Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 3

 

      అలా చెప్పటం భరద్వాజకి ఇష్టంలేదు. కానీ కీర్తి అలా అడగటానికి కారణాలు వివరించాక కన్విన్స్ అయ్యాడు. రచయిత మీద గతం తాలూకు సంఘటనలు ప్రభావమూ.... అతడి చుట్టూ చాలాకాలంగా పేరుకుని వున్నా వాతావరణమూ.....మనసుమీద అనుభవాల ముద్రలూ....స్నేహితుల ప్రభావం......ఇవన్నీ సంయుక్తంగా కలిసి పనిచేసి అతడి రచనని శాసిస్తాయి. అందుకే రచయిత మాటి మాటికీ తన స్నేహితుల్ని చుట్టూ వున్న వాతావరణాన్నీ మారుస్తాడు.
   
    'ఈ రోజు నేను వ్రాయలేను. నాకు మూడ్ లేదు' అని ప్రొఫెషనల్ రైటర్ ఎవరూ అనరు. అలా అంటే అతడు ప్రొఫెషనల్ రైటర్ కానే కాదన్నమాట. అవసరం వస్తే అతడు సినిమా 'క్యూ'లో నిలబడి కూడా వ్రాయగలిగి వుండాలి.
   
    ఈ విధమైన తాత్కాలికమైన మూడ్ ప్రభావం రచయితల మీద వుండకపోయినా, దీర్ఘకాల పరిస్థితుల ప్రభావం మాత్రం పడితీరుతుంది. ఒక్కొక్కప్పుడు తనమీద తనకే జాలి, సమాజం మీద కసి, లేదా ఒక సిద్దాంతంపట్ల విపరీతమైన ఆప్యాయత.... ఇలాటివి ఏర్పడతాయి.
   
    భరద్వాజ అన్నాడు-"ఒక్కసారి అలాటి ఉచ్చుల్లో ఇరుక్కున్నాక, రచయిత మనసు నుంచి వెలువడే తరంగాలకీ, పాఠకులకి దూరమవుతాడు."
   
    "అవును. రచయిత తమకి ఒక 'కొత్తగా' చెప్పేది ఏదీ లేదని పాఠకులు గ్రహించాక అతడిని వదిలేస్తారు."
   
    "ఇప్పటి పాఠకులు మరీ సెన్సిటివ్ అయిపోయారు. పూర్వకాలం అలా వుండేది కాదు. ఒకే వస్తువు రకరకాల మూసల్లో పోస్తే చదివేవారు. ఆ రోజుల్లో ఒకే జేమ్స్ బాండ్ కథ పదహారు సినిమాలుగా వస్తే విరగబడి చూశారట. ఇప్పుడలా కాదు. సూపర్ బాండ్ చిత్రాలు రెండో చిత్రం నుంచీ ఫెయిలయ్యాయి. రాబోట్ (మరమనిషి) మీద వచ్చిన చిత్రాలన్నీ వరుసగా ప్లాప్ అయ్యాయి" అన్నాడు భరద్వాజ.
   
    "ఇంత జాగ్రత్తగా వున్నా మీ ఓటమికి కారణం ఏమిటి?"
   
    భరద్వాజ నవ్వేశాడు. "అది కనుక్కోవలసింది మీరు."
   
    కీర్తి కూడా నవ్వేసి "నిజమే" అన్నాడు.
   
    తరువాత ఇద్దరూ భరద్వాజ ఆఫీసుకి వెళ్ళారు.
   
    రచనా వ్యాసంగం మీద రకరకాల పద్ధతుల్లో తను పెట్టే పెట్టుబడిని అతడు కార్లో ఆ డాక్టర్ కి సూచించాడు. తన సిబ్బందిని పరిచయం చేశాడు.
   
    చివరికి ఇద్దరూ ఒక గది దగ్గరకు వచ్చాడు. దానికి తాళం వేసి వుంది.
   
    కీర్తి అతడివైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
   
    "అది నా పర్సనల్ గది" అన్నాడు భరద్వాజ. "దయచేసి దాన్ని తెరవమని అడగొద్దు. నా రచనలకీ, దానికీ ఏ సంబంధమూ లేదని మాత్రం హామీ యిస్తున్నాను."
   
    కీర్తి ఏదో అడగబోయి తటపటాయించి సరే అన్నట్లు తలూపి అక్కన్నుంచి కదిలాడు. నడుస్తూ "పూర్వం జానపద కథల్లో రాజకుమార్తె రాజకుమారుడితో 'ఏ గదిలోకైనా వెళ్ళు కానీ ఆ ఒక్క గదిలోకి మాత్రం వెళ్ళకు' అనేదట. అలాంటి గది కాదు కదా' అన్నాడు.
   
    భరద్వాజ నవ్వి "కాదు......కాదు.....అలాటిదేమీ కాదు" అన్నాడు.
   
                               4
   
    అతడూ, అతడి భార్యా, కూతురూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని వున్నారు. అతడి కూతురికి ఇరవై నాలుగేళ్ళుంటాయి.
   
    ఏదో ఎలక్ట్రానిక్ కంపెనీలో పని చేస్తూంది. ఆమె మంచి అమ్మాయి. నెలజీతం అంతా తీసుకొచ్చి ఇంట్లో ఇస్తుంది. అతడి కొడుకు కూడా అతడితోనే వుంటాడు. చాలా తక్కువ కుటుంబాలకే ఈ అదృష్టం దొరుకుతుందని అతడిచ్చే డిన్నర్ పార్టీల్లో చాలామంది వాళ్ళని పొగుడుతారు.
   
    అతడి కొడుకులిద్దరూ మంచి క్రమశిక్షణతో పెరిగారు. చిన్నప్పటి నుంచీ హాస్టల్స్ లో వుండటంవల్ల వారికా శిక్షణ వచ్చింది.
   
    అయితే పెద్దకొడుకు మాత్రం చదువుకొనే రోజుల్లో ఎందుకో మానసిక వ్యధకి (డిప్రెషన్) గురి అయి డ్రగ్స్ కి అలవాటు పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజుల్లో - అంటే 2025 ప్రాంతంలో ఈ డిప్రెషన్ యువకుల్లో మహమ్మారిలా వ్యాపించి, చాలామంది నల్లుల్లా మాడిపోయారు. ఈ ఆత్మహత్యలకి కారణం అన్వేషించటం కోసం ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. కానీ అంతలో వాటంతట అదే తగ్గిపోవటంతో ఆ ఫైలు మూలపడింది. ఇప్పటికీ అది ఎందుకు జరిగిందో ఎవరికి తెలీదు.
   
    అదే కథాంశంగా అతడు ఆ రోజుల్లో వ్రాసిన "నా హత్యకి హంతకుడు" అన్న నవల సూపర్ హిట్ అయింది. అతడు వ్రాసిన గొప్ప రచనల్లో అది ఒకటి అని ఇప్పటికీ విమర్శకులు చెప్పుకుంటారు.
   
    రెండో కొడుకు పోలీస్ డిపార్టుమెంట్ లో ఇన్ స్పెక్టర్. అదే ఊరిలో యాభై మైళ్ళ దూరంలో వున్న ఒక కాలేజీలో పనిచేస్తున్నాడు. విద్యార్ధులు ఆయుధాల్తో క్లాసుల్లోకి ప్రవేశించకుండా వెతికి చూసే బాధ్యత అతడిది. ఏవైనా ముఠాల్తో (మాఫియా) వారికి సంబంధం వుందేమో చూడవలసిన పనికూడా అతడిదే అవటంతో అతడి దినచర్య క్రమబద్దంగా వుండదు.
   
    అసలారోజు గొప్పతనం - కనీసం ముగ్గురు కలిసి భోజనం చెయ్యటం! అతడి భార్య సి.వి.టి. సంస్థల్లో పని చేస్తూంది. దారుణమైన నష్టాల్తో సినీరంగం మూతపడే స్థితిలో సినిమా, టీ.వీ., వీడియో యజమాన్లకు ఒప్పందం కుదిరాక, ఒక్కొక్క థియేటర్ లో ఒక్కో సినిమా వేసే పద్దతి పోయి, అన్ని సినిమా హాళ్ళల్లోనూ ఒకరోజు ఒకే సినిమా వేసే పద్దతి వచ్చింది. దీనివల్ల ప్రతీ హాల్లోనూ ఒక ప్రొజెక్టర్ పెట్టుకోవలసిన అవసరం లేకుండా సర్క్యూట్ వీడియో ద్వారా ఒకచోట నుంచే అన్ని సినిమా హాళ్ళకూ చిత్రాల్ని పంపే వీలు కలిగింది. దాంతో చిత్ర నిర్మాణాల సంఖ్య బాగా తగ్గిపోయినా, పరిశ్రమ కనీసం బ్రతికి బట్టకట్ట గలిగింది.
   
    "ఎప్పుడూ బోరు సినిమాలే వేస్తారేం మమ్మీ?" అంది కూతురు.
   
    "వాళ్ళేం తీస్తే అవి వెయ్యాలి. పోటీ తగ్గిపోయాక తక్కువ ఖర్చుతో మరీ దారుణమైన చిత్రాలు నిర్మిస్తున్నారు" అంది తల్లి.
   
    భరద్వాజ మౌనంగా వాళ్ళ మాటలు వింటూ భోజనం పూర్తి చేశాడు.
   
    అతడు తన గదిలోకి వస్తూ వెనుకే కూతురు కూడా రావటం గమనించాడు. ఆగి ఏమిటన్నట్లు చూశాడు.
   
    ఆ అమ్మాయి కొద్దిగా తటపటాయించి "నాక్కొద్దిగా డబ్బు కావాలి" అంది.
   
    "ఎందుకు?"
   
    "ఆ ... అబార్షన్ కి."
   
    అతడు కాస్త షాక్ అయి ఆశ్చర్యంగా "ఎందుకంత బాధ్యతారహితంగా ప్రవర్తించావ్?" అడిగాడు ఇంగ్లీషులో.
   
    "తను వెసక్టమైజ్ డ్ అని చెప్పాడు. దాంతో టి.హెచ్.టి. గురించి వత్తిడి చేయలేదు" అంది కూతురు తండ్రితో.
   
    అతడు వెంటనే మాట్లాడకుండా "కొంచెం జాగ్రత్తగా వుండాలి" అన్నాడు నచ్చచెపుతున్నట్టు.
   
    ఆమె తలూపింది. మళ్ళీ అతడే - "నే చూస్తాలే. నీకు ఆస్పత్రుల గురించి అంతగా తెలీదు" అన్నాడు.
   
    ఆమె మొహం విప్పారింది. ఎంతయినా చిన్నపిల్ల! "థాంక్యూ డాడీ" అని వెళ్ళిపోయింది.
   
    ఆ తరువాత అతడు ఈ వార్త భార్యకి చెప్పాడు. "నువ్వో రోజు శలవు పెట్టాలి. ఆస్పత్రిలో వుండాల్సి వస్తుంది కదా."
   
    "ఈ వారం వద్దు. వచ్చేవారం పెట్టుకుందాం. ముందు చెప్పకుండా శలవు అడిగితే ఒప్పుకోరు. అయినా *టి.హెచ్.టి. గురించి జాగ్రత్త తీసుకోకుండా ఇలా ఎందుకు చేసిందటా?"
   
    "వాడు ఆపరేటెడ్ అని చెప్పాడట."
   
    "ఈ కాలంలో ఆపరేషన్ లెవరు చేయించుకుంటున్నారు?"
   
    "ఇక దాని గురించి తనతో ఏమీ అనకు. అనవసరంగా ఖర్చు పెంచానని అది ఇప్పటికే బాధపడుతూ వుండవచ్చు" అన్నాడు. అంతలో ఫోన్ మ్రోగింది.
   
    అట్నుంచి కొడుకు.
   
    "నాకు కంగ్రాట్స్ చెప్పాలి ఫాదర్."
   
    "ఎందుకు?"
   
    "ముందు చెప్పు."
   
    "కంగ్రాట్స్....... ఎందుకు?"
   
    "స్టూడెంట్స్ లో అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ ని పట్టుకున్నాను. త్వరలోనే నాకు మెడల్ కూడా ప్రకటించబోతూంది డిపార్టుమెంట్."
   
    "నిజంగానా! కంగ్రాచ్యులేషన్స్ మై బోయ్" సంతోషంగా అన్నాడు భరద్వాజ "ఎక్కడనుంచి మాట్లాడుతున్నావ్ నువ్వు?"
_____________________________________________________________________________________________
    * శరీర ఉష్ణోగ్రతకంటే తక్కువ టెంపరేచర్ లోనే వీర్యం సజీవంగా వుంటుంది. అందుకే పురుషుడి శరీరం నుంచి వృషణాలు కాస్త దూరంగా వుంటాయి. రతికి ముందు కొన్ని పద్దతుల ద్వారా వాటిలో ఉష్ణం కలిగించి సంతానోత్పత్తిని అరికట్టవచ్చునని కనుక్కున్నాక కుటుంబ నియంత్రణ సులభమైంది. అదే టెస్టికల్ హీటింగ్ టెక్నిక్. (టి.హెచ్.టి)

 Previous Page Next Page