Previous Page Next Page 
వారుణి పేజి 2


    భర్త మాటల్లో నిజం కనిపించిందో- లేకపోతే కొడుకుని అనటానికి మనస్సు రాలేదో- యిదమిద్ధంగా తెలియదుగాని సుబ్బరత్నమ్మ ఆ మాటలకి ఏమీ అనలేదు.
    మౌనం వహించింది.
    భార్య మౌనం వహించడం చూసి నిట్టూర్చాడు నారాయణ.


                                                      *    *    *    *


    ఆయనకి తన రెండో కొడుకు సారధి తనతో తనిలా ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవటానికి యిష్టపడుతున్నానని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అదే గనక జరిగితే యింట్లో గందరగోళం తప్పదు అనిపించింది. కానీ వయస్సు తెచ్చిన అనుభవం ఆయన్ని అడ్డు చెప్పనివ్వలేదు.
    కానీ_
    అనుభవం నేర్చిన లౌక్యం ఆయన్ని మాట్టాడనివ్వలేదు. కొడుకుకి అడ్డుచెప్పి ఆపుచేయలేక పోయాడు.
    అయితే-పెద్దరికం-యింటి యజమాని తనం, తండ్రిగా తన భాధ్యత, హోదా- ఆయన్ని ఆగనివ్వలేదు.    
    "సారధీ! మీ అమ్మ మనస్సు కష్టపెట్టుకుంటుందేమో ఆలోచించు. ఎంత మారినా- ఎన్ని జరిగినా ఆడవాళ్ళు ఆడవాళ్లే."
    తండ్రి మనస్సులో భావం గ్రహించిన సారధి తనలో తనే చిన్నగా నవ్వుకున్నాడు. కానీ తండ్రితో తర్కించదలచుకోలేదు. అందుకే నవ్వుతో "మీకిష్టమే కదా నాన్నా! అది చెప్పండి!" అన్నాడు.
    నారాయణగారు చప్పున జవాబు చెప్పలేకపోయారు.
    "ఇష్టం-ఇష్టమంటే - నా యిష్టంతో అవుతుందా?" అయినా నాకిష్టం లేదంటే నువ్వు ఆగుతావా?" మరో అస్త్రం వదిలాననుకున్నారాయన.
    సారధికి తండ్రి మనస్తత్వం, తత్త్వం బాగా తెలుసు. అందుకే అతను ఆయన్ని నొప్పించ దలచుకోలేదు. మెల్లిగా అయినా, కఠినంగా అయినా సున్నితంగా అయినా తను అనుకున్నది సాధించ దలచుకున్నాడు అతను, అందుకే మృదువుగా అన్నాడు.
    "ఎదుగుతోన్న సంతానం విషయంలో వాళ్ళ వాళ్ళ అభిరుచుల్ని మీరు గౌరవిస్తారని తెలుసు నాన్నా!"
    తనలో తనే నవ్వుకున్నారాయన. "సారధీ! అభిరుచులు వేరు ఆచరణ వేరు. పైగా పెళ్ళి ఒక కుటుంబానికి ఒక సాంప్రదాయానికి చెందింది. ఆర్షేయ పౌరుషేయాలు, కులం గుణం, సాంప్రదాయం, వంశం- ఎన్నెన్నో విచారించాలి." గంభీరంగా అన్నారాయన.
    సారధి ఒక్క క్షణంపాటు మౌనమే వహించాడు. వాదనతో విషయాలు చక్కబడవు అనుకున్నాడు.
    "నా విషయం వేరు- పరిస్థితుల్ని, పరిసరాల్ని, మనుషుల్నీ మనస్తత్వాన్నీ గమనిస్తాను. దేనికీ అట్టే పట్టుదల వహించను. సారధీ! ఏ విషయంలోనైనా తల్లిదండ్రుల బాధ్యత మంచీ చెడూ చెప్పి వాళ్ళని హెచ్చరించడం వరకే. యుక్తవయస్సు రాకముందు విషయం వేరు. పెరిగి పెద్దయి, విద్యాబుద్ధులు సంతరించుకుని, ఒకరికి బుద్ధిచెప్పగలిగిన ఉద్యోగం నిర్వహిస్తూ వున్న పిల్లల విషయంలో యింకా జాగ్రత్తగా వుండాలి. చెప్పటం వరకే మా బాధ్యత. వినటం, ఆచరించదగ్గ నిర్ణయాలు తీసుకోవడం అన్నీ మీ మీ స్వంత విషయాలే.
    కానీ మీ అమ్మ విషయం వేరు. అసలు ఆడవాళ్ళ మనసులే ఒక విధంగా వుంటాయి. వాళ్ళు మనలాగా అంత సులువుగా పరిస్థితులతో, మారుతోన్న విషయాలతో రాజీపడలేరు. అందువల్లే చాలా కుటుంబాల్లో ఘర్షణలు వస్తూ ఉంటాయి." నింపాదిగా అన్నాడు నారాయణ కొడుకులోని మార్పుని ఓ కంట గమనిస్తూ.
    తండ్రి మనస్సు బాగా తెలిసిపోయినట్టుగా అనిపించింది సారధికి.
    అందుకే మృదు దరహాస చంద్రికలని పెదాలనుండి తొలగిపోనివ్వకుండా జాగ్రత్తపడుతూ అతి సౌమ్యంగా, అనునయ స్వరంతో, తన మనస్సుని వివరించుకునే ధోరణిలో అన్నాడు.
    "నాన్నా పెళ్ళి అమ్మా నాన్నల కోసం చేసుకోం! అవునా?"
    ఆ సూటి ప్రశ్నకి ఆయన జవాబు యివ్వలేదు. జవాబు చెప్పటానికి యిబ్బంది పడుతున్నట్టుగా చూశారు.
    "నాన్న బాధపడతారనీ, అమ్మ మనస్సు కష్టపెట్టుకుంటుందనీ ఆగిపోతామా? అలా అయితే అది ప్రేమ అవుతుందా? వ్యాపారంలో లాగా లాభనష్టాల్ని బేరీజు వేసుకుంటామా?"

 Previous Page Next Page