"అయ్యబాబోయ్... నేనేం కులీకుతుబ్ షా... వారసుడ్ని కాదు... వాళ్ళకీ నాకూ ఏ విధమైన సంబంధం లేదు... నాయనోయ్. ఈ సమాధుల్లో మా వాడెవడూ లేడు... నిజంగా నిజం..." అరిచి చెప్పాలనిపించింది ఆంజనేయులికి.
అప్పటికే తనని పిచ్చివాడి కింద జమకట్టారు. ఇంకా అలా అరిస్తే ఆ 'పిచ్చి'ని నిజం చేసేస్తారన్న నమ్మకం కలగడంతో ఆ ప్రయత్నాన్ని విరమించేసి....
అక్కడి నుంచి బయటికొస్తున్నాడు గబగబా-
అదే సమయంలో-
ఎడం వేపున్న ఓ సమాధివేపు అప్రయత్నంగా చూశాడు ఆంజనేయులు.
బిర్లామందిర్ సూటులోని వ్యక్తి....!
ఇప్పుడు నిజంగా అరవాలనిపించింది ఆంజనేయులికి.
"యా అల్లా... సమాధుల్లోని మహాపురుషుల్లారా... నేనెక్కడికెళితే అక్కడకు నా వెనకే వచ్చే... వీడెవడు... పోలీస్ సి.ఐ.డి.యా... దొంగా, ఖూనీఖోరా... వీడు నా వెనక రావాల్సిన అవసరం ఏమిటి? ఈసారి వీడు నా వెనక, ఇంకెక్కడయినా కనిపిస్తే దుర్యోధన గాడ్ సాక్షిగా అక్కడ ఒక మర్డర్ జరుగును గాక... జరుగును..." అని నిశ్చయించుకుని అక్కడ నుంచి పరుగున రోడ్డు మీద కొచ్చేశాడు.
ఆ బిర్లామందిర్ సూటు వ్యక్తి కూడా తనని చూసి అదే విధంగా అనుకుంటున్నాడని పాపం ఆంజనేయులికి తెలీదు.
* * * *
"దుర్యోధనుడి దేవాలయం ఇక్కడెక్కడుందండీ..." ఆ ప్రశ్న అడిగిన ఆంజనేయులి వేపు అనుమానంగా చూశాడు ఎదుటి వ్యక్తి.
"ఏవిటీ... మరోసారి చెప్పండి..." ఆంజనేయుల్ని ఆపాదమస్తకం చూస్తూ అడిగాడా వ్యక్తి.
"దుర్యోధనుడి దేవాలయం...."
"రాముడికి, కృష్ణుడికీ, ఈశ్వరుడికీ గుళ్ళున్నాయి కానీ, దుర్యోధనుడికి గుడేవిటయ్యా బాబూ..." అన్నాడతను బిత్తరపోతూ.
"దుర్యోధనుడు మా ఇలవేల్పండీ... అస్సలు మా వంశంలో వారికందరికీ కౌరవులే ఇలవేల్పులండీ... మా తాత... ధృతరాష్ట్రుడ్ని పూజించేవాడండీ... మా నాన్నకి దుశ్శాననుడి భక్తెక్కువండీ... నా మేనత్త గాంధారి నోములూ, వ్రతాలూ చేసేదండి... మా మామయ్యకి శకుని గాడ్ మరి నాకు చిన్నప్పటి నుంచీ దుర్యోధనుడి భక్తెక్కువండీ... మన రాష్ట్రంలో గాడ్ దుర్యోధన టెంపుల్ ఎక్కడుందో నాకు తెలీదండీ... ఎవరో... హైద్రాబాద్ లో వుందని చెప్పారు... ఇక్కడ కొచ్చిందగ్గర్నించీ వెతుకుతున్నానండీ... గాడ్ దుర్యోధనని తలచుకోనిదే నేనే పనీ చెయ్యనండి... రేపు నాకు ఓ కంపెనీలో ఇంటర్వ్యూ వుందండి..." చెప్పడం ఆపాడు ఆంజనేయులు.
"చూడు బాబూ... పదిహేనేళ్ళు ఒక సురక్షితమైన ప్రదేశంలో గడిపి వచ్చాను కాబట్టి, నీ వుపన్యాసం ఓపిగ్గా వినే ధైర్యం నాకొచ్చింది. ఇక ఎవర్నీ దుర్యోధనుడి గుడి గురించి అడక్క... మనసులోనే తల్చుకుని, నీ ఇంటర్వ్యూకి వెళ్ళిపో..." సలహా ఇచ్చాడా వ్యక్తి పిచ్చెత్తిపోతూ.
"ఫిఫ్టీన్ ఇయర్స్ ఏ సురక్షితమైన ప్లేస్ లో గడిపారు సార్..." ముందు కెళ్ళబోతూ అడిగాడు ఆంజనేయులు.
"చెప్పాలా... తప్పదా..." అన్నట్టు చూసి-
"ఎర్రగడ్డ అని ఓ పోష్ ఏరియాలో" తిక్కగా చెప్పేసి, చకచకా వెళ్ళిపోయాడా పెద్ద మనిషి.
అర్థం కాలేదు ఆంజనేయులికి.
ఆలోచిస్తూ, బస్టాపులో కొచ్చి, బస్సు రాగానే ఎక్కేసి టిక్కెట్ తీసుకుని నిద్రలోకి జారుకున్నాడు.
* * * *
"ఆర్టీసీ క్రాస్ రోడ్స్.... ఆర్టీసీ క్రాస్ రోడ్స్" అని గబగబా డ్రైవర్ దగ్గరున్న కండక్టర్ అరుచుకుంటూ, పేసింజర్స్ ని నెట్టుకుంటూ, ముందు డోర్ దగ్గరకొచ్చి....
"వీడెవడో... వీడితో ప్రతిరోజూ వేగలేక ఛస్తున్నానయ్యా... నేనే రూట్ లో వస్తే ఆ బస్సే ఎక్కుతాడు" అని ఏడుపు మొహం పెట్టి "వీడెక్కడున్నాడో నేనే చూసుకోవాలి టిక్కెట్టివ్వాలి... లేపి స్టాపు దగ్గర దింపాలి. ఇదెక్కడి గోలయ్యా బాబూ" అని-
"అయ్యా... ఒరేయ్... బాబూ... నీ స్టాపొచ్చింది... లేరా చిట్టి తండ్రీ... అని లేపాడు ఆంజనేయుల్ని.
అప్పుడే ఆంజనేయులికి దుర్యోధనుడు ప్రత్యక్షమై అడ్డమైన వరాలన్నీ ఇచ్చేస్తున్నాడు.
"భక్తా... నీ బస్టాపొచ్చేసింది... చివరాఖరు వరం కోరుకో..." అడిగాడు దుర్యోధన దేవుడు.
"ఇప్పుడెళ్తున్న ఈ ఇంటర్వ్యూలో గట్టెక్కి, నాకుద్యోగం వచ్చేటట్టు చూడు స్వామీ..."
"అలాగేలే... నీకుద్యోగం వస్తే... నాకేంటంట..." ఆ ప్రశ్నకు కంగారు పడిపోయాడు ఆంజనేయులు.
"నువ్వు దేవుడివా-దేవుడి వేషం వేసిన రాజకీయనాయకుడివా? గవర్నమెంట్ ఉద్యోగివా? పోనీలే... అడిగావు కదా... నాకుద్యోగం వస్తే... వంద గదల్తో నీకు అర్చన చేయిస్తాను... సరేనా..."
'ఠాంగ్'మని పెద్ద శబ్దం అయింది.
కలలో దేవుడు మాయమైపోయాడు. అదే సమయంలో 'దబ్'మని వీపుమీద ఓ మోత మోగడంతో ఆంజనేయులు హస్తినాపురం నుంచి ఇహలోకంలోని ఆర్టీసి క్రాస్ రోడ్స్ కొచ్చాడు.
"మళ్ళీ డ్రీమ్స్ లో కెళ్ళిపోయావా... చిట్టి ఫాదరూ... నీ స్టాపొచ్చింది దిగారా... దిగు... దిగి... నా జాబ్ ని కాపాడు..." జాలిగా ముఖం పెట్టిన కండక్టరు వేపు చిద్విలాసంగా చూసి గబగబా బస్సు దిగబోయి, బస్టాపు దగ్గర నిలబడ్డ ఓ పెద్దావిడను గుద్దెయ్యబోయి, ఆ ప్రయత్నాన్ని అతి కష్టమ్మీద నివారించుకోగలిగాడు.
ఆ పెద్దావిడ ఎవరో కాదు 'మంగళసూత్రాల మంగాదేవి.'
"నన్ను క్షమించండి" అని మంగళసూత్రాల్ని పైకి తీసుకోడానికి సిద్ధమైపోయిన సదరు మంగాదేవి. ఆ అవకాశం కలగక పోవడంతో ఆంజనేయులు వేపు ఒకింత అసహనంగా చూసింది.
ఆ చూపుల్ని పట్టించుకోలేదు ఆంజనేయులు. జేబులోంచి ఇంటర్వ్యూ కార్డ్ తీసి, ఆ కంపెనీ ఎడ్రసు చూసి, ముషిరాబాద్ రోడ్డు వేపు నడవడం ప్రారంభించాడు.
* * * *