Read more!
 Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 2

    ఆ విద్యార్ధికి సమాధానం అంత తృప్తిగా వున్నట్లు కనిపించలేదు.

    "చూడునాయనా! మనయింటి కెవరన్నా అతిధులొస్తారు. సమయానికి ఇంట్లో పాలుండవు. కాఫీ యివ్వడం కనీస మర్యాదకదా! ఎలా మరి? అందుకే గృహిణి చిన్న చిట్కా ప్రయోగిస్తుంది .తీరా__వాళ్ళు వెళ్ళబోయే సమయానికి కాఫీ అయినా తాగిపొండి__అంటుంది యధాలాపంగా. వాళ్ళు మొహమాటానికి వద్దులెండి అంటారు. ఈవిడ తృప్తిగా ఊపిరి పీల్చుకుంటుంది."

    శాస్త్రిగారు తమాషాగా చెపుతుంటే విద్యార్దులంతా నవ్వేశారు.

    "పోయేవాళ్ళు ఆగిపోయి... మళ్ళీ కూర్చున్నారనుకోండి" మరో కొంటె విద్యార్ధి ప్రశ్నించాడు.

    "అలాంటివన్నీ అడక్కూడదు మరి" అంటూ పద్యం ఎత్తుకున్నారాయన.

    వాళ్ళని పంపేసి ఆయన లేచారు. టైం దాదాపు తొమ్మిది కావస్తుంది. భుజంపై కండువాతో మొహం తుడుచుకుని వంటింటివేపు కదిలారు.

    సరిగా ఆయన వంటింటి గడపలో అడుగుపెట్టబోయే సమయానికి పెద్దకుమారుడు దశరధరామయ్య రుసరుస లాడుతూ బయటకి వస్తున్నాడు. తండ్రిని చూసీచూడనట్లు ముందుకు వెళ్ళాడు.

    కొడుకు నిర్లక్ష్యం సంగతి ఆయనకు బాగా తెలుసు. లోపలికి వెళ్ళి వడ్డించిన విస్తరిముందు కూర్చుని చేతిలో నీళ్ళు వేసుకోబోతూ "మళ్ళీ ఏమిటట?" అని అడిగారు. పార్వతి సమాధానం యివ్వకుండా ఓ క్షణం ఆగి వచ్చి నేయి వడ్డించింది.

    "కోడలు ఎప్పుడొస్తుందట!" పచ్చడి కలుపుకుంటూ ప్రశ్నించారు.

    "ఆ మాట అడిగితేనే ఆయనకి వళ్ళు మండుకొచ్చింది. వేకువనే మీరు స్నానానికి వెళ్ళాక ట్రయిన్ దిగాడు. వెళ్ళి పడుకున్నాడు. ఇప్పుడువచ్చి కాఫీ తాగి వెళుతున్నాడు ఆఫీసుకి. అమ్మాయి ఏదిరా అంటే పలికితేనా?"

    శాస్త్రిగారు ఏదో అడగాలని నోరు తెరిచారు. బయటి నుంచి దశరధరాముడి మాటలు వినిపించాయి. "నా పెళ్ళాంతో మీకేం పని? వస్తుందో రాదో దానిష్టం, దాని తల్లి యిష్టం. ఆరోజు వద్దు తల్లీ! అంటే నా మెడకి చుట్టావు. ఈరోజు అనుభవిస్తున్నాను నేను. నా ఖర్మకొద్దీ దొరికింది. సుఖపడేరాత నా ముఖాన రాయలేదు భగవంతుడు. మీకేం మీరు హాయిగా వున్నారు. నేనేగా చచ్చేది" వ్యంగ్యంగా అన్నాడు. దాంట్లో దాగివున్న బాధ ఆ పితృ హృదయానికి సూటిగానే తగిలింది.

    "దాశరధీ!" శాంతంగా పిలిచారాయన.

    ...          ...         ...

    "తల్లితో తండ్రితో ఒక్కసారయినా కఠినంగా మాటాడనివాడే సత్పుత్రుడన్నాడు వివేకానందుడు."

    "మీరు బళ్ళో పాఠాలు చెప్పి చెప్పి అదే చాదస్తం వంటబట్టింది. ఎమ్మే చదివినా ఉద్యోగం దొరక్క సెకండరీ గ్రేడ్ లో పనిచేస్తున్నాను నేను. నేను లెక్చరర్నో గ్రేడ్ వన్ ఆఫీసర్నో అయితేగానీ రాదట ఆ దేవి! ఆ రాతవుంటే యీ దేభ్యం ముఖాన్ని చేసుకుని ఇక్కడెందుకు పడుంటాను? హాయిగా ఏ లక్షాధికారి కూతుర్నో పెళ్ళాడి, కాలుమీద కాలు వేసుకుని కూర్చునేవాడ్ని" విసురుగా అనేసి వెళ్ళిపోయాడు.

    దగ్గరేవున్న పంచాయితీ స్కూల్లో టీచర్ అతను. ఆ టౌన్ లిమిట్స్ లో చేరకుండా వూరునానుకునే వుంది ఆ పల్లె. ప్రెసిడెంటుని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలుకుని అక్కడికి వేయించారు శాస్త్రిగారు. రోజూ సైకిల్ పై వెళ్ళి వస్తుంటాడు. ఈ రకమైన జీవితంపై విసుగుపుట్టిందతనికి. దానికితోడు భార్యనుంచి సౌఖ్యమూ శాంతీ లేదు. ఎప్పుడూ ఏవో కలతలు. ఆ కోపమంతా తల్లిదండ్రులమీద తీర్చుకుంటుంటాడు.

    భోజనం ముగించి బయటకు వచ్చారు శాస్త్రిగారు.

    ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం ఆయన మనసుని గాయపరచింది. మూడో అబ్బాయి జానకిరాం సిగరెట్ తాగుతూ భార్యతో కబుర్లాడుతున్నాడు. ఆమె మాటలమధ్యలో భర్త చెంపమీద చిన్నగా చిటికె వేసింది సుతారంగా నవ్వుతూ. జానకిరాం నవ్వుతూ భార్యనే చూస్తున్నాడు.

    శాస్త్రిగారు రెండడుగులు వేశారు.

    మామగారిని చూసిన కోడలు గదిలోకెళ్ళిపోయింది. భార్యని అనుసరించాడు జానకిరాం. అతనదేవూళ్ళో తాలూకాఫీసులో టైపిస్టు.

    దీర్ఘంగా నిట్టూర్చి చొక్కా వేసుకుని, ఉత్తరీయం భుజాన వేసుకుని బయట కాలుపెట్టేసరికి నాలుగో కుమారుడు అయోధ్య రాముడు కేకలేస్తున్నాడు. అయిదో కుమారుడు కోసల రాం ఏదో చెపుతున్నాడు అతని సమాధానం నచ్చని అయోధ్య కోసలపై చేయెత్తాడు. అన్నపై తిరగబడ్డాడు కోసలరాం.

    "ఆగండర్రా" బాధగా అరిచారు శాస్త్రిగారు.

    ఇద్దరూ తండ్రిని చూసి ఆగిపోయారు. లేకపోతే చేతులు కలిసేవే.

    అయోధ్యరాం ఆ ఊళ్ళోనే బ్యాంక్ లో పిగ్మీ కలెక్టర్. కోసలరాం స్టాంపు వెండర్. ఇద్దరికి సైకిల్ తో అవసరముంటుంది. అన్నని అడక్కుండా తమ్ముడు సైకిల్ తీసికెళ్ళి పంక్చర్ చేసుకొచ్చాడు. అదే కలహకారణం. పెళ్ళయి భార్యలతో కాపురం చేసే వయసున్న ఆ భారత పౌరులు యుక్తా యుక్త విచక్షణ లేకుండా పోట్లాడుకుంటున్నారు.

    "చూడు నాన్నా" అయోధ్య ఏదో చెప్పబోయాడు. 

    ఆయనకి కొడుకుల మీద ఎన్నో ఆశలుండేవి ఒకప్పుడు. నలుగురూ నాలుగు రాజ్యాలేలతారని కలలు కన్నారు. ఒక్కరికీ ఆయన పాండిత్యం అలవడలేదు. పైగా ఒక సరైన అభిప్రాయాలు లేని వింత వ్యక్తిత్వాలు! తమ ఉనికిని మరిచిపోయిన చిత్రమైన మనస్తత్వాలు.

    "చూడు నాన్నా... మరి"

    "ఏం చూడను బాబూ! చూడకుండా కళ్ళు పోయినా ఇంత బాధ వుండేది కాదు" విసుక్కుని గేటుదాటారాయన. మనసంతా వికలమైపోయింది. వీళ్ళెలా దారికి వస్తారో అర్ధం కావటం లేదాయనకి.

    తండ్రి విసుక్కోవటంతో కిక్కురు మనలేదా కొడుకులిద్దరూ.

    తండ్రి స్కూలుకి వెళ్ళగానే దాశరధి వచ్చి కూడు పెడతావా? అనడిగాడు తల్లిని. పార్వతి మనసు చివుక్కుమంది. కొడుకు ముఖంలోకి నిశితంగా చూసింది.

    "ఏం మాటలురా యివి? బ్రాహ్మణపుటక పుట్టి ఇలాగేనా మాట్లాడేది?"

    "అబ్బ! నువ్వు కూడా ప్రతిదానికీ నాన్నలాగే వుపన్యాసాలివ్వటం మొదలుపెట్టావు. అసలే ఆకలై చస్తుంటే" చర్రుమని లేచాడు.

    పార్వతిలో ఓర్పు నశించలేదు.

    "ఒరేయ్! మీ నాన్న అపురూపంగా పెంచారు రా మిమ్మల్ని. నిన్ను ఎమ్.ఎ. చదివించి కలెక్టర్ని చెయ్యాలనుకున్నారు. వాడ్ని ఇంజనీరు చెయ్యాలనుకున్నారు. నువ్వు ధర్డ్ క్లాసులో పాసై పనికిరాని గాడిదవయ్యావ్. వాడేమో అర్ధంతరంగా చచ్చాడు మా గుండెలమీద నిప్పులుపోసి. మిగతా పిల్లలందరూ అంతో యింతో అక్కరకొస్తున్నారు. నీకేమిట్రా పగ మా మీద? కన్నందుకా? పెంచినందుకా? చదివించినందుకా?" 

 Previous Page Next Page