మెట్ల మీదుగా ఎక్కుతూ, ఆ మెట్లను లెక్కెట్టాడు. లోనికి నడిచాడు. మొత్తం ఎన్ని గదులున్నాయో, ఎన్ని వరండాలున్నాయో, ఆ వరండాలో ఎన్ని మెట్లున్నాయో, ఎన్ని హాల్స్ వున్నాయో, ఫేన్లూ, ట్యూబ్ లైట్లూ ఎన్నున్నాయో రెండేసి సార్లు లెక్కపెట్టుకుని, నోట్ బుక్ లో రాసుకుని, లోన్నుంచి బయటికోస్తున్న సమయంలో-
బిర్లామందిర్ దగ్గర కన్పించిన సూటు వ్యక్తి మళ్ళీ ఇక్కడ కూడా లోనకెళ్తూ కనిపించాడు.
ఆయన వేపు అనుమానంగా చూస్తూ, గబగబా మెట్లు దిగిపోయి బస్టాపులోకొచ్చాడు ఆంజనేయులు. అక్కడకొచ్చేసరికి హఠాత్తుగా ఆంజనేయులికి తను మరిచిపోయిన విషయం జ్ఞాపకానికొచ్చి, మళ్ళీ ఆర్ట్స్ కాలేజీ మెట్ల దగ్గరకు పరుగెత్తి కెళ్ళాడు. ఆర్ట్స్ కాలేజీని ఎవరు కట్టించారో తెలుసుకోవటం మరిచిపోయాడు. దానికి ఆన్సర్ ఎవరు చెప్తారు... అటూ ఇటూ గాభరాగా చూశాడు.
మెట్లు దిగుతూ ఓ చక్కని అమ్మాయి వస్తోంది.
"ఆర్ట్స్ కాలేజీని ఎవరు కట్టించారో కొంచెం చెప్తారా?"
ఆ వినయానికి తీవ్రంగా ముగ్ధురాలై పోయిన ఆ అమ్మాయి, ఒక్క నిమిషం ఆలోచనలోపడి -
"1945లో ఎన్.టి. రామారావుగారు కట్టించారండి" అని సీరియస్ గా చెప్పేసి వెళ్ళిపోయింది.
"అడక్కుండానే ఇయర్ కూడా చెప్పిందే... హిస్టరీ లెక్చరర్ లా వుంది..." అని ఆ అమ్మాయి హిస్టరీ నాలెడ్జికి అబ్బురపడి, మనసులో అభినందనలందజేసి నోట్ బుక్ తీసి-
"ఆర్ట్స్ కాలేజీని 1945లో ఎన్.టి. రామారావు కట్టించెను..." అని రాసుకుని ఆ బుక్ ని జేబులో పెట్టేసుకుని, ముందుకు నడిచాడు ఆంజనేయులు.
* * * *
మున్సిపల్ కార్పొరేషన్ హెడ్డాఫీసు వరండా మీద అటూ యిటూ పచార్లు చేస్తున్నాడు ఆంజనేయులు.
తనకు కావలసిన ఇన్ఫర్ మేషన్ ఎవరు చెప్తారబ్బా! డౌటులతో కొట్టుకిట్టాడుతున్నాడు. ఎవర్నడిగినా ఏమంటారోననే భయం. నవ్వినా ఫర్లేదు. తనకు ఇన్ఫర్ మేషన్ కావాలని నిర్ణయించుకున్నవాడై, ఎదురుగా చాలా చికాగ్గా చేతిగొడుగునే ఊపుకుంటూ వస్తున్న, ఓ వ్యక్తికి అడ్డంగా నిలబడ్డాడు. ఆ వ్యక్తి జూలుకుక్కలా తలెత్తి చూసి భౌ మన్నాడు. ఆ మున్సిపల్ ఆఫీసులో అతని భాష అందరికీ తెలుసు. ఆ భాష అర్థంకాక ఆంజనేయులు పిచ్చికుక్క కరిచిన వాడిలా అతనివేపు చూసి....
"సర్... సర్... రోడ్డు మీద తిరిగే ఆవారా కుక్కల ఇన్ ఛార్జి మీరేగదా సర్..."
అతను ఈసారి "భౌ భౌ" మని రెండు సార్లన్నాడు. అంటే ఔనని అర్థం.
"నాకా ఇన్ఫర్ మేషన్ కావాలి సర్..."
ఆ వ్యక్తి దీర్ఘం తీస్తే ఆ ఇన్ఫర్ మేషన్ నీకెందుకూ అని అర్థం...
తనకు ఇన్ఫర్ మేషన్ ఎందుకో చెప్పాక, సదరు కుక్కల ఇన్ ఛార్జి అతన్ని ఆ ఆఫీసులో వెనక పక్కనగల 'డాగ్స్ హోం'కి తీసుకువెళ్లాడు. అదొక కుక్కల మహాప్రపంచం.
అదొక కుక్కలా విశ్వవిద్యాలయం.
అదొక కుక్కల తత్త్వ మహాసభ. అక్కడ రకరకాల కుక్కలు, రంగు రంగుల కుక్కలున్నాయి. వాటి మొరుగుల సంగీత విశ్వవిద్యాలయం అది.
"ఇవి మొత్తం మూడు వేల కుక్కలు... వార్డుల వారీగా, జాతుల వారీగా, వ్యాధులవారీగా వీటిని విభజించాం... సెక్రటేరియట్ సమీపంలో నున్న వీధుల్లో దొరికిన వెర్రి కుక్కలివి... ఇవి బడ్జెట్ పేపర్లను తప్ప మరేమీ తినవు... ఇవి అసెంబ్లీ చుట్టూ, సెక్రటేరియట్ చుట్టూ తిరగటం వల్ల, ఇవెక్కువగా అరచుకోవడం, కరచుకోవడం, కొట్టుకోవడం, బక్క కుక్కల నోటి ముందు కూడుని లాక్కోవటం లాంటి నికృష్టమయిన పనులు చేస్తుంటాయి. వీటి పిచ్చి బాగా ముదిరినప్పుడు, డాక్టర్ల ప్రిస్కిప్షన్ మేరకు మా సిబ్బంది వీటిని ఎమ్మెల్యేల క్వార్టర్ల చుట్టూ, మంత్రుల యిళ్ళ చుట్టూ తిప్పుతారు... అంతే జబ్బు కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఇందులో కొన్ని కుక్కలు ఎలక్షన్లొచ్చినప్పుడు మాత్రమే అరుస్తాయి... వాటివల్ల ప్రమాదం అతి తక్కువ... ఇందులో యింకో రకం కుక్కలు వున్నాయి... వీటి శాతం ఎక్కువగా వుండటం వలన కొంచెం ఇబ్బందిగా వుంది... ఇవి సాయంత్రం ఆరుగంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ఎక్కువగా అరుస్తుంటాయి... పరమ భయంకరంగా ప్రవర్తిస్తాయి... వాటిలో అవి కరుచుకుంటుంటాయి... చాలాకాలం ఇదేం వ్యాధో మాకర్ధం కాలేదు... ఆఖరికి మావాళ్ళు పసికట్టేశారు... ఈ కుక్కలు ఎక్కువగా రవీంద్రభారతి, కళాభవన్, తెలుగు లలిత కళాతోరణం, త్యాగరాయగాన సభ, హరిహర కళామండపం, రేల్ కళారంగ్, ఇలా కొన్ని ఆడిటోరియాల దగ్గర తిరగటం వల్ల పిచ్చెక్కిపోయాయని తెలిసింది. వీటికి మందులేదని డాక్టర్లు చెప్పేశారు... అందుకే... వీటిని సాయంత్రాలపూట ఆ రవీంద్రభారతి, త్యాగరాయగాన సభ ప్రాంతాల్లో తిప్పుతుంటాం... అక్కడ ఆస్థాన ఉపన్యాసకుల ఉపన్యాసం మైకుల్లో వినిపించగానే వీటిల్లో మార్పొచ్చేస్తుంది"
ఆ వ్యక్తి చెప్పడం ఆపాడు.
ఆంజనేయులు థాంక్స్ చెప్పి బయటికొచ్చాడు. బయటికి వస్తున్న సమయంలో లోనికెళుతూ బిర్లామందిర్ సూట్లో వ్యక్తి కనిపించాడు.
"వీడెవడండీ బాబూ... నా వెనక పడ్డాడు..." అనుమానంగా ఆ వ్యక్తివేపు చూసి బయటికొచ్చాడు ఆంజనేయులు.
* * * *
కులీఖుతుబ్ షా టాబ్స్ లో ఒక్కొక్క సమాధి దగ్గరున్న వివరాల్ని వ్రాసుకుంటున్నాడు ఆంజనేయులు.
ఆ వివరాల్ని రాసుకుంటున్న అతనివేపు విచిత్రంగా చూస్తూ వెళ్ళిపోతున్నారు విజిటర్స్.
"ఎందుకలా అన్నీ అలా రాసుకుంటున్నాడతను..." ఒక వ్యక్తి పక్కనున్న వాడిని అడిగాడు.
"ఆ కులీకుతుబ్ షా ఆస్థుల గురించి గొడవలు ఈ మధ్య పేపర్లలో చదవడంలేదూ... ఆ కుతుబ్ షా వంశానికి చెందినవాడేమో... వాళ్ళ వాళ్ళ సమాధుల్ని లెక్కగట్టుకుంటున్నాడేమో?..." ఇంకో పెద్ద మనిషి కళ్ళ జోడు పైకెగదోసుకుంటూ అన్నాడు.
"అప్పట్లో ముస్లిం రాజులు ఎంత పొడవుగా, ఎంత దృఢంగా వుండేవారో... వాళ్ళ వంశానికి చెందినవాడయితే, వీడేంటి ఇలా... దిష్టిబొమ్మలా వున్నాడు..." ఎవడో వ్యాఖ్యానించాడు.
"రోజులయ్యా... బాబూ... ఆ ఆస్థులేవీ ఇప్పుడు లేవుగదా..."
ఆ మాటకు అందరూ జాలిగా ఆంజనేయులివేపు చూడసాగారు.