Read more!
Next Page 
క్షమించు సుప్రియా! పేజి 1

                                 

                                                          

                                          క్షమించు సుప్రియా!
   
                                                                              --  యండమూరి వీరేంద్రనాథ్

                                

                                          
   
    అయిదు గంటల ఇరవై రెండు నిమిషాలకి ప్రొఫెసర్ గౌరీనాథ్ కారు పోర్టికోలోకి వచ్చి ఆగింది. ఆ రోజు ఆయన ఇంటికి చేరుకోవటంలో జరిగిన పన్నెండు నిమిషాల ఆలస్యానికి కర్ణం. ఆయన చేతిలో వున్న పెద్ద బౌండు పుస్తకం. ఆ అనాటమీ పుస్తకాన్ని ఆయన తన తమ్ముడికోసం ఒక సెకండ్ హాండ్ షాపులో, ఆ షాపువాడితో పదకొండు నిమిషాలు దెబ్బలాడి మరీ కొన్నాడు.
   
    ఆ పదకొండు నిముషాల్లోనూ ఆయన ఆ షాపువాడికి తన క్వాలిఫికేషన్ సంగతి చెప్పి, దాదాపు ఆరునిమిషాలపాటూ మనస్తత్వాలమీదా, మానవుడి బలహీనతలమీదా చిన్నసైజు లెక్చరిచ్చేడు. వాడు తననేమీ మోసం చెయ్యలేదనే విషయాన్ని ఆయన విపులీకరిస్తుంటే అతడు శ్రద్దగా, మిగతా కష్టమర్స్ ని వదిలేసి మీ ఆయన చెప్పింది విన్నాడు.
   
    "చూడవోయ్! నీలాంటి వాళ్ళని చాలామందిని స్టడీ చేసేన్నేను కస్టమర్ రాగానే మామూలు ధరకన్నా దాదాపు రెట్టింపు ధర చెప్పేసి, ఆ కొనేవాడి మనసులో అసంతృప్తి కలిగించటం, ఆపైన ఆ ధరని కొద్దిగా తగ్గించి, ఆ కొనేవాన్ని ఒక రకమైన 'ట్రాన్స్'లో పెట్టేసి, ఆ పుస్తకాన్ని అమ్మేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య అయితే అయి వుండవచ్చుకానీ ఈ ప్రయోగం నామీద చెయ్యలేవు. కాబట్టి నా అమూల్యమైన సమయాన్ని వృధా చెయ్యకుండా ఒకే ధర చెప్పు-" ఇలా సాగింది ఆయన సంభాషణ.
   
    ఆ షాపువాడి మనసులో ఈయన చెప్పిన మాటలు చాలా సూటిగా నాటుకొన్నాయి. అతని కళ్ళకి ఈయనో ఋషిలా కనబడ్డాడు. చాలా భక్తితో ఆ పుస్తకాన్ని అందిస్తూ "రెండు రూపాయలు తగ్గించుకోండి సార్. కానీ, దయచేసి ఈ విషయాన్ని  మాత్రం ఎక్కడా చెప్పొద్దు" బ్రతిమాలేడు.
   
    ఆ షాపువాడి కళ్ళలో కనబడే నమ్రతా భావాన్ని గౌరీనాథ్ తీక్షణమైన కళ్ళు వెంటనే పసిగట్టేయి. ఆయన కళ్ళు గర్వంగా నవ్వేయి. అనూహ్యమూ, అభేద్యమూ అయిన ఆ షాపువాడి అంచనాల్ని పటాపంచలు చేసి ఆ పుస్తకాన్ని రెండు రూపాయల తక్కువకి కొన్న సంతృప్తి ఆయన కళ్ళలో ప్రతిబింబించింది.
   
    తను విపులీకరించిన పద్దతిలోనే షాపువాడు తనని మోసం చేసేడని గుర్తించని గౌరీనాథ్, కార్లో పుస్తకాన్ని పెట్టుకొని ఇంటికొచ్చేసేడు.
   
                                                             *    *    *
   
    అదే సాయంత్రం - ఆరయింది.
   
    స్నానం చేసి డ్రాయింగ్ రూమ్ లో టీ త్రాగుతూ కూర్చున్నాడు గౌరీనాథ్. ఆయనెదుట బల్లమీద అందంగా అత్తవేసిన బౌండు పుస్తకం కనపడుతూ వుంది. పక్కనే రాక్ నిండా సైకాలజీమీద వ్రాసిన పుస్తకాలున్నాయి.
   
    కిటికీలోంచి బైటికి చూస్తూ, అప్రయత్నంగా ఆ అనాటమీ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొన్నాడు. అందులో బొమ్మల్ని చూస్తూ, అక్కడక్కడ చిన్న చిన్న పేరాలు చదువుతూ, దాదాపు అరగంట గడిపేడు. అంతలో నౌకరు ఎవరో వచ్చేరని చెప్పేడు.
   
    పుస్తకాన్ని మూసేసి లేవబోతున్న ప్రొఫెసర్ గౌరీనాథ్ చటుక్కున ఆగిపోయేడు. అతని సునిశితమైన దృష్టికి ఆ పుస్తకం అట్ట వెనకభాగం ఎత్తుగా కనబడింది. వ్రేళ్ళతో తడిమిచూసి, ఆ పుస్తకానికి వేసిన కవర్ లో ఏదో కాగితం ఉన్నట్టు గ్రహించేడు.
   
    ఆపై విజిటర్ తో మాట్లాడుతున్నంతసేపూ ఆయన దృష్టి ఆ పుస్తకం మీదే వుంది. అతడు వెళ్ళిపోగానే చటుక్కున ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని, కవర్ విప్పేడు. అందులోంచి మడత పెట్టివున్న చిన్న కాగితం జారిపడింది. విప్పి చూసేడు. అందులో ఇలా వుంది-
   
    "డియర్ రావ్,
   
    దాదాపు పదిరోజులనుంచీ నిన్ను కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కానీ వీలు కుదరటంలేదు. నా పెండ్లి గురించి మా ఇంట్లో తొందరపడుతున్నారు. కనీసం నా ఎమ్.బి.బి.యస్. పూర్తయ్యేవరకూ కూడా ఆగేటట్టులేరు. ఇటువంటి పరిస్థితుల్లో మనకొకటే మార్గం.
   
    ఈ ఉత్తరం నేనేదో ఆవేశంలో వ్రాయడం లేదు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ నిర్ణయాలపట్ల నాకు నమ్మకం వుంది.
   
    మనం వెంటనే పెళ్లిచేసుకోవాలి రావ్. ఇప్పుడుగానీ మనం తెగించకపోతే మా ఇంట్లో వాళ్ళ ఒత్తిడికి నేను తట్టుకోలేను. ఇంకెవర్నో చేసేసుకోవాలి. తప్పదు.
   
    నీకున్న క్వాలిఫికేషన్ కి ఏదో ఉద్యోగం దొరక్కపోదు. నాకా ఈ చదువుపట్ల పెద్ద ఇష్టమేమీలేదు. ఇక్కడితో ఆపుచేసేస్తాను. ఒక గృహిణిగా నా యింటిని సరిదిద్దుకోవటం, నీ కౌగిలిలో సేదతీరి విశ్రమించటం. యివే యిష్టం నాకు.
   
    మొన్నే నన్ను చూసుకోవటానికి ఎవరో వచ్చేరు. ఈ సంబంధం సెటిల్ అయ్యేటట్టు వుంది. అదే నా భయం. మనం ఇంక తెగించాలి. ఇప్పుడుగానే ఆ మాత్రం ధైర్యం చెయ్యకపోతే జీవితాంతం అందుకు చింతించవలసి వుంటుంది.
   
    ఈ విషయంలో నీ నిర్ణయం కావాలి నాకు. సాయంత్రం మా కాలేజీ వాళ్ళు పిక్ నిక్ కి బయలుదేరుతున్నారు. నేనూ ఇంట్లో అలాగే చెప్పేను. చిన్న సూట్ కేస్ తో వచ్చేస్తున్నాను. నువ్వూ సాయంత్రం  మద్రాసు ట్రైన్ కి వచ్చేస్తే మనం వెళ్ళిపోవచ్చు. పెళ్ళి చేసుకొన్నాక ఇంకెవరూ ఏమీ చెయ్యలేరు. మా ఇంట్లో ఇక నాకు స్థానం ఉండదనుకో కానీ, నీకన్నా వాళ్ళెక్కువ కాదు నాకు.
   
    ఒకవేళ నువ్వుగానీ రాకపోతే, ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరనుకొంటాను.
   
    కానీ, నాకు నమ్మకం వుంది. రావ్ - నువ్వొస్తావని!
   
    సాయంత్రం కలుసుకుందాం. సాయంత్రం కలుసుకోలేకపోతే -ఇక జీవితంలో కలుసుకోలేం, ఆ విషయం గుర్తుంచుకొంటావ్ కదూ.
   
                                                                                            -నీ సుప్రియ."

   
    చాలా తొందరలో వ్రాసినట్టు గజిబిజిగా వుంది. చాలాచోట్ల కొట్టివేతలున్నాయి.
   
    ఆసక్తికరంగా చదవటం పూర్తిచెయ్యగానే, తేది గురించి చూసేడు గౌరీనాధ్. అయిదేళ్ళక్రితం వ్రాసింది అది. అప్పటికి ఆ పుస్తకం ఎన్ని చేతులు మారిందో కానీ, ఉత్తరం మాత్రం ఎవరికంటా పడలేదు. అయిదు సంవత్సరాలపాటు ఆ కవర్ వెనక చీకట్లో వుండి ఇన్నాళ్ళకి గౌరీనాధ్ సునిశితమైన దృష్టికి నిదర్శనంగా బయటపడింది.
   
    ఆ క్షణం మాత్రం గౌరీనాధ్ కి సుప్రియా, రావ్ లమీద కోపం వచ్చింది. తమ జీవితాల్ని కలిపినా ఆ ఉత్తరాన్ని అలా పుస్తకం అట్ట వెనక వదిలేసినందుకు ఎంత అపురూపంగా దాచుకోవలసిన ఉత్తరం అది!
   
    ఉత్తరం ఎగిరిపోకుండా దానిమీద పేపర్ వెయిట్ పెట్టి మళ్ళీ  అనాటమీ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొన్నాడు. మొదటి పేజీ తిప్పగానే అదే దస్తూరితో వ్రాసి వుంది -ఎమ్. సుప్రియ, హైదరాబాద్ అని.
   
    సైకాలజీ ప్రొఫెసర్ గౌరీనాథ్ సెన్సిటివ్ బ్రెయిన్ కి ఎక్కడో ఏదో అపశ్రుతి పలికినట్టు అనిపించింది.
   
    'సుప్రియ' అనే అమ్మాయి వ్రాసిన ఈ ఉత్తరం మళ్ళీ అదే అమ్మాయి ఆనాటమీ పుస్తకంలోనికి ఎలా వస్తుంది?
   

    ప్రొఫెసర్ గౌరీనాధ్ బుర్ర చురుగ్గా ఆలోచించటం మొదలు పెట్టింది.
   
    ఉన్నవి రెండు మార్గాలు. ఒకటి వాళ్ళిద్దరి వివాహం జరిగి ఉండటం. రెండవది - జరగకపోవటం.
   
    వివాహం జరిగిందీ అనుకొంటే- ఆ రోజు ఆ అమ్మాయి స్టేషన్ కి వెళ్ళేటప్పుడు సూట్ కేస్ లో అంత పెద్ద పుస్తకాన్ని పెట్టుకొని వెళ్ళి ఉండదుకదా! కొన్ని నగలూ, చీరెలూ పెట్టుకొని వెళ్ళి వుంటుంది. పోనీ - రావ్ తో పెళ్ళి జరిగేక ఆ అమ్మాయి ఇంటి పరిస్థితులు చక్కబడి, మళ్ళీ ఇంటికొచ్చి తన పుస్తకాన్ని తీసుకెళ్ళిందా అని ఆలోచిస్తే..... ఒకవేళ తీసుకెళ్ళినా, రావ్ ఆ ఉత్తరాన్ని అంతకాలం భద్రపరిచి ఆ అమ్మాయికిస్తే ఆమె దాన్ని ఆ పుస్తకంలో దాచింది అని ఆలోచించటం హాస్యాస్పదం.....
   
    వివాహం జరగలేదూ అనుకొంటే దానిక్కారణం ఒకటే అయి వుంటుంది- రావ్ స్టేషన్ కి రాకపోయి ఉండటం! అదే నిజమైన పక్షంలో రావ్ దగ్గర ఉండవలసిన పుస్తకం మళ్ళీ సుప్రియ దగ్గరికి చేరటానికి వీల్లేదు.

Next Page