Previous Page Next Page 
ష్.......మాట్లాడొద్దు పేజి 2

   గబగబ లేచి, బాత్రూంలో దూరి ఏడయ్యేసరికి  మొత్తం ఫ్రెషప్పయ్యాడు.
    హాలులోకి వెళ్ళాడు.
    మంచమ్మీద  మతిస్దిమితం తప్పిన వ్యక్తి లేడు.  ఒక్క క్షణం భయమేసింది.  వెంటనే వాకిట్లోకి వెళ్ళి చూశాడు.  గదులన్నీ వెతికాడు.  కనిపించలేదు.
    ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు భార్గవకు.  తనను తనే తిట్టుకున్నాడు.
    తన కసలు బుద్ది లేదు.  అతణ్ణి కనిపెట్టుకు ఉండాల్సింది. ఇప్పడేమిటిదారి?  అనవసరంగా వచ్చే డబ్బును  పోగొట్టుకోవడం అంటే ఇదే...
    షిట్...నుదురు  మీద కొట్టుకున్నాడు. వెంటనే ఓ అయిడియా ఫ్లాష్ లా వెలిగింది.
    స్లిప్సర్స్ వేసుకుని   బయటకు  పరుగు తీశాడు.తను బాత్రూంలో దూరినప్పుడు ఉన్నాడు.  అంటే సాన్నం చేస్తున్నప్పుడు బయటకు వెళ్లి ఉంటాడు. వెంటనే వెళ్ళి వెతికితే దొరక్కపోడు.
    ఆ ఆలోచన రావడమే ఆలస్యం.  రోడ్డు మీదికి వచ్చేశాడు.
    అరగంట పాటు మొత్తం తిరిగాడు.
    ఎక్కడా కనిపించలేదు.  నిరాశగా  ఇంటికి వచ్చేసరికి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి.
భయమేసింది. కోపందీసి దొంగలు పడలేదుగా...అనుకుంటూ లోపలికి అడుగు పెట్టి షాకయ్యాడు.
    మతి స్దిమితం  లేని వ్యక్తి సోఫాలో కూచొని ఉన్నాడు.అతని చేతిలో పాల ప్యాకెట్ ఉంది.
    "హ్హిహ్హిహ్హి"....ఏంలా చూస్తూన్నావు.  పొద్దునే కాఫి తాగడం అలవాటు. హొటల్ కు  వెళ్ళి తాగుదాం అనుకున్నా...పాపం అనిపించింది.  నిన్ను వదిలి తాగబుద్దేయ లేదు.  పాల ప్యాకెట్ కొనుక్కొచ్చా."
    ఒక్క క్షణం తనగ్గానీ పిచ్చెక్కలేదు కదా! అనుకున్నాడు భార్గవ.
    అతని మాటలు వింటుంటే మతిస్దిమితం తప్పిందంటే  ఎవరూ నమ్మరు.
    "ఏంటి...నన్ను పిచ్చోడిలా చూస్తున్నావు.  నేను పిచ్చోడినా?"  భార్గవ వైపు తిరిగి మతిస్దిమితం లేని వ్యక్తి.
    "అవును...కాదు...."అన్నాడు ఏమనాలో తోచక.
    "మరి నా పేరేమిటి?"
    బుర్ర గోక్కున్నాడు భార్గవ.
    "చూసావా...చూసావా...నా పేరు నాకు తెలియదు. నాక్కూడా తెలియదు. భలే భలే....ఏంటో అప్పుడప్పుడు యిలా అన్నా మరిచిపోతా....ఓ సారేమైందో తెలుసా....?"  కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అన్నాడతను.
    "ఏమైంది?" అసంకల్పితంగా  అడిగాడు భార్గవ.
    "డబ్బులు....అదే పచ్చగా వుంటాయి చూడు నోట్లు...అయిదొందల నోట్లు...చలేస్తుందని వాటితో చలి కాచుకున్నా...నోట్లు సరిపోకపోతే, బీరువాలో నుంచి తెచ్చి మరీ మంటలో వేశాను"  అంటూ చప్పట్లు కొట్టుసాగాడు చిన్న పిల్లాడిలాగ.
    మతిపోయింది భార్గవకు.  తనకు పిచ్చెక్కడం  గ్యారంటీ అనుకున్నాడు.
    "కొందరేమో నాకు పిచ్చి అంటారు, మరి కొందరేమో మతిమరుపు అంటారు...అప్పుడప్పుడు నన్ను మా యింటికి తీసుకెళ్తారు. మా యిల్లు ఎక్కడుందో నాకు తెలియదుగా మరి" అతనన్నాడు.
    కొద్ది కొద్దిగా అర్ధమవుతూ వుంది భార్గవకు. పూర్తిగా అవతలి వ్యక్తికి మెంటల్ బ్యాలెన్స్ తప్పలేదని అర్ధమైంది.
    అంతే కాదు మరో విషయం కూడా సృష్టమైంది. ఆ వ్యక్తి తాలూకు  వాళ్ళకు బాగా డబ్బు వుందని.
              
                               *    *    *                                          
    భార్గవకు హుషారుగా వుంద. తనకు డబ్బు రాబోతుంది.  ఆ డబ్బులో సెకండ్ హ్యండ్ కారు కొనాలా?  ప్లాటుకు అడ్వాన్స్ కట్టాలా? ఆ డబ్బును ఫిక్సడ్ చేయాలి?  వడ్డీలకు  తిప్పాలా?  రకరకాలుగా ఆలోచిస్తున్నాడు.
    వేడి  వేడి  ఫిల్టర కాఫీ చేసిచ్చాడతానికి  భార్గవ.  నాయర్ హొటల్ కు  వెళ్ళి పెసరట్టు, ఉప్మా తెచ్చాడు. అతడు ఏ మాత్రం మొహమాటం లేకుండా తింటున్నాడు.  చక్కగా మాట్లాడుతున్నాడు
ఎటొచ్చీ తన పేరు,అడ్రసూ చెప్పడం లేదు.
    బహుశా ఏదైనా యాక్సిడెంట్ జరిగి, జ్ఞాపకశక్తి  పోయిందేమో అనుకున్నాడు.
    ఏది ఏమైనా అతనికి సంతోషంగా ఉంది.
    ఎస్టీడీ బూత్ కు  వెళ్ళాడు.
    అత్తారింటికి  ఫోన్ చేశాడు. భార్య లైన్ లోకి  వచ్చింది.  భర్త గొంతులోని  యాంగ్జయిటీ గుర్తుపట్టింది.
    " ఏవండి...ఏమైనా  విశేషమా"
    "అవును" భార్గవ గొంతులో సంతోషం కనిపిస్తోంది.
    "ప్రమోషనొచ్చిందా"?
    "ఉహు"
    "పోనీ లాటరీ తగిలిందా"? డబ్బుకు సంబంధించిన విషయమైతేనే భర్త గొంతులో అలాంటి ఆనందం తాండవిస్తుందని  తెలుసావిడకు.
    "అది కాదు...నువ్వొచ్చాక చెబుతా...అన్నట్టు నువ్వెప్పడొస్తున్నావు.?"
    "మరో రెండ్రోజుల్లో"
    "వచ్చేటప్పుడు నేనడిగానని...మీ నాన్నగారిని ఏమైనా అడిగి పట్రా."
    భర్త మాటలు విని నిట్టూర్చింది. ఎంత డబ్బు వున్నా, భర్తకు వున్న డబ్బు పిచ్చి ఆమెను అప్పుడప్పుడు భయపెడుతుంది.
    మిగాత అన్ని విషయాల్లోనూ భర్త మంచివాడే....ప్రేమగా చూసుకుంటాడు...సిన్సియర్ గా వుంటాడు.
    "అలాగే" అంది ముభావంగా.
    "ఏంటి...కోపమొచ్చిందా? ఏమీ వద్దులే నేనే నీకు మంచి గిప్ట్ యిస్తా....అన్నట్టు నువ్వు బయల్దేరేటప్పుడు టిఫిన్ చేసి, క్యారేజ్ తీసుకొని వచ్చేయ్.ఇక్కడి కొచ్చాక వండుకోవడం ఇబ్బంది. డూప్లికేట్ కి నా దగ్గర ఉందిగా....అంటూనే డిస్ ప్లే లో కనిపించే ఎమౌంట్ చూసి ఫోన్ పెట్టేస్తున్నా...ఇప్పటికే నలభై దాటిందంటూ ఫోన్ పెట్టేసాడు.
                    బ్యాక్ లో  వన్ అవర్ పర్మిషన్ తీసుకోవాలా?  మొత్తం సెలవు పెట్టాలా?  అన్న విషయం గురించి  తర్జన  భర్జనలు పడి చివరకు ఆ రోజు సెలవు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
      మతిస్దిమితం   లేని  వ్యక్తి  తను  వాళ్ళ  వాళ్ళకు  అప్పగించాక  వాళ్ళిచ్చే  డబ్బు లెక్కపెట్టుకోవాలి.  దాన్ని ఏం చేయాలో ఆలోచించాలి.  బ్యాంకులో వేయాలా?ఇంట్లో దాచి పెట్టాలా? ఇలాంటి రకరకాల ఆలోచనలు వచ్చా యతనికి.
    ముందుగా అతడ్ని వాళ్ళ వాళ్ళకి అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చాడు భార్గవ.
                               *    *    *                                  
    భార్గవ బీరువా మొత్తం వెతికాడు గాగుల్స్ కోసం.  పెళ్ళయిన  కొత్తలో అత్తారింటికి వెళ్ళినప్పుడు అక్కడ స్టోర్ రూమ్ లో  పడివున్న గాగుల్స్ అవి.  చాలా పెద్దగా వున్నాయి.  స్కూటర్  మీద వెళ్ళేటప్పుడు దుమ్ము కళ్ళల్లో పడకుండా ఉండేందుకు పనికి వస్తుందని  దాన్ని అత్తారింటి నుంచి తీసుకొచ్చాడు.
    ఇప్పుడు దానితో పని పనిపడింది.  మతి స్దిమితం లేనివ్యక్తిని ఇతరులెవరైనా గుర్తిస్తే  తనకు పోటీ అవ్వొచ్చు అందుకే అతన్ని గుర్తించకుండా ఈ గాగుల్స్ తగిలించాలని నిర్ణయించుకున్నాడు.
                                            *    *    *
    ఆటో  మిథిలానగర్ వైపుకు  బయల్దేరింది.
    ఆటోలో భార్గవ, ఆ వ్యక్తి.
    భార్గవ సంతోషంగా వున్నాడు.
    కొద్దిసేపట్లో తను లక్షాధికారి కాబోతున్నాడు.
    ఆ ఊహే అతనికి బాగా నచ్చింది.
    తల బయటకు పెట్టి చూస్తున్నాడు ఇంటి నెంబర్లు సరిగ్గా లేవు.
    ఆటో స్లోగా వెళుతోంది.
    నిర్మానుష్యమైన  ప్రాంతంలోకి వచ్చింది.అక్కడ ఇళ్ళు ఎక్కువగా లేవు.
    అదిగో ఆ ఇంటి నెంబర పదహారు.  గట్టిగా అరిచాడు భార్గవ.  చాలా పాతకాలం నాటి యిల్లు.చుట్టూప్రహారీగోడ. మధ్యలో యిల్లు. చెక్కగేటు. ఆటోవాడికి  డబ్బిచ్చి చెక్కగేటు తెరిచాడు.  కిర్రుమంటూ తెరుచుకుంది.
    ఎందుకో...భార్గవ శరీరం ఒక్క క్షణం జలదరించింది.
    రాత్రి వచ్చిన కల గుర్తుకొచ్చింది.
    ఇప్పుడు సడన్ గా తనకు ఒళ్ళు జలదరించింది.  ఏమిటి?  అనుకున్నాడు భార్గవ.
    మతిస్థిమితం లేని వ్యక్తి భార్గవ వంక నవ్వుతూ చూస్తూండిపోయాడు.  డ్రాకులా... మొహంలా అనిపించింది భార్గవకు.వెన్నులో నుంచి చలి బయల్దేరిన ఫీలింగ్.
    ఆటో వెళ్ళిపోయింది.
    చెక్కగేటు మీద ఇంటినెంబర్ పదహారు అని వుంది.
    కొత్తగా ఏర్పడిన ఆ కాలనీలో  యిళ్ళు అక్కడక్కడ విసిరిపారేసినట్టున్నాయి.  హత్య జరిగినా తెలియదు. చెక్కగేటు వేసి లోపలికి అడుగు పెట్టాడు  భార్గవ.  పిచ్చి మొక్కలు మొలిచాయి.  ఆ యింటిని,  ఆ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేసినట్టు అనిపించడం లేదు.
    చుట్టూ ప్రహారీగోడ, మధ్యలో ఇల్లు అది పాతకాలం నాటి భవనం.
    డోర్ బెల్  కోసం చూసాడు.  కనిపించలేదు.  భార్గవకు ఆశ్చర్యంగా వుంది. ఈ  ఇంట్లో  మనుష్యుల్నున జాడలే లేవు.  ఒక్క క్షణం చిన్నపాటి అనుమానం కూడా కలిగింది తను రాంగ్ అడ్రస్ కు  రాలేదు కదా!
    ఆ ఆలోచన రాగానే అతనికి భయమేసింది అప్రయత్నంగా.
    "ఇది....ఇదే కదూ....మీ యిల్లు"  గుండె చిక్కబట్టుకుని అడిగాడు భార్గవ మతి స్దిమితం లేని వ్యక్తిని.
    "మా యిల్లా......ఏమో"  అన్నాడు అతను అదోమాదిరిగా చూస్తూ.
    ఒక్క క్షణం అక్కడ్నుంచి  పారిపోవాలనిపించింది.  అక్కడి వాతావరణం, మతిస్దిమితం  లేని వ్యక్తి వాలకం చూసాక,  దైర్యం చేసి తలుపు మీద శబ్దం చేశాడు.
    చెవులు రిక్కించాడు.  ఎవరూ వస్తున్న జాడలేదు.  మళ్ళీ శబ్దం చేశాడు...ఈ సారి గట్టిగా!
    "భలే.....భలే.....అలా కాదు గట్టిగా తలుపులు నెట్టాలి"  అన్నాడు మతిస్దిమితం లేని వ్యక్తి.
    "అదేంటి...."అంటూ ఆశ్చర్యపోతూ అలాగే చేశాడు. తలుపులు తెరుచుకున్నాయి.  లోపలపెద్దహాలు...అంతా దుమ్ముతో నిండి వుంది.  పాత కాలం నాటి సోఫాలు.
    అసలా యింట్లో ఎవరూ ఉంటున్న జాడ కూడా లేదు.
                               *    *    *
    అనుమానం... భయం... ఒక్క సారిగా కలిగాయి భార్గవకు.
    వెనక్కి తిరిగి చూడబోయేలోగా...
    వెనకవున్న మతిస్దిమితం లేని వ్యక్తి...  పెద్దగా నవ్వుతూ భార్గవని  నెట్టాడు.
    పెద్ద శబ్దంతో  లోపలి పడిపోయేడు భార్గ.
    మతిస్దిమితం లేని వ్యక్తి లోపలికి వచ్చి తలుపులు మూసి భార్గవవైపు తిరిగి...
    "భలే...భలే...నిన్ను చంపెయనా?"  అని అడిగాడు.
    భార్గవ శరీరం మరోసారి భయంతో జలదరించింది.భార్గవ కళ్లకు  అతను ఇప్పుడు మతిస్దిమితం లేని  వ్యక్తిగా కనిపించడంలేదు.
    నిజంగా అతను మతిస్దిమితం లేని వ్యక్తా? అన్న సందేహం అతనిక్కలిగింది.
    స్పృహ తప్పిపోతుండగా వచ్చిన ఆ ఆలోచనతో  వణికిపోతూ...స్పృహ కోల్పోయాడు  భార్గవ.
                                             *    *    *
    క్రైం  బ్రాంచి ఇన్స్ పెక్టర్ కృపాల్ బైక్ ని పొలీసు స్టేషన్ ముందు పార్కుచేసి స్టేషన్ లోపలికి వచ్చాడు.
    ఓ కానిస్టేబుల్ వేడి టీ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టాడు.
    కుర్చీలో రిలాక్సవుతూ టీ తాగుతూ ఫైల్స్ తిరగేస్తున్నాడు కృపాల్.
    "సార్ ఛాయ్ చల్లారిపోతుంది"  కానిస్టేబుల్ అనడంతో, టీని సిప్ చేస్తూ ఆలోచించసాగాడు. సిటిలో క్రైమ్ రేటింగ్ పెరిగిపోతోందని రికార్డ్స్ ని  బట్టి తెలిస్తోంది.
    నేరస్దులు తెలివి మీరిపోతున్నారు. టెక్నాలజీ డెవలప్ అయింది. తామెంత అడ్వాన్సయినా, అంతకన్నారెండడుగులు ముందుకేస్తున్నారు.
    కృపాల్  ఆలోచనలు  అలా  సాగుతూనే వున్నాయి.  కృపాల్ గురించి కొంత చెప్పుకోవాలి.
    వృత్తి నిర్వహణలో చాలా కఠినంగా వుంటాడు. ముప్పయ్యేళ్ల  కృపాల్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కేవలం... వృత్తి పై అతనికుండే గౌరవమే.
    తన వ్యక్తి గత  జీవితంలో ఏదైనా ప్రమాదం సంభవించినా ఎవరైనా తన కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని తననిబ్లాక్ మెయిల్ చేసినా,  తను తలవంచక తప్పదు.  అలాంటి పరిస్ధితి తనకు రాకూడదని కృపాల్ పెళ్లి చేసుకోలేదు.
    అతని తల్లిదండ్రులు కృపాల్  మూడేళ్ల  వయసులో వున్నప్పుడు ఓ యాక్సిడెంట్  లో చనిపోయారు. అప్పట్నుంచి ఓ చర్చి పాదర్ అతడి బాధ్యతలు స్వీకరించి ప్రయోజకుడ్ని చేసాడు.
    కృపాల్ ప్రొఫెషన్ చాలా స్ట్రిక్ట్.  అనుకున్న పని సాధించేవరకూ వదలిపెట్టాడు.
    ఆ సిన్సియార్టీనే  అతడి గురించి నేర ప్రపంచం భయపడేలా చేస్తోంది.   
                                          *    *    *
    "ఏంటిసార్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు?" కృపాల్ కు టీ తెచ్చిన కానిస్టేబుల్ అడిగాడు.
    "ఏంలేదు  చలమయ్యా...రోజురోజుకూ నేరస్దూలు పెరిగిపోతున్నారు. మనం యిలా కుర్చీలో కూర్చునే వాళ్ల గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఏదో ఒకటి చేయాలికదా..."
    కృపాల్ ఎప్పుడు సబార్దినేట్స్ ని చులకనచేసి మాట్లాడడు..వాళ్ల మాటలకు విలువ యిస్తాడు. వాళ్లని తోటి మనుష్యుల్లాగా గౌరవిస్తాడు.  వాళ్ల కష్ట సుఖాలు తెలుసుకుంటాడు.
    "నిజమే సార్...నేను సర్వీసులో చేరి ఇరవయ్యేళ్లు  దాటింది. ఒకప్పుడు బందిపోటు దొంగలని భయపడేవారు జనం...ఇప్పటిలా రోజుకో దొమ్మి, గంటకో అత్యాచారం, నిమిషానికో రేప్ లా జరిగిపోలేదు.
    అప్పుడు మేము   ఖాకీనిక్కర్లు వేసుకొని బయటకు వెళితే భయంతో కొందరు, గౌరవంతో మరికొందరు పక్కకు తప్పకునేవారు. మమ్మల్నిప్పుడు అంత భయంగానూ,  భక్తిగానూ  చూసేవాళ్లు కరువయ్యారు"  వాపోయేడు  చలమయ్య.

 Previous Page Next Page