Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 3

   


    ఈ లోపులో తనూ ఓ గ్లాసు తీసుకొని కూర్చుంటూ, "కాదండీ -మీరు ఏదో అన్యమనస్కంగా వున్నారు....." అంటూ భర్తని సమర్ధించింది సుప్రియ.
   
    ప్రొఫెసర్ ఒక్కక్షణం తదేకంగా శూన్యంలోకి చూసేడు. తరువాత గాఢంగా విశ్వసిస్తూ ఆ దంపతులవైపు చూసి "ఈ రోజు నాకెందుకో మా బాబాయ్ కొడుకు మాటిమాటికీ జ్ఞాపకం వస్తున్నాడు" అన్నాడు. ఇద్దరూ ఆయనవైపు ప్రశ్నార్ధకంగా చూసేరు.
   
    "అవును" భారంగా అన్నాడాయన. "ఒక అమ్మాయిని ప్రేమించిన నేరానికి - ఒక అమ్మాయితో జీవితాన్ని పంచుకుందామానుకున్న నేరానికి అన్యాయంగా తన జీవితాన్ని బాలి చేసుకొన్నాడు. స్త్రీలు పురుషుల్ని ఎంత అందంగా మోసం చెయ్యగలరో తెలుసుకోలేని అమాయకుడు."
   
    ఆయనింకా వాక్యం పూర్తి చేయకముందే సుప్రియ అందుకొని "మీరిలా పూర్తిగా ఆడవాళ్ళని జనరలైజ్ చేయకండి. ఆ మాటకొస్తే అమాయకులయిన అమ్మాయిల్ని ప్రేమలోకి దింపి, ఆపై ఏమీ తెలియనట్టు తప్పుకునే మగవాళ్ళే ఎక్కువ ఈ ప్రపంచంలో....." అంది ఎర్రటి సంధ్యలో ఆమె మొహం ఆవేశం వల్ల మరింత ఎర్రగా కనిపించింది.
   
    గౌరీనాథ్ ఆమెను అనునయిస్తున్నట్లు "మీరు చెప్పింది నిజమైతే నిజమై వుండవచ్చు. కానీ మా వాడు బ్రిలియంట్. జీవితంలో ఎంతో పైకి రావలసినవాడు. అటువంటిది ఒక అమ్మాయి అతన్ని గాఢంగా మోసం చేసింది. దానితో రోజు రోజుకీ కృంగిపోయి, మూన్నెల్ల క్రితం చచ్చిపోయేడు. ఇంకోరకంగా చెప్పాలంటే, ఆత్మహత్య చేసుకున్నాడు దాదాపు" అన్నాడు.
   
    "అవును మాస్టారూ! ఈ ఆడవాళ్ళని అసలు నమ్మకూడదు. ముఖ్యంగా మెడికోల్ని....." అన్నాడు మాధవ్ భార్యవైపు చిలిపిగా చూస్తూ.
   
    "ఏమిటి మీ ఉద్దేశ్యం?" అంది సుప్రియ కోపంగా.
   
    తాను మధ్యలో కల్పించుకుంటూ "మాధవ్ యధాలాపంగా అన్నా మా రావ్ విషయంలో అది నిజమే. ఎందుకంటే, రావ్ ప్రేమించింది కూడా మెడికోనే" అన్నాడు గౌరీనాథ్. 'రావ్' అంటున్నప్పుడు సుప్రియ శరీరం కొద్దిగా కంపించటం ఆ మసక చీకట్లో ఆయనకీ అస్పష్టంగా కనిపించింది. రావ్ కి వ్రాసిన ఉత్తరం అతనికి చేరలేదనేది ఇంత వరకూ సుప్రియకి తెలియలేదనీ, ఆమె ఇంకా అతను తనని మోసం చేసేడనే అనుకుంటోందనీ గౌరీనాథ్ కి నిశ్చయంగా తెలిసిపోయింది. ఎందుకంటే, ఒకవేళ ఆమెకి మాధవ్ తో వివాహం జరిగి పోయాక రావ్ గానీ కనబడి జరిగినదంతా చెప్పేసి వుంటే ఆమెకి పురుషులమీద ఇంత కోపం వుండటానికి వీల్లేదు. జరిగినదంతా తెలిస్తే, ఆమెకి పురుషులమీద వున్న కోపం, విధి చేసిన మోసం పట్ల వేదనగా మారుతుంది. విధి తనపట్ల ఎంత కఠోరంగా ప్రవర్తించిందీ ఈ అమ్మాయి తెలుసుకుంటే ఏమవుతుంది? ఆ షాక్ నుంచి తట్టుకోగలదా? అప్పటివరకూ రావ్ పట్ల వున్న కోపం అంతా ఒక్కక్షణంలో అతని పట్ల జాలిగా మారటం- ఒక ఫేజ్ లోంచి ఇంకో ఫేజ్ లోకి మనిషి ట్రాన్స్ ఫార్మేషన్ -జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఒక సైకాలజిస్ట్ గా తన మెదడు కెంత మేత!
   
    "ఏ ఊరు? ఈ ఊరేనా?" అడిగేడు మాధవ్.
   
    "అవును అతని చదువు అప్పటికే పూర్తయింది. ఆ అమ్మాయి ఫోర్త్ ఇయర్ లోనో ఎక్కడో వుందనుకొంటా - నాకు సరీగ్గా తెలీదు. ఇద్దరూ చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి గురించి నాకు అప్పుడప్పుడు చెబుతూ వుండేవాడు. నా దగ్గిర బాగా చనువు వాడికి. ఇంతలో వున్నట్టుండి ఆ అమ్మాయికి పెళ్ళయిపోయింది. కనీసం వీడితో చూచాయగా కూడా చెప్పలేదు. అసలేం జరిగిందో అతనికి తెలిసేసరికి రెండు నెలలు పట్టింది. ఆ అమ్మాయి తననెందుకు అంత మోసం చేసిందో తనేం తప్పుచేసేడో అర్ధంకాలేదు. ఆ షాక్ నుంచి అతను తప్పించుకోలేక పోయాడు. నేనెంతో చెప్పిచూసేను. కానీ, ఆమెని అతను ఎంత గాఢంగా ప్రేమించాడో, పాపం - నా మాటలు అతనిమీద ఏమీ ప్రభావం కలిగించలేకపోయేయి. రోజు రోజుకీ కృశించిపోసాగేడు. చివరికి టైఫాయిడ్ వచ్చి చచ్చిపోయేడు. కానీ, నిజంగా అతనే కారణంవల్ల చనిపోయాడో నా ఒక్కడికే తెలుసు" గంభీరంగా అన్నా, గౌరీనాథ్ కంఠంలో విషాదం ధ్వనిస్తూనే వుంది.
   
    అంతా నిశ్శబ్దంగా వుంది. బాగా చీకటిపడింది. సన్నగా వీచేగాలికి చెట్ల ఆకులు నెమ్మదిగా కదులుతున్నాయి.
   
    ఎవరూ మాట్లాడటం లేదు.
   
    చేతులు రెండూ ఒడిలో పెట్టుకొని తల బాగా క్రిందికి వంచుకొని కూర్చుంది సుప్రియ. వెలుతురు బాగా తక్కువ అవటం వల్ల ఆమె మొహంలో కదులుతూన్న భావాల్ని స్పష్టంగా చదవలేకపోయేడు గౌరీనాథ్. ఆమె మనసులో ఎంత కల్లోలం చెలరేగుతూందో, ఉద్వేగాన్ని ఆపుకోవటానికి ఆమె ఎంత ప్రయత్నిస్తూందో - ఆమె కూర్చున్న భంగిమే చెబుతోంది.
   
    "ఏమిటంత సీరియస్ గా ఆలోచిస్తున్నావ్?" అన్నాడు మాధవ్ నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ, సుప్రియ మాట్లాడలేదు. మాట్లాడితే తన కంఠంలో గాద్గదికత ఎక్కడ తనని పట్టిచ్చేస్తుందోఅన్న భయంతో కాబోలు......
   
    మాధవ్ గౌరీనాథ్ వైపు తిరిగి "తను డాక్టర్ అన్న మాటేగానీ, చాలా సెన్సిటివ్ అండీ" అన్నాడు విపులీకరిస్తున్నట్టుగా.
   
    గౌరీనాథ్ అకస్మాత్తుగా తను చేసిన తప్పు బోధపడింది. తను ప్లే చేసిన ట్రిక్ వల్ల ఈ అమ్మాయి జీవితంలో ఆనందం అనేది పూర్తిగా లేకుండా చేసేడు. తనను ప్రేమించిన నేరానికి జీవితాన్ని బలి చేసుకొన్న ఆ రావ్, ప్రతి నిమిషమూ ఆమెకి ఇక గుర్తువచ్చి బాధ పెడతాడు. తను అనాలోచితంగా చేసిన ఈ ట్రిక్ వల్ల ఇటు ఆమె జీవితమూ, అటు మాధవ్ జీవితమూ నరకప్రాయం కాబోతున్నాయి.
   
    గౌరీనాథ్ ఆలోచనల్లో వుండగానే మాధవ్ లేచి, "ఇప్పుడే వస్తాను" అంటూ ఇంటివైపు వెళ్ళేడు. గౌరీనాథ్ సుప్రియవైపు చూసేడు. ఆమెకూడా తల ఎత్తి ఆయనవైపు చూసింది. లోపల మాధవ్ స్విచ్ వేసినట్టున్నాడు-తోటలో లైటు వెలిగింది. ఆ వెలుతురులో ఆమె మొహం తెల్లగా పాలిపోయినట్టు ఆయనకీ కనిపించింది. తను చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి ఇంకో అబద్దం ఆడటానికి నిశ్చయించుకొని "నన్ను క్షమించండి" అన్నాడు.
   
    "ఎందుకు" అంది సుప్రియ ఆశ్చర్యంగా.
   
    "రావ్ చచ్చిపోలేదు. బ్రతికే వున్నాడు. అంతేకాదు- శుభ్రంగా పెళ్ళి చేసుకొని సంసారం చేస్తున్నాడు."
   
    సుప్రియ ఆయనవైపు మరింత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది.
   
    "అవును! నేను అబద్దం చెప్పేను. ఆ రోజుల్లో మిమ్మల్ని రావ్ గాఢంగా ప్రేమించి వుండవచ్చు. కానీ, అకారణంగా మీరు అతన్ని తిరస్కరించేరు."
   
    "మీరు చెపుతోంది...."
   
    "మీ గురించే, సుప్రియాదేవీ....మీరు చదువుకునే రోజుల్లో రావ్ ని ప్రేమించలేదూ?" సూటిగా ప్రశ్నించాడు.
   
    ఆయన చెబుతోంది నిజమే అన్నట్టు తల ఊపింది.
   
    "కానీ, మీరు అకస్మాత్తుగా అతనితో పరిచయం తెంచేసుకొనేసరికి......"
   
    "నేనేమీ అకారణంగా ...." అనబోతున్న సుప్రియ చటుక్కున మాటలు ఆపుచేసింది. మాధవ్ అక్కడికి వచ్చి "డిన్నర్ కి అన్నీ అరేంజ్ చేసెయ్యమని చెప్పనా..... ఇంకా ఆలస్యం వుందా?" అని అడిగేడు. సుప్రియ లేవబోయింది.
   
    "ఇంకో అరగంట పోయాక చేద్దాం" అన్నాడు గౌరీనాథ్.
   
    భార్యని వారిస్తూ, "నువ్వు మాట్లాడుతూ వుండు, నేను చెప్పేసి వస్తాను" అంటూ లోపలికి వెళ్ళేడు మాధవ్.
   
    తిరిగి సంభాషణ కొనసాగిస్తూ, "మీరు అకారణంగా రావ్ ని తిరస్కరించలేదు. ఒక రకంగా చెప్పాలంటే, మీ వాళ్ళందర్నీ వదిలేసి వచ్చేసి అతన్ని పెళ్ళి చేసుకుందామని అనుకున్నారు ఆ రోజుల్లో అవునా?" అన్నాడు గౌరీనాథ్.
   
    "ఇవన్నీ.... మీకెలా ....?" అనబోతున్న సుప్రియని మధ్యలో ఆపుచేసి, "తెలుసు! అంతేకాదు- రావుకూడా మిమ్మల్ని అంతే గాఢంగా ప్రేమించాడన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ, అతను మిమ్మల్ని చేసుకోలేకపోవటానికి కారణం మీరు ఊహిస్తున్నది మాత్రం కాదు. దానిక్కారణం నాకే - ఇంకోలా చెప్పాలంటే నా ఒక్కడికే తెలుసు" ఆయన కంఠం ఆవేశంతో కంపించింది.
   
    "మీరు చెపుతోంది....." అర్దోక్తిలోనే ఆపుచేసింది.
   
    "చెబుతాను. కానీ, మీరు నాకో వాగ్ధానం ఇవ్వాలి. విధి మీ ఇద్దరిపట్లా చాలా చిన్న చూపు చూసింది. ఇదంతా తెలిసిన తరువాత మీరు కృంగిపోకూడదు. ముఖ్యంగా మాధవ్ ని ఏమీ బాధ పెట్టకూడదు" అని క్షణం ఆగి, "మీరు రావ్ కి ఒక ఉత్తరం వ్రాసేరు కదూ- పెళ్ళి చేసుకొమ్మని ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారని, ఆ రోజు రాత్రి స్టేషన్ కి వస్తే...." అంటూ ఇంకా చెప్పబోయాడు.
   
    సుప్రియ చప్పున "అవును, వ్రాసేను" అంది.
   
    గౌరీనాథ్ కంఠంలో అకస్మాత్తుగా విషాదం ధ్వనించింది. "మీరు వ్రాసిన ఉత్తరం రావ్ వరకూ చేరలేదు సుప్రియాదేవీ! అది మీ అనాటమీ పుస్తకం అట్ట వెనుక చీకట్లో సమాధి అయిపోయింది. మీ జీవితం అందంగా మలుపు తిరగవలసిన చోట, మీరు కొద్దిగా నిర్లక్ష్యం చూపటంవల్ల, విధి మీ పట్ల చాలా కర్కశంగా పగ తీర్చుకుంది. మీ గురించీ, మీ ఆకస్మిక మౌనం గురించీ రావ్ ఎంత తల్లడిల్లి పోయేడో, పాపం" అంటూ ఆగి, ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ వుందేమో అని చూసేడు.

 Previous Page Next Page