Read more!
 Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 2

   

   మరి అసలేం జరిగి వుంటుంది.
   
    ఆమె వ్రాసిన ఉత్తరం మళ్ళీ ఆమె పుస్తకంలోకి వచ్చింది అంటే - అది చేరవలసిన చోటుకి చేరలేదన్నమాట.
   
    ఈ ఆలోచన రాగానే గౌరేనాధ్ కుర్చీలో నిటారుగా అయ్యేడు.
   
    అవును. అదొక్కటే వీలుంది.
   
    ఎంతసేపు ఆలోచించినా ఇంకోలా జరిగివుండే వీలు కనబడలేదు. ఆ ఉత్తరం రావ్ కి చేరలేదు అంటే ఆ రోజు అతను స్టేషన్ కి వెళ్ళలేదన్నమాట. తన పుస్తకంలోనే పొరపాటున ఆ ఉత్తరాన్ని మరిచిపోయిన ఆ అమ్మాయి. ఆ రోజు స్టేషన్ లో తన స్నేహితుని కోసం ఎదురు చూసీ చూసీ నిరాశచెంది వుంటుంది. రావ్ పట్లా, ప్రేమ పట్లా ఆమెకి ఆ క్షణంనుంచే విరక్తి జనించి వుండాలి. ఆ విరక్తితోనే ఆమె మరొకరితో వివాహానికి ఒప్పుకొని వుండాలి.
   
    ఈ విధమైన ఎనాలిసిస్ తో సంతృప్తి చెందేరు ప్రొఫెసర్ గౌరీనాథ్ కానీ, అంతలోనే ఆయనకింకో అనుమానం వచ్చింది.
   
    "తను వ్రాసిన ఉత్తరం తన స్నేహితునికి అందలేదూ అన్న సంగతి ఆ అమ్మాయికి తెలిసిందా? తెలిసి వుంటే - ఎప్పుడు తెలిసింది? పెళ్ళవకముందు తెలిసివుంటే - తన తప్పు తెలుసుకుని ఆ రావ్ నే వివాహం చేసుకొని వుంటుంది. అలా కాకుండా ఇంకెవర్నో చేసుకున్నాక రావ్ ఎప్పుడో కనబడి వుంటే? కనబడి జరిగిందంతా వివరించి వుంటే? ఆ అమ్మాయి తరువాత జీవితం అంతా నరకం అయి వుంటుంది. రావ్ ఆ అమ్మాయికి కనబడకుండా, వుంటే కనీసం అతని పట్ల పెంచుకొన్న ద్వేషంతోనైనా ఆమె తన సంసారంలో ఏ కలతలూ లేకుండా జీవిస్తూ వుండవచ్చు. ఏం జరిగిందో ఎలా తెలుసుకోవటం?
   
    దాదాపు అయిదు సంవత్సరాల క్రితం హైద్రాబాదులో మెడికల్ కాలేజీలో చదివిన ఆ సుప్రియ అనే అమ్మాయి ప్రస్తుతం ఎక్కడవుందో, ఎవర్ని పెళ్ళి చేసుకుందో, రావ్ విషయం ఆమెకి తెలిసిందో లేదో - ఇవన్నీ జవాబులేని ప్రశ్నలుగా మిగిలిపోయేయి గౌరీనాథ్ కి కాలక్రమేణా ఈ విషయాన్ని మరిచిపోయేడు కూడా.
   
    ఇంతటితో ఈ కథ ఆగిపోవలసిందే కానీ, ఒకరోజు.....
   
                                                                *    *    *
   

    "కూర్చో మాధవ్" అన్నాడు గౌరీనాథ్ మాధవరావు కూర్చోలేదు.
   
    "చెప్పండి సార్. మీరెన్నాళ్ళనుంచో తప్పించుకుంటున్నారు. ఈ రోజు అన్నీ అరేంజ్ చెయ్యమని ఇంట్లో చెప్పి వచ్చేను. ఏమైనా ఈ రోజు రాత్రికి మా ఇంటికి డిన్నర్ కి రావలసిందే" అన్నాడు.
   
    "వస్తాను. కానీ, ఈ రోజు కాదు"
   
    "అదేం లాభంలేదు. ఎన్నాళ్ళనుంచో మీరు అలాగే చెబుతున్నారు. ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టను"
   
    గౌరీనాథ్ ఇబ్బందిగా కుర్చీలో కదిలి, "సరే, అయితే నీ ప్రోగ్రామ్ రేపటికి మార్చుకో ఈ రోజు సాయంత్రం నాక్కొద్దిగా పనుంది" అన్నాడు.
   
    మాధవ్ మొహం సంతోషంతో విప్పారింది.
   
    "ఇంటికి ఫోన్ చేసి చెబుతాను సార్. రేపటికి పోస్ట్ ఫోన్ చెయ్యమని" అంటూ ఫోన్ ఎత్తి డయల్ చేసి 'హలో సుప్రియా' అన్నాడు.
   
    టేబిల్ మీద కాగితాలు సర్దుతున్న ప్రొఫెసర్ చేతులు హఠాత్తుగా ఆగిపోయేయి. సుప్రియ....సుప్రియ .... అంటూ మనసులోనే మననం చేసుకొన్నాడు. మాధవ్ మాట్లాడటం పూర్తిచేసే వరకూ అతనివైపే ఆత్రుతగా చూడసాగేడు........మనసులోనే అస్పష్టమైన ఆలోచనల కదలికలు- 'సుప్రియ' అనే పేరు సాధారణంగా ఎక్కువమందికి వుండదు. తన ప్రియాతి ప్రియమైన శిష్యుడి భార్యగానీ ఆ అమ్మాయి అయితే?.... ఇతని దాంపత్య జీవితం ఎలా సాగుతూంది?
   
    గౌరీనాథ్ ఆలోచనలనుంచి తేరుకోకముందే మాధవ్ ఫోన్ పెట్టేస్తూ "ఏమిటి ఆలోచిస్తున్నారు?" అన్నాడు.
   
    "అబ్బే- ఏం లేదు- ఇంటికేనా ఫోన్ చేసింది? కలవరపాటును అణుచుకుంటూ అడిగేడు గౌరీనాథ్.
   
    "అవునండీ. వచ్చేముందు చెప్పేను. ఈ రోజు ఎలాగైనా మిమ్మల్ని డిన్నర్ కి తీసుకొస్తానని. అందుకని...."
   
    "మీ ఇంట్లో ఫోన్ వుందా?"
   
    "తను డాక్టర్ కదండీ? ఫోన్ లేకపోతే ఎలా?" నవ్వేడు. బల్ల అంచుమీద గౌరీనాథ్ చెయ్యి బిగుసుకుంది.
   
    డాక్టర్.....!
   
                                                               *    *    *
   

    ప్రొఫెసర్ గౌరీనాథ్ కారు మాధవ్ ఇంటి కాంపౌండ్ లోకి ప్రవేశించేసరికి ఆరున్నర అయింది. వేసవికాలం అవటం వలన ఇంకా చీకటి పడలేదు. ఆయన కారు దిగుతూ వుంటే, అప్పటి వరకూ ఆయన కోసమే చూస్తున్నట్టు మాధవ్ గబగబా దగ్గర కొచ్చేడు.
   
    కారు దిగుతున్నప్పుడే గౌరీనాథ్ తీక్షణమైన కళ్ళు అన్నివైపులా వెతికేయి.
   
    "ఇక్కడే బయట కూర్చుందాం సార్. లోపల మరీ సల్ట్రీగా  వుంటుంది" అన్న మాటలకు మౌనంగానే తల వూపేడు గౌరీనాథ్.

    ఇంటిచుట్టూ చిన్న గార్డెన్ పొందికగా వుంది. సన్నగా వీచే గాలికి మల్లెపందిరి మీదనుంచి వచ్చే సువాసన సేద తీరుస్తూంది. కుండీల్లో వున్న క్రోటన్ మొక్కల్ని చూస్తూంటే ఆ ఇంట్లో వారి అభిరుచి తెలుస్తోంది. మూడు కుర్చీలూ, టీపాయీ అమర్చారు. ఇద్దరూ కుర్చీల్లో కూర్చున్నారు.
   
    "మీ ఇల్లు చాలా బాగుందోయ్" మెచ్చుకోలుగా అన్నాడు గౌరీనాథ్. మాధవ్ నవ్వి  "ఇందులో నాదేమీ లేదండీ అంతా ప్రియే చూసుకొంటూంది. నాకు నా ఆఫీస్ తోనే సరిపోతుంది" అన్నాడు.
   
    ఇంకేదో అడగబోతున్న గౌరీనాథ్ చటుక్కున మాటలు ఆపుచేసి ఇంటివైపు చూసేడు. తెల్లటి పాము కుబుసంలాంటి చీరెలో -కడిగిన ముత్యంలా, మంచులో తడిడిన మల్లెలా ఉన్న సుప్రియ నెమ్మదిగా నడుస్తూ అక్కడికొచ్చింది. ఏమీ అలంకారాలు లేకపోయినా, ఆ అమ్మాయి ఎంతో హుందాగా వుంది. ఆమె ముఖంలో విజ్ఞానం తొణికిసలాడుతూ వుంది.
   
    "నా భార్య సుప్రియ" అంటూ పరిచయం చేసేడు. గౌరీనాథ్ నమస్కారం చేస్తూ ఆమె కళ్ళలోకి సూటిగా చూసేడు. చాలా ప్రశాంతంగా వున్నాయి అవి. కానీ, గౌరీనాథ్ సునిశితమైన దృష్టి ఆమెకళ్ళ వెనుక అస్పష్టంగా గూడుకట్టుకున్న నీలి నీడల్ని వెంటనే గమనించింది.
   
    "ఈయన మా ప్రొఫెసర్ ఇన్నాళ్ళకి మనింటికి డిన్నర్ కి రావటానికి ఒప్పుకొన్నారు" అన్నాడు మాధవ్.
   
    "అబ్బే, అదేం లేదు. ఏదో టైమ్ దొరక్క...." అంటూన్న గౌరీనాథ్ ని మధ్యలో ఆపుచేస్తూ "మీ ఆర్టికల్స్ నేనూ ఇంటరెస్టింగ్ గా చదువుతూ వుంటానండీ ముఖ్యంగా మనుష్యుల బలహీనతల మీదా, 'ఈగో' మీదా మొన్న మీరు వ్రాసిన వ్యాసం చాలా బాగుంది" అంది మెచ్చుకోలుగా ఊహించని ఆ పొగడ్తకి తబ్బిబ్బయి బట్టతలని తడుముకొంటూ నవ్వేడు కృతజ్ఞతగా.
   
    ఆ తరువాత కొద్దిసేపు ముగ్గురూ ఇండస్ట్రియల్ అన్ రెస్ట్ గురించీ, లేబర్ సైకాలజీ గురించీ మాట్లాడుకున్నారు. మాధవ్ కూడా సైకాలజీ స్టూడెంట్ అవటం వల్ల సంభాషణ ఎక్కువ భాగం దానిమీదే. పైకి వాళ్ళతో మాట్లాడుతున్నా ప్రతిక్షణం గౌరీనాథ్ ఆ అమ్మాయిని గమనిస్తూనే వున్నాడు.
   
    "మీరు తొందరగా భోజనం చేస్తారా- ఇంకా చీకటి పడాలా?" అడిగేడు మాధవ్.
   
    "తొందరలేదు" అన్నాడు గౌరీనాథ్. మాధవ్ భార్యతో ఏదో అన్నాడు. ఆమె లేచి లోపలికి వెళ్ళింది. గౌరీనాథ్ మళ్ళీ ఆలోచనల్లోకి జారుకున్నాడు. ఆమెలో ఎక్కడో అస్పష్టమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఎక్కడ?
   
    ప్రేమించినవాణ్ణి పొందలేకా?
   
    ప్రేమించినవాడు మోసం చేసేడనే కసివల్లా?
   
    విధి చేసిన మోసం పట్లా? వేదనవల్లా?
   
    ఎలా? ఎలా తెలుసుకోవటం?? ఈ రకమైన ఆలోచనలతో ఆయన తల వేడెక్కిపోయింది. ఆయన ఏభై సంవత్సరాల వయసులో ఎప్పుడూ ఇంత సీరియస్ ప్రోబ్లమ్స్ ఆయనకి తగల్లేదు. ఈ ఆలోచనలలోనే ఆయన, సుప్రియ మూడు గ్లాసులలో నిమ్మరసం పట్టుకొచ్చి ఇవ్వబోవటం గమనించలేదు.
   
    "ఈ రోజు మీరెందుకో అన్యమనస్కంగా వున్నారు" అన్న మాధవ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చేడు.
   
    "ఏం లేదు" అంటూ ట్రేలోంచి గ్లాసు అందుకోబోతూ వుంటే ఆయనకి ఫ్లాష్ లాంటి ఆలోచన వచ్చింది. ఆ ఐడియా రాగానే ఆయన మొహంలో ఒక్కసారిగా అప్పటివరకూ వున్న సందిగ్ధత మాయమైపోయింది. 'లింక్' దొరకగానే రెండు క్షణాల్లో మిగతా కథ అల్లుకుపోయి రంగం సిద్దం చేసుకొన్నాడు.

 Previous Page Next Page