ప్రజల గుండెల్లోనూ జమీందారి స్థాయి నుంచి దిగిపోదు.

    ఆమె జీవితంలో విషం కాదు అని చేదు విషంలాంటి విషాదముంది.

    మొదటి పిల్ల గాయత్రి. రెండవది ఆమని కడుపులో ఉండగా భర్త కాలం చేశాడు. ఆమె అభిమానులయిన రైతు కుటుంబాల వారి ఇళ్ళ, పెళ్ళిళ్ళు జరిగితే ఆ భవనం నించి మంగళ వాయిద్యాలతో మంగళ సూత్రాలు వెడతాయి. అదొక వేడుకలా జరుగుతుంది.

    ఆస్తి ఐశ్వర్యం పెంచుకోవటం ఒక గొప్ప.

    అయితే దాన్ని పంచి యివ్వటంలోని ఆనందమూ, క్రిందివారితో కలిసి కష్ట సుఖాలు పంచుకోవటంలో ఒక మధురమయిన అనుభవమూ వుంటాయి. అటువంటి తీయని మైత్రి ఆ భవంతిని అభిమానించే కుటుంబాలకీ మధ్య ఎంతో కాలంగా నిలబడింది.

    అది ఒక సాంప్రదాయంగా కూడా మారింది.

    పిల్లలు పుడితే మొదటిసారి చొక్కా కాని గౌనుకాని రాణి సుమిత్రాదేవి కుట్టించాలి. పేరు పెడితే ఆమెను అడిగి పెట్టాలి.

    అన్నప్రాసన చేస్తే వెండి గిన్నె చంచా ఆ భవనం నించే వెడతాయి. ఆ యింటి బాలికలు పుష్పవతులు అయితే వారికి సంబంధాలు విచారించటం భవనంలోంచి మొదలవుతుంది.

    అక్కడే నిర్ణయమవుతుంది.

    ఆమె దగ్గర ఉపాధులు సంపాదించుకున్న పండితులే ముహూర్తాలు నిర్ణయిస్తారు. చట్టబద్ధమయిన అధికారాలు సంపదలు కాకుండా ప్రేమ, అభిమానంతో ఆమె జమీందారీ గిరి వెలిగిస్తోంది.

    పోవలసింది అంతా పోయినా భవనంలో కీర్తి కాంతి తగ్గలేదు.

    రాణి సుమిత్రకు ఇప్పుడు అరవై నాలుగు సంవత్సరాలు.

    ఆవిడగారు ఒక రోజు సుస్తీగా ఉండటం కాదు తలనొప్పి అలసట అనే మాటలు కూడ ఎవరూ వినలేదు.

    గ్రామం ఎంత ఉందో  ఒకనాటి వైభవాన్ని చాటే జగదీశ్వరాలయం ప్రాకారం అంత ఉంది. ఆ గ్రామానికి మించిన ఆలయం అయితే బ్రహ్మోత్సవాల సమయం ఘనంగా ఉంటుంది.

    చుట్టు గ్రామాల నుంచి జనం గుంపులుగా ఉత్సవాలు చూడటానికి వస్తారు. ప్రతి ఏటా ఒక లక్ష రూపాయలు వెచ్చించి బ్రహ్మోత్సవాలను ఘనంగా ఆడంబరంగా జరిపిస్తుంది రాణి సుమిత్ర. ఆ అయిదు రోజులు తిరునాళ్ళు వాతావరణం కనిపిస్తుంది. రధోత్సవం పవళింపు సేవ వసంత సేవ దొంగల దోపిడీలాంటి సాంప్రదాయకమైన ఉత్సాహమంతా వెల్లి విరుస్తుంది. ఉట్టి పండుగలో ఉంగరాన్ని సంపాదించుకోవటానికి చుట్టుప్రక్కల గ్రామాల యువకులు సంవత్సరమంతా రహస్యంగా ప్రాక్టీస్ చేస్తుంటారు.

    కాసు బంగారంతో పాటు ఆ ఏటి కధానాయకుడు అవుతాడు. ఆ ఉట్టి పండుగలోని విజేత. పెళ్ళి కావలసిన యువతుల హృదయాలలో గిలిగింతలు పెడతాడు.

    ఆలయానికి పెద్ద ప్రాకారం, పెద్ద పెద్ద ఇత్తడి వాహనాలు ఉన్నాయి. జగదీశ్వరుని తేజో లింగానికి బంగారు తొడుగు వెండి పానవట్టము చేయించింది సుమిత్ర.

    ఆ అయిదు రోజుల వైభవం చూచేందుకు రెండు కళ్ళు చాలవు. ప్రభుత్వం గుర్తింపులో చెరుకుపల్లి గ్రామం పంచాయితీ స్థాయి గుర్తింపు కూడా లేదు. ప్రక్కనున్న మరో గ్రామం పంచాయితీ వారు ఇళ్ళ పన్నులు వసూలు చేసుకుపోతారు.

    నీటి సౌకర్యం బోరులు పంపులు అన్నీ సుమిత్ర ఆధ్వర్యంలో సలహా సహాయాలతో జరుగుతుంటాయి.

    అందువల్ల రాజకీయ వాదుల కన్నులు ఆ గ్రామం మీద పడలేదు. సంవత్సరానికి వారి క్షేమానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టె ఆమెను ఏ విషయంలో ఎవరూ కాదని అనరు.

    మిగిలిన గ్రామాలలోలాగా రెండు అభిప్రాయాలు ఉండవు. అందువల్ల రాజకీయాలు ప్రవేశించి రెండు పార్టీలుగా రూపుదాల్చటం, ఇద్దరు నాయకులు ఏర్పడటం జరగదు.

    మిగిలిన దేశంలో ఉన్న డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతాలు అక్కడ మాత్రం పనిచేయవు. అటువంటి అవకాశంలేని చోటుకి రాజకీయ వాదులు రారు.

    ఎలక్షన్స్ లాంటివి జరిగినప్పుడు నిలబడిన అభ్యర్ధులు ఆ గ్రామంలో ప్రచారం చేయరు. టెన్షన్స్ క్రియేట్ చేయటం అసాధ్యం! తమ అర్హతలను రాణి సుమిత్రతో చెప్పుకోవాలి!

Next Page