Previous Page Next Page 
మహావృక్షం పేజి 13

"నీరజా!" గట్టిగా అరిచింది శ్యామల ఉత్సాహంగా. రాజు గబగబా వెళ్ళి శారదనీ, అయిలయ్యనీ లేపేశాడు. క్షణంలో ప్రశాతంగా వున్న వాతావరణం రణగొణధ్వనులతో నిండిపోయింది. నలుగురు సాయంపట్టి తొట్టిలోంచి నీరజని  పైకి లేపారు. ఒళ్ళు కాలిపోతుంది. సృహాలోలేదు. అలాగే తీసుకొచ్చి మంచం మీద పడుకోపెట్టారు. అనూషకి ఏం జరుగుతొందో కాస్సేపటిదాకా అర్దంకాలేదు. అర్డమయ్యేటప్పటికి నీరజకి నూట నాలుగు డిగ్రీల జ్వరం వచ్చిందని తెలిసింది.
అనూష ముందుగా వీణకి పోన్ చేసి చెడామడా తిట్టింది. వెంటనే బయలుదేరి "ఆశ్రమానికి రా "అని చెప్పింది. తరువాత  మణికి పోన్ చేసి నీరజ పరిస్టితి క్లుప్తంగా వివరించి వెంటనే రమ్మంది. ఆ తరువాత కొన్ని మందులు రాసిచ్చి వాచ్ మన్ ని కారు తీసుకుని వెళ్ళి ఎక్కడ దొరికినా ఆ మందులు తెమ్మని చెప్పింది. ఇంతలో బాబు లేచి ఏడుపు మొదలు పెట్టాడు. సుశీల  బాబునేత్తుకుని  అవతలికి  వెళ్ళిపోయింది.
ఆశ్రమ వాతావరణం అంతా గంభీరంగా మారిపోయింది.రాత్రంతా విపరీతమైనా మానసికాందోళనకి గురిచేసిన నీరజ  పాడైపోయిన  సిమెంటు  తొట్టిలో  కనిపించడం, రాత్రంతా మంచులో తడిసిపోవడం, తెల్లారిజ్వరంతో ఎవరికీ  కాళ్ళు, చేతులు  ఆడడంలేదు. అప్పుడే వామనమూర్తి పోన్ చేశాడు.
"మీ అమ్మాయి ఎక్కడికీ వెళ్ళలేదండీ . అనవసరంగా ఖంగారుపడి మమ్మల్ని ఖంగారు పెట్టారు. జ్వరంగా వుందని, వేరే గదిలో వెచ్చగా వుంటుందని  వెళ్ళి పడుకుని నిద్రపోయిందట. ఇప్పుడే లేచింది.  నేను పరీక్ష చేస్తున్నాను. మీరేం ఖంగారుపడకండి .మేము తీసుకొచ్చి దింపేస్తాం కాస్సేపయాక"ఆపద దాటడానికి అందంగా, సులభంగా అబద్దం  చెప్పింది  అనూష.
ఎవరూ ఏమి మాట్లాడలేదు.
అదృష్టవశాత్తూ , వాచ్ మన్ కుకట్ పల్లిలోనే ఓ నర్సింగ్ హొమ్ లో వున్నమెడికల్ షాపులో మందులు దొరికాయని తీసుకొచ్చాడు. అనూష ఇంజెక్షన్ చేసింది నీరజకి.
సరిగ్గా గంట తరువాత మణి, వీణ వచ్చారు. మణి నీరజని పరీక్షచేసి, అనూష రాసిన మందులే కంటిన్యూ చేయమని చెప్పింది.
జరిగిన సంగతంతా శారద, శ్యామల చెబుతోంటే విన్న మణి అనూష తీసుకున్న శ్రద్దకి, పడిన టెన్షనుకి ఎలాగో అయిపోయింది. "ఎందుకే ఇంత శ్రమ తీసుకున్నావు?" అంది. అనూషని దగ్గరకి తీసుకుని "ఏనాటి రుణానుబందమే     ఆ పిల్లకీ నీకూ?"
వీణా మాట్లాడలేదు. అనూష కొంచెంసేపటి తరువాత బాత్ రూమ్ కి వెళ్ళడానికి బైటికి వెళ్లడం చూసి, ఆమె వెనకే వెళ్ళింది.
"సారీ అనూ! వెరీ సారీ. రాత్రి నువ్వు పోన్ చేసినప్పుడు మూడ్  లో లేను. కొంచెం  డ్రింక్  చేశాను"అంది పశ్చాత్తాపంతో.
అనూష తీవ్రంగా చూసి అంది. "ఎందుకిలా భ్రష్టురాలివైపోతున్నావు? చేతులారా బంగారంలాంటి జీవితం నాశనం చేసుకుంటున్నావు. ఇంక ఎంజాయ్ చేసింది చాలు. ఇంకోసారి ఇలాంటి దరిద్రవు పనులు చేయకు."
వీణ తమాషాగా నవ్వింది. "బంగారంలాంటి జీవితం....నాది..."
"ఏం? ఏం తక్కువైంది నీకు? పెద్ద పేరున్న లాయర్ వి. డబ్బుంది. అంతో ఇంతో అందం వుంది. స్వంత ఇల్లుంది. కారుంది. ఇంకా ఏం కావాలి?"
అన్నీ వున్నాయి అనూషా! లేనిదేమిటో చెప్పినా నీకర్థం కాదులే."
"మనిషికి తృప్తి అనేది వుంటే అన్నీ వున్నట్టే. తెలిసిందా?" అనూష బాత్ రూమ్ వేపు వెళ్ళిపోయింది.
ఆ రొజు  ఆదివారం కావడంతో అందరూ అక్కడే వుండిపోయారు. గంట గంటకీ నీరజని ఇద్దరు డాక్టర్లు చూసుకుంటూ మందులు ఇస్తుండటంతో మధ్యాహ్ననికి కొంచెం తేరుకుని కళ్ళు తెరిచింది. వామనమూర్తి మళ్ళీ రెండు సార్లు పోన్ చేశాడు. "ఇంకా రాలేదేం" అని "బయలు దేరి చాలాసేపయింది వస్తుంటారు" అని చెప్పమంది అనూష. ఎవరు రిసీవ్ చేసుకున్నా అలాగే చెప్పారు.
ఒంటిగంటకి నీరజకి కొంచెం హార్లిక్స్ కలిపిచ్చి కూర్చోబెట్టారు.
అనూష ప్రారంబించింది. "చూడు నీరజా! నీ వలన నిన్నటినుంచీ మేమంతా ఎంత అందోళన, ఎంత మెంటల్ టార్చర్ అనుభవించామో తెలుసా!నీ అంతట నువ్వే నీకథ చెప్తానని ఇన్నాళ్ళూ ఎదురుచూశాం. ఇప్పుడు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. చెప్పు ఏంటి నీ బాధ  ?వామనమూర్తి ఎవరు?"
నీరజ వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది.
"ఎడవద్దు . నీ ఆరోగ్యం బాగాలేదు. ఏడవకు. మేమంతా నీ శ్రేయోభిలాషులం. చూశావా! ఎంతమంది నీకు సపోర్ట్ గా వున్నారో!చూడు ఇక్కడ వున్నవాళ్ళంతా నీలాగా జీవితంలో ఏదో బాధపడి ఇక్కడికి వచ్చినవాళ్ళే. అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో! ఈ సుశీల ఎన్ని కష్టాలుపడిందో తెలుసా!భర్త తిండి క్కూడా డబ్బు లివ్వక వదిలేస్తే నాలుగు రోజులు పస్తులుండేది . ఈ శారద, ప్రేమించినవాడు మోసం చేస్తే ఆది కూడా ఎంత దారుణమైన మోసమో తెలుసా?
ఆమెని ఏదో పెళ్ళికని తీసికెళ్ళి తన స్నేహితుడికి తార్చబోయాడు. తప్పించుకుని పారిపోయి ఇంటికి వెళితే,లేచిపాయినదాన్ని ఇంటికి రానివ్వం అని తల్లీ తండ్రి వెళ్ళగొట్టారు. కానీ నీలాగా చచ్చిపోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. తను దైర్యంగా బతికి, తనేమిటో రుజువు చేయాలనుకుంది. ఇలా ఒక్కోరిది ఒక్కో కథ. ఎవరూ నోట్లో బంగారు స్పూన్ పెట్టుకుని ఇక్కడికి రాలేదు చెప్పు. నువ్వేదన్నా చెబితే నీకేం సాయం చేయాలో మేమొ ఆలోచిస్తాం. లేకపోతే వామనమూర్తి దగ్గరకి పంపిస్తాం."
"వద్దు వద్దు నన్నక్కడికి పంపించకండి"వణికిపోతూ అంది.
"మరైతే చెప్పు."
"చెబుతాను"నీరజ కళ్ళు తుడుచుకుంది.
"మాది నెల్లూరు....మా నాన్నగారికి రైసుమిల్లు వుంది. నేనూ, తమ్మడూ, చెల్లి ముగ్గురం.... మా అమ్మ మమ్మల్ని చాలా ప్రేమగా చూసేది. మేము  చదువుకోవాలని శ్రద్ద చూపిస్తే ఎంతయినా చదివిస్తాకానీ, బలవంతం చేయననేవాడు నాన్న. అయినా మేము బాగానే చదివేవాళ్ళం. నాన్న, అమ్మ ఎప్పుడూ దేబ్బలాడుకునేవాళ్ళు. అమ్మ నాన్నని లక్షపెట్టదని నాన్నకి కోపం, నాన్న తనని కట్టేసి వుంచుతాడని, తనకో సరదా. షికారు లేకుండా బతుకుతున్నానని అమ్మకి కోపం....                                  

 

 Previous Page Next Page