"డిపార్ట్ మెంట్ లో మంచీ , చెడు రెండూ వుంటాయి. ఎవరో కొందరు లంచాలు అంటూ తమ వుద్యోగాన్ని అడ్డుపెట్టుకొని జనాల్ని బెదిరిస్తారు.మార్కెట్ కు వెళ్లి కూరలు తేరగా తెచ్చుకోవడం, రాంగ్ సైడంటూ సైకిల్ ని ఆపి మామూళ్లు వసూలు చేయడం ముందు ఈ పద్ధతి మారాలి. మిగతా ఏ డిపార్ట్ మెంటుకూ లేని ప్రత్యేకత మనకొద్దు. మనం చేసే ప్రతి పని ప్రజల రక్షణకు ఉపయోగపడాలి" కృపాల్ అన్నాడు.
కృపాల్ వైపు అడ్మయిరింగ్ గా చూసాడు చలమయ్య.
పోలీస్ స్టేషన్ అంటే ఖైదీలు, క్రైమ్ రికార్డులు, లాకప్ డెత్ లు అనుకునే వాళ్లు ఆ పోలీసుస్టేషన్ చూసి తమ అభిప్రాయం ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. అదో సహాయక కేంద్రంలా వుంటుంది. అక్కడికి వచ్చే వాళ్లను తక్కువగా చూడ్డం.
కానీ, వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం కానీ వుండదు. ఇదంతా కృపాల్ ఆ స్టేషన్ కు వచ్చాకే జరిగింది.
కృపాల్ ఏదో మాట్లాడబోతుండగా, అప్పడే ఓ పాతికేళ్ల లోపు వయసున్న స్త్రీ ఆ స్టేషన్ లోకి అడుగు పెట్టింది. లోపలికి వస్తూనే రెండు చేతులు జోడించి కృపాల్ కు నమస్కరించింది.
"నమస్తేసార్...నా పేరు ప్రణవి. సిటీ బ్యాంకులో పనిచేసే భార్గవ నా భర్త" చెప్పింది ఆ అమ్మాయి.
టేబుల్ మీద గ్లాసులో నిళ్లు ఆమెకందిస్తూ, "ముందు మంచినీళ్లు తాగండి. కొద్దిగా రిలాక్సవ్వండి" అంటూనే చలమయ్యకు ఓ టీ తెచ్సిపెట్ట మని చెప్పాడు.
ఒక్కసారి ప్రణవికేసి పరిశీలనగా చూసాడు. చాలా చక్కగా హుందాగా వుంది. ఆమె మొహమంత చెమట పట్టింది.ఆమె మొహంలో కంగారు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
చలమయ్య పక్కనే వున్న టీ బడ్డీ దగ్గరికి వెళ్లి టీ తీసుకు వచ్చాడు.
"ముందు టీ తాగండి" కృపాల్ అన్నాడు.
ఆ అమ్మాయి వద్ధనట్టు తల అడ్డంగా వూసి "ఆయన..ఆయన కనిపించడం లేదండి" అనేది ఆందోళన నిండిన గొంతుతో.
"బహుశా ఏ ఫ్రెండింటికో వెళ్లి వుంటాడు. లేదా ఏదైనా ఆఫీసు పని మీద".
కృపాల్ మాట్టడ్డం పూర్తవ్వక ముందే చెప్పింది ప్రణవి.
"ఆయన నిన్న ఆఫీసుకు వెళ్ళలేదు. సెలవు పెట్టారట" చెప్పింది ఆందోళన నిండిన గొంతుతో.
"మరింకే...ఎందుకు కంగారు పడతారు. ఏదైనా వూరికి వెళ్లారేమో...వెళ్లేముందు మీకు చెప్పలేదా?"
"నేను నిన్ననే మా పుట్టింటి నుంచి వచ్చాను. వచ్చేసరికి తాళం వేసి వుంది. బ్యాంకుకే వెళ్లి వుంటారనుకున్నాను.నా దగ్గర వున్న డూప్లికేట్ 'కీ'తో యింట్లోకి వెళ్ళాను.నిన్నంతా ఎదురుచూసాను. ఇవ్వాళ కూడా రాకపోయేసరికి..." ప్రణవి గొంతులో దుఃఖం పోంగుకొస్తోంది.
"బహుశా...మీ కోసం మీ పుట్టింటికి వెళ్ళారేమో?"
"వాళ్ళక్కూడా ఫోన్ చేశాను. అయినా నేను వస్తానని తెలుసు.ఆయన అక్కడికి వెళ్లరు"
"సెలవు కూడా పెట్టారంటే...బహుశా...ఏదైనా అనుకోని పని పడివుండొచ్చు కదా".
"ఎక్కడికి వెళ్లినా రాత్రి వరకూ తిరిగి వస్తారు. అంతేకాదు. అంతగా వెళ్లాల్సినపని వుంటే యింట్లో బెడ్రూంలో ఓ స్లిప్ రాసి పెట్టి వెళ్తారు".
"మీరేం వర్రీ అవ్వకండి. మీవారి ఫోటో డిటెయిల్స్ యివ్వండి. చాలా చిన్న మ్యాటర్. మీవారేం చిన్న పిల్లాడు కాదు.పోనీ కిడ్నాప్ చేసారే! అంటే బిజినెస్ మాగ్నెట్ కాడు. మీరు కంప్లయింట్ యిచ్చి నిశ్చింతగా వెళ్లండి. మీ వారు మీరు యింటికి వెళ్లేసరికి వుంటారు సరేనా" కృపాల్ ఆమెకు దైర్యం చెబుతూ అన్నాడు.
హ్యండ్ బ్యాగ్ లో నుంచి తన భర్త ఫోటో తీసి టేబుల్ పై పెట్టింది. టేబుల్ పై వున్న ఓ వైట్ పేపర్ తీసి పూర్తి డిటెయిల్స్ తో కంప్లయింట్ రాసిచ్చింది.
"ఇన్స్ పెక్టర్ గారూ...... ఒక్క విషయం... యిలా కంప్యింట్ యివ్వొచ్చో, లేదో తెలియదు.....ఏదో కంగారులో మీరు చెప్పినట్టు చేస్తున్నాను. ఒకవేళ నేను వెళ్లేసరికి తను వుంటే ఈ కంప్లయింట్ చించేయండి...ప్లీజ్" రిక్వెస్టింగ్ గా అంది ప్రణవి.
"అలాగేనమ్మా...ఈ కంప్లయింట్ యిప్పుడే అఫీషియల్ ఫైల్ చేయను. ఎఫ్.ఐ.ఆర్ లో రాయకుండా ఈ కేసు వ్యక్తిగతంగా ఇన్ వెస్టిగేట్ చేస్తాను. సరేనా?" చిర్నవ్వుతో అన్నాడు.
ఎందుకో అతడ్ని అన్నయ్యా...అని ఆప్యాయంగా పిలవాలనిపించింది ప్రణవికి. నవలల్లో, సినిమాల్లో పోలీసుల గురించి చదివి, చూసి భయపడి పోయింది కానీ అందుకు భిన్నంగా యిక్కడ వుండడంతో హాయిగా వూపిరి పీల్చుకుంది.
ప్రణవి లేచి మరోసారి ఇన్స్ పెక్టర్ కృపాల్ కు రెండు చేతులు జోడించి, కృతజ్ఞతలు తెలియజేసి బయటకు నడిచింది.
వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి కృపాల్ వైపు చూసి చెప్పింది.
"అన్నట్టు మీకో విషయం చెప్పడం మరిచిపోయాను. నిన్న నేను యింటికి వచ్చాక, యిల్లు సర్దుతుంటే హాలులో దిండూ, దుప్పటి కనిపించాయి.సాధారణంగా మా యింటికి గెస్టులు ఎవరూ రారు. ఒకవేళ ఎవరైనా వచ్చివున్నా,నాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు చెప్పి వుండేవారు".
"అనుకోకుండా ఫ్రెండ్ వచ్చి వుంటాడేమో...ఎనిహౌ...ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటాను" అన్నాడు కృపాల్.
కృపాల్ తన చేతిలో వున్న భార్గవ ఫోటో వంక చూడసాగాడు.
* * *
"సార్...మిస్సింగ్ కేసా? కిడ్నాపింగ్ కేసా?" చలమయ్య అడిగాడు.
"అది తేల్చవలసింది మనం. తేలవలసింది మన పరిశోధనలో. పాపం ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తోంది" అన్నాడు కృపాల్.
"అవున్సార్...యింత పెద్ద సిటీలో తెలిసినవాళ్లయినా వున్నారో...లేదో" చలమయ్య అంటూ కృపాల్ చేతిలో వున్న ఫోటో వంకచూసి.
"సార్" అంటూ అరిచాడు.
" ఏంటి చలమయ్యా ...అలా అరిచావు"
"ఈ ఫోటో లో వున్నాయాన్ని నేను చూశాను" యాంగ్జయిటీగా చెప్పాడు.
"చూసావా? ఎప్పుడు? ఎక్కడ?"
"మొన్న...ఓ వ్యక్తిని ఆటోలో ఎక్కించుకొని వెళుతున్నాడు".
"ఎవరా వ్యక్తి?" అడిగాడు కృపాల్.
"తన బంధువని చెప్పేడు. కంగారుగా ఆటోలో కూచోబెట్టుకుని వెళ్లిపోయాడు. తర్వాత" అంటూ ఏదో గుర్తొచ్చినవాడిలా ఆగి" అక్కడ ఓ పేపర్ పడి వుంది. ఆ పేపర్ లో ఓ వ్యక్తి కనపడుటలేదు అని వుంది. ఫోటోలోనివ్యక్తి,ఆటోలో
వెళ్లిన వ్యక్తి ఒకేలా వున్నార్సార్" ఉత్సాహంగా చెప్పాడు చలమయ్య.
కృపాల్ మెదడు చురుగ్గా పనిచేయసాగింది.
"ఆ పేపర్ నీ దగ్గర వుందా?"
"ఒక్క క్షణం సార్" అంటూ వెళ్లి బీరువాలో వున్న పేపర్ తెచ్చిచ్చేడు.
కృపాల్ ఆ పేపర్ లోని 'కనబడుట లేదు'బాక్స్ చూసాడు. అతని నొసలు ముడిపడింది.
"భార్గవ కు ఇతడ్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది?పైగా 'రిలేటివ్' అని అన్నాడు అంటున్నావుకదు" చలమయ్య వైపు చూసి అడిగాడు కృపాల్.
"అవున్సార్"చలమయ్య చెప్పేడు.
"బహుశ, అతనికి నిజంగానే రిలేటివ్ అయి వుంటాడేమో"కృపాల్ సాలోచనగా అన్నాడు.
"అయివుండొచ్చుసార్"
కృపాల్ వెంటనే లేచి "నేను భార్గవ యింటికి వెళ్ళొస్తాను. ఈ ఫోటో చూపించి మిసెస్ భార్గవను అడిగితే తెలుస్తుంది" అంటూ బయటకు నడిచాడు.
మరో ఇరవై నిమిషాల్లో అతను భార్గవ యింటి దగ్గర వున్నాడు.
కృపాల్ వెళ్లేసరికి మిసెస్ భార్గవ విచారంగా సొఫాలో కూచుని వుంది.
కృపాల్ ను చూసి లేచి అడిగింది సంతోషంగా.
"ఆయన ఆచూకీ దొరికిందా?"
"లేదమ్మా...చిన్న ఇన్ఫర్మేషన్ అవసరమై వచ్చాను" అంటూ తన చేతిలోని పేపర్ ఆమెకిచ్చి "యిందులోని వ్యక్తి మీకుగాని , మీ వారికి కానీ చూట్టమా?" అడిగాడు కృపాల్.
ఆ ఫోటో వంక పరిశీలనగా చూసి చెప్పింది ప్రణవి.
"లేద్సార్...మావారి తరపువాళ్లు చాలా తక్కువమంది. అందరూ తెలుసు నాకు. మా తరపు వాళ్లు ఈ పోలికల్లో లేరు".
"మరి మీ వారు ఈ ఫోటోలో వున్న వ్యక్తితో కలిసి ఆటోలో ఎక్కారట. మా కానిస్టేబుల్ చూసి చెప్పేడు."
ఒక్క క్షణం ఆలోచనలో పడింది. ప్రణవి ఆమెనే పరిశీలనగా చూస్తున్నాడు కృపాల్.
తన దగ్గరేమైనా దాస్తందా? అని అతని అనుమానం కానీ ఆమె మొహంలో సిన్సియారిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే వుంది.
"పర్లేదు...నేను నా రూట్ లో ఎంక్వయిరీ చేస్తాను. మీరు నిశ్చింతగా వుండండి. అన్నట్టు యింట్లో మీరు ఒక్కరే వున్నట్టున్నారు.మీ వాళ్లను ఎవరిన్తెనా పిలిపించుకోలేక పోయారా?"
"వద్దండీ...ఆయన కనిపించడంలేదని తెలిస్తే కంగారుపడతారు"అంది ప్రణవి.
"అది నిజమే..అన్నట్టు మీ యిల్లు మొత్తం నేనోసారి చూడొచ్చా?"అడిగాడు కృపాల్ ఏమైనా క్లూలు దొరుకుతాయేమోనన్న ఆశతో.
"తప్పకుండా"అంటూ అతనికి యిల్లు మొత్తం చూపించింది. కిచెన్, హాలు, బెడ్ రూమ్, అన్నీ నీటుగా సర్దివున్నాయి.హాలులోకి వచ్చాక చెప్పింది. "యిక్కడే ఓ వ్యక్తి ఎవరో పడుకున్నారు. బెడ్ షీట్స్ కూడా సర్ద లేదు...నేనే యిందాక వచ్చి సర్దేసాను"అంది ప్రణవి.
కృపాల్ మెదడు చురుగ్గా పనిచేస్తోంది. బహుశా ఆ రోజు భార్గవ తీసుకు వచ్చింది చలమయ్య చూసిన వ్యక్తినే కావచ్చు.
ఆ ఆలోచన రావడంతోనే ప్రణవి వైపు తిరిగి...
"మీరేమి అనుకోకపోతే, మీవారి గురించి పూర్తి డిటైల్స్ చెప్పండి. అంటే, ఆయన అలవాట్లు, నడవడిక..."
ప్రణవి వెంటనే అంది.
"ఆయనకు ఎలాంటి దురలవాట్లూ లేవు..తాగడం, పెకాడ్డం అంటేనే అసహ్యం ఆయనకు...వర్క్ విషయంలో కూడా సిన్సియర్...కాకపోతే"అంటూ ఆగింది.
"చెప్పండి పర్లేదు...నన్నో ఆత్మీయుడిగా, మంచి స్నేహితుడిగా భావించి చెప్పండి " అభిమాన పూర్వకంగా అన్నాడు కృపాల్.
"ఆయనకు మని వీక్నెస్...డబ్బు పిచ్చి...డబ్బు సపాదించాలనే యావ...దానికి తోడు పొదుపు...డబ్బును ఎన్నిరకాలుగా సంపాదించాలో ఎప్పడూ ప్లాన్స్ వేస్తూ వుంటాడు. అదొక్కటే ఆయన వీక్నెస్...
"ఐ.సీ" అంటూ తల పంకించాడు. కొద్దికొద్దిగా మిస్టరీ విడిపోయినట్టు తోస్తోంది.
"కనబడుటలేదు"అనే ప్రకటన చూసి, అనుకోకుండా ఆ వ్యక్తి భార్గవకు కనిపించి వుండొచ్చు. అతడ్ని ఆరోజు రాత్రి తనింట్లోనే వుంచుకొని,తెల్లారి ఆ వ్యక్తి తాలూకు వ్యక్తులకు అప్పగించడానికి వెళ్లి వుండొచ్చు"అది కృపాల్ అంచనా మాత్రమే.
అయితే అతని తరపు వాళ్లకి అప్పగించాక భార్గవ తిరిగి రావాలిగా...బహుమతి ఎమౌంట్ అంది వుంటే ఆ డబ్బును ఎక్కడా పెట్టివుంటాడు?
ప్రణవి వైపు తిరిగి అడిగాడు.
"మీవారు డబ్బును ఏమైనా తీసుకొచ్చి దుబారా?"
"తెలియదండీ...అయిదారు వేలకు మించి క్యాష్ ఇంట్లో పెట్టరు. బ్యాంకులోనే పెడతారు"
ఒకసారి చూడకూడదా?"
ఒక్క నిమిషం"అంటూ బెడ్ రూమ్ లో మూలకు వున్న బీరువా దగ్గరకు నడిచి, బీరువా ఓపెన్ చేసి సీక్రెట్ లాకర్ లో చూసింది. యాభై రూపాయలకట్ట ఒకటుంది. మిగతా చిల్లర...అవి చూసి చెప్పోంది ప్రణవి.
"లేదండీ...అయిదువేల క్యాష్ వుందంటే...యింతకూ...ఎందుకండీ ఈ డిటెయిల్స్ ...మావారి మీద ఏమైనా డౌటా?"
"ఛ...ఛ అదేమి లేదమ్మా...సరే నేను వెళ్తానమ్మా...ఒకవేళ మీకేమ్తెన ఫోన్ కాల్స్ వచ్చినా కిడ్నిపర్స్ నుంచి కాల్స్ వచ్చినా నాకు తెలియచేయండి"అన్నాడు కృపాల్.
"అంటే ఆయన్ని కిడ్నాప్ చేసారా?"ప్రణవి గొంతు వణుకుతోంది.
"అదేం లేదమ్మా...పోలీస్ వాళ్లం కదా...అన్ని కోణాల్లో నుంచి ఆలోచిస్తామంతే...నేను వెళ్తానమ్మా...మికేమైనా మా సాయం అవసరమైతన, ఏ సమయంలో అయినా సరే, నాకు ఫోన్ చేయండి".
"అలాగే ధాంక్యూ సార్"అంది ప్రణవి.
కృపాల్ వెళ్తుంటే నొచ్చుకుంటూ అంది.
"అయ్యో కాఫీ తాగి వెళ్లండి"
"నెక్ట్స్ టైమ్ మీ వారితో కలిసి కాఫీ తాగుతాను"అంటూ బయల్దేరాడు.