Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 2

                          2

    

 

    లిఫ్టు పదమూడో అంతస్థులో ఆగింది. అతడు ఆలోచన్ల నుంచి తేరుకుని తన ఆఫీసులోకి అడుగుపెట్టాడు. అతడు తన పర్సనల్ రూమ్ లోకి ప్రవేసించి కుర్చీలో కూర్చోగానే సెక్రటరీ లోపలి వచ్చింది.

    ఆమె పేరు అహల్య. వయసు ముప్పై ఎనిమిదికి పైగా వుంటుంది. 42-36-42. ఒకప్పుడు అందంగా వుండేదేమో. ఇప్పుడు అది లేదుగానీ వైభవం కోల్పోయిన అందమైన కట్టడాల పూర్వపు ఛాయలు అలాగే వున్నాయి. అయినా అతడికి దానితో సంబంధంలేదు. ఆమె తెలివైంది. తన పనులు చక్కగా నిర్వర్తిస్తుంది. అతడికి కావల్సింది అంతవరకే.
   
    అతడు తన రచనలో చాలాసార్లు హీరోలకి అందమైన సెక్రటరీలను సృష్టిస్తూ వచ్చాడు. అది చదివి, అదంతా నిజమని ఎవరన్నా అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి వుండదు. తెలివైన వాడెవడూ తన సెక్రటరీ కుండవలసిన ముఖ్య అర్హత 'అందం' అని అనుకోడు. నెలజీతానికి సరిపడా పని రాబట్టుకోవాలను కుంటాడు. అందం ఎక్కడన్నా దొరుకుతుంది. కాస్త తెలివితేటలుండి కష్టపడి పనిచేసేవాళ్ళు దొరకరు. సాహిత్యానికీ, నిజ జీవితానికీ అదే తేడా, ఆ తేడాని అతడు ఎప్పుడూ గుర్తుంచుకుంటూనే వచ్చాడు. తనే పాఠకుడిగా, తను వ్రాసినదాన్ని బావున్నచోట ఆనందిస్తూ-బావోనిచోట విమర్శించుకుంటూ వచ్చాడు. ఇంతకాలం వరకూ అతడి విజయానికి అదే కారణం. ఇన్నాళ్ళకి...ఇప్పుడు.....పునః ఆలోచించుకోవలసిన స్థితి ఏర్పడింది.
   
    "యస్.యస్.ఎ. వాళ్ళ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం రెండున్నరకి కలుసుకోవచ్చునని అపాయింట్ మెంట్ ఇచ్చారు" అంది సెక్రటరీ లోపలికి వస్తూ.
   
    "గుడ్" అన్నాడు. యస్.యస్.ఎ. అంటే సిట్యుయేషన్ అండ్ సైకాలజీ అనాలిసిస్ ఇన్ స్టిట్యూట్. నలుగురు డాక్టర్లూ, ఇద్దరు పెద్ద పెద్ద మానసిక వైద్య నిపుణులూ, లాయర్లూ, వ్యాపార విషయాల్లో అనుభవం వున్నవాళ్ళూ కలిసి దాన్ని పది సంవత్సరాల క్రితం స్థాపించారు. పెట్టిన అనతికాలంలోనే అది చాలా పేరు సంపాదించింది. అందులో చాలా డిపార్టుమెంటులున్నాయి. వ్యాపారం నుంచి సెక్సువరకూ, సైకాలజీనుంచి ఆస్ట్రాలజీ వరకూ ఏ వ్యవహారాన్నయినా విపులంగా విడగొట్టి పరిశీలించి, సలహా ఇవ్వగలరు. ఫీజు మాత్రం అయిదు అంకెల్లో వుంటుంది. అది అతడికో సమస్య కాదు. యస్.యస్.ఎ. నుంచి అంత తొందరగా అపాయింట్ మెంట్ దొరకడం అదృష్టమే!
   
                         *    *    *    *
   
    INSTITUTE FOR SITUATION AND SYKOLOGY ANALYSIS
   
    సోలార్ కాంతి రేడియం బోర్డుమీద పడి అందంగా మెరుస్తూంది. ఒకప్పుడు 'సైకాలజీ' అన్న ఇంగ్లేషు పదపు స్పెల్లింగ్ 'పి'తో ప్రారంభమయ్యేదట. అమెరికన్ ఇంగ్లీషు విపరీతంగా విస్తరించాక బ్రిటీష్ ఇంగ్లీష్ ప్రభావం తగ్గిపోయింది.
   
    "మీరేనా భరద్వాజ?" అని అడిగింది రిసెప్షనిస్టు.
   
    అతడు తలూపాడు. ఆమె తన హ్యాండ్ బ్యాగ్ లోంచి ఆటోగ్రాఫ్ పుస్తకం తీసి ముందు పెడుతూ "మీరీ రోజు వస్తారని అపాయింట్ మెంట్ చార్టులో చూసి ఇది తెచ్చుకున్నాను" అంది. ఆమె కంఠంలో థ్రిల్ కొట్టొచ్చినట్టు కనబడుతూంది.
   
    అతడు నవ్వుతూ అందులో సంతకం చేశాడు.
   
    అంతలో లోపల్నుంచి పిలుపొచ్చింది.
   
    అతడు ఛాంబర్ లోకి ప్రవేశించాడు. యస్.యస్.ఎ. మేనేజింగ్ డైరెక్టరు లోపల కూర్చొని వున్నాడు.
   
    రెండు మూడు నిమిషాలపాటు మామూలు సంభాషణ జరిగాక విషయంలోకి వస్తూ అన్నాడు.
   
    "మిస్టర్ భరద్వాజా! మీ అప్లికేషనూ, మీ సమస్యా అంతా మా కమిటీ ముందు పెట్టాము. చాలా చిత్రమైన సమస్య మీది. అయినా దీన్ని పరిష్కరించగలమనే మేము అనుకుంటున్నాము. పరిష్కరించటమంటే 'తప్పు' ఎక్కడుందో చెప్పటం మాత్రమే. దాన్ని ఎలా సరిచేసుకోవచ్చో వీలైనంతవరకూ సూచిస్తాం. అంతవరకే మా పని."
   
    భరద్వాజ తలూపాడు.
   
    "సమస్యని ముందు ఎనలైజ్ చెయ్యాలి. దానికి తమ తమ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు మిమ్మల్నీ, మీ రచనల్నీ పరిశీలిస్తారు. ఒక డాక్టరు మిమ్మల్నీ - మీ మనస్తత్వాన్నీ పరీక్షిస్తాడు. మరో లిటరరీ ఎక్స్ ఫర్ట్ ప్రస్తుతం సాహిత్యం ఎలావుందో పరిశీలించి మాకు నివేదిక అందజేస్తాడు. ఒక సోషియాలజిస్టు పూర్వ రచనలకి, ఇప్పటివాటికీ తేడా గురించి రిపోర్టు అందజేస్తాడు. ఇద్దరు ముగ్గురు మనుష్యుల్ని నియమించాలి. వీళ్ళు ప్రజల అభిరుచి మీద ఇంటింటికీ తిరిగి సర్వే చేయాలి. వాళ్ళ కోసం ప్రశ్నోత్తరాల పట్టిక ఒకటి తయారుచెయ్యాలి. చాలా పెద్ద పని ఇది. మొత్తం అంతా పూర్తయి, రిపోర్టు ఇవ్వటానికి రెండు నెలలు పట్టవచ్చు. మా ఫీజు రెండు లక్షలా యాభైవేలు."
   
    భరద్వాజ తలూపాడు. ఫీజు ఎక్కువే. కానీ యస్.యస్.ఎ. సామాన్యమైనది. కాదు.
   
    ఎమ్.డి.అన్నాడు.
   
    "డాక్టర్ కీర్తి మిమ్మల్ని మొదట పరిశీలిస్తారు. కీర్తి సైకాలజీలో ప్రొఫెసర్. సోషియాలాజీలో కూడా ప్రవేశం వుంది. అన్నట్టూ మీరు మీ రచనలన్నిటినీ రెండు కాపీలు చొప్పున పంపగలరా?" అని అంటూండగా-
   
    కీర్తి ప్రవేశించాడు.
   
                      *    *    *    *   
   
    స్విచ్ ఆఫ్ చెయ్యగానే గది అంతా చీకటి అయింది. మరొకటి వెయ్యగానే బలమైన కాంతికిరణం వచ్చి భరద్వాజ మొహంమీద పడింది. అతడు కళ్ళు చిట్లించాడు.
   
    కీర్తి లైటు వెలుతురు సరిచేస్తూ "మనసు ప్రశాంతంగా వుంచుకోండి. నేను అడిగే ప్రశ్నలకి పెద్దగా ఆలోచించకుండా మనసుకు తోచిన సమాధానాలు చెపుతూ పొండి" అన్నాడు.
   
    భరద్వాజ మాట్లాడలేదు. కీర్తి అతడిని నిద్రలోకి పంపాడు.
   
    తరువాత ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. మేరు రచనలు ఎప్పుడు ప్రారంభించారు? మీకు బాగా నచ్చిన మీ రచన ఏమిటి? ఇలాంటి మామూలు ప్రశ్నలతో మొదలుపెట్టి క్రమంగా లోతుకి వెళ్ళాడు.
   
    భరద్వాజ కుర్చీలో ఇబ్బందిగా కదులుతూ "ఒకసారి లైట్లు వేస్తారా?" అని అడిగాడు. కీర్తి అతడి కోర్కెకి ఆశ్చర్యపోతూ వెళ్ళి అన్ని లైట్లు వేశాడు. గది ప్రకాశవంతమైంది.
   
    భరద్వాజ ఆ వెలుతురు భరించలేనట్టు కళ్ళు చిట్లిస్తూ "మీరు కోరుకునే ప్రశాంతతలోకి నేను వెళ్ళలేక పోతున్నాను డాక్టర్! నిజాయితీగా చెపుదామనుకున్నా కూడా మనసులో .... ఈ సమాధానం కరెక్టేనా, మరోసారి ఆలోచించి చెప్పాలా లాటి సందిగ్ధత కలుగుతూంది" అన్నాడు.
   
    కీర్తి కొద్దిగా దెబ్బతిన్నట్టు కనబడ్డాడు.
   
    "అవును డాక్టర్! మీ మొదటి ప్రశ్నగా రచనలు ఎప్పుడు ప్రారంభించారు? అని అడగ్గానే 'ఈ విషయం అప్లికేషన్ లో వ్రాశాను కదా.... అయినా ఎందుకు అడుగుతున్నాడు? కేవలం నన్ను ట్రాన్స్ లోకి పంపటానికే సుమా' అనుకున్నాను."
   
    కీర్తి నవ్వాడు.
   
    "మీరు రచయిత కదా. దీనికి మీరెలా వివరణ ఇస్తారు చెప్పండి."
   
    "అనుభూతిని అనుభవించటంకన్నా పరిశీలించటం ఎక్కువ అవటంవల్ల అనుకుంటున్నాను."
   
    "ఇంకో ప్రశ్న" కీర్తి మొదలుపెట్టాడు.
   
    "అడగండి డాక్టర్!"
   
    "సెక్స్ పట్ల మీ ప్రవర్తన, భావాలు ఎలా వుంటాయి?"
   
    భరద్వాజ నవ్వాడు.
   
    "ఎందుకు నవ్వుతున్నారు?"
   
    "మామూలుగానే తేలిక ప్రశ్నలతో మొదలుపెట్టారు. అది పనిచెయ్యకపోవటంతో ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్నతోనే నా మనసుని షాటర్ చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు. అవునా?"
   
    "ప్రతీ క్షణం అవతలివారి మనసులో ఏముందో అని ఆలోచించటం మాని, మీ మనసులోకి మీరు ప్రవేశిస్తారా?" మందలిస్తున్నట్టు అన్నాడు.
   
    "సారీ డాక్టర్."
   
    కీర్తి మరింత మందు ఇంజెక్ట్ చేస్తూండగా భరద్వాజకి బాహ్య స్పృహ పూర్తిగా పోయింది. మత్తుగా అతడి ప్రశ్నలకి జవాబు చెప్పసాగాడు.
   
                              3
   
    దాదాపు నెల గడిచింది.
   
    ఎస్.ఎస్.ఎ. వాళ్ళు ఏం చేస్తున్నారో అతడికి తెలియదు. కీర్తి అతడిని పరీక్షించాక ఇంకో ఇద్దరు అతడి దగ్గిర మరో కోణంలో ఇంటర్వ్యూ తీసుకున్నారు. అతడి జీవితంలో ముఖ్య సంఘటనలు కూడా వాళ్ళు అడిగారు. ఎవరికీ తెలియని తన వ్యక్తిగత విషయాలు కూడా కీర్తికి చెప్పాడతడు.

 Previous Page Next Page