Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 1

                                 

                             ఆనందో బ్రహ్మ
   
                                               --యండమూరి వీరేంద్రనాథ్
   
   
                           
  

 

     2054 ఎ.డి.
   
    ప్రపంచం.
   
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా.
   
    ఆంధ్రదేశం.
   
    సమయం 10-55.

   
                                      *    *    *    *
   
    రామారావ్ స్టాచ్యూ నుంచి రాజీవ్ అవెన్యూ వైపు వెళుతూంది భరద్వాజ కారు.
   
    భరద్వాజ మనసంతా చిరాకుగా వుంది. అతడి మూడ్ కి సరిపడ్డట్టే కారులో పాట వస్తూంది. "కలిమిలేములు... కష్టసుఖాలు.... కావడిలో కుండలనే భయమేలోయీ..."
   
    ఎప్పటి పాట అది? అతడు క్యాసెట్ తీసుకుని చూశాడు. దాదాపు తొంభై సంవత్సరాల క్రితం పాట.
   
    అతడు ఛానెల్ మార్చాడు.
   
    "ఆగదూ ఆగదు ఈ నిముషమూ.... ఆగితే సాగదు ఈ లోకము" బాలసుబ్రహ్మణ్యం- 1981.
   
    'అవును. ఆగదు ఈ లోకము ఎవరికోసమూ.'
   
    ఎనభై సంవత్సరాల క్రితం ఘంటసాల లేకపోతే తెలుగులో పాటల్లేవనుకొనేవారట. అప్పట్లో జనం పక్కనుంచి రాకెట్ లా దూసుకొచ్చాడు బాలసుబ్రహ్మణ్యం. అతడి తరువాత వచ్చింది ఉదిత్ నారాయణ్. ఆ తరువాత అనిల్ గోవింద్. అప్పటి నుంచీ మొన్న మొన్నటివరకూ అతడు ఏకచక్రాధిపతిలా రాజ్యమేలాడు. చిన్న కుదుపు.....రామ్ కె. గంటి (పూర్తి పేరు కోగంటి రమణ్రావో, కొడవటిగంటి రామారావో) అనే కుర్రవాడు చిన్న ప్రయోగం చేశాడు. ఇళ్ళల్లో ఉపయోగించుకొనే పరికరాలు దువ్వెన, చీపిరికట్ట, గ్లాసులో నీళ్ళు-వీటిని వాద్యాలుగా ఉపయోగించి చిన్న ప్రయోగం చేశాడు. ఎనభై సంవత్సరాల క్రితం, కాస్త పురుష స్వరం మిళితమైన స్త్రీ కంఠం కలిగి ఉషా ఉతప్ ని ఎలా ప్రజలు వెర్రిగా ఆదరించారో, ఆడపిల్లలా వున్నా అతడి నాజూకు కంఠాన్ని అంత విపరీతంగానూ ఆమోదించారు. నెలరోజులు తిరిగేసరికి పాటల ప్రపంచానికి రామ్కేగంటి మకుటంలేని మహారాజు అయిపోయాడు. తెర మరుగుకు వెళ్ళిపోయే స్థితినీ, మానసిక వ్యధనీ తట్టుకోలేక అనిల్ గోవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా 2038లో జరిగింది.
   
    మార్పు సహజం! కానీ దాన్ని అంగీకరించటం కష్టం.
   
    భరద్వాజ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి అది.
   
    వరుసగా మూడు నవలలు అతడివి ప్లాప్ అయ్యాయి.
   
    ఆంద్రదేశపు మొట్టమొదటి మగ ప్రొఫెషనల్ రైటర్ అతడు.
   
    ఇరవై సంవత్సరాల క్రితంవరకూ భరద్వాజ ఫ్యామిలీ ప్లానింగులో పనిచేసేవాడు. క్రీ.శ. 2024లో ఎ.జె.పి. (ఆంధ్రా జనతాపార్టీ) అధికారంలోంచి తప్పుకుని యంగ్ టర్మ్స్ అధికారంలోకి వచ్చి, ఇద్దరుకన్నా ఎక్కువ పిల్లలు వుండకూడదని కుటుంబ నియంత్రణని చట్టబద్దం చేశాక, ఇక ఆ డిపార్టుమెంటు అవసరం లేకపోయింది. అతడు ఉద్యోగంలోంచి తొలగించబడి నిరుద్యోగి అయ్యాడు. నిరుద్యోగి అయ్యాక ఏం చెయ్యాలో తోచక రచనలు చేపట్టాడు.
   
    కుటుంబ నియంత్రణ రంగంలో తనకున్న అనుభవంతో..... ఒక మతం వారు దాన్ని అమలు జరిపి, వేరొక మతం వారు జరపకపోతే భవిష్యత్తులో వచ్చే దుష్పరిణామాల గురించి నవల వ్రాశాడు. వేర్వేరు ఆస్పత్రులు తిరిగి, ఏ యే మతంవారు ఎంతమంది ఆపరేషనులు చేయించుకొన్నదీ లెక్కలు సేకరించాడు. చేయించుకొనని వారి కొడుకులకి కొడుకులు కొడుకులకి మనవలూ.... ఈ వరుసన పుట్టుకుంటూ పోతే యాభై సంవత్సరాల్లో ఏమవుతుందీ అని ఊహించి, చదివేవాళ్ళకి ఇదంతా నిజమేకదా అనిపించేలా వ్రాసాడు. ఆ పుస్తకం మార్కెట్లో విడుదలయి కొద్దిగా విజయవంతం కాబోతూన్న తరుణంలో ప్రభుత్వం అతడిని అరెస్టు చేసింది. దాంతో సంచలనం రేగింది.
   
    ఇది జరిగిన రెండు నెలలకి కేసు కోర్టుకి వచ్చింది. అతడు మతద్వేషాన్ని రెచ్చగొట్టే పనేమీ చేయలేదనీ, అతని రచన రాజ్యాంగ విరుద్దం కాదనీ కోర్టు అభిప్రాయపడి విడుదల చేసింది.
   
    సరిగ్గా అదే సమయానికి అతడి రెండో నవల విడుదలైంది. రాక్ హిల్స్ లో వున్న ఒక బ్యాంకుని భూగర్భంలోంచి ప్రవేశించి ఎలా దొంగతనం చేయవచ్చో విపులీకరించే నవల అది. ఆ నవల రిలీజైన నాలుగో రోజున ఆ బ్యాంక్ ని సరిగ్గా అలాగే లూటీ చేశారు. దాంతో సంచలనం ప్రారంభమైంది.
   
    అదీ ప్రారంభం!
   
    ఆ తరువాత అతడికి ఎదురులేకపోయింది!
   
    వరుసగా మూడు - నాలుగు అయిదు నవలలు సక్సెస్ అయినయ్. ఇన్ కంటాక్స్ తట్టుకోవటానికి, అతడు మానేజింగ్ డైరెక్టరుగా ఆంద్రదేశపు కార్పొరేట్ సెక్టార్ లో మొట్టమొదటి సాహితీ సంస్థ - భరద్వాజ అండ్ కంపెనీ స్థాపించబడింది. ఒక సెక్రటరీ, డెక్టా ఫోను, ఆరుగురు గుమాస్తాలతో అతడు సాహిత్యాన్ని 'ప్రొఫెషనలైజ్' చేశాడు. రచయిత పేరు మీద కాకుండా, కంపెనీ పేరు మీద పుస్తకాలు రిలీజ్ అవటం ప్రారంభమయింది.
   
    మొదటి దెబ్బ మొన్న మొన్న.... అంటే 2042 లో తగిలింది. బ్యాట్ పట్టుకుంటే చాలు అమ్మాయిల్నీ వెర్రెక్కించి.... తరువాత వరుసగా ఫెయిలయి పన్నెండవ స్థానానికి రిజర్వ్ డ్ గా తోయబడి, ఆడేవాళ్ళకి డ్రింకులు సప్లయ్ చేయటానికి నియమింపబడ్డ క్రికెట్ ఆటగాడి మానసిక వ్యధ వర్ణనాతీతం. అతడి స్థితి అలాగే వుంది.
   
    'వరుసగా మూడు.....మూడు ఫెయిల్యూర్లు' అనుకున్నాడు తనలో.
   
    కారు వేగంగా వెళుతూంది.
   
    ట్రాఫిక్ సమస్యని తట్టుకోలేక ఏ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఆ ఆఫీసుకి రెండు కిలోమీటర్ల దూరంలోపలే నివసించాలన్న రూలు పెట్టిన తరువాత వీధులు చాలా ఖాళీగా వుంటున్నాయి.
   
    అతడు తన ఆఫీసుకు చేరుకొనేసరికి 11-15 అయింది. కారు పార్క్ చేసి, లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు. అతడి ఆఫీసు 13వ అంతస్తులో వుంది. తలుపులు మూసుకుని 13 అన్న బటన్ నొక్కాడు. నెమ్మదిగా లిఫ్ట్ పైకి వెళ్ళటం ప్రారంభించింది. అతడు యధాలాపంగా టి.వి. స్క్రీన్ వైపు చూశాడు.
   
    వైర్ లెస్ వీడియో అది. ఏదో ఇంగ్లీషు సినిమా వస్తూంది. ఒక నలభై అయిదేళ్ళ స్త్రీని పదిహేనేళ్ళ కుర్రవాడు బలాత్కారం చేస్తున్నాడు. ఆ చిత్రం పేరేమిటా అని అతడు ఛానెల్ తీసి చూశాడు.
   
    "రేప్ దై మదర్"
   
    అంతలో లిఫ్ట్ అయిదో అంతస్తులో ఆగింది. ఒక లావుపాటి వ్యక్తి ప్రవేశించాడు. లిఫ్ట్ తిరిగి పైకి కదలటం ప్రారంభించింది.
   
    భరద్వాజ జేబు తడిమి, అందులో బాల్ పాయింట్ పెన్ వుండటం గమనించి సంతృప్తి చెందాడు. అది పెన్ కమ్-టార్చ్ లైట్-కమ్-వాచ్-కమ్-కారు తాళం-కమ్-లేజర్ బీమ్ పిస్టల్-కమ్-ట్రాన్సిష్టర్. ఈ రోజుల్లో అలాటి ఆయుధం లేకుండా బయట తిరగటం ప్రమాదకరం. లిఫ్ట్ ల్లో చోరీలు మరీ సర్వసాధారణం అయిపోయాయి. అయితే అదృష్టవశాత్తూ అప్పుడేమీ జరగలేదు. ఏడో అంతస్థులో లావుపాటి వ్యక్తి వెళ్ళిపోయాడు. లిఫ్ట్ మళ్ళీ బయల్దేరింది. టి.వి.లో తల్లిని హత్య చేస్తున్నాడు కొడుకు.
   
    ప్రజల టేస్టు మారిందనటానికి అదే గుర్తు. దాదాపు రెండు వందల రోజుల్నుంచి ఆ చిత్రం 'విజయవంతంగా' ప్రదర్శించబడుతూంది.
   
    అతడిలో మెచ్చుకోవలసిన విషయం ఒకటున్నది. సమస్యల్ని అతడు చర్చించడు. సమస్యకి సమకాలీనతే తప్ప మరో ప్రాముఖ్యత లేదని అతడు నమ్ముతున్నాడు.
   
    మూడువందల సంవత్సరాల క్రితం భర్త చచ్చిపోతే భార్యని తగుల బెట్టేవారట. రెండువందల సంవత్సరాల క్రితం భర్త చచ్చిపోతే బొట్టు (అదేదో స్త్రీలకు నుదుట చిన్నమచ్చలా వుండేదట) దాన్ని తీసేసేవారట. వంద సంవత్సరాల క్రితం మరీ చిత్రం - అమ్మాయి పెళ్ళి చేసుకొనేటప్పుడు 'కట్ నం' అని కొంత డబ్బు ఇవ్వవలసి వచ్చేదట. ఇవన్నీ చరిత్ర పుస్తకాల్లో చదువుతూంటే అతడికి నవ్వొస్తూంది. క్రీ.శ. 2026లో మూడో ప్రపంచయుద్ధం అయ్యాక స్త్రీలలో వివాహంపట్ల విముఖత, పెరగటం, తల్లిదండ్రుల్లో కూతుళ్ళకి పెళ్ళి చెయ్యకపోతే తప్పు అనే భావం పోవటం - ఈ రెండు పరిణామాల్తో ఈ వరకట్నం సమస్య ఊడ్చి పెట్టుకుపోయింది.
   
    మారుతున్న ప్రజల టేస్టుకి అనుగుణంగా అతడూ తన రచనల్లో మార్పు తీసుకొస్తూనే వున్నాడు. అయినా వరుసగా మూడు నవలలు ఫెయిలయ్యాయి అంటే.....
   
    ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది.
   
    ఎక్కడ?
   
    కొద్ది రోజుల్లోనే 'ఆ తప్పు' ఏమిటో బైటపడబోతోందని అతడాక్షణం వూహించలేదు.

Next Page